Jump to content

పల్నాటి సోదరకవులు

వికీపీడియా నుండి
పల్నాటి సోదరకవులు

పల్నాటి సోదరకవులుగా సుప్రసిద్ధులైన వారు మువ్వురు సోదరులు కన్నెకంటి ప్రభులింగాచార్యులు, కన్నెకంటి చినలింగాచార్యులు, కన్నెకంటి వీరభధ్రాచార్యులు. వీరు అనేక అష్టావధానాలు,శతావధానాలు చేశారు. వీరు గుంటూరు జిల్లా, తక్కెళ్లపాడు గ్రామంలో జన్మించారు.[1] కోటమ్మ, రాజలింగాచారి వీరి తల్లిదండ్రులు[2]. కన్నెకంటి ప్రభులింగాచారిశార్వరినామ సంవత్సరం కార్తీక శుద్ధ త్రయోదశి సోమవారం ఉదయం,ఆంగ్ల కాలమానం ప్రకారం 1900సం.నవంబరు5వ,తేదీన జన్మించారు.

శ్లిష్టాచార సంపన్నులు విశ్వకర్మ వంశోద్భవులుభరద్వాజ గోత్రీకులైన కన్నెకంటి రాజలింగాచార్యులు, కోటమాంబల పుత్రుడు. బేతనభట్ల కృష్ణశాస్త్రి వద్ద, విద్యాభ్యాసం చేశారు.అక్కిరాజు ఉమాకాంతం వద్ద, మేనమామ కొండా రాజమల్లాచారి వద్ద ఛందోవ్యాకరణ విద్యను అభ్యసించారు. కొంతకాలం శిరిగిరిపాడు, జూలకల్లు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తరువాత మద్యపాన నిషేధ ప్రచారకవిగా, యుద్ధరంగ ప్రచార కవిగా పనిచేశారు. గుంటూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నందిగామ, రెంటచింతల, ముక్త్యాల, గద్వాల, మద్రాసు, మొలకచెర్ల, కె.సముద్రం మొదలైన 60 పట్టణాలలోను, పల్లెలలోను అవధానాలు చేశారు. అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరుల వారితో కలసి పల్నాటి పర్యటన చేసి పల్నాటి చరిత్ర ను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఉమాకాన్తంగారు పల్నాటి చరిత్ర కు సమగ్ర పీఠిక రాయగా, ప్రభులింగాచార్య "పలనాటి వీరచరిత్రము" నాటకము రాసి 1928 లో ప్రచురించారు. తమ్ముడు చినలింగాచారి,వీరభధ్రాచారి అవధానవిద్యలో ఆరితేరినారు.కనుకనే "పల్నాటి సోదర కవులుగా "పేరుపొందినారు. "విద్వగ్ద్వాల" ఆస్ధానమునకు 1942-44 ప్రాంతములో కవిసింహ కాశీపత్యవధాని వెంట తమ్ముడు చినలింగాచార్యులుతో వెళ్ళి పండిత వర్యుల మెప్పునొందిరి.శ్రీ శ్రీ ఆదిలక్ష్మీదేవి వారి అనుగ్రహముతో వర్షాశనము (వార్షిక వేతనము) పొందారు.1945లో క్షయవ్యాధి బాధితులై సరైన వైద్యమందక 1946 నవంబరు 1 వ తేదీన స్వర్గస్తులైనారు.

అవధాన పద్యాల నుండి ఉదాహరణ

[మార్చు]
  • సమస్య: రాటమునందు పెద్దనిదురంగన రంభయొసంగు సౌఖ్యముల్

పూరణ:

ఏటికి రావణా? రఘుకులీనుడు, ధీరుడు, సీత సాధ్వి; నీ
ధాటి యడంగు; నీ తరుణి దక్కదు దక్కదునా, విభీషణా,
బోటిని నూరు మార్గముల బొందుదు; పొందన, రాముచేతి పో
రాటమునందు పెద్దనిదురంగన రంభయొసంగు సౌఖ్యముల్

