Jump to content

పద్మావతి సాలగ్రాం

వికీపీడియా నుండి
పద్మావతి గోఖలే సాలిగ్రామ్
1937 నాటి ది ఇండియన్ లిజనర్ పత్రిక ముఖచిత్రంపై పద్మావతి సాలిగ్రామ్
జననం1918
మరణం20 జూలై 2014
ముంబాయి
వృత్తిహిందుస్తానీ సంగీత కళాకారిణి, నటి

పద్మావతి షాలిగ్రాం గోఖలే జైపూరు-అత్రౌలీ ఘరానాకు చెందిన ప్రముఖ హిందుస్తానీ సంగీత కళాకారిణి, భారతీయ సినిమా నటి.

పద్మావతి 1918లో కొల్హాపూరులో సాంప్రదాయ దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె చిన్నతనం నుండే తన తండ్రి, చిన్నాన్నల వద్ద సంగీతంలో శిక్షణ పొందింది. ఈమె చిన్నాన్న పండిత గోవింద్‌బువా షాలిగ్రాం జైపూరు-అత్రౌలీ ఘరానా స్థాపకుడైన అల్లాదియా ఖాన్ శిష్యుడు.[1] ఆ తరువాత అల్లాదియా ఖాన్ తమ్ముడు హైదర్ ఖాన్, హైదర్ ఖాన్ కొడుకు నత్తన్ ఖాన్ వద్ద సంగీతం నేర్చుకున్నది.[2] కొల్హాపూరు సంస్థానానికి చెందిన సాలిగ్రామ్‌ కుటుంబానికి స్థానిక భోంసాలే పాలకుల ప్రోత్సాహం, ఆదరణ ఉండేది. అల్లాదియా ఖాన్ కూడా ఈ భోంసాలే రాజుల ఆస్థానంలోనే గాయకుడిగా ఉండేవాడు.[3] పద్మావతి తండ్రితో సహా కుటుంబసభ్యులందరూ సంగీతజ్ఞులే. పద్మావతి తమ్ముళ్లూ, పద్మావతి తండ్రి ఆమె కచ్చేరీ చేసే వేళ, పక్క వాయిద్యాలతో అనుసరించేవారు. విడిగా తామూ వాద్య కచ్చేరీలు చేస్తుండేవారు. ఆ కుటుంబం మొత్తం దేశంలోని ప్రధాన నగరాలకు వెళ్లి, అక్కడ ఓ ఆర్నెల్లు మకాం పెట్టి, చుట్టూతా వుండే సంగీతాభిమానులు ప్రోత్సహించి, కచ్చేరీ ఏర్పాటుగావిస్తే, ధనికుల పారితోషికం తీసుకుని కచ్చేరీ చేసేవారు.[4] ఈమె హిందుస్తానీ సంగీతంలో సాంప్రదాయ మహిళలు కూడా ప్రవేశించేందుకు దోహదం చేసింది. ఈమె దేశమంతటా ఎంత ప్రసిద్ధి పొందిందంటే సరోద్ విద్వాంసుడు అలీ అక్బర్ ఖాన్ 1948లో నిర్వహించిన జోధ్‌పూరు ప్యాలెస్ ఉత్సవం వంటి సంగీతోత్సవాలలో పాల్గొనటానికి ఆహ్వానం పొందిన ఏకైక మహిళ పద్మావతి.[3]

పదమూడేళ్ల ప్రాయం నుండే ప్రదర్శన ఇవ్వటం ప్రారంభించిన పద్మావతి, చిన్నవయసులో హిందుస్తానీ సంగీతంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నది. కాంగ్రేసు అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో కచేరీ చేసి అతను మన్ననలనందుకుంది. ఆమెకు 'స్వర కిన్నెర' అనే బిరుదు ఇచ్చారు.[4] ఆలిండియా రేడియోలో ప్రథమ శ్రేణి కళాకారిణిగానే కాక భారతదేశమంతటా తిరిగి అనేక సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.[5] స్వాతంత్ర్యానికి పూర్వం ఈమె ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతం అంతటా ప్రదర్శనలిచ్చింది.

పద్మావతి విప్లవాత్మక గాయని. సాంప్రదాయ మరాఠీ గృహిణి అయినప్పటికీ, అప్పటి సాంఘిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా తుమ్రీలు, దాద్రాలు మధురంగా గానం చేసేది. శాస్త్రీయ సంగీత గాయకులు తుమ్రీలు పాడటం అప్పట్లో చాలా అరుదు.[3] పద్మావతి భారతీయ సంగీత అభిమానుల్లో తుమ్రీకి గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ ఘరానాలో శిక్షణ పొందినా, కిరానా ఖయాల్‌ను, పటియాలా తుమ్రీల ప్రభావంతో తనదైన సొంతశైలి ఏర్పరచుకొన్నది. ఈమె సంగీతంపై ఈమెకు భారత ప్రభుత్వం 1988లో కళారంగంలో అత్యున్నత పురస్కారమైన సంగీత నాటక అకాడమీ పురస్కారంతో సత్కరించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే 1994-95 సంవత్సరానికి గాను కాళిదాసు సమ్మాన్‌ను, అఖిల భారత గాంధర్వ మహావిద్యాలయ మండలి పురస్కారం అందుకున్నది.[5][6] ఈమె తరచూ ఉస్తాద్ అలర్ ఖాన్‌తో పాటు ప్రదర్శనలు ఇచ్చింది. 2009 సంవత్సరపు ప్రతిష్ఠాత్మక మల్లిఖార్జున మన్సూర్ సమ్మాన్ పురస్కారాన్ని పద్మావతికి బహూకరించారు.[7] ఈమె హిందీ, మరాఠీ, తెలుగు భాషలలో నాలుగు చలనచిత్రాలలో కూడా నటించింది.

