Jump to content

పిట్ దొరసాని

వికీపీడియా నుండి
పిట్ దొరసాని

భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో ఆంగ్లేయ అధికారులతో పాటు వారి కుటుంబం కూడా ఇక్కడే నివసించేవారు. ఆంగ్లేయాధికారుల భార్యలలో ఏ కొద్ది మందో ఈ దేశాన్ని, ఈ దేశప్రజలను సహృదయంతో ఆదరించేవారు. అలాంటి కొద్ది మందిలో పెనుకొండలో నివసించిన పిట్ దొరసాని[1](Isobel J Pitt) ఒకరు.

జీవితం

[మార్చు]

ఈమె ఇంగ్లాండు దేశపు కేంబ్రిడ్జి నగరానికి చెందినది. ఈమె తన పినతల్లి, ఆమె భర్తతో పాటు భారతదేశంలోని పెనుకొండలో నివసించింది. ఈమె పినతండ్రి బయ్యర్స్ 1886లో బెంగళూరు - గుంతకల్లు రైల్వే మార్గం నిర్మాణపనుల్లో రైల్వే ఇంజనీరుగా పెనుకొండలో పనిచేసేవాడు. ఆ సమయంలో పిట్ దొర పెనుకొండలో హెడ్ ఆక్టింగ్ కలెక్టర్‌గా పనిచేసేవాడు. ఈమె, పిట్ దొర పరస్పరం ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ సఫలీకృతమై అస్సాంలో వీరి వివాహం జరిగింది. తిరిగి వెనువెంటనే వారు పెనుకొండ తిరిగివచ్చారు. కొంత కాలానికి పిట్ దొర మద్రాసుకు బదిలీ కావడంతో మకాం అక్కడికి మారింది. 1895లో పిట్ దొర విషజ్వరపీడితుడై మరణించాడు. భర్త అకాల మరణానికి చింతించిన పిట్ దొరసాని తన స్వదేశమైన ఇంగ్లాండుకు వెళ్లిపోయింది. 1899 నుండి 1930 వరకు ఆమె ఎన్నో పర్యాయాలు ఇంగ్లాండు నుండి పెనుకొండకు రాకపోకలు కొనసాగించింది.

వ్యక్తిత్వం

[మార్చు]

టి.శివశంకరం పిళ్లె ఈమె వ్యక్తిత్వాన్ని గూర్చి ఇలా కొనియాడాడు.[2] "ఆమె శీలసౌందర్యమును, పరార్థ దృష్టియు, కరుణాలవాలతయు చూచి ఉప్పొంగుచుండుదును. పేదసాదల యందు వారి దయ అవ్యాజమైనది. ఆర్తుల వెతకికొని వెళ్లి వారి దుఃఖముల వివర్తించుట వారి గూఢచర్యలలో నొకటి. సహనము ఆమె సొమ్ము. ఆశ్రిత వత్సలతకు వీరి జన్మ ఱెక్కమాను."

ఈమెకు పెనుకొండ పట్టణం, పరిసరాలపట్ల అమితమైన అనురాగం, ఆదరణ ఉండేది. పెనుకొండకు వచ్చినప్పుడల్లా గతకాలపు స్మృతులను నెమరు వేసుకుని మనసుకు సాంత్వన,శాంతిని పొందేది. ఈమె పెనుకొండలోని బీదబాలురనిధికి ఎంతో సహాయం చేసింది. బెంగళూరులోని అబలాశ్రమమునకు అవసరమైన ధనసహాయం చేసింది. ఈమె పెనుకొండలో ఉన్న సమయంలో ఈమెకు మునిసామి అనే అమీనా సేవలు చేస్తుండేవాడు. అతడు మరణించగా అతని సేవలకు కృతజ్ఞతగా పెనుకొండ తపాలాకార్యాలయం ఎదుట వీధిదీపాన్ని స్మారకచిహ్నంగా నిర్మించింది. మునిసామి వేతనం అనే పేరుతో స్థానిక గర్ల్స్ హైస్కూలులో ఆదిఆంధ్ర విద్యార్థులకు ఉపయోగపడేలా ఒక నిధి ఏర్పాటు చేసింది.

