కొండవీటి వెంకటకవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండవీటి వెంకటకవి
ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత
జననంకొడవీటి వెంకటయ్య
జనవరి 25, 1918
గుంటూరు జిల్లా విప్పర్ల (క్రోసూరు) గ్రామం
మరణంఏప్రిల్ 7, 1991
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిదాన వీర శూర కర్ణ సినిమా డైలాగులు
తల్లిదండ్రులునారాయణ, శేషమ్మ

కొండవీటి వెంకటకవి (జనవరి 25, 1918 - ఏప్రిల్ 7, 1991) ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత.

జననం, విద్య

[మార్చు]

వెంకట కవి గుంటూరు జిల్లా విప్పర్ల (క్రోసూరు) గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు జనవరి 25, 1918 సంవత్సరంలో జన్మించారు. వీరి అసలు పేరు కొండవీటి వెంకటయ్య. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము చేశారు. చిట్టిగూడూరు నరసింహ సంస్కృత కళాశాలలో చేరి దువ్వూరు వేంకటశాస్త్రిగారి శిశులై బాషా ప్రావిణపట్టా పొందారు. వసుచరిత్ర అవలీలగా పాడి వినిపించేవాడు. భట్టుమూర్తి అంటే ఆయనకు విపరీత ప్రేమాభిమానం.

1936లో కిసాన్ కాంగ్రేసుకు సహాయకార్యదర్శిగా పనిచేశాడు.1944-45లో సత్తెనపల్లి లో శరభయ్యగుప్త హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు. 1946 నుండి 1952 వరకు వెంకటకవి జిల్లా మాచర్లలో బోర్డు ఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు.

1952నుంచి పొన్నూరు భావనారాయణ స్వామివారి సంస్కృత కళాశాలో ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.

కవిగా వీరు అనేక అష్టావధానాలు చేశాడు. భువన విజయాలలో పాల్గొన్నాడు

రచనలు

[మార్చు]

కవితా రచనకు తన 14వ ఏటనే శ్రీకారం చుట్టిన వీరు అనేక గ్రంథాలు రచించారు. 1932లో వీరు కర్షకా! శతకాన్ని రచించారు. ఇది మూడు ముద్రణలు పొందింది. 1942లో “హితభోద”రచించారు. 1940లో “చేన్నకేసవశతకం” వెలువరించారు. దివంగతులైన ప్రముఖుల గురించి దివ్య స్క్రుతులు 1954లో వీరు నెహ్రూ చరిత్ర మొదటి భాగం ప్రకటిస్తూ తాము బహుళ ప్రబంధయుతుడని పేర్కొన్నారు. ఈగ్రంధం బెజవాడ గోపాలరేడ్డి గారికి అంకితం ఇవ్యబడింది. నెహ్రు చరిత్ర రెండవ భాగం గుత్తికొండ నరహరిగారికి అంకితం ఈయబడింది. మూడవ భాగం అముద్రితంగానే ఉంది. బుద్ధుడు, వేమన, గాంధీజీల గురించి వీరు మూడు శతకాలు రాసి దాన్ని “త్రిశతి” పేరుతో 1960లో ప్రకటించారు. నిదబ్రోలుకు చెందిన ప్రముఖ విద్యా పోషకులు పాములపాటి బుచ్చి నాయుడు దీని కుతిపతి శ్రీకృష్ణవ్యాసావళి వీరి మరొక రచన. వీరు 1984 ప్రాంతంలో కడప జిల్లా కందిమల్లయపల్లెలోని బ్రహ్మమ్ గారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. ఆమఠానికి సర్వఅధ్యక్షుడుగా ఉన్న శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాములు వారి ఆదేశానుసారం “శ్రీవీర బ్రహెంద్ర సుప్రభాతమును” సంస్కృతంలోకి రచించారు.

1932లో కర్షకులమీద, 1946లో చెన్నకేశవ శతకం రచించారు. తరువాతి కాలంలో త్రిశతి పేరుతో బుద్ధుడు, వేమన, గాంధీల గురించి మూడు శతకాలు రచించారు. 1942లో హితబోధ, 1944లో ఉదయలక్ష్మీ నృసింహ తారావళి రచించారు. 1984 ప్రాంతంలో బ్రహ్మంగారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. మఠాధ్యక్షుల ఆదేశానుసారం శ్రీవీరబ్రహ్మేంద్ర సుప్రభాతం సంస్కృతంలో రచించారు.

నందమూరి తారకరామారావు వీరిని 1977లో పిలిపించి దానవీరశూరకర్ణ చిత్రానికి సంభాషణలు రాయించారు. ఈ సినిమాతోనే ఆయన చలనచిత్ర రంగంలో తొలిగా పరిచయమయ్యారు.[1] తరువాత శ్రీమద్విరాటపర్వం (1980), శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984) చిత్రాలకు కూడా సంభాషణలు సమకూర్చారు.