రచనలు

[మార్చు]
  1. శ్రీ సత్యనారాయణ చరిత్రము
  2. నీలకంఠేశ్వర చరిత్రము
  3. పురూరవ నాటకము
  4. పల్నాటి వీరచరిత్రము
  5. చంద్రమౌళీశ్వర శతకము
  6. పోతన
  7. శ్రీ కృష్ణ పారిజాతము (అముద్రితము)
  8. కుమార సంభవము (ఆంధ్రీకరణము అముద్రితం)
  9. భరతపుత్రులు (అముద్రితము)
  10. ధనంజయ విలాసము (అముద్రితము)
  11. తారాశశాంకము (అముద్రితము)
  12. విప్రపురి సుభక్త విజయము (అముద్రితము)
  13. ద్రౌపదీ స్వయంవరము (అముద్రితము)
  14. ద్రౌపదీ వస్త్రాపహరణము (అముద్రితము)
  15. ఉమాకాంతం గారి జీవితచరిత్ర (అముద్రితము)
  16. శ్రీ కృష్ణ తులాభారము (అముద్రితము)
  17. ఆంధ్ర సోదరా!(అముద్రితము)
  18. కృష్ణ రాయబారము (అముద్రితము)
  19. శివస్తవము (అముద్రితము)
  20. గయోపాఖ్యానము (అముద్రితము)
  21. సుభద్రాపరిణయము (అముద్రితము)
  22. జయలక్ష్మి పరిణయము (అముద్రితము)

కన్నెకంటి చినలింగాచారి

[మార్చు]

ఇతడు 1903లో జన్మించి 1968 వరకు జీవించాడు. ఇతడు బేతనభట్ల కృష్ణశాస్త్రి వద్ద, అక్కిరాజు ఉమాకాంతం వద్ద, మేనమామ కొండా రాజమల్లాచారి వద్ద, అన్న ప్రభులింగాచారి వద్ద విద్యను అభ్యసించాడు. ఇతడు పెదగార్లపాడు, తంగెడ, వేమవరం, ఆత్మకూరు,కారంపూడి,జూలకల్లు గ్రామాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇతడు చేసిన అవధానాలు తక్కువైనా తన అన్న ప్రభులింగాచారితో కలిసి జంటగా చేశాడు.

అవధాన పద్యాల నుండి ఉదాహరణ

[మార్చు]
  • సమస్య: పెంకొక్కటి మింటి కెగసి పెల్లుగ దిరిగెన్

పూరణ:

జింకల పాలెము నందున
ఢంకా వాయించి మంత్రఢాకా యనగా
టెంకాయ విసిరి కొట్టగ
పెంకొక్కటి మింటి కెగసి పెల్లుగ దిరిగెన్

రచనలు

[మార్చు]
  1. వేంకటరంగ శతకము
  2. కయీమొర లక్ష్మీ ప్రశంస
  3. వేంకటరమణ శతకము
  4. నీలలోహిత శతకము
  5. రాజరాజు
  6. వేంకటరమణస్తుతి
  7. రత్న మంజరి
  8. సూర్యనారాయణ స్తవము
  9. సువ్రత
  10. దీర్ఘిక
  11. జ్యోతిస్సులు
  12. స్తోత్ర మంజరి
  13. క్రీస్తు సుప్రభాతం
  14. బంగారు ధార (అముద్రితము)
  15. సంక్షిప్త రామాయణము (అముద్రితము)
  16. సంవాద లహరి (అముద్రితము)
  17. సైంధవ పరాభవము (అముద్రితము)
  18. ఆర్తనాదము (అముద్రితము)
  19. రామరాజ్యము (అముద్రితము)
  20. లోకం పోకడ్ (అముద్రితము)
  21. కవి పతంగ శతకము (అముద్రితము)

కన్నెకంటి వీరభద్రాచారి

[మార్చు]

