Jump to content

జగన్నాథ పండితరాయలు

వికీపీడియా నుండి
(పండిత జగన్నాధ రాయలు నుండి దారిమార్పు చెందింది)
జగన్నాథ పండితరాయలు

జగన్నాథ పండితరాయలు 17వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి, విమర్శకుడు. తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జగన్నాథ పండితరాయలు ఉత్తర భారతదేశంలో పండిత్‌రాజ్ జగన్నాథ్‌గా సుప్రఖ్యాతులు. తర్కాలంకార శాస్త్రాల్లో పేరెన్నిక గన్నవాడు. ఆంధ్రదేశానికి చెందిన ముంగండ అగ్రహారానికి (ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది) చెందినవాడైనా ఉత్తర భారతదేశంలో మొగలు రాజుల సంస్థానంలో గొప్ప విద్వాంసునిగా పేరు తెచ్చుకున్నాడు. రసగంగాధరం, భామినీ విలాసము, గంగాలహరి మొదలైనవి ఆయన సుప్రసిద్ధ రచనలు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

జగన్నాథుని తాతయైన కేశవభట్టు తన నాట్య ప్రతిభతో విజయనగర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలను మెప్పించి ముంగండ అగ్రహారాన్ని బహుమానంగా పొందాడు.[2] ఈయన తండ్రి పేరు పేరుభట్టు. ఆయన కాశీలో పలు శాస్త్రాలను అభ్యసించి వచ్చాడు. జగన్నాథుడు తన తండ్రి దగ్గరే చాలా శాస్త్రాలు అభ్యసించాడు. జగన్నాథ వంశస్థులు వేగినాటి వారని ప్రతీతి.
జగన్నాథుడు జ్ఞానేంద్ర భిక్షువు వద్ద అద్వైతం, మహేంద్రుని వద్ద తర్కశాస్త్రం, ఖండదేవ సన్నిధిలో పూర్వ మీమాంస అభ్యసించారు. వ్యాకరణశాస్త్రం శేషవీరేశ్వర పండితుని వద్ద అధ్యయనం చేశారు. మొత్తంగా ఆయన వేదాంత, న్యాయ, వైశేషిక, మీమాంసా, వ్యాకరణ, సాహిత్యాది శాస్త్రాల్లో మహాపండితుడు. శేషవీరేశ్వర పండితుడు కాశీ నివాసి, జగన్నాథుని తండ్రికి కూడా గురువు. ఆయన వద్ద విద్యను అభ్యసించేందుకు జగన్నాథుడు కాశీ చేరుకున్నాడు.
అనేకమైన శాస్త్రాలను సాంగంగా చదువుకున్న జగన్నాథుడు ఢిల్లీచక్రవర్తి ఆస్థానంలో స్థానం పొందాడు. జహంగీరు ఆస్థానంలో చేరిన ఆయన తన ప్రతిభ కారణంగా సన్మానాలు, గౌరవాలు పొందాడు. ఆయన గ్రంథరచన మొత్తం ఢిల్లీలో ఉండగానే జరిగిందని పండితుల భావన. సంస్కృత అలంకార శాస్త్రంలో చివరిమాతగా గణుతికెక్కిన ఆయన సిద్ధాంతాలు, రచనలు, విద్వత్‌చర్చలు మొదలైనవన్నిటీకీ ఆనందించిన జహంగీరు జగన్నాథునికి పండిత్‌రాజ్ అనే బిరుదు ప్రదానం చేశాడు.[3]

రచనలు

[మార్చు]

జగన్నాథ పండితరాయలు ఆలంకారికునిగా సుప్రఖ్యాతుడు. సంస్కృత అలంకార శాస్త్ర అభివృద్ధిలో కీలకమైన ప్రతిపాదనలు చేసిన ఆధునికుడు (ఇతర సంస్కృత అలంకారికులతో పోలిస్తే ఆధునికుడు) జగన్నాథుడే. ఆయన ప్రతిపాదనలు, సిద్ధాంతాలు అలంకారశాస్త్రంలో చాలా విలువైనవిగా పేరొందాయి. ఆయన రాసిన పలు గ్రంథాలు:

