పశు పోషణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గేదెను కడుగుతున్న వ్యవసాయ కార్మికుడు

పశు పోషణ (ఆంగ్లం Animal husbandry) అనగా బర్రెలు, ఆవులు, మేకలు లేదా గొర్రెలు లాంటి జంతువులను పెంచడం ద్వారా జీవనాధారం చేయడం. ఆవులు, బర్రెలను పెంచడం ద్వారా వాటి పాలను అమ్ముకుని ఆదాయం చేకూర్చుకోవచ్చు. అలాగే మేకలను, గొర్రెలను అమ్మి సొమ్ము చేసుకోవచ్చు.

నెల్లూరు జిల్లా యల్లాయపాళెం అనే వూరిలో గేదెలు
నెల్లూరు జిల్లా యల్లాయపాళెం అనే వూరిలో గొర్రెలు

గేదె దూడల నిర్వహణ[మార్చు]

ముందస్తు నిర్వహణ[మార్చు]

  1. పుట్టిన వెంటనే ముక్కులో, నోటిలో ఉన్న మావి పొర లేదా జిగురు పదార్ధాన్ని (శ్లేష్మం) తుడిచి వేయాలి.
  2. సాధారణంగా పుట్టిన వెంటనే దూడను ఆవు నాకుతుంది. దీనివలన దూడ పొడిగా అయి, శ్వాసక్రియకు, రక్త ప్రసరణకు తోడ్పడుతుంది. ఆవు అలా నాకని పక్షంలో కానీ, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ, దూడను పొడి బట్టతోనో, గోనె సంచీ బట్టతోనో రుద్ది పొడిగా తుడవాలి. ఛాతీ భాగాన్ని చేత్తో ఒత్తి వదిలిపెడుతూ కృత్రిమ శ్వాసను అందివ్వాలి.
  3. బొడ్డును శరీరానికి 2 – 5 సెం.మీ దిగువన దారంతో కట్టి ముడి దిగువ భాగంలో 1 సెం.మీ. దూరంలో కత్తిరించి టించర్ అయోడిన్ లేక బొరిక్ ఆమ్లం కానీ లేదా ఏదైనా ఆంటీబయాటిక్ కానీ అద్దాలి.
  4. పశువుల దొడ్డిలో నేల మీద తడిగా ఉన్న గడ్డి గాదం తీసివేసి షెడ్డును చాలా శుభ్రంగానూ, పొడిగానూ ఉంచాలి.
  5. దూడ యొక్క బరువును తూచి నమోదు చేయాలి
  6. ఆవు యొక్క పొదుగును, వీలయితే క్లోరిన్ ద్రావణంతో కడిగి ఆరనివ్వాలి.
  7. దూడ మొదటిగా తల్లి పాలు ( జున్ను పాలు) తాగడానికి వదలాలి
  8. ఒక గంటలో, దూడ నిల్చుని పాలు తాగడానికి ప్రయత్నిస్తుంది. దూడ బలహీనంగా ఉంటే అందుకు సహాయం చెయ్యాలి.

దూడలకి ఆహారాన్నివ్వడం[మార్చు]

