Jump to content

నల్లనివాడు (పద్యం)

వికీపీడియా నుండి
(నల్లనివాడు పద్మనయనంబులవాడు నుండి దారిమార్పు చెందింది)
బమ్మెర పోతన

నల్లనివాడు పద్మనయనంబులవాడు అనేది బమ్మెర పోతన రచించిన భాగవతంలోని ఒక భక్తిపూరిత తెలుగు పద్యం.

పద్యం

[మార్చు]

నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్...భా. 9-361-ఉ.

టీకా

[మార్చు]

నల్లని వాడు = నల్లగా ఉండు వాడు; పద్మ = పద్మముల వంటి; నయనంబుల వాడు = కన్నులు గల వాడు; మహా = గొప్ప; ఆశుగంబులున్ = బాణములు; విల్లునున్ = బాణాసనమును; తాల్చు వాడు = ధరించెడి వాడు; కడు = మిక్కిలి; విప్పు = విశాల మైన; వక్షము వాడు = రొమ్ము గల వాడు; మేలున్ = శుభములు; పైన్ = మీద; జల్లెడు వాడు = కురిపించు వాడు; నిక్కిన = ఎగు; భుజంబుల వాడు = భుజములు కల వాడు; యశంబున్ = కీర్తిని; దిక్కులన్ = దిక్కుల కడ వరకు; జల్లెడు వాడు = వ్యాపించిన వాడు; ఐన = అయినట్టి; రఘుసత్తముడు = రఘువంశపు తిలకుడు; ఇచ్చుత = తీర్చుగాక; మా = మా; కున్ = కు; అభీష్టముల్ = కోరికలు.

తాత్పర్యం

[మార్చు]

నల్లటివాడు, పద్మాలవంటి కళ్ళు గలవాడు, గొప్ప ధనుస్సు బాణాలు ధరించువాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, మేళ్ళు అనేకం సమకూర్చువాడు, ఎగుభుజాలు గలవాడు, అన్ని దిక్కులకు తన కీర్తిని వ్యాపింపజేసిన వాడు, రఘు కులోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు మా కోరికలు తీర్చుగాక.

వ్యాఖ్యానాలు

[మార్చు]
  1. శ్రీరామ చరిత్ర చెప్తున్న సందర్భంలో మన సహజ కవి పోతరాజు గారు శ్రీరాముని ఇలా ప్రార్థించారు. ఇది పండిత పామరులు అందరికి బాగా నచ్చిన స్తోత్రం. మహాకవులకు బహు ఇష్టమైనది కూడ. అంతేకాదు రాసిన కవిరాజు పోతన్న గారికి కూడా ఎంతో నచ్చినది. అందుకే ఇలాంటిదే శ్రీకృష్ణుని మీద కూడ గోపికలు కృష్ణుని వెతుక్కుంటు మల్లెలను అడిగారు అంటు రాస్తే కాని తృప్తి చెందలేదు.

10.1-1012-ఉ.
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో!
మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే!

కవిత్వ విశిష్ఠత

[మార్చు]
  1. అంత అందమైన ఈ నుతిలో ఆ నల్లని వాడు అంటు కలువలదండ (ఉత్ఫల అంటే కలువే కదా) వేసిన వృత్త సార్థకత కూడా సాధించబడింది.

కవిత్వ విశిష్ఠతలు

తెలుగు సినిమాలు

[మార్చు]