  • భామినీ విలాసం: ఆయన లక్షణ గ్రంథాలతో పాటుగా కొన్ని కావ్యాలు రచించారు. ఆ లక్షణ గ్రంథాలు కానివాటిలో ప్రసిద్ధి చెందిన కావ్యం భామినీ విలాసము. ఇది చాటుకవితల సంకలనం. వేర్వేరు సందర్భాల్లో చెప్పిన చక్కని చాటుకవితలను సంకలనం చేశారు. ఐతే ఈ గ్రంథం ఆయన లక్షణానికి లక్ష్యంగా రాశారనీ అంటారు.[4] ఇది అతని భార్య గురించి రాసిన పుస్తకం. రసవత్తరమైన పద్యాలను రూపొందించడంలో పేరుగాంచిన జగన్నాథుడు తన పద్య రత్నాలను భామినీవిలాసము పేరుతో చాటుకవితల కావ్యంగా రచించాడు.ఇక్కడ సేకరించిన పద్యాలను ఆయన ఇతర గ్రంథాలలో కూడా ఉదాహరణలుగా ఉటంకించాడు.భామినీవిలాసములో నాలుగు సంపుటాలు ఉన్నాయి. అవి 1. ప్రస్తావన విలాసము, 2. శృంగార విలాసము, 3. కరుణా విలాసము, 4. శాంతి విలాసము. ప్రస్తావన విలాసములో, ఇతర ఉచ్చారణలు ప్రధానంగా ఉపయోగించబడ్డాయి, శృంగార విలాసములో, సౌందర్య అభిరుచికి గల పద్యాలు, కరుణా విలాసములో, తన భార్యను విడిచిపెట్టినందుకు దుఃఖిస్తున్న పద్యాలు, శాంతి విలాసములో ప్రధానంగా భక్తితో కూడిన కవితలు ఉన్నాయి.
  • రసగంగాధరం: ఇది ఒక అలంకారగ్రంథము. రసగంగదర యొక్క రెండ భాగములు మాత్రమే కనుగొనబడ్డాయి. పూర్తి భాగము లభించలేదు. దాదాపు 5 భాగాలు గల గ్రంథముగా ఇది ఉండవచ్చునని పండితులు భావిస్తున్నారు. లభించిన మొదటి విభాగంలో కావ్యం యొక్క లక్షణాలు, కావ్య ప్రక్రియలు, కావ్యానికి కారణాలు, అభిరుచులు, భావోద్వేగాలు మొదలైన విషయాలు వివరించబడినవి. రెండవ విభాగంలో, శబ్ద, శబ్ద అర్థాల నియంత్రకాలు, విశేషణాల లక్షణాలు, వివిధ అలంకారాలు చర్చించబడ్డాయి.

హాస్యం

[మార్చు]

సాహిత్యంలో సున్నితమైన హాస్యాన్ని ప్రవేశపేట్టినవారిలో చెప్పుకో దగ్గవారు జగన్నాధ పండితరాయలు. ఈయన రచనలలో కల సున్నితమైన చురుకైన పద్యాలలో పాఠకుల పెదవులపై తప్పకుండా చిరునవ్వు తొణికిసలాడుతుంది.

కొన్ని ఉదాహరణలు

త్రపశ్యామ జంబూ
ర్దళిత హృదయం దాడిమ ఫలమ్
సశూలం సంధత్తే హృదయ
మభిమానేన పనసః
భయా దంతస్తోయం
తరు శిఖరజం లాంగలి ఫలమ్
సముద్బూతే చూతే
జగతి ఫలరాజే ప్రసరతి.
దళితంబయ్యెను గుండె దాడిమకు,
మీదన్ సల్పు జంబూఫలం
బులకం గల్గెను సిగ్గుచే,
పనస రొమ్ముంగ్రుమ్మె శూలమ్మున్
సలిలంబయ్యెను గుండె కొబ్బరికి
వృక్షాగ్రమ్మునన్ భీతిచే,
ఫలరాజంబను పేర చూతమునకున్
ప్రఖ్యాతి ప్రాప్తించుటన్.