అప్పుడే పుట్టిన దూడకు మొట్టమొదటి సారిగా ఇచ్చే అతి ముఖ్యమైన ఆహారం జున్నుపాలు. దూడ పుట్టిన తర్వాత 3 నుండి 7 రోజులవరకూ తల్లికి జున్నుపాలు వుంటాయి. జున్ను పాలు దూడకి పోషకాలను, ద్రవాలను అందిస్తాయి. అంతే కాక జున్ను పాలు వ్యాధి నిరోధక ఆంటీబాడీలను కూడా అందిస్తాయి. ఈ ఆంటీబాడీలు దూడను అంటురోగాల బారి నుండి పోషక లోపాల సమస్య నుండి కాపాడతాయి. పాలు ఉండడం బట్టి, దూడకు మొదటి మూడు రోజులూ జున్నుపాలను ఇవ్వాలి. పుట్టినప్పుడు ఇచ్చే జున్నుపాలతో బాటు దూడలకు మొదటి 3-4 వారాల పాటు పాలు ఇవ్వడం అవసరం. అటు తర్వాత దూడలు కొద్ది కొద్దిగా గడ్డిలోని పిండి పదార్ధాలనూ, చెక్కెరనూ అరిగించుకోగలుగుతాయి. ఆ పైన కూడా పాలు తాగిస్తే పోషక పరంగా మంచిదే కానీ, గింజ ధాన్యాలను మేపడం కన్నా ఖరీదు ఎక్కువ పడుతుంది. అన్ని ద్రవ పదార్ధాలనూ మామూలు (గది లేక శరీర ) ఉష్ణోగ్రత లోనే ఇవ్వాలి. దూడలకు మేత నిచ్చే పాత్రలను చాలా శుభ్రంగా కడగాలి. సంబంధిత సామగ్రిని శుభ్రంగానూ పొడిగానూ ఉన్న చోట దాచాలి. నీరు ముఖ్యం ఎల్లప్పుడూ పరిశుభ్రమైన మంచి నీరు అందుబాటులో ఉండేలా చూడాలి. దూడ ఒకేసారి ఎక్కువగా నీళ్ళు తగేయకుండా ఉండడానికి, నీటిని వేరొక పాత్రలో పోసి, దూడ పాలు తాగే ప్రదేశానికి దూరంగా ఉంచాలి. దూడలకు ఆహారాన్నిచ్చే పద్ధతులు దూడలను మేపే పద్ధతి వాటికి పెట్టే మేత మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ పద్ధతులను పాటిస్తారు:

  1. వెన్న తీయని పాలను ఇవ్వడం
  2. వెన్న తీసిన పాలను ఇవ్వడం
  3. పాలు కాకుండా తాజా మజ్జిగ, తాజా పాల విరుగు నీరు, గంజి వంటి ద్రవ పదార్ధాలు ఇవ్వడం
  4. పాలకు బదులుగా వాడే పదార్దాలనివ్వడం
  5. దూడలకి ప్రత్యేకంగా మార్కెట్లో లభ్యమయ్యే మేతను ఇవ్వడం
  6. పాలిచ్చే ఆవుల పాలతో పెంచడం

వెన్న తీయని పాలను ఇవ్వడం[మార్చు]

పుట్టిన నాటి నుండి మూడు నెలల మధ్య వయసు, 50 కిలోల సగటు శరీర బరువు కల దూడ యొక్క పోషక అవసరాలు ఈ విధంగా ఉంటాయి:

డ్రై మాటర్ (శుష్క పదార్థం) - డి. ఎం. 1.43 kg
టోటల్ డైజస్టిబుల్ న్యూట్రియంట్స్ (మొత్తం జీర్ణమయ్యే పోషకాలు) - టి.డి. ఎన్. 1.60 kg
క్రూడ్ ప్రోటీన్స్ (ముడి ప్రాణ్యాలు) 315g

డి.ఎం. అవసరం కన్నా టి.డి.ఎన్. అవసరం ఎక్కువ ఉన్నట్లు గమనించాలి. దీనికి కారణం దూడకు ఇచ్చే ఆహారంలో కొవ్వు నిష్పత్తి ఎక్కువగా ఉండడమే. ఒక పదిహేను రోజులైతే దూడలు మెల్ల మెల్లగా గడ్డిని తినడం మొదలు పెట్టి రోజుకు ఒక అర కేజీ గడ్డి వరకూ తింటాయి. ఒక పదిహేను రోజులైతే దూడలు మెల్ల మెల్లగా గడ్డిని తినడం మొదలు పెట్టి రోజుకు ఒక అర కేజీ గడ్డి వరకూ తింటాయి. క్రమంగా మూడు నెలలయ్యే సరికి అది 5 కేజీ ల వరకూ పెరుగుతుంది.

