నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దొరవారిసత్రము మండలంలోని నేలపట్టు గ్రామంలో ఉంది.

విశేషాలు[మార్చు]

ఇది 458.92 హెక్టార్ల విస్తీర్ణం కలిగియుంది. ఈ కేంద్రానిని విదేశీ పక్షులు ఏటా చలికాలంలో వేలమైళ్ళు ప్రయాణించి ఆహారం కోసము, సంతానోత్పత్తి కోసమూ వస్తుంటాయి. పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలో ఇదే అతి పెద్ద ఆవాసం. [1] ఈ ప్రాంతానికి రంగు రంగుల విదేశీ వలస పక్షులు వస్తాయి. పేరుకు విదేశీ పక్షులే అయినా వాటి జన్మస్థలం నేలపట్టే. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న ఈ నేలపట్టు దశాబ్దాల కాలంగా పక్షులకు విడిది కేంద్రంగా ఉంటోంది. పక్షులకు ఆహారమైన చేపలు ఇక్కడ సమృద్దిగా దొరుకుతాయి. అందుకే విదేశీపక్షులు ప్రతి ఏటా అక్టోబర్ నెల నుంచి నేలపట్టుకురావటం ప్రారంభిస్తాయి. అప్పటి నుంచి ఆరునెలల పాటు వెదురుపట్టు, బోరులింగలపాడు, శ్రీహరికోట, చింతవరం, మొనపాళెం, మనుబోలు ప్రాంతాల్లో చెట్లపై గూళ్లు కట్టుకుని విడిది ఏర్పాటు చేసుకుంటాయి.[2]

ఫ్లెమింగోలు (సముద్రరామచిలుక), పెలికాన్(గూడబాతులు), పెయింటెడ్‌స్టార్క్స్(ఎర్రకాళ్లకొంగలు), ఓపెన్‌బిల్ స్టార్క్స్ (నల్లకాళ్లకొంగ), సీగల్ (సముద్రపు పావురాళ్లు), గ్రేహారన్ (నారాయణపక్షి), నల్లబాతులు, తెల్లబాతులు, పరజలు, తెడ్డుముక్కు కొంగ, నీటికాకులు, చింతవక్క, నత్తగుల్లకొంగ, చుక్కమూతి బాతులు, సూదిమొన బాతులు, నీటికాకులు, స్వాతికొంగలులాంటి అనేక విదేశీ, స్వదేశీ పక్షులు ఇక్కడ దర్శనమిస్తుంటాయి.[3]

ఏటా అక్టోబర్‌లో వీటి రాక ఆరంభమవుతుంది. ఇక్కడకు వచ్చాకే తమ జతను వెతుక్కుంటాయి. గూళ్లు కట్టుకుంటాయి. పిల్లలతో కలిసి ఆరు నెలలకు అంటే సరిగ్గా మార్చి నెలకు తిరిగి తమతమ దేశాలకు పయనం అవుతాయి. నైజీరియా, బర్మా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఖజకిస్థాన్, హిమాలయాల నుంచి ఇక్కడకు తరలివస్తాయి. మొత్తం 46 రకాల పక్షులు ఇక్కడ విడిది చేస్తుంటాయి.

పెలికాన్ రకానికి చెందిన పక్షులకు నేలపట్టు హాట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. విదేశీ అతిథులను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం ఇక్కడకు వస్తుంటారు.[4] [5]

నేలపట్టు గూడుబాతు సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా నత్తగుల్లకొంగ, నీటికాకి, తెల్లకంకణాయి, శవరి కొంగ లాంటి అంతరించిపోతున్న జాతులకు కూడా ఇది సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి బర్మా, నేపాల్, అమెరికా, చైనా, థాయ్‌లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అంటార్కిటికా ప్రాంతాల నుంచి పక్షులు శీతాకాలంలో వలస వస్తుంటాయి. అక్టోబరు నుంచి మార్చి వరకు పక్షులు ఇక్కడే ఉంటాయి. అక్టోబరు మొదటి, రెండో వారంలో వచ్చిన పక్షులు మూడో వారంలో గూడుకోసం సామాగ్రిని సంపాదించుకుంటాయి. నాలుగో వారంలో ఆడ, మగ పక్షులు జతకూడుతాయి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో గుడ్లు పెడతాయి. డిసెంబరు రెండు లేదా మూడో వారంలో గుడ్డు నుంచి పిల్లలు బయటికి వస్తాయి. తరువాత పిల్లపక్షికి తల్లి పక్షులు ఈతకొట్టడం ఎగరడం, ఆహారాన్ని సంపాదించుకోవడం నేర్పిస్తుంది.

పురుగులు, క్రిమి కీటకాలు, చేపలు, కప్పలు, నత్తలు, పీతలు, గొంగళి పురుగులు, నాచుమొక్కలు వీటి ఆహారం. పిల్లపక్షులు పెద్దయిన వెంటనే తిరిగి స్వస్థలానికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్న వాచ్ టవర్ ఎక్కితే ఈ పక్షులను బాగా చూడవచ్చు. ఇక్కడ ఒక మ్యూజియం, గ్రంథాలయం, ఆడిటోరియం కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న అభయారణ్యంలో తోడేళ్ళు, లోరిస్ జాతి కోతులు, చుక్కల జింకలు, తాబేళ్ళు, పాములు కూడా ఉన్నాయి.[6]

ఫ్లెమింగో ఫెస్టివల్[మార్చు]

2000లో నెల్లూరు జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన ప్రవీణ్‌కుమార్ ఒకరోజు కుటుంబంతో పులికాట్ సందర్శనకు వచ్చారు. తడ రేవు వద్ద పడవ షికారు చేస్తుండగా వేల సంఖ్యలో ఫ్లెమింగోలు గుంపులు గుంపులుగా కనిపించి కనువిందు చేశాయి. ఇది గమనించిన కలెక్టర్ నాటి స్థానిక శాసనసభ్యులు పరసా వెంకటరత్నయ్య దృష్టికి తీసుకెళ్లి 2001లో ఫ్లెమింగో ఫెస్టివల్(పక్షుల పండుగ) కు శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి ప్రతి ఏటా మూడురోజులపాటు పక్షుల పండుగను నిర్వహించడం ప్రారంభించారు.  ఏటా జనవరి నెలలో పక్షుల పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పండగను ఎగ్జిబిషన్ స్టాల్స్, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా నిర్వహిస్తారు.

మూలాలు[మార్చు]

  1. Frederick, Prince. "Pelican Place". The Hindu. Archived from the original on 8 ఫిబ్రవరి 2005. Retrieved 1 February 2013.
  2. పక్షులకు పరిచిన నేలపట్టు పానువు Sakshi January 09, 2015
  3. Sharma, P.K. and P. S. Rahgavaiah (2002). "Effect of Rainfall on Grey Pelican (Pelecanus philippensis) Arriving and Breeding at Nelapattu Bird Sanctuary, Andhra Pradesh". Indian Forester, October 2002, pp. 1101-1105.[1] Archived 2016-03-04 at the Wayback Machine
  4. విదేశీపక్షుల రాకతో సందడిగా నేలపట్టు 04-01-2016[permanent dead link]
  5. Sharma, P.K. and P. S. Rahgavaiah (2002). "Effect of Rainfall on Grey Pelican (Pelecanus philippensis) Arriving and Breeding at Nelapattu Bird Sanctuary, Andhra Pradesh". Indian Forester, October 2002, pp. 1101-1105. [2] Archived 2016-03-04 at the Wayback Machine
  6. ఆదివారం ఈనాడు, నవంబరు 13, 2011

ఇతర లింకులు[మార్చు]