Jump to content

పంచముఖ వినాయకుడు

వికీపీడియా నుండి

పంచముఖ వినాయకుడు: పార్వతీదేవి ఒకరోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయనిశ్చయించి నలుగుపెట్టుకొనుచు తనస్నానం అయ్యేంతవరకూ బయట కాపలానిమిత్తం నలుగుపిండితో ఒక అందమైన బాలుని రూపమును తయారుచేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి నాయనా నీవు నాస్నానం పూర్తి అయ్యేవరకు ద్వారంవద్ద కాపలా ఉండి ఎవ్వరినీలోనికి రానీయకు అని ఆజ్ఞాపించి పంపెను. ఆబాలకుడు అట్లే కాపలాకాయుచుండగా లోకసంచారము చేసి తిరిగివచ్చుచున్న శివుని చూచి ప్రతిఘటించెను. ఎవరవు నీవు నన్నే అడ్డగించు చున్నావని శివుడు ప్రశ్నించగా నేనెవరైతేనీకేమని పలికి ఆబాలుడు శివునితో యుద్ధానికి దిగెను. వారిద్దరికీ మధ్య భీకరపోరుకొనసాగెను. శాంకరి మానసపుత్రుడైన ఆబాలుడు దివ్యాస్త్రములను ప్రయోగించుచు శివుని నిరోధించెను. చివరకు శివుడు విసుగుచెంది ఆబాలుని శిరమును తన త్రిశూలముతో ఖండించి వెంటనే తనమూడవ నేత్రమును తెరచి ఆశిరస్సును భస్మము చేసెను. అప్పుడే తనస్నానమును ముగించుకొని తను సృష్టించిన తమకుమారుని గురించి తన భర్తయైన శివునకు తెలుపవలెనని ఆనందముతో బయటకువచ్చిన పార్వతీదేవి ఈ దృశ్యమును చూచిరోదించుచు శివుని నిందించెను. అపుడు సర్వాంతర్యామియైన శివుడు జరిగినదంతయు తన దివ్యదృష్టితో వీక్షించి పార్వతీదేవిని ఓదార్చి ఆబాలుని మరల బ్రతికింతునని మాట ఇచ్చెను. అపుడు శివుడు తనసేవకులను నలుదిక్కులకు పంపి ఉత్తరదిశగా శిరస్సు ఉంచి నిద్రించుచున్న ఏదైనా జంతువు శిరస్సునైనను ఖండించి తెమ్మని ఆదేశించెను. కొంతసేపటికి వారు ఒక గజ (ఏనుగు) ముఖమును తెచ్చి శివునకు ఇచ్చిరి. అపుడు శివుడు ఆఏనుగు తలను ఆబాలుని మొండెమునకు అతికించి తనసర్వ శక్తులను అతనికి ప్రసాదించుచు పునరుజ్జీవితుని చేసెను. అందువల్ల ఆబాలుడు "గజాననుడు" అయ్యెను. తరువాతశివుడు ఆబాలుని తన గణములన్నింటికి అధిపతిగ ప్రకటించెను. కావున ఆబాలుడు "గణాధిపతి" అయ్యెను. సమస్త దేవతలు ఆబాలుని ఆశీర్వదించిరి. ఆబాలుడు సమస్త విఘ్నములను పోగొట్టునని వరమునిచ్చిరి. కాబట్టి ఆబాలుడు విఘ్నములకు అధిపతియై "విఘ్నేశ్వరుడు" అయ్యెను. ఆబాలుడే శివపార్వతుల పెద్దకుమారుడైన "వినాయకుడు". సర్వజనులును సమస్త కార్యములకు ప్రారంభమునకు ముందుగ విఘ్నేశ్వరుని పూజించవలసినదని శివుడు ఆజ్ఞాపించెను. వినాయకునికి సిద్ధి, బుద్ధి అను ఇద్దరు భార్యలు కలరు. కాబట్టి సిద్ధివినాయకుడు, బుద్ధివినాయకుడు మనకు దర్శనమిత్తురు. పంచముఖ ఆంజనేయుడు, వినాయకుడు అర్ధనారీశ్వర స్వరూపమువలె ఒకరిలో మరియొకరు సగభాగమని కథనము ఉంది. కాబట్టి వినాయకుడు మనకు పంచముఖగణపతి వలెకూడా కనిపించును. పంచముఖ వినాయకునికి కూడా పంచముఖ ఆంజనేయుని వలెనే నాలుగు దిక్కులకు నాలుగు ముఖములు, ఊర్ధ్వ ముఖముగా ఐదవముఖము కలిగియుండును. ఆయన ఐదు ముఖములలో మొదటిది గజముఖుడైన వినాయకుడు. ఈయన భోజన ప్రియుడు. ఈయనకు వినాయక చవితిరోజు చేసే ఉండ్రాళ్ళనిన అత్యంత ప్రీతిపాత్రము. రెండవది లక్ష్మీ గణపతి. ఈయన సమస్త సంపదలను ప్రసాదించును. మూడవది సిద్ధివినాయకుడు. ఈయన సమస్త కార్యసిద్ధిని కలిగించును. నాల్గవది బుద్ధివినాయకుడు. ఈయన సమస్త జ్ఞానమును మనకు ప్రసాదించును. ఐదవది చింతామణి గణపతి. ఈయన చింతలను పోగొట్టి, సమస్తభయములను పారద్రోలును.

(ముఖ్య గమనిక: పంచముఖ వినాయకుని గురించి ఈ వివరాలను నేను 2015 సంవత్సరంలో పరిశోధనచేసి నా ఫేస్ బుక్ అకౌంట్ లో అందించడం జరిగింది. దీనిని చాలామంది తరువాత వారి సైట్లలో వారే వ్రాసినట్లుగా కాపీ చేయడం జరిగింది. అటువంటివారు నా పేరును సూచించవలసినదిగా తెలియజేయుచున్నాను.) పంచముఖ వినాయకునికి మాకుటుంబ సభ్యులందరి తరపున శతసహస్ర వందనములు. సమస్త జనులకు పంచముఖ వినాయక అనుగ్రహ ప్రాప్తిరస్తు........ సర్వేజనాః సుఖినోభవంతు.......... సమస్త సన్మంగళాని సంతు........ స్వస్తి.... Written by Nemani.V.V.S.N.Murty, Lecturer in Physics, Nedunuru, Inavilli Mandal, Konaseema District, Andhra Pradesh, Mobile: 9440249930.