ఈమె కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఆంగ్లసాహిత్యం అభ్యసించింది. షేక్స్‌పియర్, బ్రౌనింగ్‌లపై పరిశోధనలు చేసింది. సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులకు ఆంగ్ల భాషను, సాహిత్యాన్ని నేర్పింది ప్రతిగా బాలుడైన పుట్టపర్తి ఆమెకు ప్రబంధాలను నేర్పారు.. గురుభక్తితో ఆమె బట్టలు కూడా ఉతికేవారట పుట్టపర్తి..[3] ఈమెకు తెలుగు భాష, సాహిత్యం పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. క్రైస్తవ భక్తురాలైనప్పటికీ హిందూ మతగ్రంథాలైన ఉపనిషత్తులను, వేదాలను చదివి అంతఃసారాన్ని గ్రహించేది. భాగవతంలోని బలి, ప్రహ్లాద, గజేంద్ర మోక్ష ఘట్టాల రహస్యాలను ఆంగ్లంలోకి అనువదించి తన దేశీయులకు తెలియజేసింది. పెనుకొండలో ఉన్నప్పుడు ఆంధ్రపత్రిక క్రమంతప్పకుండా చదివి సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకొనేది. ఇంగ్లాండులో ఉన్నప్పుడు పెనుకొండలోని మిత్రబృందానికి వారానికి పది ఉత్తరాలు తక్కువకాకుండా తెలుగులో వ్రాసేది. పెనుకొండ పరిసరాలనుండి కేంబ్రిడ్జికి చదువు నిమిత్తం వెళ్లిన వారికి ఈమె ఆశ్రయం కల్పించేది. గోక్లే శ్రీనివాసశాస్త్రి, శంకరనాయర్, గుత్తి కేశవపిళ్లె, ఎస్.వి.రామమూర్తి, క్యాండెత్ మొదలైనవారు ఈమె ఆథిత్యం పొందిన వారిలో కొంతమంది. ఈమె ఆహ్వానం మేరకు టి.శివశంకరం పిళ్లె ఇంగ్లాడు వెళ్లి ఆ దేశాన్ని సందర్శించి వచ్చాడు.

అచిరకాలంలోనే భారతదేశం స్వాతంత్ర్యం పొందాలని ఈమె ఆకాంక్షించేది. ఆ లక్ష్యసాధనకు రాజకీయ పరిస్థితుల వికల్ప స్థితులలో దుర్నయములకు పాల్పడకుండా శాంతిమార్గాన్ని అవలంబించాలని భారతప్రజలను కోరేది. భారతదేశాభ్యుదయానికి తోడ్పడని ఆంగ్లేయాధికారుల పద్ధతులకు విముఖత వ్యక్తపరచేది. గాంధి మహాత్ముని ఉద్యమం పట్ల గౌరవం కలిగి ఉండేది.

ఈమె పట్ల అభిమానంతో గౌరవంతో టి.శివశంకరం పిళ్లె తన అళియరామభూపాలుడు[4] వచన కావ్యాన్ని ఈమెకు అంకితం చేశాడు. A Short Study of the Hindu & Muslim Minds and their Reaction to Politics[5] అనే పేరుతో ఒక చిరుపొత్తాన్ని ఈమె ప్రకటించింది.

మూలాలు

[మార్చు]
  1. అప్పిరెడ్డి, హరినాథరెడ్డి (2014). సీమ సాహితీస్వరం శ్రీ సాధన పత్రిక (1 ed.). అనంతపురం: శ్రీమతి జెన్నె(ఎం) మాణిక్యమ్మ పబ్లికేషన్స్. pp. 262–264. ISBN 978-93-5156-338-9.
  2. టి.శివశంకరం, పిళ్లె (1930-05-31). "పోయివచ్చెదను". శ్రీసాధనపత్రిక. 4 (37): 9.
  3. శశిశ్రీ (2012). పుట్టపర్తి నారాయణాచార్య (మోనోగ్రాఫ్) (1 ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడెమీ. p. 12. ISBN 81-260-4106-4.
  4. టి.శివశంకరం, పిళ్లె (1932). అళియరామభూపాలుడు (1 ed.). మద్రాసు: ఆంధ్రగ్రంథమాల. p. 7. Retrieved 12 January 2015.
  5. అమెజాన్.కామ్‌లో పుస్తకవివరాలు