సందర్భము

జగనాథుడికి షాజహాన్ చక్రవర్తి పండిత రాజ బిరుదు ప్రధానం చేసిన సంగతివిని, మాత్సర్యంతో మిగతా కవులు పండితులూ ఎలా కుమిలిపోయారో అన్న విషయాన్ని ఫలరాజు మామిడి పండుతో పోలుస్తాడు. మామిడి పండుకి ఫలరాజమనే బిరుదు ఉంది.అవును మరి ఆ రంగు, ఆరుచి, ఆ వాసన ఆపాతరమణీయాలు. మిగిలిన పళ్ళకి వీటిలో ఏఒక్క సుగుణమో ఉంటే ఉండవచ్చునుగాని, అన్ని సుగుణాలు ఒకేచోట కుప్పపోసినట్లుగా లేవు.అయినా మామిడి పండుకి అంతటి పూర్వ ప్రశస్తి కలగడం సహించలేక పోయాయి మిగతాపళ్ళు.అసహనంతో ఏవిధంగా ప్రవర్తించాయో వివరిస్తాడు. మామిడి పండుతో పోలలేకపోయాననే అనే సిగ్గుతో నల్లబడి పోయింది నేరేడుపండు! గుండె వెయ్యి ముక్కలైపోయింది దానిమ్మపండుకి. పండినదానిమ్మ చెట్టున ఉండగానే పగిలిపోవడమూ, లోపల చిన్నచిన్న ఎర్రని గింజలతో పగిలింది దాని హృదయం. చీ ఎందుకొచ్చిన బ్రతుకూ? అని ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నంలో గుండెలో శూలం దింపుకుంది పనసపండు! బాధ భరించలేక చెట్టెక్కి కూర్చొన్న కొబ్బరికాయ గుండె చెరువైపోయింది! ప్రసిద్ధ మైన ఈపళ్ళే ఇంతగా దిగులుపడి నీరుకారిపోతే ఇంక అల్పమైన ఇతర ఫలాలను గూర్చి ఇంక చెప్పేదేమున్నది! అని గేళి చేస్తాడు జగన్నాధుడు.

మా గర్వముద్వహ బిడాల!
మహీపతీ నా
మంతర్గృహం మణిమయం
నిలయో మమేతి
పట్టాఅభిషేక సమయే
పృధివీపతీనాం
బాహ్యస్థితస్య
కలభస్య హి మండన శ్రీః

హేల జరింప నేర్తు మణి
హేమమయోన్నత సర్వధారుణీ
పాలగృహాంతరంబుల
నవారిగ నేనని గర్వమేల మా
ర్జాలమ! బైటనుండినను
రాజుల పట్టపువేళ భద్రశుం
డాలమె మండనంబుల
ఘనంబుగ బొందును, నిన్ను జూతురే?

సందర్భము

జగన్నాథ పండితుడు బాహ్యమందిర ద్వారం దగ్గరే షాజహాన్ సెలవు పుచ్చుకొని వచ్చేసేవాడు.రాణేసాహెబావారి దగ్గరనుండే ఒక కొజ్జావాడు ఒకడు జగనాథుడ్ని అవహేళనం చేశాడు, తాని అంతః పురము నంతటా స్వేచ్ఛగా తిరగ గలగనని, జగన్నాఢుడు మాత్రమే కోటదగ్గరే ఆగిపోవాలని తనకీ ఈ బాపయ్యకీ పోలిక ఎక్కడనీ...ఆఎత్తి పొడుపుకి జగనాధుడికి కోపమ రాలేదు, అతడిని చూసి జాలి వేసింది, ఆజాలి నిందాగర్భితమై ఈ విధంగా బయటపడింది.

