పశ్చిమ బెర్లిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పశ్చిమ బెర్లిన్

Berlin (West)
1948–1990
Flag of పశ్చిమ బెర్లిన్
జండా
Coat of arms of పశ్చిమ బెర్లిన్
Coat of arms
పశ్చిమ బెర్లిన్ (ఎరుపు)
పశ్చిమ బెర్లిన్ (ఎరుపు)
స్థాయిపశ్చిమ మిత్ర పక్షాలు ఆక్రమించిన జర్మనీ
స్వేచ్ఛా నగరం ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ)
అధికార భాషలుజర్మను
Governing Mayor 
• 1948–1953 (తొలి)
ఎర్నెస్ట్ రూటర్ (SPD)
• 1989–1990 (last)
వాల్టర్ మోంపర్ (SPD)
చారిత్రిక కాలంప్రచ్ఛన్న యుద్ధం
• బెర్లిన్‌లో ఎన్నికైన ప్రభుత్వంపై సోవియట్ల మద్దతుతో చేసిన కుట్ర
నవంబరు 1948
• పునరేకీకరణ
అక్టోబరు 3 1990
ద్రవ్యండాయిష్ మార్క్ (ధికారిక)
అమెరికా డాలరు (విరివిగా చెల్లుతుంది)
Preceded by
Succeeded by
మితర పక్షాలు ఆక్రమించిన జర్మనీ
జర్మనీ
బెర్లిన్
Today part ofజర్మనీ

పశ్చిమ బెర్లిన్ అనేది ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 1948 నుండి 1990 వరకు బెర్లిన్ పశ్చిమ భాగాన్ని కలిగి ఉన్న రాజకీయ ఎన్‌క్లేవ్. పశ్చిమ బెర్లిన్‌కు ఎటువంటి సార్వభౌమాధికారం లేకపోయినా, 1990లో జర్మన్ పునరేకీకరణ వరకు సైనిక ఆక్రమణలో ఉన్నప్పటికీ, ఈ భూభాగం పూర్తిగా తూర్పు జర్మనీ (GDR)చే చుట్టుముట్టబడినప్పటికీ, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ (FRG) తన భూభాగం గానే దావా చేసింది. ఈ దావా చట్టబద్ధతను సోవియట్ యూనియన్, ఇతర ఈస్టర్న్ బ్లాక్ దేశాలు సవాలు చేసాయి. ఏది ఏమైనప్పటికీ, పశ్చిమ బెర్లిన్ వాస్తవంగా 1949 మే నుండి FRG తోనే రాజకీయంగా జతకట్టింది. ఆ తర్వాత ఆ దేశంలోని వాస్తవ నగర-రాష్ట్రంగా పరిగణించబడింది. 1949 తరువాత, ఇది FRG సంస్థలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రాతినిధ్యం వహించింది. అక్కడి నివాసులలో ఎక్కువ మంది FRG పౌరులే.

పశ్చిమ బెర్లిన్ అధికారికంగా పశ్చిమ మిత్రరాజ్యాల నియంత్రణలో ఉండేది. ఇది పూర్తిగా తూర్పు బెర్లిన్ తూర్పు జర్మనీలచే చుట్టుముట్టబడి ఉండేది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో పశ్చిమ బెర్లిన్‌కు గొప్ప ప్రతీకాత్మక ప్రాముఖ్యత ఉంది. దీనిని పాశ్చాత్యులు " స్వేచ్ఛా ద్వీపం"గా పరిగణించేవారు. [1] దీనికి పశ్చిమ జర్మనీ భారీగా సబ్సిడీలు ఇస్తూ "పాశ్చాత్య ప్రాభవం"గా చూపించింది. [2] సంపన్న నగరమైన పశ్చిమ బెర్లిన్ దాని విలక్షణమైన కాస్మోపాలిటన్ పాత్రకు విద్య, పరిశోధన, సంస్కృతులకు కేంద్రంగా ప్రసిద్ది చెందింది. దాదాపు ఇరవై లక్షల మంది నివాసులతో, ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో జర్మనీలోని నగరాన్నిటి కంటే పశ్చిమ బెర్లిన్‌లో అత్యధిక జనాభా ఉండేది.[3]

