నాగపూడి కుప్పుస్వామి
నాగపూడి కుప్పుస్వామయ్య (1865 - 1951) తెలుగు రచయిత.
బాల్యము
[మార్చు]వీరు సామశాఖీయద్రావిడ బ్రాహ్మణులు. చిత్తూరు మండలములోని "చిరుతని" దరినున్న నాగపూడి వీరి నివాసము. వీరి తండ్రి యజ్ఞనారాయణ శాస్త్రి. జననము: 1865. నిర్యాణము: 1941. సామశాఖీయద్రావిడ బ్రాహ్మణులు. చిత్తూరు మండలములోని "చిరుతని" దరినున్న నాగపూడి వీరి నివాసము. తండ్రి యజ్ఞనారాయణ శాస్త్రి. జననము: 1865. నిర్యాణము: 1941. కృతులు: 1. భారతసారము 2. భోజరాజీయము 3. కాళహస్తీశ్వర శతకము 4. స్తవరత్నావళి (సంస్కృతము) 5. పారిజాతాపహరణ పరిమళోల్లాసము 6. భాగవవ, నిర్వచనోత్తర రామయణాది ప్రాచీన గ్రంథముల పీఠికలు.
కుప్పుస్వామయ్యగారు విమర్శ కాగ్రేసరులు. మదరాసులోని ఆనంద ముద్రాక్షరశాలాధికారులు వీరిచే గొప్ప సారస్వతసేవ చేయించిరి. వారుప్రకటించిన బాగవతము, కంకంటి పావరాజకృతోత్తర రామాయణము, నిర్వచనోత్తర రామాయణము మున్నగు ప్రాక్తన గ్రంధములను బాఠభేదములతో సరిచూచి ససిచేసి చక్కని పీఠికలు వ్రాసిన మహాశయులు వీరే. ఆంగ్లపద్ధతుల ననుసరించి యాంధ్ర గ్రంధముల కుపోద్ఘాతములు రచించినవారిలో కుప్పు స్వామయ్యగారిది యగ్రతాంబూలము. వీరి కావ్య-పురాణభూమికలు తరువాతవారి కొరవడిదిద్దె ననుటలో నత్యుక్తిలేదు. వీరి పాండిత్య-విమర్శకతా శక్తులను వేదము వేంకటరాయశాస్త్రి, కొక్కొండవేంకటరత్నం ప్రభృతు లుగ్గడించిరి. శ్రీపీఠికాపురాధీశ్వరులు వీరిని గౌరవించిరి.
విద్యాభ్యాసము
[మార్చు]కుప్పుస్వామయ్య చెన్నపురిక్రైస్తవ కళాశాలలో జదివి పట్ట భద్రులైరి. సంస్కృతాంధ్ర సాహిత్యము చాలవఱకు స్వయం సంపాదితము. నాడు తిరుపతి సంస్కృత కళాశాలాధ్యాపకులు వట్టివల్లి నరకంఠీరవ శాస్త్రి , కాళహస్తి సంస్థానపండితులు శతఘంటము వేంకటరంగ శాస్త్రిగారును వీరికి మిత్రులు. ఈకమ్మ యిందులకు దృష్టాంతము.
"సిరుల కిరవై, చదువులకు గుదురై, యీవికి దావలమై, దిట్ట తనమ్మునకు మనికిపట్టై, నీటునకు జోటై, ఓరుపునకు మేరయై, ప్రేముడికి గీమై, నాణెములకు దానకమై, పొంకంబులకు డెంకియై, చల్లదనంబుల కిలల్లై, మఱియు గొనమ్ముల కిమ్మై యిమ్మై గ్రాలుచు గతంబేదియు నాయెడం దద్దయు బోరామి గారాములు నెఱపుచు వఱలు నాయనుగు నెయ్యునకు-శతఘంటము వేంకటరంగయ్య గారికి-' నాగపూడి కుప్పుస్వామయ్య బి.ఏ.
