దండకారణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలో వింధ్య పర్వతమునకు దక్షిణమున ఉన్న అరణ్యము. దండుని పురము మట్టిలో కలసిపోయి అక్కడ ఏర్పడిన అరణ్యము కాబట్టి దీనికి దండకారణ్యము అని పేరు వచ్చింది. ఇది ప్రస్తుతం తూర్పుకనుమలకు పడమరగా మధ్య ప్రదేశ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఈ అరణ్యం ఇంచుమించు 200 మైళ్ళు ఉత్తరదక్షిణాలుగా, 300 మైళ్ళు తూర్పుపడమరలుగా విస్తరించింది.[1]

దండకారణ్యం భారత పురాణాలలో ప్రముఖమైనది. రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాసంలో 13 సంవత్సరాలు గడిపాడు. ఇక్ష్వాకు పుత్రుఁడు అగు దండుఁడు అసురకృత్యములచే జననిందితుఁడు అగుటవలన తండ్రిచే వింధ్యశైలమునకు పంపఁబడి అందు మధుమంతము అను పట్టణం ఒకటి నిర్మాణము చేసికొని అసురులతో కలిసి అసురగురువైన శుక్రాచార్యులకు శిష్యుఁడు అయి ఆపురమును ఏలుచు ఉండెను. ఒకనాడు అతఁడు శుక్రాచార్యుని ఆశ్రమమునకు పోయి అచట తపము ఆచరించుచు ఉన్న అతని పెద్దకొమార్తె అగు అరజ అను దానిని కని మోహించి అది అయుక్తము అని ఆమె ఎంత చెప్పినను వినక బలాత్కారముగా ఆమెను కూడి వెడలిపోయెను. పిదప దానివిని శుక్రుఁడు మిగుల ఆగ్రహించి ఆదండుఁడు సపరివారముగ నేలపాలు అగునట్లును, ఆ మధుమంతముచుట్టు ఏఁడుదినములు మట్టి వాన కురియునట్లును జనశూన్యము అగునట్లును శాపము ఇచ్చెను. చూ|| జనస్థానము.

రామాయణంలో దండకారణ్య ప్రస్తావన

[మార్చు]

రామాయణకథలో కనిపిస్తున్న దండకారణ్య ఆవిర్భావ ప్రస్తావన పద్మపురాణంలో ఉంది. శ్రీరాముడు అరణ్యవాసానంతరం పట్టాభిషిక్తుడైన తర్వాత దుష్టజన సంరక్షణలో భాగంగా ఆ అరణ్యప్రాంతానికి వెళ్ళినప్పుడు అగస్త్యుడు శ్రీరాముడికి ఆ అరణ్యం పూర్వాపరాలను వివరించి చెప్పాడు. విదర్భరాజైన శ్వేతుడు తపస్సు చేసిన ఆ ప్రదేశం కూడా అదే. త్రేతాయుగం నుంచి ఈ అరణ్యం అలాగే ఉందని తాను ఆ అరణ్యాన్ని ద్వాపరయుగంలో చూశానని అగస్త్యుడన్నాడు. క్రూరమృగాలు ఏమీ లేకుండా అలాగే జనసంచారం కూడా లేకుండా ఉన్న ఆ అరణ్యంలో ఎన్నెన్నో కందమూల ఫలాలు ఉన్నాయి. అనేక రకాల శాకాలు ఉన్నాయి. ఆ అరణ్యం మధ్యలో అయిదు యోజనాల వెడల్పు గల ఒక సరస్సు ఉంది. హంసలు, అడవి కొంగలు, చక్రవాక పక్షులు ఉన్నాయి. అసంఖ్యాకంగా తాబేళ్ళు కూడా అటూ ఇటూ తిరుగుతున్నాయి. కొంగలు బారులు కట్టి ఆ సరస్సు మీద ఎగురుతున్నాయి. ఎటువంటి హింసకు తావులేకుండా ఆ ప్రాంతమంతా కళకళలాడుతుంది. అందుకే ఆ ప్రాంతాన్ని తాను కూడా తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు అగస్త్యుడు శ్రీరాముడికి చెప్పాడు.