పశ్చిమ బెర్లిన్ రెండు జర్మనీల సరిహద్దు నుండి తూర్పు, ఉత్తరాల్లో 160 కి.మీ. దూరంలో ఉంది. సన్నపాటి రైలు, హైవే కారిడార్ల గుండా మాత్రమే పశ్చిమ జర్మనీ నుండి అక్కడికి మార్గం ఉంది. ఇందులో 1945లో స్థాపించబడిన అమెరికన్, బ్రిటిష్, ఫ్రెంచ్ ఆక్రమణ ప్రాంతాలున్నాయి. 1961లో నిర్మించిన బెర్లిన్ గోడ, 1989లో పడిపోయే వరకు పశ్చిమ బెర్లిన్‌ను తూర్పు బెర్లిన్ నుండి, తూర్పు జర్మనీ పరిసరాల నుండీ భౌతికంగా వేరు చేస్తూ ఉండేది. 1990 అక్టోబరు 3 న జర్మనీ అధికారికంగా పునరేకీకరించబడినపుడు తూర్పు, పశ్చిమ బెర్లిన్లు ఏకమై, ఫెడరల్ రిపబ్లిక్‌లో స్టాడ్‌స్టాట్ (నగర రాష్ట్రం) గా చేరి, చివరికి, మళ్లీ జర్మనీ రాజధానిగా మారింది.

బెర్లిన్ లోని నాలుగు ఆక్రమణ ప్రాంతాలు. పశ్చిమ బెర్లిన్ లేత నీలం, ముదురు నీలం, ఊదా రంగులో ఉంది. ఇందులో అనేక ఎక్స్‌క్లేవ్‌లను చూడవచ్చు. బరోల సరిహద్దులు 1987 నాటివి. ఎరుపు రంగు ప్రాంతం తూర్పు బెర్లిన్
తూర్పు పశ్చిమ బెర్లిన్‌ల మ్యాపు. సరిహద్దును దాటే దారులు, మెట్రో నెట్‌వర్కులూ చూదవచ్చు

1944 నాటి లండన్ ప్రోటోకాల్, పోట్స్‌డ్యామ్ ఒప్పందాలతో రెండవ ప్రపంచ యుద్ధం అంతంలో జరిగిన జర్మనీ ఆక్రమణకు చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు అయుంది. ఈ ఒప్పందాల ప్రకారం, "అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన" జర్మన్ ప్రభుత్వం స్థాపించబడే వరకు, జర్మనీ అధికారికంగా నాలుగు మిత్రదేశాల (యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్) పరిపాలనలో ఉంటుంది. 1937 నాటికి ఉనికిలో ఉన్న జర్మనీ భూభాగంలో చాలా వరకు తూర్పు జర్మనీలోకి వెళ్తుంది, తద్వారా జర్మనీ పూర్వపు తూర్పు భూభాగాలు ఏర్పడ్డాయి. మిగిలిన భూభాగాన్ని నాలుగు జోన్‌లుగా విభజించారు, ఒక్కొక్కటీ నాలుగు మిత్ర దేశాలలో ఒక్కొక్కదాని అధీనంలో ఉంటుంది. సోవియట్ ఆక్రమణ జోన్‌తో చుట్టుముట్టబడిన బెర్లిన్‌ను కూడా అదే విధంగా విభజించుకున్నారు. పశ్చిమ మిత్రరాజ్యాలు నగరం లోని పశ్చిమ భాగాలతో కూడిన ఎన్‌క్లేవ్‌ను ఆక్రమించాయి. ఒప్పందం ప్రకారం, బెర్లిన్ ఆక్రమణ చతుర్భుజఒప్పందం ద్వారా మాత్రమే ముగుస్తుంది. పశ్చిమ మిత్రరాజ్యాలు బెర్లిన్‌లోని తమ సెక్టార్‌లను చేరుకోవడానికి మూడు ఎయిర్ కారిడార్‌లను హామీగా పొందాయి. పశ్చిమ దేశాలు పశ్చిమ బెర్లిన్‌కు, జర్మనీలోని పశ్చిమ ప్రాంతాలకూ మధ్య రహదారి, రైలు మార్గాల ద్వారా చేరుకునేందుకు సోవియట్‌లు అనధికారికంగా అనుమతించారు.