కోట గుమ్మం బయట కట్టబడిఉన్న పట్టపుటేనుగుని చూసి, పిల్లి ఒకటి పళ్ళు ఇగిలించింది.మణులు తాపడంచేసిన రాజాంతఃపురంలో స్వేచ్ఛగా విహరించగలననీ విర్రవీగకు పిల్లీ, కోట బయట కట్టుబడిఉన్నప్పటికీ మత్తేభానికి లోటు ఏమీ లేదు.పట్టాభిషేకం సమయం వచ్చిందంటే అంబారీవేసీ అలంకరించిన ఈఏనుగు దగ్గరకే చక్రవర్తి స్వయంగా వస్తాడు.అప్పుడు నువ్వు సోదిలోకి కూడా ఉండవు. పైగా కనిపించావంటే పిల్లి శకునం అని నీకాళ్ళు విరగొట్టగలరు జాగ్రత్త!.

హేమ్నః ఖేదో న దాహేన
భేదేన కషణేనవా
తదేవతు మహద్దుఃఖమ్
యద్గుంజా సమతోలనమ్

అగ్గిలోపల పడవేసి, అరుగదీసి
కోసినను కుందదాయెను కుందనమ్ము
త్రాసులోనిడి గురివెంద పూసతోడ
తూతురు సమంబుగానని దుఃఖపడియె.

సందర్భము

ఒకప్పుడు పండితరాయలు ఒక చిన్నపాటి సంస్థానాన్ని దర్సించబోయారు.అక్కడి రాజుకి ఇతగాడి అసాధారణ పాండిత్యం అంతగా అర్ధం కాలేదట. ఇతడిముందు ఏనుగు దగ్గర దోమలాంటి ఒక చిన్నపాటి పండిన్నాడు. వారిని వీరిని ఆరాజు ఒకేలాగా గౌరవించాడాట. అందుకు దానిని రాయలువారు అగౌరవంగా భావించారు.

నిప్పుల్లోవేసి ఎర్రగాకాల్చినా, కరిగించినా, సుత్తితో మొత్తినా, ముక్కలకింద కోసినా, ఆకురాయితో గీటినా బంగారానికి విచారం కలగలేదట. కాని, గురివెంద పోసలతో సమానంగా త్రాసులో పెట్టి తూచుతారుకదా అని అపరిమితంగా బాధపడిందట!

జగత్ప్రాణే ప్రౌఢే నికట
ముపయాతేసతి హఠాత్
వినంరా ఆం రాద్యాః
శుకపికవచశ్చాటుపటవః
సురాభాంఢం కంఠే వహతి
న నతే తాళహతకే
సుదుర్వృత్తే తస్మిన్
క్షతిరహపునః కాచ మహతాం.

సందర్భము

పండితరాయలు ఏసభకు వెళ్ళినా అక్కడ ఆబాలగోపాలమూ ఇతడికి వంగి నమస్కరించటము మామూలేనట. అతడి కీర్తి అటువంటిది.కాని, ఒక సభలో అనామకుడైన ఒక ధూర్తుడు ఒకడు పొగరుగా ఆయనకు వంగి నమస్కరించలేదట. పండితరాయలు ఆయనను క్రీగంట గమనించి ఈవిధంగా అక్షేపించారు.

జగత్తునంతటకీ ప్రాణాధారభూతుడు మహానుభావుడు అయి వాయుదేవుడు వచ్చేసరికి మామిడి పనసవంటి మంచిమంచి చెట్లు అన్నీ తలలువంచి నమస్కారాలు చేస్తున్నాయి.ఆచెట్లమీద కోకిలలు, చిలుకలు కలధ్వనులు చేస్తూ వాయుదేవుణ్ణి ఆహ్వానిస్తున్నాయా అన్నట్లున్నాయి. ఓరి తాటిచెట్టూ! కల్లుకుండలు మెడకి కట్టుకొని నువ్వు ఒక్కడివే వంగకుండా ఉన్నావు. నీయీచర్యవలన నీ అల్పత్వమే బయటపడింది కాని మహాత్ములకి నష్టం ఏముందిరా?