Dandakaranya roughly equivalent to the Bastar division

in the Chhattisgarh]]

దండకారణ్యం పేరు వెనుక కథ

[మార్చు]

పూర్వం ఇక్ష్వాకు మహారాజు భూమండలాన్ని ధర్మబుద్ధితో పరిపాలిస్తుండేవాడు, ఆయనకు కలిగిన కుమారులలో మంచి విద్యాబుద్ధులు, రూప, గుణశీలాలు కలిగిన ఒక కుమారుడు ఉండేవాడని అయితే ఇక్ష్వాకు భవిష్యత్లో తన కుమారుడికి ఒక మహానుభావుడి వల్ల దండన కలగవలసిన పరిస్థితి ఉందని గమనించి అందుకు తగినట్లుగా తన కుమారుడికి ‘దండుడు’ అని పేరుపెట్టినట్లు చెప్పాడు. అలాగే దండుడుకి వింధ్య, నీల పర్వతాల మధ్యభాగంలో ఉన్న అరణ్యప్రాంతాన్నంతటినీ రాజ్యంగా ఇచ్చాడని ఆ అందమైన అరణ్య ప్రాంతమే దండుడు పరిపాలించినందువల్ల దండకారణ్యంగా పేరువచ్చిందని పౌరాణిక కథనం

దండుడి వృత్తాంతం

[మార్చు]

ఆ అరణ్యంలోనే దండుడు నివసించటానికి అనువుగా ‘మధుమత్’ అనే పేరుగల ఎంతో సుందరమైన ఒక నగరాన్ని కూడా ఇక్ష్వాకువే నిర్మించాడు. కానీ కామప్రకోపంతో విచక్షణను మరచిపోవడం వల్ల దండుడు ఒక ఘోరతప్పిదం చేసి శుక్రాచార్యుడు శాపానికి గురై నశించిపోవాల్సి వచ్చింది.

దండుడు ఒకరోజున అరణ్యంలో సంచరిస్తూ శుక్రాచార్యుడి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. అసలే మొదటి నుంచి ఎంతో సౌందర్యవంతంగా ఉండే ఆ అరణ్యంలో అంతకు పదిరెట్లు ప్రకృతి సౌందర్యంతో శుక్రుని ఆశ్రమ ప్రాంతం వుంటుంది. ఆ ఆశ్రమ సౌందర్యాన్ని దూరం నుండే చూసి ఆకర్షితుడై ముందుకు నడుస్తున్న దండుడుకి మరింత ఆశ్చర్యం కలిగించేలా అత్యంత సౌందర్యవతి యైన ఓ అద్భుత అందాల కన్య దండుడి కంటపడింది. ఆమె అందాన్ని చూసి ముగ్ధుడై విపరీతమైన ఆకర్షణకు లోనై మన్మథతాపంతో ఆ రాజు విలవిలలాడాడు. ఆ స్థితి నుంచి తట్టుకోలేక ఆమెను సమీపంచి తన మనోవాంఛను వివరించాడు. అప్పుడామె తాను శుక్రాచార్యుడి కుమార్తెనని తన పేరు అరజ అని తాను శుక్రుడి కుమార్తె కనుక శుక్రుడు దండుడికి గురువు కనుక తాను దండుడికి సోదరితో సమానమని నచ్చచెప్పి దండుడి మనస్సును మరల్చాలని చూసింది. కానీ దండుడు ఆమె మాటలు వినే స్థితిలో లేడు. అప్పుడు అరజ ఒక వేళ తనను చేపట్టదలిస్తే తన తండ్రి అయిన శుక్రాచార్యుడి అనుమతి పొంది చేపట్టమని చెప్పింది. ఆ మాటలను కూడా వినే స్థితిలో లేని దండుడు కామాంధుడై ఆమెన బలవంతం చేశాడు. ఆ వెంటనే అతడు తిరిగి తన నగరానికి వెళ్ళిపోయాడు. అరజ మాత్రం తనకు జరిగిన అన్యాయానికి రోదిస్తూ ఆశ్రమం వెలుపలే ఉండిపోయింది. వేరే పనిమీద బయటకు వెళ్ళిన శుక్రాచార్యుడు తన శిష్యులతో సహా ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి అరజ దుఃఖిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పింది. శుక్రాచార్యుడు కోపోద్రిక్తుడై అన్యాయంగా ప్రవర్తించిన రాజు నశించిపోవాలని అతడి మీద దేవేంద్రుడు ధూళివర్షం కురిపించగలడని శపించి తన కుమార్తెను ఆశ్రమం వద్దే విడిచి తాను మాత్రం వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయాడు. శుక్రాచార్యుడి శాపం కారణంగా ఆకాశం నుంచి ధూళి ధారాపాతంగా కురిసింది. ఆ దూళి వర్షంలో దండుడు మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Dandakaranya". Encyclopædia Britannica Online. Retrieved 2006-12-22.