Jump to content

దార్ల సుందరీమణి

వికీపీడియా నుండి
(దార్ల సుందరీ మణి నుండి దారిమార్పు చెందింది)

దార్ల సుందరీమణి (దార్ల సుందరమ్మ) తెలుగు రచయిత్రి, గురు బోధకురాలు, తత్త్వజ్ఞాని, యోగిని. ఆమె భావలింగ శతకం రాసింది. వేమన శతకం వంటి తత్త్వశాఖకి చెందిన రచన అది. [1]

జీవిత విశేషాలు

[మార్చు]

దార్ల సుందరీమణి గుంటూరు జిల్లాలోని చర్లగుడిపాడులో పద్మసాలెల కుటుంబానికి చెందిన గంజి నాగమాంబ, శ్రీరాములు దంపతులకు 1802-03లో జన్మించింది. ప్రాయం వచ్చాక రామచంద్రపురం నివాసి దార్ల శేషయ్యను వివాహమాడింది. 1833లో ఆమె రాసిన భావలింగ శతకం నేటికి లభిస్తున్న మహిళా శతకాల్లో మొట్టమొదటిది.

నూట యిరువది ఒకటి ఆటవెలందుల
నాటలాడుకొంటి ననుభవముగ
సూటి జూచినట్టి సుందరమ్మను నేను
పాపభయ విభంగ భావలింగ

అనే పద్యం ద్వారా ఆ శతకంలో ఆమె రాసిన ఆటవెలది పద్యాల సంఖ్యను తెలియజేసింది.

పదియేడు నూర్ల పైన యేబది యైదు
శాలివాహన శకము జరుగుచున్న
విజయ వత్సరమ్ము నిజ చైత్ర పౌర్ణమి
పాప భయ విభంగ భావలింగ

పద్యం ద్వారా ఆమె తన రచనా కాలాన్ని పేర్కొంది.

1833లో "పాప భయ విభంగ భావలింగ" అనే మకుటంతో ఆమె రాసిన 123 పద్యాల భావలింగ శతకంను 1953లో కొండవీటి వెంకటకవి పరిష్కరించి కవిరాజ గ్రంథమాల తరపున ప్రచురించాడు. ఆ తర్వాత 1975లో "వీవర్స్ వెల్ఫేర్ ట్రస్టు" తరపున గుంటు నర్సయ్య పంతులు, మధిర సుబ్బన్న శతావధానులు ముంద్రింపించారు.

వేమన వలె ఈమె కూడా వ్యర్థ పదాలు లేకుండా ఎల్లరకు అర్థమగు సామాన్య పదాలతో మహార్థాన్నిచ్చేటట్లు పద్యాలను రాసింది.[2]

ఆమె తన అనుభవంలో ‘సూటిగా జూచినట్టి’ విషయాలను ‘ఇంపుగా’ నూట ఇరువది ఆటవెలదులలో చెబితే మోక్షం గల్గుట సత్యమనే నమ్మకంతో శతకాన్ని వ్రాసినట్లు కనపడుతోంది. ‘భావ’మంటే అనేకార్థాలున్నా కూడా శతక విషయాలను బట్టి మనోభావాలకు లింగాన్ని చిరునామా చేసికొని వ్రాసిన శతకం ఇది అని అర్థం అవుతుంది. జీవితంలో మాట, మనస్సుతో మోక్షమనే జ్ఞాన మార్గాన్ని అన్వేషించటమే ఈ భావలింగశతక విశిష్టతగా భావించవచ్చు.

ఈ ‘భావలింగ శతకం’ తేట తెలుగులో ఆటవెలదులలో అలవోకగా చెప్పబడింది. మాటను మనస్సును ప్రక్షాళనచేసే శతకమిది. ‘మాట’ కున్న విలువను తెలియజేసే శతకం.

భావమెట్టులుండె బలు కట్టి దై యుండ
పలుకు లెట్టి నైన బనులు నట్లు
పనులననుసరించి ఫలము చేకూరు
పాప భయ విహంగ భావలింగ!’’ (ప.105)

మనసా, వాచా, కర్మణా జరిగే భావ సంస్కారంతో మనిషి తన మాటల చేత పనుల చేతనే జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాడు. కాబట్టి చేతలకు మాటలకు తాత్త్విక భూమిక ‘భావమని’ స్పష్టం చేసింది.

మూలాలు

[మార్చు]
  1. "దార్ల సుందరమ్మ భావ లింగాత్మకత". www.andhrajyothy.com. 2018-10-21. Archived from the original on 2018-10-24. Retrieved 2019-09-08. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. ప్రతిభావంతులు, గంగాధర పబ్లికేషన్సు, విజయవాడ-2, సంవత్సరం=1979,రచయిత:కప్పగంతుల మురళీకృష్ణ

బయటి లంకెలు

[మార్చు]