ఇతడు 1912 -1974ల మధ్య జీవించాడు. ఇతడు అక్కిరాజు వెంకయ్య, అన్నలు ప్రభులింగాచారి, చినలింగాచారుల వద్ద విద్యను నేర్చుకున్నాడు. వాస్తుశాస్త్రము, జ్యోతిషశాస్త్రము, వైద్యశాస్త్రము, మంత్రశాస్త్రములలో ప్రావీణ్యం సంపాదించి పండితకవిగా రూపొందాడు. ఇతడు 32 శతావధానాలు, 67 అష్టావధానాలు చేశాడు. ఇతడు చీరాల, తిమ్మసముద్రం, నర్సారావుపేట, తెనాలి, చిలకలూరిపేట, అవనిగడ్డ, దాచేపల్లి, బాపట్ల, గురజాల, సత్తెనపల్లి, వెల్దుర్తి, పిల్లుట్ల, దుర్గి మొదలైన చోట్ల తన అవధాన విద్యాప్రదర్శన చేశాడు.

అవధాన పద్యాల నుండి ఉదాహరణ

[మార్చు]
  • సమస్య: పదిరెంటిన్ గొని వంశధర్మము నిల్పన్‌జాలె మిత్రాగ్రణీ

పూరణ:

ముదిఱేనిన్ గని నీ వొసంగెడి వరంబుల్ పెక్కు గైకొన్నచో
నది యోగ్యంబని మెత్తురే బుధులు మామా! నన్ను నా భర్తలన్
వదలం గల్గితి వంతెచాలు నిదె నా వాంఛాద్వయంబంచు ద్రౌ
పది రెంటిన్ గొని వంశధర్మము నిల్పన్‌జాలె మిత్రాగ్రణీ

  • దత్తపది: ఎల్లి - పిల్లి - నల్లి - మల్లి అనే పదాలతో తారాశశాంక ప్రణయము

ఎల్లి మగండు వచ్చు నిదియే సమయం బిక దాళజాల గం
పిల్లి తొలంగిపోవలదు, ప్రేమ మనస్సుమజాల మాల నే
నల్లి భవద్గళంబున మహాముద మొప్పగ వేయుదాన మా
మల్లియ తోటకుం గదలుమా! యని తార వచించెఁ జంద్రుతోన్

రచనలు

[మార్చు]
  1. ఆంజనేయ శతకము
  2. శ్రీ బ్రహ్మేంద్రస్తుతి పద్యములు
  3. పేదరాలు
  4. ఆపన్న
  5. విశ్వ విపంచి
  6. చిరుమామిళ్ళ సుబ్బదాసు జీవితచరిత్ర
  7. శ్రీ కుమార విజయము
  8. అచ్చమాంబికా ప్రశంస
  9. భువనజ్యోతి
  10. సువర్ణాంజలి
  11. నందికొండ చిలుక
  12. బాటసారి
  13. పొట్టి శ్రీరాములు
  14. శ్రీ కోదండరామ శతకము
  15. అటుకుల మూట
  16. పేద కాపు
  17. శ్రీశైల ఖండము
  18. అంబుజాంబక విలాసము (అముద్రితము)
  19. లోక బాంధవులు
  20. పార్వతి
  21. నవభారతము[2]
  22. తెలుగు పాప
  23. కృష్ణవర్ధన చరిత్ర
  24. కన్నెగోవు
  25. త్యాగరాజు (అముద్రితము)

మూలాలు

[మార్చు]
  1. రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (227-233 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి.
  2. 2.0 2.1 కన్నెకంటి, వీరభద్రాచార్యులు (1 May 1957). నవ భారతము (ప్రథమ ed.). తెనాలి: వీరభద్రాచార్యులు. pp. 1–122. Retrieved 13 July 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]
  • పలనాటి కవుల చరిత్ర...డాక్టర్ బెజ్జంకిజగన్నాథాచార్యులు మాచర్ల. తొలిప్రచురణ.2020.పేజీ. నం 41,47,54. 4.పల్నాటి సోదరకవుల జీవితము-సాహిత్యము. డా.చిటిప్రోలు సుబ్బారావు నర్సరావుపేట.ముద్రణ1990.
  • 1987లో నాగార్జున విశ్వవిద్యాలయంలో పిహెచ్ .డి పొందిన సిద్ధాంత వ్యాసం.
  • మద్రామాయణము-డాక్టర్ కన్నేకంటి రాజమల్లాచార్య.దాచేపల్లి. ముద్రణ అక్టోబరు2003.