  • ఈ సమయంలో దూడకు పచ్చ గడ్డికి బదులుగా 1-2 కేజీల మంచి ఎండు గడ్డిని ఇవ్వచ్చు. 15 రోజుల వయసున్నప్పుడు అర కే.జీ.తో మొదలు పెట్టి 3 నెలలు వచ్చేటప్పటికి దాన్ని 1.5 కే.జీ.ల వరకూ పెంచవచ్చు.
  • మూడు వారాల నుండి, వెన్న తీయని పాలు ఎక్కువగా లేని పక్షంలో దానికి బదులుగా కొంత వరకూ, వెన్న తీసేసిన పాలనూ, మజ్జిగానూ లేదా మరేదైనా పాలకు బదులుగా వాడే ద్రవ పదార్ధాన్ని ఇవ్వచ్చు.

దూడల దాణా[మార్చు]

  • పాలు లేక మరేదైనా ద్రవ పదార్థంతో బాటు దూడకి ఒక ఘన పదార్ధాన్ని కూడా అదనంగా (సప్లిమెంట్ గా) ఇస్తారు. ఈ దాణాలో ముఖ్యంగా మొక్క జొన్నలు, యవలు ఉంటాయి.
  • బార్లీ, గోధుమ, జొన్న వంటి ధాన్యాలు కూడా ఈ పోషక మిశ్రమంలో చేర్చవచ్చు. ఈ మిశ్రమంలో 10 % వరకూ చెరుకు పిప్పిని కూడా చేర్చవచ్చు.
  • ఒక మంచి పోషక మిశ్రమం 80 % టి.డి.ఎన్.ను, 22 % సి.పి.ని కలిగి ఉంటుంది.

దూడకు ఇచ్చే పీచు పదార్థం[మార్చు]

  • సన్నని కాండాలూ, బాగా ఆకులూ ఉన్న కాయ జాతి పశు గ్రాసాలు దూడకు ఇవ్వడం చాలా మంచిది. రెండు వారాల వయసు నుంచి ఎండు గడ్డిని ఇవ్వచ్చు. ఒక కాయ జాతి పశుగ్రాసం, గడ్డి జాతి పశుగ్రాసం కలిపి ఇస్తే మరీ మంచిది.
  • తాజా ఆకు పచ్చ రంగును కలిగి ఉన్న, ఎండలో ఎండ బెట్టిన గడ్డిలో విటమిన్ ఏ, డీ, ఇంకా బీ కాంప్లెక్స్ విటమిన్లూ సమృద్ధిగా ఉంటాయి.
  • ఆరు నెలల వయసులో ఒక దూడ 1.5 నుండి 2.25 కే.జీ.ల ఎండు గడ్డిని తింటుంది. ఇది వయసుతో బాటు పెరుగుతుంది.
  • దీనికి తోడు 6, 8 వారాలు మొదలు, కొద్ది కొద్దిగా పాతర గడ్డి కూడా పెట్టవచ్చు. ఐతే మరీ చిన్న వయసులో పాతర గడ్డి పెట్టడం వలన దూడకు విరేచనాలు అవుతాయి.
  • నాలుగైదు నెలలు వచ్చే వరకూ దూడకు పాతర గడ్డి ఇవ్వడం అంత మంచిది కాదు.
  • సర్వ సాధారణంగా ఇచ్చే మొక్క జొన్న, జొన్న, నిజానికి అంత ఎక్కువగా ప్రోటీన్లను, కాల్షియాన్ని కలిగి ఉండవు. విటమిన్ డీ కూడా తక్కువే ఉంటుంది

వేరొక ఆవుతో పాలు ఇప్పించడం[మార్చు]

  • పాలలో కొవ్వు తక్కువగా ఉండి పాలు పితకడానికి ఇబ్బందిగా ఉన్న ఆవులతో 2 నుండి 4 దూడలకు మొదటి వారం నుంచీ పాలు ఇప్పించవచ్చు.
  • గడ్డితో బాటుగా ఘన పదార్ధాన్ని కూడా వీలైనంత త్వరగానే మొదలు పెట్టాలి. రెండు మూడు నెలల వయసులో దూడలని తల్లి నుండి వేరు చేసి పెంచాలి.

