దుగ్గిరాల రాఘవచంద్రయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దుగ్గిరాల రాఘవచంద్రయ్య ( )

దుగ్గిరాల రాఘనచంద్రయ్య సచ్చాస్త్రి అని ప్రసిధ్ధిచెందిన శ్రీ దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరి గారు కృష్ణాజిల్లా లోని అంగలూరు వాస్తవ్యులు. వారిది విద్యత్కుటుంబము. సంస్కృతాంధ్రములు చదువుకున్నారు. బి.ఎ పట్టభద్రులు. బెజవాడలో 1923-24 సంవత్సరములలో స్వరాజ్య పత్రిక నడిపేవారు. స్కూలులో చదవుకునే రోజులలోనే ఆయన రచించిన విజయనగర సామ్రాజ్యము అను వ్యాసమును కొమర్రాజు లక్ష్మణరావుగారు చూసి సంతోషించి విజ్ఞాన చంద్రికా మండలి పారితోషికమును దుగ్గిరాల రాఘవచంద్రయ్యగారికిచ్చారు. బెజవాడలో ఆరోజులనాటి రాజకీయ సాహిత్య సాంఘిక విశేషములతో రాఘవచంద్రయ్యగారిని గురించి వారి మిత్రులు శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారు తమ " నా జ్ఞాపకాలు, అభిప్రాయాలు" అను రచనలో వ్రాసియున్నారు. ఇంటిపేరు దుగ్గిరాల అనగానే ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు (1889- 1928) స్మరణకువస్తారు. కానీ వారు వేరు వీరు వేరు. దుగ్గిరాల రాఘవచంద్రయ్యగారి జీవతకాలపు కాలమానం ఇంకా తెలియలేదు.

రాజకీయజీవితము[మార్చు]

గాంధీ మహాత్ముని సహాయనిరాకరణోద్యమము నుండి వారు చనిపోయోదాకా ఖద్దరు వస్త్రములనే ధరించేవారు. స్వాతంత్ర్యోద్యమములో జైలుకు వెళ్ళారు. రాజకీయ బాధితునిగా గుర్తించబడినీలం సంజీవరెడ్డిగారు ముఖ్యమంత్రిగానుండిన కాలంలో రాఘవచంద్రయ్యగారికి బెజవాడలో ఒక నివేశ స్తళము ఇవ్వబడింది. అప్పటిలో రాష్ట్రపతిగానున్న డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో కొంత ఉత్తర ప్రత్యుత్తరములు జరిపారు

సాహిత్యజీవితము[మార్చు]

ఆంధ్ర దేశములో ఆలనాటి గ్రంథాలయోద్యమములో దుగ్గిరాల రాఘవచంద్రయ్య పాత్ర గణనీయమైనది. 1919 సంవత్సరము మద్రాసులోని ఆంధ్ర గ్రంథాలయసంఘానికొక ముద్రాక్షరశాలను లిమిటెడ్ కంపెనీగా నేర్పాటు చేయుటకు తీర్మానము చేయబడింది. ఆ సంకల్పమునకు రాఘవచంద్రయ్యగారు చాల ప్రముఖ పాత్రవహించారు. రాఘవచంద్రయ్యగారు మరియూ అయ్యంకి వెంకట రమణయ్య గారు కలిసి ఆ ముధ్రాక్షరశాల స్థావనకు పాటుబడ్డారు. టంగుటూరి ప్రకాశం గారు 300 రూపాయలు విరాళమునిచ్చారు. లిమిటెడ్ కంపెనీగా స్థాపించబోయే ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షరశాలకు వాటాలు (షేర్లు) కొనిపించటానికి దుగ్గిరాల రాఘవచంద్రయ్యగారు చాల కష్టపడి అనేక ఊర్లుతిరిగి వాటామూలధనము (షేరకాపిటల్) సమకూర్చారు.చాలమంది వాటాదారులైయ్యారు. 1920-21 లో స్థాపించబడ్డ ఆంధ్రగ్రంద్రాలయ ముద్రాక్షరశాలలిమిటెడ్లో అయ్యంకి వెంకట రమణయ్య గారు డైరక్టరు గానుండిరి ఇదివరలో వాణీ ముద్రాక్షరశాలలో పనిచేసిన అనుభవజ్ఞులైన కర్లపాలెం కోదండరామయ్య గారిని ఈ క్రొత్తగానియమితమైన ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షరశాల లిమిటెడ్ కు మేనేజరు గానూ వారికి అసిస్టెంటుగా కె.యల్ నరసయ్యగారునూ నియమితులైయారు. 1963లో రాఘవచంద్రయ్యగారు "నెహ్రూ పట్టాభిషేకము" అను నాటకము రచించి "ఉత్తరభారతము" అని నామకరణంచేశారు. అందులో బ్రిటిష్ ప్రధాని రాజప్రతినిధి జాతీయొద్యమములో కీలక రాజకీయ నాయకులైన గాంధీ నెహ్రూలే కాక మహా భారతములోని సూత్రధారులను చేర్చారు. ఆ పుస్తకమునకు అప్పటి మాజీ గవర్నరు బూర్గుల రామకృష్ణారావుగారు తొలిపలుకు వ్రాసి దాని ముద్రణకు 500 రూపాయలు విరాళమిచ్చారు.దివాకర్ల వెంకటావధానిగారు ఆ పుస్తకమునకు రెండు పుటల పండితాభిప్రాయం వ్రాసి రాఘవచంద్రయ్యగారిని ప్రశంసించారు.

