పండితారాధ్య చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పండితారాధ్య చరిత్ర శైవకవి పాల్కురికి సోమనాథుడు రచించిన ద్విపద కావ్యం.

ఇతివృత్తం[మార్చు]

పండితారాధ్య చరిత్ర శైవ భక్తుల కథలకు ఆలవాలంగా రచయించారు సోమనాథుడు.[1] తెలుగు నాట శైవాన్ని ప్రచారం చేసేందుకు నడుంకట్టిన మల్లికార్జున పండితారాధ్యుని జీవితాన్ని ప్రముఖంగా ఇందులో రాశారు. పండితారాధ్యుని జననం, బాల్యం విడిచిపెట్టి ఆయన మిగతా జీవితాన్ని వర్ణించారు. దీక్ష, పురాతన, వాద, మహిమ, పర్వతం అనే ఐదు ప్రకరణాల్లో ఆయన జీవిత వర్ణన సాగింది.[2]

విశేషాలు[మార్చు]

ఛందస్సు[మార్చు]

పండితారాధ్య చరిత్రాన్ని పాల్కురికి సోమన 11910 ద్విపద పద్యాల్లో రచించారు. మార్గ ఛందస్సులను విడిచిపెట్టి రోకటి పాటలు వంటి జానపదాలకు దగ్గరగా ఉండే దేశి ఛందస్సు అయిన ద్విపదను పాల్కురికి సోమనాధుడు ఆయన సాహిత్యరచనకు ప్రధానంగా స్వీకరించారు. ఆ క్రమంలోనే పండితారాధ్య చరిత్రాన్ని ద్విపదల్లో రాశారు.[2]

రసచర్చ[మార్చు]

కొందరు విమర్శకులు పండితారాధ్య చరిత్రలో నవరసాల చిత్రీకరణ కనిపిస్తున్న విధానాన్ని వివరించారు. శివుని భర్తగా భావించిన బసవన భక్తి శృంగారం, అంచెన్న శివునితో బావమరిదిలా చేసిన వెటకారంలో కొంత హాస్యం, దక్ష ధ్వంసంలో రౌద్రం, బసవని మరణవార్త పండితారాధ్యునికి తెలిసిన ఘట్టంలో కరుణం, మడివాలు మాచయ్య కథలో వీరం, మల్లికార్జునుడు చూపిన మహిమల్లో అద్భుతం, వేమనారాధ్యుని కథలో రాజు శవం వర్ణనలో బీభత్సం, పల్నాటి చోళుని వంశ నాశనంలో భయానకం, పండితారాధ్యుని లింగార్చన వర్ణనలో శాంతం వంటివి వ్యక్తమైనట్టు రాశారు.[3]

సమాజ చిత్రణ[మార్చు]

పండితారాధ్య చరిత్రలో 13వ శతాబ్దికి చెందిన తెలుగువారి జీవితాన్ని సవివరంగా వర్ణించారు పాల్కురికి. ఇందులో కేవలం శివభక్తిపరుల జీవితాల వర్ణన మాత్రమే కాక జనజీవన వర్ణన విస్తృతంగా లభిస్తుంది. ఈ కారణంగా పండితారాధ్య చరిత్రాన్ని తెలుగు వారి తొలి విజ్ఞాన సర్వస్వంగా పలువురు విమర్శకులు పేర్కొన్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. యల్లాప్రగడ, మల్లికార్జునరావు. "చిరుతొండనంబి". ఈనాడు. Retrieved 31 March 2016.
  2. 2.0 2.1 వెల్దండి, శ్రీధర్. "పండితారాధ్యచరిత్ర.. తెలుగువారి తొలి విజ్ఞానసర్వస్వం". ఆంధ్రజ్యోతి: 4. Retrieved 31 March 2016. 2015 ఆగస్టు 1, 2 తేదీలలో మెదక్‌ జిల్లా జోగిపేటలో జరిగిన యూజీసీ జాతీయ సదస్సులో చదివిన పరిశోధనా పత్రంలో కొంత భాగం వ్యాసంగా ప్రచురితం
  3. 3.0 3.1 జె.వి., సత్యవాణి (జనవరి 2016). సామల, రమేష్ బాబు (ed.). "పండితారాధ్య చరిత్ర-విజ్ఞాన సర్వస్వం". అమ్మనుడి. సాహితీ చరిత్ర. తెనాలి: తెలుగు జాతి ట్రస్టు. 11 (1): 33–35. Check date values in: |date= (help)