మొదట్లో ఈ ఏర్పాటును తాత్కాలిక పరిపాలనా సౌలభ్యంగా ఉద్దేశించారు. జర్మనీ, బెర్లిన్‌లు త్వరలోనే తిరిగి కలుస్తాయన్న ఆశాభావాన్ని అన్ని పార్టీలు ప్రకటించాయి. అయితే, పాశ్చాత్య మిత్రదేశాలు, సోవియట్ యూనియన్ మధ్య సంబంధాలు దెబ్బతిని, ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం కావడంతో జర్మనీ, బెర్లిన్‌ల ఉమ్మడి పరిపాలన విచ్ఛిన్నమైంది. త్వరలోనే, సోవియట్-ఆక్రమిత బెర్లిన్, పశ్చిమ దేశాల-ఆక్రమిత బెర్లిన్‌లు వేర్వేరు నగర పరిపాలనలను ఏర్పరచుకున్నాయి. [4] 1948లో, సోవియట్‌లు పశ్చిమ ప్రాంతాలపై భూ దిగ్బంధనాన్ని విధించి, బెర్లిన్ నుండి పశ్చిమ మిత్రదేశాలను బలవంతంగా వెళ్లగొట్టడానికి ప్రయత్నించారు. దీన్నే బెర్లిన్ దిగ్బంధనం అంటారు. దానికి ప్రతిస్పందనగా పశ్చిమ దేశాలు తమ ఎయిర్ కారిడార్‌లను ఉపయోగించుకుని, బెర్లిన్ ఎయిర్‌లిఫ్ట్ ద్వారా నగరంలోని తమ భాగానికి ఆహారం, ఇతర వస్తువులను సరఫరా చేసాయి. 1949 మేలో, సోవియట్‌లు దిగ్బంధనాన్ని ఎత్తివేసారు. పశ్చిమ బెర్లిన్ ప్రత్యేక నగరంగా, దాని స్వంత అధికార పరిధిని నిలబెట్టుకుంది.[4]

బెర్లిన్ దిగ్బంధనం తరువాత, తూర్పు, పశ్చిమ బెర్లిన్‌ల మధ్య సాధారణ సంబంధాలు తిరిగి ప్రారంభమయ్యాయి. చర్చలు తిరిగి ప్రారంభమయ్యే వరకు ఇది తాత్కాలికమైన ఏర్పాటే. [4] 1952లో, తూర్పు జర్మనీ ప్రభుత్వం దాని సరిహద్దులను మూసివేయడం మొదలుపెట్టి, పశ్చిమ బెర్లిన్‌ను మరింత ఒంటరిగా చేసింది. [5] దాని ఫలితంగా, విద్యుత్ గ్రిడ్లను వేరు చేసారు. ఫోన్ లైన్లను కత్తిరించారు. [4] పోలీసులు, సోవియట్ సైనిక సిబ్బందీ నగరం నుండి వెళ్లే అన్ని రహదారులను నిరోధించారు. ఫలితంగా అనేక సాయుధ ప్రతిష్టంభనలు జరిగాయి. ఆ సంవత్సరం జూన్‌లో ఫ్రెంచ్ జెండర్‌మేరీ, బుండెస్‌గ్రెన్జ్‌స్చుట్జ్‌లతో కనీసం ఒక ఘర్షణ జరిగింది. [5] అయితే, 1961 లో బెర్లిన్ గోడ నిర్మాణంతో గానీ, విభేదాలు పరాకాష్టకు చేరలేదు.[4]

1969లో అమెరికా సైనిక వాహనాలు నివాస ప్రాంతం అయిన జెహ్లెన్‌డార్ఫ్ గుండా వెళ్తున్నాయి.