దూడలను గంజితో పెంచడం[మార్చు]

  • గంజి ద్రవ రూపంలో ఇచ్చే కాఫ్ స్టార్టర్ (తొలి రోజుల్లో దూడకు ఇచ్చే ఆహారం). ఇది పాలకు ప్రత్యామ్నాయం కాదు. నాలుగు వారాల వయసు నుండి పాలు తాగించడం మెల్లిగా తగ్గించి, అంత మేరకూ గంజిని ఇవ్వాలి. ఇరవై రోజుల తర్వాత పాలను పూర్తిగా మానిపించాలి.

దూడలకు కాఫ్ స్టార్టర్స్ (మార్కెట్లో లభ్యమయ్యే కృత్రిమ ఆహారాలు) ఇవ్వడం[మార్చు]

  • ఈ పద్ధతిలో దూడలకు తొలుతగా వెన్న తీయని పాలు ఇస్తారు. పొడిగా ఉండే కాఫ్ స్టార్టర్, మంచి ఎండు గడ్డి లేదా పచ్చి గడ్డి తినడం నేర్పిస్తారు. 7 నుంచి 10 వారాల మధ్యలో దూడలకు పాలు మాన్పిస్తారు.

దూడలకు పోత పాలు ఇవ్వడం[మార్చు]

  • పోషక విలువల పరంగా పాలకు ఏదీ సాటి రాదు. కానీ పాలు లేక ఇతర ద్రవ పదార్ధాల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు పాలకు ప్రత్యామ్నాయాలు వాడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
  • పోత పాలు కూడా మామూలు పాల మొతాదులోనే ఇవ్వాలి. అంటే పాలు కలిపిన తరువాత శరీరం బరువులో 10% ఉండేటట్లు. కలిపిన ద్రవ పదార్థంలో మొత్తం ఘన పదార్థం 10-12% వరకూ ఉండాలి.

వీనింగ్ లేదా దూడను వేరు చేసి పెంచే పద్ధతి[మార్చు]

  • వీనింగ్ లేదా దూడను వేరు చేసి పెంచడం ఇంటెన్సివ్ పశు పోషణ పద్ధతిలో అవలంభిస్తారు. వీనింగ్ ద్వారా యాజమాన్యంలో ఎకరూపతను సాధించ వచ్చు. పాలు వృధా పోకుండా, లేదా దూడలు అవసరానికి మించి ఎక్కువ పాలు తాగేయ కుండా ప్రతి దూడకు అవసరమైన పాలు లభ్యమయ్యేలా చూడవచ్చు.
  • అవలంభించిన పద్ధతిని బట్టి దూడను పుట్టిన వెంటనే కానీ, 3 వారాల తరువాత కానీ, లేదా 8 -12 వారాల మధ్యలో కానీ లేక 24 వారాలప్పుడు కానీ వేరు చేస్తారు. సాధారణంగా రైతులు 12 వారాలప్పుడు దూడను వేరుచేస్తారు. ఆబోతుగా ఎదగనిచ్చే కోడె దూడలను ఆరు నెలల వయసు వరకూ తల్లితోనే ఉంచుతారు.
  • పశువుల మందను క్రమ పద్ధతిలో పోషిస్తున్నప్పుడు, అంటే అధిక సంఖ్యలో దూడలు ఉన్నప్పుడు, పుట్టిన వెంటనే దూడను వేరు చెయ్యడం లాభదాయకం.
  • పుట్టిన వెంటనే దూడను వేరు చెయ్యడం వలన, దూడలకు చిన్న వయస్సులోనే పోత పాలు, దూడ దాణాలు అలవాటవుతుంది. ఆవు పాలు మనుషుల వినియోగానికి మిగులుతాయి.