కస్తూరికాం తృణభుజా మటవీచరాణాం
వినస్య నాభిషు వధాయ వృధా చకార
మూఢో విధి స్సకిల దుర్జనలోలజిహ్వా
మూలేషు నిక్షిపతిచేత్ సకలోపకారః

సందర్భము

కస్తూరిమృగాలు ఉన్నాయి. బహు పిరికివి. ఎవ్వరికీ ఈహానీ చెయ్యనివి. ఎక్కడో కాకులు దూరని అడవిలో గడ్డితిని పొట్టపోసుకుంటాయి, ఈఅమయకమైన లేళ్ళా కడుపులో కస్తూరి పెట్టి దాని వలన ఆమృగాలకి ఒరిగేదేమిటి? ఆవాసన వలన వాటి ఆచూకీ తెలిసి, కిరాతులు వాటిని చంపి, ఆ కస్తూరిని పెకళించుతారు. కస్తూరిని నిక్షేపించటానికి నీకు ఇంతకన్నా మంచి చోటు దొరకలేదా? నన్ను అడిగితే నేనే నా సలహా ఇచ్చి ఉండేవాడిని. కొండెములు చెప్పే దుర్మార్గుల నాలుకలమీద కనక ఈ కస్తూరిని సృష్టించిఉంటే ఎంత లోకోపకారం జరిగేదయ్యా! విషయాన్ని డొంకతిరుగుడగా చెప్పటంలో ఎంత హాస్యం కలదు!

వానరాణాం వివాహేషు
తత్రగార్దభ గాయకాః
పరస్పరం ప్రశంసంతి
అహోరూప మహోధ్వనిః

సందర్భము

డబ్బాకొట్టుకోవటం మూడు రకాలు. స్వ-పర-పరస్పర! అందులో ప్రశస్తమైనది ఆఖరుది. ఈ సార్వత్రిక సత్యాన్ని పండితరాయలు బహు చమత్కారంగా చెప్పారు. కోతుల పెళ్ళి అవుతోంది. ఆ పెళ్ళిలో పాటలు పాడడానికి గాడిదలు వచ్చాయి. ఓహోహో ఏమి సౌందర్యంఅని కోతులను గాడిదలు, ఏమి అద్భుత గాత్రంఅని కోతులు గాడిదలను మెచ్చుకున్నాయి.

కవయతి పండితరాజే
కవయంత్యన్యేపి విద్వాంసః
నృత్యతి పినాకపాణౌ
నృత్యం త్వన్యేపి భూతవేతాళాః

సందర్భము

సందర్భము

పండితరాయలు కవిత్వం చెప్తూఉండగా విని, మిగిలిన విద్వాంసులు కూడా కవితలల్లటం మొదలు పెట్టారట. వీటిలో మొదటి వాక్యంలో ప్రత్యేకతఏమీలేదు. రెండవవాక్యంలోను వస్తుక్రమాన్ని పరిశీలిస్తే జగన్నాథునికీ శివునికీ పోలిక, ఇతర పండితులకీ పిశాచాలకీ పోలిక కనిపించి నవ్వొస్తుంది.

ఇందులో పైన పేర్కొన్న జగన్నాథపండితరాయల మూలశ్లోకములకు పద్యానువాదములు గావించిన కవి డా|| మహీధర నళినీమోహన్ గారు. వీరిది కూడా ముంగండ అగ్రహారమే. అంతేకాకుండా ఈయనకూడా వేగినాటి బ్రాహ్మణశాఖీయుడే.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Paṇḍitarāja Jagannātha, the Renowned Sanskrit Poet of Medieval India By Narendra Nath Sarma
  2. Music-dance and Musical Instruments: During the Period of Nayakas (1673-1732) By Ke Kusumābāyi
  3. నవరస గంగాధరం(అనువాదం) :జమ్మలమడక మాధవరామశర్మ:ప్రస్తావనలో
  4. భామినీ విలాసం:అనువాదం.వడ్డాది సుబ్బారాయుడు:పీఠికలోని వివరాలు


  • 1970 భారతి మాస పత్రిక: వ్యాసం: పండితరాయల్ హాస్యం డా.మహీధర నళినీమోహన్.