నయాగరా (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నయాగరా
కృతికర్త: కుందుర్తి ఆంజనేయులు
ఏల్చూరి సుబ్రహ్మణ్యం
బెల్లంకొండ రామదాసు
ముద్రణల సంఖ్య: 2
అంకితం: అనిసెట్టి సుబ్బారావు, లక్ష్మీదేవి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కవిత్వ సంకలనం
ప్రచురణ: నవ్యకళాపరిషత్‌, నరసరావుపేట
విడుదల: 1944 ఆగస్టు

నయాగరా అభ్యుదయ కవులు ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయుల సంయుక్త కృషి ఫలితంగా కవితల సంకలనం తయారైంది. నయాగరా కవితా సంకలనం తెలుగులో అచ్చయిన తొలి అభ్యుదయ కవిత్వ సంకలనంగా చరిత్రలో స్థానం పొందింది.

రచన నేపథ్యం[మార్చు]

1930ల్లో శ్రీశ్రీ అభ్యుదయ కవితా వస్తువులతో కొత్త శైలి, శిల్పాలను అనుసరిస్తూ కవితలు రచన చేసారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మాంద్యం ప్రభావంతోనూ, రెండవ ప్రపంచ యుద్ధారంభ సూచనలతోనూ సమాజ స్థితిగతులలో నెలకొన్న అస్థిరత ఆనాటి యువతపై ప్రభావం చూపింది. ఈ సామాజిక స్థితిగతుల నేపథ్యంలోనే శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వరచన ప్రారంభించగా అచిరకాలంలోనే అది ఉద్యమ స్థాయికి చేరింది.[1] ఆ క్రమంలోనే బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం వంటివారి సంయుక్త కృషి ఫలితంగా నయాగరా కవిత్వ సంకలనం వెలువడింది. ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన అభ్యుదయ కవిత్వోద్యమంలో అచ్చయిన తొలి కవిత్వ సంకలనంగా పేరొందింది.[2]

ఖండకావ్యాలు[మార్చు]

నయాగరా కవితా సంకలనం బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి ఆంజనేయులు రచించిన ఖండకావ్యాల సంకలనం. ఒక్కొక్కరూ మూడేసి ఖండకావ్యాలను రచించి సంకలనంలో చేర్చడంతో మొత్తంగా 9 ఖండకావ్యాల సంకలనం అయింది. ఈ సంకలనంలో చోటుచేసుకున్న ఖండకావ్యాలు ఇవి:[3]

  1. విజయముద్ర ఖండకావ్యాన్ని ఏల్చూరి సుబ్రహ్మణ్యం 1941 మార్చిలో రాశారు.
  2. ప్రజాశక్తి అన్న ఖండకావ్యం 1941 జూన్‌లో ఏల్చూరి సుబ్రహ్మణ్యం రచించారు.
  3. జయిస్తుంది ఖండకావ్యాన్ని 1941 అక్టోబరులో కుందుర్తి ఆంజనేయులు రాశారు.
  4. మన్యంలో అనే పేరున్న ఖండకావ్యం కుందుర్తి ఆంజనేయులు 1943 ఏప్రిల్‌లో రాశారు.
  5. తరువాత పేరుగల ఖండకావ్యాన్ని 1942 సెప్టెంబరులో కుందుర్తి ఆంజనేయులు రచించారు.
  6. ఠాకూర్ చంద్రసింగ్ ఖండకావ్యాన్ని ఏల్చూరి సుబ్రహ్మణ్యం 1943 జూలైలో రచన చేశారు.
  7. నా గీతం ఖండకావ్యాన్ని 1944 జనవరిలో బెల్లంకొండ రామదాసు రచించారు.
  8. ఈ రోజున ఖండకావ్యం బెల్లంకొండ రామదాసు 1944 జనవరిలో రచన చేశారు.
  9. చెరసాల ఖండకావ్యాన్ని 1944 జనవరిలో బెల్లంకొండ రామదాసు రాశారు.

కవితా వస్తువులు[మార్చు]

