నిజామాబాదు మ్యూజియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజామాబాదు మ్యూజియం
Established1936 (నిర్మాణం)
2001 అక్టోబరు 24 (ప్రజా సందర్శనం
Locationతిలక్ గార్డెన్, నిజామాబాదు, తెలంగాణ, భారతదేశం

నిజామాబాదు మ్యూజియం తెలంగాణ రాష్ట్రం నిజామాబాదులోని తిలక్ గార్డెన్ ప్రాంగణంలో ఉన్న మ్యూజియం. ఈ మ్యూజియంలో పాతరాతియుగం నుండి విజయనగర సామ్రాజ్యం (16వ శతాబ్ధం) వరకు మానవ నాగరికత పరిణామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ కళాఖండాలు, పురాతన వస్తువులు ఉన్నాయి. ఈ మ్యూజియంలో బిద్రి కథనాలు, విస్తృతమైన ఆయుధాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి.[1]

చరిత్ర

[మార్చు]

ఈ పురావస్తు మ్యూజియంను 1936 లో ఏడవ నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించాడు. 2001 అక్టోబరు 24న ఇందూరు ఉత్సవాలలో భాగంగా ప్రజల సందర్శనకోసం అధికారికంగా తెరవబడింది.[2]

సేకరణలు

[మార్చు]

మ్యూజియం పురావస్తు విభాగం, శిల్పకళా గ్యాలరీ, కాంస్య అలంకార గ్యాలరీ అనే మూడు విభాగాలుగా విభజించబడింది.

పురావస్తు విభాగం

[మార్చు]

ఇందులో పాలియోలిథిక్, నియోలిథిక్, చివరి రాతి యుగాలకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. సామాన్యశకం 2వ శతాబ్దం నాటి కుండలు, ఇనుప పనిముట్లు, కంకణాలు, పూసలు, టెర్రకోట, ఇటుకలు వంటి శాతవాహన కాలం నాటి చారిత్రక, సాంస్కృతిక వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. బోధన్ ప్రాంతంలో వెలికితీసిన విజయనగర శకంనాటి బంగారు నాణేలు కూడా ఉన్నాయి. శాతవాహన రాజవంశం, విష్ణుకుండినులు, కాకతీయులు, ఇక్ష్వాకులు, కుతుబ్ షాహీ రాజవంశం, విజయనగరం, బ్రిటిష్ కాలం, మధ్యయుగ కాలం నాటి ఖురాన్ షరీఫ్ ఉన్నాయి.[3]

శిల్పకళా గ్యాలరీ

[మార్చు]

ఇందులో చాళుక్య రాజవంశం, కాకతీయ రాజవంశం, రాష్ట్రకూటాలు, విజయనగర రాజ్యం (16వ, 17వ శతాబ్దాలు) కాలాలకు చెందిన అనేక శిల్పాలు ఉన్నాయి. వీటిల్లో జైన, గణేశ, పార్శ్వనాథ్, వీరభద్ర, చాముండి, లౌకిక, హీరో స్టోన్స్, శిల్పాలు, గంగా, యమున, సరస్వతి, చెన్నకేశవ మొదలైనవి ప్రధానమైనవి. విజయనగరం రాజవంశం నాటి ఎర్రటి ఇసుక రాతితో చెక్కిన డోర్ జాంబ్ ఇక్కడ మ్యూజియం ముందు నిర్మించబడింది.

కాంస్య, అలంకార గ్యాలరీ

[మార్చు]

మ్యూజియంలోని కాంస్య, అలంకార విభాగంలో చాళుక్యుల నుండి విజయనగర కాలం వరకు వివిధ కాలాల నుండి కాంస్య విగ్రహాలు, వస్తువులు ఉన్నాయి. బిడిరివేర్, పింగాణీ, ఎనామెల్ వప్తువులు, ఆయుధాలు, కవచాలు ఉన్నాయి. కుత్బ్ షాహీ, ఆసిఫ్ జాహీ కాలం నుండి బంగారు పూత పనిముట్లు, ఛాతీ ప్లేట్లు, కవచాలు, వక్ర ఖడ్గాలు, బాణాలు, బాకులు మొదలైనవి కూడా ఉన్నాయి.

ఇతర వివరాలు

[మార్చు]

మ్యూజియంలో నాణేలు, పవిత్ర ఖురాన్ వంటి మాన్యుస్క్రిప్ట్‌లు, పూర్వ చరిత్ర వస్తువులు, పూర్వ చరిత్రకు సంబంధించిన రాతి శిల్పాలు, ఆధునిక పెయింటింగ్‌లు, సూక్ష్మ చిత్రలేఖనాలు ఉన్నాయి.

సందర్శన వివరాలు

[మార్చు]

ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. శుక్రవారం, పబ్లిక్ హాలిడేస్‌లో మ్యూజియం మూసివేయబడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. "Welcome to Telangana Focus.com". www.telanganafocus.com. Archived from the original on 4 March 2016. Retrieved 2 October 2021.
  2. Department of Heritage Telangana, Museums. "District Heritage, Archaeological Museum". Archived from the original on 18 July 2021. Retrieved 2 October 2021.
  3. The Hindu, Telangana (29 March 2014). "A date with the glorious past" (in Indian English). P. Ram Mohan. Archived from the original on 25 October 2020. Retrieved 2 October 2021.