Jump to content

పాండవుల గుట్టలు

అక్షాంశ రేఖాంశాలు: 18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E / 18.514772; 78.861809
వికీపీడియా నుండి

పాండవుల గుట్టలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా - మహదేవపూర్ రహదారిపై రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో ఈ పాండవులగుట్టలున్నాయి.[1] ఎక్కువ మట్టుకు సున్నపురాళ్ళతో, అవక్షేపశిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు కన్పిస్తాయి[2][3].

పాండవుల గుట్టలు రావులపల్లె
పాండవుల గుట్టలు
పాండవుల గుట్టలు
పాండవుల గుట్టలు రావులపల్లె is located in Telangana
పాండవుల గుట్టలు రావులపల్లె
పాండవుల గుట్టలు రావులపల్లె
తెలంగాణ లో ప్రాంతం
భౌగోళికాంశాలు :18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E / 18.514772; 78.861809
పేరు
ఇతర పేర్లు:పాండవుల గుట్టలు
పంచపాండవుల క్షేత్రం
పాండవ క్షేత్రంగా
ప్రధాన పేరు :పంచ పాండవుల గుట్టలు
దేవనాగరి :पंच पांडवुला गुट्टालु
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ రోడ్డు రేగొండ మండలంలోని
ప్రదేశం:రావులపల్లె
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పాండవులు
ప్రధాన దేవత:ద్రౌపది
ఇతిహాసం
నిర్మాణ తేదీ:13 వ. శతాబ్ద కాలంలో
పాండవుల గుట్టలు రావులపల్లె జయశంకర్ భూపాలపల్లి జిల్లా.

ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా అబ్బురపరిచేవిధంగా పడిగెలెత్తి నిల్చున్న కొండవాళ్ళు. ఆ కొండగోడలపై అపురూపమైన ప్రాచీన రాతిచిత్రాలు.[4][5]

చరిత్ర

[మార్చు]

హిమాలయాలు, దక్కన్ పీఠభూమి కంటే కూడా పురాతనమైనవి. పాండవులగుట్టల్లో ‘ఎదురుపాండవులు,గొంతెమ్మగుహ, పంచపాండవులు, పోతిరాజు చెలిమె, మేకలబండ, ముంగీసబండ, తుపాకులగుండు, యానాదుల గుహ’లు చూడాల్సిన ప్రదేశాలు. వాటిలో ఎదురుపాండవులు దానికి కుడిపక్కన వెనకవైపు గుహలు, గొంతెమ్మగుహ, పంచపాండవుల దొనెల్లో అద్భుతమైన శిలాశ్రయచిత్రాలున్నాయి. ప్రాక్ యుగం నుండి చారిత్రకయుగం దాకా వేయబడిన రాతిచిత్రాలెన్నో అప్పటి జీవనశైలీ వైవిధ్యాల్ని కనువిందు చేస్తున్నాయి. కొన్నిచోట్ల పాతబొమ్మల మీదనే కొత్తబొమ్మలు వేసిన జాడలగుపిస్తున్నాయి. ఆరుచోట్ల వున్న చిత్రిత శిలాశ్రయాల్లో అన్నిబొమ్మలు ముదురు ఎరుపురంగుతో చిత్రించబడ్డవే. మందమైన గీతలతో చదునైన పూతలతో గీయబడిన ఈ బొమ్మల్లో శాకాహార, మాంసాహార జీవులు, మనుషుల బొమ్మలు వున్నాయి. వీటిలో జింకలు, చేపలు, మేకలు, కుక్కలు, ముళ్ళపందులు, కుందేళ్ళు, తాబేలు, పాము, చిలుక, సీతాకోకచిలుకలు, కొండెంగ, నెమలి, కప్ప,బల్లి, ఎలుగుబంటి, పెద్దపులులు, పండు, వలతో మనుషులు, పులి వంటి జంతువును చంపిన సరీసృపం వంటి పెద్ద జంతువు, కుందేళ్ళను తరుముతున్న కుక్కలు, కుక్కలు చుట్టి నిలుచున్న మనిషి, ఈనిన జింక, జింకపిల్లను నాకుతున్న దృశ్యాన్ని చూస్తున్న మనిషి, త్రిభుజాలు, త్రిశూలం, చుక్కల వంటి రేఖాకృతులు, కొన్ని శిథిలచిత్రాలు, ఇవేకాక గొంతెమ్మగుహలో చేతిగుర్తులు, యుద్ధం చేస్తున్న వీరుల బొమ్మ లున్నాయి. పంచపాండవుల గుహలో రంగులలో పంచపాండవులు, కుంతి, ద్రౌపది, ద్రుపదుడు, పాండవుల పెండ్లి, శేషశాయి, గణేశుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ, సరస్వతుల చిత్రాలున్నయి.[6]