న్యాయవాదిగా
[మార్చు]పై నుదాహరింపబడిన యిరువురుశాస్త్రులవలనను నీయన తన సాహిత్యమునకు మెఱుగులు పెట్టుకొనెను. అసలు కుప్పుస్వామయ్యగారు 1918 దాక న్యాయవాదులై పేరు సంపాదించిరి. కాని వారి కావృత్తిపై మనసులేదు. నిరంతరము భాషావ్యాసంగమే బిహారరంగము. తిరుపతి సంస్కృతకళాశాలకు నాడు వీరు విచారణకర్తలుగ నుండిరి.
సాహిత్య సేవ
[మార్చు]ఈ విమర్శకుని జీవిత మానందతుందిలమైనది. శిష్టానుష్టాన పరులు. శాంతహృదయులు. తెలుగన్నచో నెన్నరాని యభిమానము. వీరి కుటుంబములోని వారందఱు భారత భాగవతాదుల పారాయణముతో గాలవ్యయము సేయుచుండువారట. కుప్పుస్వామయ్యగారి భారతసారము, భోజరాజీయము నను వచన గ్రంధములు మధురశయ్యా బంధములు."కవులకుగద్యము గీటురాయి" యని దండి పండితుని యాభాణకము. దానికి దగినట్లుగా నీయన వచనధోరణి మంచియొడుపు బెడగులలో నుండెడిది. చిన్నయసూరివలె నీయనయుజక్కని వచనరచయితయని నాడు వశంసించిరి. వ్యావహారిక వాద మీయన యామోదింప లేదు. ఉత్తరములుకూడ నీయన సలక్షణభాషలో రచించెను. సంస్కృతమున వీరి పాండితికి దారకాణగా "స్తవరత్నావళి"నారయవచ్చును. శ్రీశృంగేరి జగద్గురువులు-శ్రీ కుంభఘోణము జగద్గురువులును వీరి గీర్వాణవాణీప్రౌఢిమమునకు మెచ్చి గౌరవించిరి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి భారతమునకు వీరువ్రాసిన విపులభూమిక పరికింపదగినది. ఆనందముద్రాలయ, వావిళ్ళముద్రాలయ ప్రకటితములయిన పెక్కుకృతులు కుప్పుస్వామయ్యగారి పీఠికలతో నందగించుచున్నవి.
చెన్నపురి విశ్వవిద్యాలయమున బ్రాచ్యవిద్వద్బిరుదపరీక్ష లుండవలయునని పోరిపెట్టించివారిలో మొదటివా డీవిమర్శకాగ్రేసరుడే. వీరిశిష్యులెందఱోవందలు నేడును చిత్తూరు మండలమున నుండిరని వాడుక.
ఆత్మశ్లాఘ నెఱుగని యీయన శిష్యులు వచ్చి "మేము తమ శిష్యుల" మని చెప్పుకొనునప్పుడు "గురోస్తుమౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచిన్న సంశయా" అని యనువారిని విందుము. కాళహస్తి సంస్థాన ప్రభువులగు శ్రీ దామెర అక్కప్పనాయనింగారికి వీరు కొంతకాల మాంగ్లభాష గఱపిరి. ఈనాగపూడివంశ మందారుని "పారిజాతనపహరణ పరిమళ వ్యాఖ్య" ఆంధ్రసారస్వతమున కపూర్వభూష, వ్యాఖ్యానావతరణమున నీయన యనేక జ్ణేయాంశములు వెలిబుచ్చిరి. ఇది వీరి పాండితికి స్ఫోరకము. అయినను, ఈ వినయవాదము వినదగినది.
కృతులు
[మార్చు]- 1. భారతసారము
- 2. భోజరాజీయము
- 3. కాళహస్తీశ్వర శతకము
- 4. స్తవరత్నావళి (సంస్కృతము)
- 5. పారిజాతాపహరణ పరిమళోల్లాసము
- 6. భాగవత, నిర్వచనోత్తర రామయణాది ప్రాచీన గ్రంథముల పీఠికలు.
మూలాలు
[మార్చు]- ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1850, పేజీలు: 232-4.