సినిమా నటిగా

[మార్చు]

పద్మావతి నటించిన సినిమాలు

  • సీతా స్వయంవర్ (1933, హిందీ)
  • వాసవదత్త (1934, హిందీ)
  • కిస్మత్ కీ కసౌటీ (1934, హిందీ)
  • ఆదిల్-ఏ-జహంగీర్ (1934, హిందీ)
  • డాక్టర్ మధురిక (1935, హిందీ) - ఇందు
  • భూల్ కా భోగ్ (1935, హిందీ)
  • వెర్ నూ వసూలత్ (1935, హిందీ)
  • ఉషాపరిణయం (1939, తెలుగు)
  • సతీ సీత (1946, హిందీ)

ఉషా పరిణయం సినిమా

[మార్చు]

1938లో పద్మావతి తన కుటుంబంతో మొదటిసారి దక్షిణ భారతదేశ పర్యటనకై వచ్చి మద్రాసులో మకాం పెట్టారు. టి.వి.సుబ్బారావు అనే ఒక కన్నడ సంగీతాభిమాని ఆ కుటుంబాన్ని నీలంరాజు వేంకటశేషయ్యకు పరిచయం చేశాడు. ఆంధ్రపత్రికలో సినిమా పేజీ నిర్వహిస్తూ, చెన్నపురి ఆంధ్రమహాసభ సెక్రటరీగా ఉన్న శేషయ్యకు కొన్ని సంగీత సంస్థలు, గ్రామఫోన్‌ కంపెనీలతో పరిచయాలుండేవి. అతను అవకాశం వున్నచోట ఆమె కచ్చేరీలు పెట్టించారు. అదే సమయంలో ఒంగోలు - చీరాల ప్రాంతవాసులైన ధేనువకొండ సుబ్బారావు, రావుల వెంకటసుబ్బారావు, గాలి వెంకటేశ్వరరావు ప్రభృతులు మద్రాసుకు వచ్చి ఉషా పరిణయం అనే సినిమా తీయాలి అని నిశ్చయించారు. వీరికి నీలంరాజు వేంకటశేషయ్య ఎరిగుండడం మూలాన ఈయనని కూడా తమలో కలుపుకున్నారు. పద్మావతిని తమ సినిమాలో ఉషగా నటింపచేస్తే, ఆ ఆమె కంఠమాధుర్యాన్ని సినిమాను విజయవంతం చేయడానికి వినియోగించుకోవచ్చుననుకున్నారు. కర్ణాటక సంగీతంలో దిట్ట అయిన ధేనువకొండ సుబ్బారావు హరికథా కాలక్షేపాలు చేసి ఆ ప్రాంతంలో చాలా మన్ననలందుకున్నాడు. అతను కర్ణాటక సంగీతం, పద్మావతి సాలిగ్రాం హిందూస్థానీ సంగీతం, రెండూ కలిసి సినిమాకు అఖండ విజయం సాధిస్తాయని విశ్వసించి నీలంరాజు వేంకటశేషయ్య అనిరుద్ధుడిగా, పద్మావతి కథానాయికగా ఉషా పరిణయం సినిమా తీసారు. కానీ ఈ చిత్రం వ్యాపారపరంగా విజయవంతం కాలేదు.[4]

పద్మావతి 96 ఏళ్ల వయసులో 2014, జూలై 20న ముంబాయిలో మరణించింది.[8]

మూలాలు

[మార్చు]
  1. Ray, Bharati (Sep 15, 2005). Women of India: Colonial and Post-colonial Periods. SAGE Publications India. p. 476. ISBN 9788132102649. Retrieved 16 February 2015.
  2. Grimes, Jeffrey Michael (2008). The Geography of Hindustani Music: The Influence of Region and Regionalism. ProQuest. p. 146. ISBN 9781109003420. Retrieved 16 February 2015.[permanent dead link]
  3. 3.0 3.1 3.2 Dhaneshwar, Amarendra. "FAREWELL TO THE FINEST". Afternoon Dispatch & Courier. Retrieved 18 February 2015.[permanent dead link]
  4. 4.0 4.1 4.2 "సగటుమనిషి స్వగతం - స్వాతంత్ర్య సమరోత్సాహి శ్రీ నీలంరాజు". ఆంధ్రప్రభ. 22 Jan 2012. Retrieved 16 February 2015.[permanent dead link]
  5. 5.0 5.1 "The 13th ITC Sangeet Sammelan (November 11-13, 2005) - Kolkata". www.itcsra.org. Archived from the original on 23 మార్చి 2015. Retrieved 15 February 2015.
  6. Manorama Year Book, Volume 31. Manorama Publishing House. 1996. p. 376. Retrieved 18 February 2015.
  7. "Padmavati gets Mansur Samman". The Hindu. March 30, 2010. Retrieved 16 February 2015.
  8. Kumar, Kuldeep (July 25, 2014). "Page turners". The Hindu. Retrieved 16 February 2015.