ఈ బొమ్మలన్నింటిలో ‘ఎదురు పాండవుల’నే కొండచరియలో వేసివున్న రాతిచిత్రాలు అతి పురాతనమైనవి, అపూర్వమైనవి. ఈ చిత్రాలొకచోట 6 అడుగుల కంటె ఎత్తుగా వున్నాయి. ఈ చిత్రాలు వేసిన తీరు, శైలి, మొరటుదనం, వాటిలోని జంతు జీవజాలం అన్నింటిని పరిశీలించి కాలానుశీలన చేస్తే ఇవి మనదేశంలోని మధ్యప్రదేశ్ ‘బింబేట్కా’ గుహల్లోని రాతిచిత్రాల కన్నా ప్రాచీనమైనవని తెలుస్తుంది. World Heritage వారు చెప్తున్నవిధంగా బింబేట్కా చిత్రాలు 30 వేల యేళ్ళనాటివైతే మనపాండవుల గుట్టబొమ్మల్లో అశ్వికులు, యుద్ధ సన్నివేశాలు, ఆయుధాలు, వివిధ వాహనాలు, అలంకరణలు వంటి ఆధునికరూపాలేవీలేవు కనుక ఇవి వాటికన్నా ప్రాచీనకాలానికి చెందినవని రుజువవుతున్నది.

12,13 వ శతాబ్ద కాలం

[మార్చు]

ఒక్క పంచపాండవుల గుహల్లలో మాత్రమే వర్ణచిత్రాలున్నాయి. (అవి 12, 13 శతాబ్దాల నాటివిగా పురాశాఖ వారు అనుమానిస్తున్నారు.) భారతదేశంలో దాదాపు 2,500 చిత్రిత శిలాశ్రయాలున్న 400ల స్థావరాలు 100 శిలాచిత్రలేఖన మండలాల్లో కన్పిస్తున్నాయి. తెలుగునాట 28 చోట్ల, తెలంగాణాలో 14 తావుల్లో ఈ రాతిచిత్రాలున్నాయి. పాండవుల గుట్టల్లోని చిత్రాలు అంత్యప్రాచీన శిలాయుగం నుండి మధ్యశిలాయుగంవరకు తర్వాత చారిత్రకయుగంలో చిత్రించబడినవి. పాండవులగుట్టలో రాళ్ళను చూస్తే ‘కొలరాడో’ గుర్తొస్తుంది. రాతిచిత్రాలను చూస్తే పాండవుల గుట్ట తెలంగాణాలోని ‘చిత్రిత శిలాశ్రయాల విశ్వవిద్యాలయం’ అనిపిస్తుంది. ప్రాక్ యుగం నుండి చారిత్రయుగం దాకా మానవజీవన పరిణామాన్ని ఒకేచోట నిలుపుకున్న గుహాచిత్రాల సమూహమిది. ఈ గుట్టలమీది రాతిచిత్రాలను తొలిసారి గుర్తించింది, పురావస్తువారికి రిపోర్టు చేసింది చారిత్రకపరిశోధకులు, రచయిత డా.ఈమని శివనాగిరెడ్డిగారే

గుహ విశేషాలు

[మార్చు]

పాండవుల గుట్టల్లో అన్నీ విశేషాలే. ‘ఎదురు పాండవుల’ గుహలకు కుడిపక్కన వెనక వైపున 5 చోట్ల రాతిచిత్రాల దొనెలతో పాటు ఒకచోట అద్భుతమైన సహజసిద్దమైన అవిచ్ఛిన్న ‘శిలాతోరణం’ ఉంది. ఒక రాతిగుండులో రెండు నిలువుల ఎత్తున ఈ శిలాతోరణం ఎంతో అందంగా కనిపిస్తున్నది.గొంతెమ్మగుహ కూడా విశేషాలున్న తావు. ఇక్కడి గుహలో చేతిముద్రలు, చిత్రాలు, లిపులున్నాయి. వివిధ చిత్రితశిలాశ్రయాల్లో మాదిరిగానే ఇక్కడ ముదురు ఎరుపురంగులో (కుడి) చేతిముద్రలు ఉన్నాయి.గుహ బయట వీరుల యుద్ధసన్నివేశం చిత్రించబడివుంది. రంగు, గీతలను బట్టి ఈ బొమ్మ చారిత్రకయుగం నాటిదనిపిస్తున్నది. గుహలో ఒక రాతిగో మీద బూడిదవన్నె రంగుతో రాసిన లిపి ఉంది. అట్లాంటి రాతలే ఎరుపురంగులో పంచపాండవుల గుహలో కూడా ఉన్నాయి. లిపిని బట్టి 6,7 శతాబ్దాలనాటివని తోస్తున్నది ఆ రాతలు.