పశ్చిమ బెర్లిన్‌లో పశ్చిమ మిత్రరాజ్యాలే అంతిమ రాజకీయ అధికారులుగా ఉన్నారు. పశ్చిమ బెర్లిన్ శాసనసభ లేదా ప్రతినిధుల సభ చేసిన అన్ని బిల్లులు, ముగ్గురు పాశ్చాత్య మిత్రరాజ్యాల కమాండర్-ఇన్-చీఫ్‌లు ధృవీకరించాకనే అమలౌతాయి. వాళ్ళు బిల్లును ఆమోదించాక, అది పశ్చిమ బెర్లిన్ చట్టంలో భాగమౌతుంది. కమాండర్-ఇన్-చీఫ్‌లు బిల్లును తిరస్కరించినట్లయితే, అది చట్టంగా మారదు; ఉదాహరణకు, సైనిక విధిపై పశ్చిమ జర్మన్ చట్టాల విషయంలో ఇదే జరిగింది. వెస్ట్ బెర్లిన్‌లో ఎన్నికైన గవర్నింగ్ మేయర్, సెనేట్‌లు రాథౌస్ స్కోనెబర్గ్‌లో సమావేశమయ్యేవారు. పాలక మేయరు, సెనేటర్లు (మంత్రులు) పశ్చిమ మిత్రరాజ్యాల ఆమోదం పొందాలి. వారి ఎన్నికల ఫలితం నుండి కాకుండా ఆక్రమిత దళాల నుండి తమ అధికారాన్ని పొందారు. 

సోవియట్‌లు ఏకపక్షంగా తూర్పు బెర్లిన్‌ను మిగిలిన తూర్పు జర్మనీతో పాటు ఆక్రమించుకున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ చర్యను పశ్చిమ మిత్రరాజ్యాలు గుర్తించలేదు. వారు బెర్లిన్ మొత్తాన్ని రెండు జర్మన్ దేశాలలో దేనికీ చెందని ఉమ్మడి ఆక్రమిత భూభాగంగా చూడటం కొనసాగించారు. నాలుగు ఆక్రమిత శక్తులకు చెందిన సైనికులు నాలుగు విభాగాలలో గస్తీని కొనసాగించేవారు. అందువలన, అప్పుడప్పుడు పశ్చిమ బెర్లిన్‌లో సోవియట్ సైనికులు, తూర్పు బెర్లిన్‌లో పశ్చిమ మిత్రరాజ్యాల సైనికులూ గస్తీ తిరిగేవారు. గోడను నిర్మించిన తర్వాత, పాశ్చాత్య మిత్రరాజ్యాల గస్తీదళాలు తూర్పు బెర్లిన్‌లోకి ప్రవేశించినప్పుడు, బయటికి వెళ్ళేటపుడూ నియంత్రించాలని తూర్పు జర్మనీ భావించింది. ఈ పద్ధతిని పాశ్చాత్య మిత్రరాజ్యాలు ఆమోదించలేదు. సోవియట్‌లకు నిరసనలు తెలిపిన తర్వాత, పాశ్చాత్య మిత్రరాజ్యాలు పశ్చిమ దేశాలకు పారిపోవడానికి సహాయం చేయకూడదనే అప్త్రకటిత ఒప్పందం మేరకు రెండు వైపులా గస్తీలు అదుపు లేకుండా కొనసాగాయి. 

