నాదిర్షా భారతదేశ దండయాత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్నెల్ పోరాటంలో నాదిర్షా యొక్క క్రూరత్వపు చిత్రీకరణ ఆదెల్ ఆదిలీ చిత్రం

ఇరాన్ చక్రవర్తి, ఆఫ్షరిద్ పాలకవంశ స్థాపకుడు నాదిర్ షా ఉత్తర భారతదేశాన్ని 55 వేల బలమున్న గొప్ప సైన్యంతో దండయాత్ర చేశాడు. అందులో భాగంగా 1739 మార్చి నెలలో ఢిల్లీపై దాడి చేశాడు. అప్పటికే మరాఠాల దాడుుల, ఇతర సర్దార్ల స్వాతంత్ర్యం, అంతర్గత కుమ్ములాటల్లో ఘోరంగా బలహీనపడ్డ మొఘలులు కర్నల్ యుద్ధంలో అత్యంత తేలికగా ఓడిపోయారు. ఈ విజయంతో నాదిర్షా ఉత్తర భారతదేశంపై ఆధిపత్యాన్ని స్వీకరించాడు.[1]

ఢిల్లీని పూర్తిగా నాశనం చేసి, దోపిడి చేయమన్న ఆజ్ఞను తన సైన్యానికి నాదిర్షా ఇవ్వగా ఘోరమైన జనహననం జరిగింది. మార్చి 22న ఒకే ఒక్కరోజులో 20వేల నుంచి 30వేలమంది భారతీయులను పర్షియన్ దళాలు ఊచకోత కోశాయి.[2] ఈ ఊచకోత జరుగుతుండగా మొఘల్ సామ్రాట్టు మొహమ్మద్‌ షా నాదిర్షాను తనపై, తన ప్రజలపై దయచూపాల్సిందిగా నగరం, రాజ్య ఖజానా తాళాలు అప్పగిస్తూ అర్థించాల్సిన స్థితివచ్చింది.[3] దీనికి ప్రతిగా నాదిర్షా ససైన్యంగా వెనక్కితగ్గేందుకు అంగీకరించినా, మహమ్మద్ షా ప్రతిఫలంగా రాజ్యపు ఖజానా తాళాలు అతని చేతికందించాల్సి వచ్చింది, చివరకు నెమలి సింహాసనాన్ని కూడా పర్షియా సామ్రాట్టుకు కోల్పోయాడు. అప్పటి నుంచి నెమలి సింహాసనం పర్షియన్ సామ్రాజ్య ఆధిక్యానికి చిహ్నంగా నిలిచింది. అపార రత్నరాశుల నిధిలో, నాదిర్ కోహినూర్, దర్యా-ఇ-నూర్ వంటి వజ్రాలు పొందాడు. కోహ్-ఇ-నూర్ (కోహినూర్) అంటే పర్షియన్ భాషలో కాంతి పర్వతం అనీ, దర్యా-ఇ-నూర్ అంటే కాంతి సాగరం అనీ అర్థాలు. వీటికి నాదిర్షాయే ఆ పేర్లు పెట్టాడు.[4]

నాదిర్షా తనకన్నా సైనిక శక్తి చాలా బలహీనంగా ఉన్న మొఘల్ చక్రవర్తిని రాజ్యానికి సుదూరమైన తూర్పు ప్రాంతాల్లో జయించడంతో పర్షియా ప్రత్యర్థి ఒట్టొమాన్ సామ్రాజ్యంపైనా, ఆపైన యుద్ధాల్లో తూర్పు కాసెసస్, మధ్య ఆసియాలపై పోరాడేందుకు తగ్గ బలాన్ని, స్థైర్యాన్ని అందించింది.[5]

ఊచకోత[మార్చు]

యుద్ధానంతరం జరిగిన ఘోరమైన నరమేధంలో పర్షియా సేనలు ఢిల్లీలో అన్నివైపుల నుంచి ప్రజలను ముట్టడించి తుపాకులతో కాలుస్తూ, కత్తులతో నరుకుతూ వికృత క్రీడ సలిపాయి. వేలాదిమంది స్త్రీలను అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. పిల్లలను తల్లుల చేతిలో ఉండగానే నరికిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఇళ్ళను తగలబెట్టగా వచ్చిన పొగ మేఘాల్లా ఆకాశాన్ని ఆవరించింది. ఈ ఘోరకాండ చివరకు మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా తన రాజ్యఖజానా తాళాలు చేతికివ్వడంతో ముగిసింది.

తరలించిన సంపద[మార్చు]

కోహినూర్ వజ్రానికి ట్రావెర్నియర్ చేసిన వివిధ రకాల కోణాల చిత్రీకరణ

నాదిర్షా దోచుకుని పోయిన సంపద విలువ ఇంత అని చెప్పేందుకు వీలు లేదు. శతాబ్దాల పరిపాలనలో ప్రజల నుంచి, సామంతరాజ్యాల నుంచి మొఘల్ చక్రవర్తులు పోగుచేసిన సంపదనంతా ఒక్కపెట్టున దోపిడీచేసి తీసుకుపోయాడు. చరిత్రకారులు దీనిని గురించి ఎన్నోరకాలుగా అంచనాలు వేశారు.