శాసనాలు

[మార్చు]

పాండవుల గుట్టల్లో మరొక చారిత్రకయుగ విశేషముంది. గొంతెమ్మగుహ తూర్పున బండరాయి అంచున ఒక ‘లఘుశాసనం’ ఉంది. అది ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ శాసనం. ఈ శాసనం గురించి పురావస్తుశాఖ వారు వివరించి రాయలేదు. కాని, ఇదే పేరుతో గల ఇట్లాంటి లఘుశాసనాలు తెలుగునాట 11చోట్ల, మహారాష్ట్రలో ఒకచోట లభించాయి. ఆరుచోట్ల ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు’ అని తప్ప సంపూర్ణశాసనాలు లభ్యం కాలేదు. తక్కిన ఆరు తావుల్లో శాసనాలని చదివి తెలిసిందానిమీద చర్చోపచర్చలు చేసిన చారిత్రక పరిశోధకులు ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు’ అనేది ఒక శిల్పకారుల సంఘం పేరై వుంటుందనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. కాని ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు’ మీద పరిశోధక గ్రంథం రాసిన ‘తెలుగు గోష్టి’ వ్యవస్థాపక అధ్యక్షులు చీమకుర్తి శేషగిరిరావు గారు ఈ ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు’లు కాలాముఖశైవులై వుంటారని, వారు అప్పట్లో 6,7 శతాబ్దాలలో బౌద్ధ, జైన ఆరామ, విహార, చైత్యాలను, దేవాగారాలను ధ్వంసం చేస్తూ ‘మేం బౌద్ధ, జైన మతాలనే ప్రమాదాలకు(ఉత్పత్తి అంటే ప్రమాదమని అర్థం) పిడుగు (వజ్రం)లాంటి వాళ్ళం’ అని (కృష్ణమూర్తి ‘ వేల్పుల కథ’) వేసిన హెచ్చరిక శాసనాలై వుంటాయని తేల్చారు. దానికి వారు చూపిన ఆధారాలు సబబుగానే ఉన్నాయి. కర్నూలు సాతానికోటలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాన్త నివాసి లోక శీలాభిమాన – అర్జునన్ మహేశ్వర కాలాముఖ’ అని, నంద్యాల కడమల కాల్వలోని గుడిలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాన్త నివాసి’ అని, మహానందిలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు కాలాముఖ’ అని వుండడం వల్ల, మహబూబ్ నగర్ సంగమేశ్వరాలయంలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాన్తనివాసి’ అనే శాసనం వల్ల, ఇపుడు మన పాండవులగుట్ట గొంతెమ్మగుహ (బహుశః బౌద్ధుల వర్షావాసం అయివుంటుంది ) లోని శాసనంలో ‘ శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాంతవాసి పరమ మహేశ్వర భతన్ మహాముని’ అని రాసి వుండడం వల్ల చీమకుర్తి గారి వాదమే నిజమనే సాక్ష్యం లభించినట్లైంది. ఆ శాసనంలో చెక్కబడివున్న గదలాంటిది (ఇంద్రుని వజ్రాయుధం లేదా కంటకశిల కాదు) లకులీశుని ( ఆలంపురం దేవాలయ మ్యూజియంలోని లకులీశుని విగ్రహం) చేతిలోని ఆయుధం ‘లగుడం’ వలెనె ఉంది. సున్నా గుర్తు బౌద్ధుల శూన్యవాదాన్ని సూచించే చిహ్నం అని పరిశోధకులు రాంభట్ల కృష్ణమూర్తి ‘ వేల్పుల కథ’లో రాసారు.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 జూన్ 2019. Retrieved 15 June 2019.
  2. Velugu, V6 (2022-04-15). "పోయొద్దాం.. పాండవుల గుట్ట". V6 Velugu. Retrieved 2024-11-02.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Reddy, P. Laxma (2024-03-14). "'Pandavula Gutta designated exclusive Geo-heritage site in Telangana'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-11-02.
  4. "చెక్కని శిల్పం.. చక్కని రూపం". ఈనాడు. Archived from the original on 15 ఫిబ్రవరి 2019. Retrieved 15 February 2019.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "పాండవుల గుట్టలు: ఇక్కడే పంచపాండవులు దలదాచుకున్నారట!". m-telugu.webdunia.com. Retrieved 2024-11-02.
  6. డా. మామిడి, హరికృష్ణ (2023-10-18). "Telangana, the quintessential epitome of India". Telangana Today. Archived from the original on 2023-10-18. Retrieved 2023-10-30.