అనేక విధాలుగా, పశ్చిమ బెర్లిన్ పశ్చిమ జర్మనీ లోని 11వ రాష్ట్రంగా పనిచేసింది. పశ్చిమ జర్మనీలో భాగంగా పశ్చిమంలో ప్రచురించబడిన మ్యాప్‌లలో చిత్రీకరించబడింది. పశ్చిమ బెర్లిన్, పశ్చిమ జర్మనీల మధ్య రాకపోకలు (భౌగోళికస్థితి అనుమతించిన మేరకు) స్వేచ్ఛాయుతంగానే ఉండేవి. పశ్చిమ బెర్లిన్‌కు ప్రత్యేక ఇమ్మిగ్రేషన్ నిబంధనలు లేవు; పశ్చిమ జర్మనీలో ఉన్న ఇమ్మిగ్రేషన్ నియమాలే పశ్చిమ బెర్లిన్‌లో కూడా అమల్లో ఉండేవి. సందర్శకులకు జారీ చేసిన పశ్చిమ జర్మన్ ప్రవేశ వీసాలపై "ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, స్టేట్ ఆఫ్ బెర్లిన్‌తో సహా" అని జర్మన్‌ భాషలో ఉండేది. దీనిపై సోవియట్ యూనియన్ అభ్యంతరం తెలిపింది. అయితే, పశ్చిమ బెర్లిన్ ఉనికిలో ఉన్నంత కాలమూ వీసాలపై ఈ పదాలు ఉన్నాయి. [6] [7]

తూర్పు జర్మనీ, తూర్పు, పశ్చిమ బెర్లిన్‌లూ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీతో విలీనమైన 1990 అక్టోబరు 3 వరకు పశ్చిమ బెర్లిన్, సైనిక ఆక్రమణలో ఉండేది. పశ్చిమ జర్మనీ ఫెడరల్ ప్రభుత్వం, చాలా పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు, తూర్పు బెర్లిన్‌ను తూర్పు జర్మనీ నుండి "విడిగా" పరిగణించాయి. తరువాతి కాలంలో పశ్చిమ మిత్రరాజ్యాలు తూర్పు బెర్లిన్‌లో తమ రాయబార కార్యాలయాలను ప్రారంభించినప్పటికీ, వారు నగరాన్ని ప్రభుత్వ కేంద్రంగా గుర్తించారు తప్ప, దాన్ని తూర్పు జర్మనీ రాజధానిగా గుర్తించలేదు.[8]

అయితే, కమ్యూనిస్ట్ దేశాలు పశ్చిమ బెర్లిన్‌ను పశ్చిమ జర్మనీలో భాగంగా గుర్తించలేదు. సాధారణంగా దీనిని "మూడవ" జర్మను అధికార పరిధిగా అభివర్ణించాయి. దీనిని "స్వతంత్ర రాజకీయ విభాగం"గా భావించారు.[9] తూర్పు బెర్లిన్ మ్యాప్‌లలో, పశ్చిమ బెర్లిన్‌ను దాన్ని ఆనుకుని ఉన్న పట్టణ ప్రాంతంగా చూపించేవారు కాదు. అజ్ఞాతంగా ఉండేది, కొన్నిసార్లు WB అనే అక్షరాలను చూపేవి. ఆ ప్రదేశంలో సూచికలనో, బొమ్మనో పెట్టేవారు.[10]

వలస[మార్చు]

ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, పశ్చిమ బెర్లిన్‌ వాసులకు ఇచ్చే పశ్చిమ జర్మన్ పాస్‌పోర్ట్‌లపై అది వారి నివాస స్థలంగా చూపించేది. అయితే, పశ్చిమ బెర్లినర్లు ఆ పాస్‌పోర్టులతో తూర్పు జర్మన్ సరిహద్దులను దాటగలిగేవారు కాదు. ఈస్టర్న్ బ్లాక్‌లోని ఏ దేశానికీ ప్రవేశం ఉండేది కాదు. ఎందుకంటే, పశ్చిమ బెర్లినర్‌లకు చట్టపరమైన పత్రాలను జారీ చేసే అధికారం పశ్చిమ జర్మనీకి లేదని ఈ దేశాల అభిప్రాయం. [11]