రాఘవచంద్రయ్యగారి ఇతర రచనలు[మార్చు]

వెంకటేశ్వర శతకము సంస్కృతములో

సఛ్చాస్త్రి అనే బిరుదు వృత్తాంతము[మార్చు]

రాఘవచంద్రయ్యగారు సంస్కృతాంధ్రగ్రంధములు చదివినవారు. వేదశాస్త్రములలోని సారాంశమును చెప్పగల సామర్ధ్యముగలవారు. సాహిత్యాభిలాషి. 1919 లో ఆంధ్రగ్రంధాలయసంఘమువారి తీర్మానము ప్రకారము లిమిటెడ్ కంపెనీగా 1920-21 లో స్థాపితమైన ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షరశాలలిమిటెడ్ పనిచేయసాగినది. రాఘవచంద్రయ్యగారికి ప్రియమైన ఈ ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షరశాలకంపెనీలో అప్పటికే గ్రంథాలయోద్యమములోతిరుగుతూ అనేక గ్రంథాలయములును స్థాపించిన అయ్యంకి వెంకట రమణయ్యగారు డైరక్టరైనారు. వెంకట రమణయ్యగారు వ్యవహార దక్షులు. గ్రంథాలయవ్యవహారములును కౌశలముగా చేయగలిగినప్పటికీ కొన్ని కొన్ని స్వలాభప్రియమైన పనులు: కొన్నటువంటి సామగ్రీకి లెఖ్కలు చూపించక పోవటం, ఆ ముద్రాక్షరశాలకంపెనీలో బెనామీగా వాటాదార్లను చేర్చటం వాటాదారుల సమావేశాలు జరిపించి బనాయించి నష్టముచూపించటము లాంటివి కొన్ని లావాదేవీలతో ఆ ముద్రాక్షరశాలకంపెనీని స్వల్పకాలములోనే (1923 లో అయుండచ్చు) లిక్విడేట్ చేసి తన స్వంత ముద్రాక్షరశాలగా ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షరశాలగా నామకరణంచేసుకున్నారు అయ్యంకివారు. రాఘవచంద్రయ్యగారికి దిగ్భ్రమ కలిగింది తీవ్ర ఆశాభంగము కలిగినది. దీనికి తొడుగా వారు స్వతంత్రయోధునిగా జైలులోనున్నప్పటి రోజులలో జైలులోని తోటి స్వతంత్రయోధుడైన బులుసు సాంబమూర్తి గారు స్వాతిశయంతో రాఘవచంద్రయ్యగారితో అమర్యాదగా అవమానించటం జరిగింది. ఈ రెండు దురదృష్ట ఘటనలకూ కారణమైన వ్యక్తులు బ్రాహ్మణులవటంవల్ల రాఘవచంద్రయ్యగారికి తీవ్ర బ్రాహ్మణ ద్వేషముకలిగించి వారు సాహిత్యకౌశలముకలిగినవారైనందున మహా భారతములోని 18 పర్వములవలె బ్రాహ్మణుల దుర్మార్గములను గూర్చి 18 పర్వములు రచించ పూనుకున్నారు. అందులో ఒక పర్వానికి "బ్రాహ్మణ నక్క" అని పేరు పెట్టారు. "అష్టాదశ పాపియగు బ్రాహ్మణునితో సహాయనిరాకరణము చేయుము" అనే శీర్షికతో తెలుగులోనూ ఇంగ్లీషులోను కొన్ని వందలు పుటలుగల రెండు గ్రంథములును రచించి ముద్రించి ప్రచురించారు. అప్పటినుండి వారినెరుగున్నవారందరూ ఆకాలంలో వారితో సఛ్చాస్త్రి అనే వ్యవహరించేవారు. ఇతరులు పిలవటమే కాక తనుగూడా ఆ సంబోధనను ఒక బిరుదుగా తన పేరు చివరతగిలించుకునేవారు. ఆ "బ్రాహ్మణ నక్క" పర్వమును ముద్రించి వారి మిత్రుడైన దిగవల్లి వేంకట శివరావుగారికి చూపించగా శివరావుగారు "నీకున్న పాండిత్యమును దుర్వినియోగము చేయుచున్నావు, మన వేదశాస్త్ర పురాణేతహాసములకు అంతరార్ధము చెప్పగలవాడవు వాటిని గురించి వ్రాయక ఇలాంటి తుచ్చమైన రచనలు చేస్తున్నావు, నీది రాక్షస ప్రకృతితో పోల్చాలి" అనిమందలించగా "నువ్వేమన్నా నాకు కోపం రాదు నీవు సద్బ్రాహ్మణుడవు నేను సఛ్చాస్త్రిని" అన్నారు రాఘనచంద్రయ్యగారు. అంత బ్రాహ్మణద్వేషమున్నా శివరావుగారిపట్ల, వారి మిత్రులు డా ఘంటసాల సీతారామశర్మగారి పట్ల రాఘవచంద్రయ్యగారు చాల గౌరవభావము కలవారైయుండేవారు. దేశంకోసం రాఘవచంద్రయ్యగారు చేసిన త్యాగమునకు వారికున్న సంస్కృతాంధ్ర పాండిత్యమునకూ వారికి రావలసిన గౌరవ ప్రతిష్ఠ, పేరు రాలేదు, దురదృష్ట వంతుడు అని శివరావుగారు తమ జ్ఞాపకాలు అనుభవాలు అన్న అప్రచురిత రచనలో వారినిగురించి వాపోయారు