మన్య విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు, దండి సత్యాగ్రహంలో తన అనుచరులతో కలిసి పాల్గొని యావజ్జీవ కారాగారశిక్ష విధించబడిన విప్లవనేత ఠాకూర్ చంద్రసింగ్ వంటి వారి వీరగాథలను వస్తువులుగా స్వీకరించారు. ప్రజా ఉద్యమాలకు సంబంధించిన కథాంశాలు ఈ సంకలనంలో ఎక్కువగా చోటుచేసుకున్నాయి. బెల్లంకొండ రామదాసు రచించిన నా గీతంలో తన కవిత్వ రచనా తాత్త్వికత, తన సాహిత్య ప్రయోజనం వంటివి చోటుచేసుకున్నాయి. రామదాసు ఈ రోజున ఖండకావ్యంలో విప్లవారంభాన్ని గురించిన ప్రతీకలను ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో, చరిత్రలోని వివిధ విషయాలు ప్రస్తావిస్తూ అభ్యుదయం, విప్లవం వంటివాటితో ముడిపెట్టారు. చెరసాల పేరిట ఆయన రచించిన ఖండకావ్యంలో, భూస్వామ్య సమాజాన్ని చెరసాలగా చిత్రీకరించారు. అటువంటి సమాజ నిర్బంధంలో నలిగే దీనులు, పతితుల కోసం కొత్తగా అభ్యుదయ మార్గం ఉద్భవిస్తోంది గమనించమనే సూచనతో ముగుస్తుంది.
కుందుర్తి ఆంజనేయులు రచించిన ఖండకావ్యం మన్యంలో. మన్యవిప్లవయోధునిగా పేరొందిన అల్లూరి సీతారామరాజు వీరగాథను ఇతివృత్తంగా స్వీకరించి రచించారు. ఆయన రచించిన మరో ఖండకావ్యం జయిస్తుందిలో నియంతలు, కర్కోటక ప్రభువులపై విప్లవ సైన్యం జయిస్తుందని తెలపడం ప్రధాన ఇతివృత్తం. నయాగరా సంకలనంలో చోటుచేసుకున్న కుందుర్తి ఖండకావ్యం తరవాతలోనూ కర్కోటక శాసనాలతో ప్రజలను దెబ్బతీసిన రాజుల రోజులు పోయాయనే విషయాన్ని వస్తువుగా స్వీకరించారు.
ఏల్చూరి సుబ్రహ్మణ్యం రచన చేసిన ఠాకూర్ చంద్రసింగ్ ఖండకావ్యానికి స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాధాన్యత కలిగిన దండి సత్యాగ్రహంలో పాల్గొని జీవితఖైదు శిక్షగా పొందిన విప్లవకారుడు ఠాకూర్ చంద్రసింగ్ వీరగాథను కవితావస్తువు. ఆయన రచించిన మరో ఖండకావ్యం ప్రజాశక్తిలో అభ్యుదయం, విప్లవం వంటివి ప్రజాశక్తిగా పేర్కొంటూ, ఆ ప్రజాశక్తి జయిస్తుందని పేర్కొన్నారు. విజయముద్ర ఖండకావ్యంలో ఎర్రజెండాను విజయచిహ్నంగా ఉపమిస్తూ బాధలుపడుతున్న బడుగుజీవుల తిరుగుబాటును వస్తువుగా స్వీకరించారు.

శైలి, శిల్పం[మార్చు]

నయాగరా కవిత్వ సంకలనంలో కుందుర్తి ఆంజనేయులు కవిత్వానికి, ఇతరుల అభ్యుదయ కవిత్వానికి ఆది ధర్మమైన ఆవేశం మొదటి లక్షణం అని ప్రముఖ విమర్శకుడు జి.వి.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆయన ప్రాచీనాలంకారికులు చెప్పిన పారిభాషిక పదాలతోను, ప్రక్రియా నిర్వచనాలతోనూ, ప్రమాణాలతోను వీరి కవితాన్ని పరిశీలించటం కాకుండా కవిత్వానికుండే మౌలిక ధర్మాలను దృష్టిలో పెట్టుకొని గమనిస్తే ఈ కవిత్వంలోనూ కవితాంశ కనపడుతుంది అని వివరించారు.[2] కథాత్మకత, ఆవేశం, ప్రబోధం వంటివి ఈ రచనల్లో ప్రతిఫలిస్తాయి.

ఇతరుల మాటలు[మార్చు]

  • బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారలు ముగ్గురు కలిసి - ఒక్కొక్కరూ మూడేసి ఖండకావ్యాల చొప్పున - సంకలనంచేసి ప్రచురించిన 'నయాగరా' నాకు త్రేతాగ్నిలా అనిపించింది. ఈ సంపుటి అభ్యుదయ కవితా ప్రస్థానంలో ఒక మజిలీ - జి.వి.సుబ్రహ్మణ్యం, ప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు.[2]
  • శ్రీశ్రీ కల్పించింది వాతావరణం మట్టుకే కాగా నయాగరా కల్పించింది ఆ వాతావరణం లోని స్థూల రేఖలు - కె.వి.రమణారెడ్డి, ప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు, రచయిత.

మూలాలు[మార్చు]

  1. తెలుగులో కవితా విప్లవాల వికాసం(అభ్యుదయ కవిత్వం అధ్యాయం):వెల్చేరు నారాయణరావు
  2. 2.0 2.1 2.2 "నయాగరా - అభ్యుదయ ప్రస్థానంలో తొలిమజిలీ:జి.వి.సుబ్రహ్మణ్యం:యువభారతి జనవరి,1988 సంచిక". Archived from the original on 2013-10-28. Retrieved 2014-04-09.
  3. "విషయసూచిక:నయాగరా కవితా సంకలనం:ఆంధ్రభారతి పత్రిక". Archived from the original on 2014-03-28. Retrieved 2014-04-09.