బెర్లిన్ గోడ కట్టాక[మార్చు]

రుడాల్ఫ్-వైల్డ్-ప్లాట్జ్ (నేటి జాన్-ఎఫ్.-కెన్నెడీ-ప్లాట్జ్), 1963 జూన్ 26 న రాథౌస్ స్కోనెబర్గ్ నుండి వెస్ట్ బెర్లిన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ
1987లో ప్రెసిడెంట్ రీగన్ బ్రాండెన్‌బర్గ్ గేట్ ముందు " ఈ గోడను పడగొట్టండి! " అని ప్రసంగించాడు

1961లో బెర్లిన్ గోడను నిర్మించిన తర్వాత, పశ్చిమ జర్మనీ ఛాన్సలర్ కొన్రాడ్ అడెనౌర్, యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ బెర్లిన్‌ను తురింగియాతో, సాక్సోనీ, మెక్లెన్‌బర్గ్‌లోని కొన్ని ప్రాంతాలతో మార్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీకి ప్రతిపాదించాడు; అప్పుడు నగరం లోని జనాభా పశ్చిమ జర్మనీకి తరలి వేళ్ళేవారు. [12] అలా చేస్తే తూర్పు జర్మనీ ముఖ్యమైన పరిశ్రమను కోల్పోతుంది కాబట్టి, సోవియట్‌లు ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారని అడెనౌర్ భావించలేదు. అయితే, ఈ ప్రతిపాదన చేయడం వల్ల పశ్చిమ, తూర్పు కూటమిల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనీ, USSR, తూర్పు జర్మనీల మధ్య అభిప్రాయ భేదాలకు దారితీస్తుందనీ అతను ఆశించాడు.[13] కెన్నెడీ ప్రభుత్వం ఈ ఆలోచనను గట్టిగానే పరిశీలించినప్పటికీ, సోవియట్ యూనియన్‌కు ఈ ప్రతిపాదన మాత్రం చేయలేదు.[12]

NATO కూడా పశ్చిమ బెర్లిన్‌ సమస్యపై ఆసక్తిని చూపింది. తూర్పు కూటమి నుండి దానిపై దాడి జరిగిన పక్షంలో, నగరాన్ని రక్షించడానికి ప్రణాళికలను రూపొందించింది. [14][15] ఏదైనా సంక్షోభం ఏర్పడితే, దానికి సైనికంగా ప్రతిస్పందించే బాధ్యతను LIVE OAK అని పేరున్న త్రైపాక్షిక ప్రణాళికా బృందానికి NATOతో కలిసి పనిచేసేలా అప్పగించారు. [16]

1963 జూన్ 26 న, అధ్యక్షుడు కెన్నెడీ పశ్చిమ బెర్లిన్‌ను సందర్శించాడు. విజయవంతమైన ఆ పర్యటనలో, వీధుల్లో లక్షలాది మంది వెస్ట్ బెర్లిన్ వాసులు అతన్ని స్వాగతించారు. అతను కాంగ్రెస్ హాల్ వద్ద, బ్రాండెన్‌బర్గ్ గేట్ దగ్గర, చెక్‌పాయింట్ చార్లీ వద్ద ఆగాడు. వెస్ట్ బెర్లిన్ సిటీ హాల్‌లో ప్రసంగం చేశాడు. ఆ సమయంలో వాడిన "ఇచ్ బిన్ ఐన్ బెర్లినర్" అనే మాటలు ప్రసిద్ధి చెందాయి. నగరంతో అమెరికా కనబరచిన సంఘీభావానికి అది గుర్తుగా నిలిచింది.[17]