వీరుఅముద్రితంగా ఉన్న కొన్ని ప్రాచీన కావ్యాలను పరిష్కరించి ప్రచురించారు. తురగ రాజకవి రచించిన “కిర్గియాలిని పరిణయం” అనే కావ్యం వార్ల సుందరయ్య రచించిన భావలింగ శతకం ఈకోవకు చెందినవే.చిన్నయసూరి రచించిన శబ్దలక్షణ సంగ్రహాన్ని కూడా వీరు ప్రకటించారు.వీరి గ్రంథాలన్ని కవి రాజు గ్రంథమాల పేరుతో వీరు స్వయంగా ప్రకటించినవే కావటం విశేషం. ఈనాడు దిన పత్రికలో వీరు అనేక వ్యాసాలు రాశారు.

హేతువాది

[మార్చు]

పెళ్ళికాక పూర్వం వెంకట కవి అచల మతంలో చేరి దిగంబరిగా వూళ్ళు తిరిగాడు. 1945 ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ఒక్కొక్క బాబాగురించి వివరాలు తెప్పించి ఏ బాబా ఎలాంటి వాడు, ఆయన పూర్వాపరాలు ఏమిటి లాంటి విషయాలతో ఒక పత్రం ప్రచురించారు. దాని చదివి మతం పేరుతో ప్రజలను మోసం చేస్థున్నబాబా లను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి భావజాలంతో హేతువాదిగా మారి అనేక రచనలు చేసారు. వీరు రాసిన దాన వీర శూర కర్ణ సినిమా సంభాషణలలో త్రిపురనేని ప్రభావం గొచరిస్తుంది. మంత్రాలు లేకుండా, త్రిపురనేని రామస్వామి రాసిన పెళ్ళి సూత్రాలు చదివి అనేక లౌకిక వివాహాలు చేయించాడు. ఇలా ఆవుల మంజులత గారి పెళ్ళి, నరిశెట్టి ఇన్నయ్య గారితో కలసి హైదరాబాదు ఎగ్జిబిషన్ మైదానంలో జరిపించారు.

కవులైనవారు మానవులందర్నీ ఏకం చేసేలా, వారిని సంఘటితపరచి వారిలో సౌభ్రాతృత్వం పెరిగేలా చేయాలి. ప్రజల్ని విడదీసేలా రచనలు చేయకూడదు అంటూ ఆయన విభజనతత్వాన్ని నిరసించేవారు.

కొండవీటి వెంకటకవి హాస్యప్రియుడు. తన షష్టిపూర్తి రాబోతున్నదనీ, తానేమంతగా ఆశించడం లేదనీ, ఎందుకైనా మంచిదని ముందుగా చెబుతున్నాననేవాడు. తనకు పెద్దగా కోరికలు లేవనీ, ఏనుగుపై వూరేగించి, కాలుకు గండ పెండేరం (రత్నాలు బంగారం అయితే సరేసరి, లేకుంటే చత్తతోడా (గడ్డితో చేసిన కడియం) అయినా సరే అనేవాడు.

పురస్కారాలు

[మార్చు]

1953 లో గుంటూరు జిల్లా పెదకురపాడులో వీరికి సన్మానం చేసి “కవిరాజు” గౌరవ బిరుదు ప్రధానం జరిగింది.

1971 లో ఆంధ్రవిశ్వ కళాపరిషత్ వీరిని “కళాప్రపూర్ణ”పురస్కారంతో సత్కరించింది.

1979 జూన్ 2 న కొండవీటి వెంకటకవి గారి కవితా బ్రహ్మోత్సవాన్ని డాక్టర్ కొడాలి రంగారావు గారి అధ్వర్యంలో అత్యంత వైభవంగా సత్తెనపల్లిలో నిర్వహించారు. ఎడ్ల బండి కట్టి అంగరంగ వైభవంగా సినీనటులు ఎన్.టి.రామారావు, కొంగర జగ్గయ్య లతో పాటు వెంకట కవిని సత్తెనపల్లి పురవీధులలో ఊరేగించారు. అశేష జనవాహిని సమక్షంలో వెంకట కవికి జరిగిన ఈ పౌర సత్కారం అపూర్వం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని అధికారభాష సంఘంలో సభ్యులుగా నియమించింది.

మరణం

[మార్చు]

వెంకట కవిని గురించి చెబుతూ 'సోక్రటీసులాగా తన ప్రపంచంతప్ప మరోటి తెలియని వారు, అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి ' అని ప్రసిద్ధ కార్టూనిస్టు శ్రీధర్ గారు అన్నారు. కొండవీటి వెంకట కవి గారు 1991, ఏప్రిల్ 7వ తేదిన కాలం చేశారు.

వెంకటకవి కృతులు

[మార్చు]
 1. కర్షకా! (1932)
 2. హితబోధ (1942)
 3. భాగవతులవారి వంశావళి (1943)
 4. ఉదయలక్ష్మీ నృసింహతారావళి (1945)
 5. చెన్నకేశవా! (1946)
 6. భావనారాయణ చరిత్ర (గద్యకావ్యము) (1953)
 7. దివ్యస్మృతులు (1954)
 8. నెహ్రూ చరిత్ర - ప్రథమ భాగము (1956)
 9. త్రిశతి (1960)
 10. నెహ్రూ చరిత్ర - ద్వితీయ భాగము (1962)
 11. బలి (1963)

మూలాలు

[మార్చు]
 1. "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015. "నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన

ఇతర లింకులు

[మార్చు]