 • ప్రేజర్ అనే చరిత్రకారుడు ఇది అప్పట్లోనే 70 కోట్ల నవరసులు ఉంటుందని వ్రాశారు. దీనిలోని 25కోట్ల నవరసుల విలువగల సాధారణమైన నగలు ఉన్నాయి. విశేషమైన ఆభరణాల్లో వెండి, బంగారంతో, నవరత్నాలతో నిర్మించిన అపురూపమైన నెమలి సింహాసనం, ప్రపంచ ప్రసిద్ధిచెందిన వజ్రాలైన కోహినూర్ వజ్రం (క్రమక్రమంగా అది బ్రిటీష్ వారి వద్దకు చేరింది), దర్యా-ఇ-నూర్ (ఇది ఇప్పటికీ పర్షియాలోనే ఉంది), ప్రత్యేకంగా నవరత్నాలతో అలంకరించిన వెండి, బంగారు లోహాల ఆయుధాలు, విశిష్టమైన పనితనం, అంత్యంత విలువైన మణిమాణిక్యాలున్న ఆభరణాలు కలిపి 9 కోట్ల నవరసుల ఖరీదని వ్రాశారు.[4]
 • నాదిర్షా కొలువులో వజీరుగా చేరిన భారతీయుని కింది ఉద్యోగి ఆనందరాం తనకు తెలిసిన అంచనా తాను వ్రాశారు. 60 లక్షల వెండినాణాలు, వేలాదిగా బంగారునాణాలు, కోటి విలువగల బంగారు సామాన్లు, 50కోట్లు విలువైన విశిష్టమైన నగలు, ఇవికాక కొన్ని విలువకట్టేందుకు వీలుకాని వస్తువులు పట్టుకుపోయినట్టు ఆయన వ్రాశారు.
 • నాదిర్షా చరిత్రకారుడు కోటి తొంభైలక్షల నవరసుల ఖరీదు కలిగిన నాణాలను తరలించుకువెళ్ళినట్టుగా వ్రాశారు.
 • స్కాంట్లాండుకు చెందిన మరో చరిత్రకారుడు నాదిర్షా తరలించిన డబ్బు, వస్తువుల విలువ 11 కోట్ల 90 నవరసులుగా అంచనావేశారు.

అనంతర స్థితిగతులు[మార్చు]

నాదిర్షా దండయాత్రలో సంపాదించిన దోపిడీ సొమ్ము ఆసరాతో అతను పర్షియా తిరిగివెళ్ళాకా అక్కడ ప్రజలపై పన్ను మూడేళ్ళపాటు తొలగించాడు.[6][7] బలహీనమైన మొఘల్ సామ్రాజ్యంపై సాధించిన ఈ ఘనమైన విజయంతో అతను ఒట్టోమాన సామ్రాజ్యాన్ని ఎదుర్కొనే సత్తువ సాధించుకున్నాడు.[8]

ఒట్టోమన్ సుల్తాన్ మహ్మద్ I ఒట్టోమాన్-పర్షియన్ యుద్ధాన్ని (1743-1746) ప్రారంభించగా, మొహమ్మద్ షా అత్యంత సన్నిహితంగా ఒట్టోమన్లకు 1748లో మరణించేవరకూ సహాయం చేశాడు.[9] నాదిర్షా భారత దండయాత్ర మొఘల్ సామ్రాజ్యాన్ని అత్యంత బలహీనం చేసింది. దీనివల్ల క్రమేణా బ్రిటీష్ వారు దేశాన్ని ఆక్రమించుకునేందుకు ఓ సహకారిగా నాదిర్షా దండయాత్ర ఉపకరించింది. నాదిర్షా దండయాత్ర తర్వాత మొఘల్ సింహాసనాన్ని మరాఠాలు ఆక్రమించే యత్నం చేసినా మూడవ పానిపట్టు యుద్ధంలో ఓటమి వారిని ప్రాంతీయ శక్తిగా మిగిల్చేసింది. ఈ రెండు ఘటనలు బ్రిటీష్ వారికి కలిసివచ్చి ఆ శక్తి శూన్యతలో వారు చేరేందుకు పనికి వచ్చింది.[10]

మూలాలు[మార్చు]

 1. "Nadir Shah". Britannica.com.
 2. Marshman, P. 200
 3. Soul and Structure of Governance in India. Archived from the original on 14 జూలై 2014. Retrieved 26 May 2014.
 4. 4.0 4.1 వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
 5. The Sword of Persia:Nader Shah, from Tribal Warrior to Conquering Tyrant. Retrieved 26 June 2014.
 6. "Nadir Shah". Britannica.com.
 7. This section: Axworthy pp.1-16, 175-210
 8. The Sword of Persia:Nader Shah, from Tribal Warrior to Conquering Tyrant. Retrieved 26 June 2014.
 9. Naimur Rahman Farooqi (1989). Mughal-Ottoman relations: a study of political & diplomatic relations between Mughal India and the Ottoman Empire, 1556-1748. Idarah-i Adabiyat-i Delli. Retrieved 6 April 2012.
 10. Axworthy p.xvi