బెర్లిన్‌పై ఫోర్ పవర్ అగ్రిమెంట్ (1971 సెప్టెంబరు), ట్రాన్సిట్ ఒప్పందం (1972 మే) వంటి ఒప్పందాలతో పశ్చిమ బెర్లిన్ స్థితిపై ఉద్రిక్తతలు గణనీయంగా తగ్గాయి. అనేక ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ, పశ్చిమ బెర్లినర్లు తూర్పు జర్మనీకి ప్రయాణించడం సులభతరమైంది. ఆటోబాన్ మార్గాల్లో ప్రయాణించే జర్మన్‌ల కోసం నిబంధనలను కూడా సులభతరమయ్యాయి.

1987లో బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద, అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, అప్పటి సోవియట్ నాయకుడికి ఒక సవాలు విసిరాడు:

జనరల్ సెక్రటరీ గోర్బచేవ్, మీరు శాంతిని కోరుకుంటే, మీరు సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపాల శ్రేయస్సును కోరుకుంటే, మీరు సరళీకరణను కోరుకుంటే: ఈ గేట్ వద్దకు రండి! మిస్టర్ గోర్బచేవ్, ఈ గేటు తెరవండి! మిస్టర్ గోర్బచేవ్, ఈ గోడను పడగొట్టండి![18]

1989 నవంబరు 9 న, గోడను తెరిచారు. నగరంలోని రెండు ప్రాంతాలు మరోసారి భౌతికంగా - అప్పటికి ఇంకా చట్టబద్ధంగా కానప్పటికీ - ఒకటయ్యాయి. రెండు జర్మన్ దేశాలు, నాలుగు యుద్ధకాల మిత్రదేశాలూ సంతకం చేసిన టూ ప్లస్ ఫోర్ ఒప్పందం, జర్మన్ పునరేకీకరణకు మార్గం సుగమం చేసింది. పశ్చిమ బెర్లిన్‌లో పశ్చిమ మిత్రరాజ్యాల ఆక్రమణకు ముగింపు పలికింది. 1990 అక్టోబరు 3 న - జర్మనీ అధికారికంగా మళ్ళీ కలిసిపోయిన రోజు - తూర్పు, పశ్చిమ బెర్లిన్‌లు అధికారికంగా తిరిగి కలిసి బెర్లిన్ నగరంగా మారాయి. ఇది అప్పటికే ఉన్న పశ్చిమ జర్మనీ నగర-రాష్ట్రాలైన బ్రెమెన్, హాంబర్గ్ లతో పాటు విస్తరించిన ఫెడరల్ రిపబ్లిక్‌లో నగర-రాష్ట్రంగా చేరింది. వెస్ట్ బెర్లిన్ మేయర్ అయిన వాల్టర్ మోంపర్ మధ్యంతర కాలంలో పునరేకీకరించబడిన నగరానికి మొదటి మేయర్ అయ్యాడు. 1990 డిసెంబరులో నగర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితంగా మొదటి "ఆల్ బెర్లిన్" మేయర్ 1991 జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించాడు, ఆ సమయానికి తూర్పు, పశ్చిమ బెర్లిన్‌లో మేయర్‌ల ప్రత్యేక కార్యాలయాల గడువు ముగిసింది. ఎబర్‌హార్డ్ డీప్‌జెన్ (పశ్చిమ బెర్లిన్ మాజీ మేయరు) తిరిగి కలిసిన బెర్లిన్‌కు, ఎన్నికైన మొదటి మేయర్‌ అయ్యాడు. [19]

ఇవి కూడా చూడండి[మార్చు]

 • 1961 బెర్లిన్ సంక్షోభం
 • 1986 వెస్ట్ బెర్లిన్ డిస్కోథెక్ బాంబు దాడి
 • జర్మనీ చరిత్ర (1945–1990)
 • బెర్లిన్‌లో తీర్పు
 • బెర్లిన్ ఎయిర్‌లిఫ్ట్