దూడను వేరు చేసిన తరువాత[మార్చు]

దూడను వేరు చేసిన తరువాత నుండి మూడు నెలల వరకూ కాఫ్ స్టార్టర్ ను కొద్ది కొద్దిగా పెంచుతూ వెళ్ళాలి. రోజంతా తినడానికి దూడలకు మంచి నాణ్యమైన ఎండుగడ్డిని అందుబాటులో ఉంచాలి. తేమ శాతం అధికంగా ఉన్న పాతర గడ్డి, పచ్చి గడ్డి మేత, పచ్చిక బయళ్ళలో మేత వంటివి దూడ శరీరం బరువులో 3% వరకూ ఇవ్వచ్చు. అయితే వీటి మూలంగా పోషకాలు తీసుకోవడం కుంటు పడే అవకాశం ఉంది కాబట్టి, ఇవి మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి.

దూడ ఎదుగుదల[మార్చు]

పెరుగుదల సరిగా ఉందో లేదో చూడడానికి మధ్య మధ్యలో బరువు చూస్తూ ఉండాలి.

  • మొదటి మూడు నెలలలో దూడల పోషణ అత్యంత కీలకమైనది
  • ఈ దశలో పోషణ సరిగా లేకుంటే 25 -30 శాతం వరకూ దూడలు మరణిస్తాయి.
  • చూడి పశువుకు నాణ్యమైన పశుగ్రాసాన్ని ఇవ్వాలి. చూడి కాలం చివరి 2 -3 నెలల్లో సాంద్ర దాణాలను పెట్టాలి.
  • సాధారణంగా, పుట్టినప్పుడు దూడ బరువు 20-25 కిలోలు ఉంటుంది.
  • క్రమం తప్పకుండా నులిపురుగుల మందు ఇప్పిస్తూ ఉంటే దూడలు నెలకి 10-15 కిలోలు చొప్పున పెరుగుతాయి.

తగినంత వసతి ముఖ్యం[మార్చు]

దూడలను తల్లి నుంచి వేరు చేసే వయసు వచ్చే వరకూ విడి విడి దొడ్లలో ఉంచాలి. ఇలా విడి విడిగా ఉంచడం వలన అవి ఒకదాన్నొకటి నాకకుండా ఉండి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. దూడల దొడ్లు పరిశుభ్రంగానూ, పొడిగానూ ఉండి గాలీ వెలుతురూ బాగా రావాలి. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన గాలి తగిలేలా ఉండాలే కానీ గాలి సరాసరి దూడలకు విసురుగా తగల కూడదు. దూడలను పొడిగా, హాయిగా ఉంచడానికి దూడల దొడ్డిలో నేల మీద గడ్డి గాదం పరవాలి. సాధారణంగా రంపపు పొట్టు కానీ గడ్డి కానీ వాడతారు. అధికంగా ఉన్న ఎండ నుంచి, శీతల వాతావరణం నుంచి, వర్షం నుండీ, గాలి నుండి రక్షణకి వెలుపల ఉన్న పశువుల కొట్టాలను పైన సగం వరకూ మూసి ఉంచి, చుట్టూరా గోడను కట్టాలి. తూర్పున తెరుచుకుని ఉన్న దూడల దొడ్లలో పొద్దున్న పూట సూర్య రశ్మి వచ్చి, కొంచెం ఎండగా ఉన్న సమయాలలో నీడగా ఉంటుంది. తూర్పునుండి అరుదుగా వర్షాలు పడతాయి.

దూడలను ఆరోగ్యంగా ఉంచడం[మార్చు]

పుట్టిన దూడలకు వ్యాధులు సోకకుండా చూడడం చాలా ముఖ్యం. ఇందు మూలంగా దూడ పెరుగుదల ఆరోగ్యంగా మొదలై పశు మరణాల వల్ల నష్టాలు సంభవించ కుండా ఉంటుంది. రోగాల బారిన పడిన పశువులకు వైద్యం చేయించడం కన్నా ఇది చవకైన పద్ధతి. దూడలను క్రమం తప్పక పరిశీలిస్తూ, వాటికి సరైన పోషణనిస్తూ వాటికి పరిశుభ్రమైన పరిసరాలను ఏర్పరచాలి.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పశు_పోషణ&oldid=3896826" నుండి వెలికితీశారు