మూలాలు[మార్చు]

 1. Daum, Andreas W. (2000). "America's Berlin, 1945‒2000: Between Myths and Visions". In Trommler, Frank (ed.). Berlin: The New Capital in the East (PDF). Johns Hopkins University. pp. 49–73. Archived from the original (PDF) on 13 June 2021. Retrieved March 2, 2021.
 2. Tobias Hochscherf, Christoph Laucht, Andrew Plowman, Divided, But Not Disconnected: German Experiences of the Cold War, p. 109, Berghahn Books, 2013, ISBN 9781782381006
 3. "Berlin: Where Rivalry of East, West Soars" Archived 31 మార్చి 2019 at the Wayback Machine, U.S. News & World Report, 18 July 1983
 4. 4.0 4.1 4.2 4.3 4.4 Ladd, Brian (1997). The Ghosts of Berlin: Confronting German History in the Urban Landscape. Chicago: University of Chicago Press. pp. 178–179. ISBN 978-0226467627.
 5. 5.0 5.1 Attwood, William (15 July 1952). Cowles, Gardner (ed.). "Berlin calmly rides out its Pinprick War". European Affairs, Look Reports. LOOK (in ఇంగ్లీష్). Vol. 16, no. 15. Des Moines, Iowa: Cowles Magazines, Incorporated. p. 90.
 6. Bridge Builder: An Insider's Account of Over Sixty Years in Post-war Reconstruction, International Diplomacy, and German-American Relations, Walther Leisler Kiep Purdue University Press, 2012, page 100
 7. Germany – transit visa, 1991 (issued 24 July 1990) Archived 21 ఏప్రిల్ 2017 at the Wayback Machine, World of Passport Stamps
 8. Architecture, Politics, and Identity in Divided Berlin, Emily Pugh, University of Pittsburgh Press, 2014, pages 158–159
 9. The East German Leadership, 1946–73: Conflict and Crisis, Peter Grieder, Manchester University Press, 1999, page 183
 10. Städte und Stadtzentren in der DDR: Ergebnisse und reale Perspektiven des Städtebaus in der Deutschen Demokratischen Republik, Gerhard Krenz, Verlag für Bauwesen, 1969, page 22
 11. The Path to the Berlin Wall: Critical Stages in the History of Divided Germany, Manfred Wilke, Berghahn Books, 15 Apr 2014, page 191
 12. 12.0 12.1 Wiegrefe, Klaus (2011-08-15). "Secret Documents Released: Adenauer Wanted to Swap West Berlin for Parts of GDR". Der Spiegel. Archived from the original on 7 November 2014. Retrieved 7 November 2014.
 13. "Berlin aurait pu être vendue à l'Est". Le Point (in ఫ్రెంచ్). AFP source. 2011-08-14. Archived from the original on 7 August 2020. Retrieved 2020-04-25.
 14. NATO Planning for Berlin Emergency. "Instructions to NATO Military Authorities". NATO Archives Online (in ఇంగ్లీష్). Archived from the original on 26 March 2017. Retrieved 26 March 2017.
 15. "Declassified: Berlin divided". North Atlantic Treaty Organization. Archived from the original on 26 March 2017. Retrieved 26 March 2017.
 16. Code Name. "LIVE OAK". NATO (in ఇంగ్లీష్). Archived from the original on 25 August 2018. Retrieved 24 August 2018.
 17. Daum, Andreas (2008). Kennedy in Berlin. New York: Cambridge University Press. pp. 125‒64.
 18. "Ronald Reagan speech, Tear Down This Wall". USAF Air University. Archived from the original on 17 July 2019. Retrieved 27 October 2015.
 19. Berlin Mayoral Contest Has Many Uncertainties Archived 17 జూన్ 2019 at the Wayback Machine, New York Times, 1 December 1990