Jump to content

పులస చేప

వికీపీడియా నుండి

పులస చేప
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Species:
T. ilisha
Binomial name
Tenualosa ilisha
(F. Hamilton, 1822)

పులస చేప (ఆంగ్లం: ilish) వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది.. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది. 'పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి' అంటారు. తెలుగు నేలలో ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని 'వలస చేప' అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు 'హిల్సా అని కూడా పిలుస్తారు.

పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడి జనం రాజధానిలో ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవటానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేప పులుసును పట్టుకుని వెళ్ళేవారట.

పులసల పుట్టుక

[మార్చు]

పులస పుట్టుక విచిత్రంగా ఉంటుంది. 'హిల్సా ఇలీషా' అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్‌ నుండి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి.

పేరు వెనుక కథ

[మార్చు]

డెల్టాలో లభించే చేపల రుచే అద్భుతం. అందుకే వేరే ప్రాంతాల్లో సెటిలైన డెల్టావాసులు కూడా ఇక్కడి చేపలే తినాలని అనుకుంటారు. నరసాపురం దగ్గర గోదావరి సాగరంలో కలుస్తుంది. అందుకే ఆ రెండూ కలిసే ప్రాంతంలో లభించే చేపలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది. సముద్రంలో ఉండే ఇలస.. గోదావరికి ఎదురీది ధవళేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. చెనల చేప(ఆడచేప), గొడ్డుచేప(పోతు చేప) ఇలా వివిధ పేర్లతో వీటిని విక్రయిస్తారు ,పుస్తెలమ్మయినా పులస తినాలన్న సామెత పుట్టిందంటే దాని రుచి అంత బాగుంటుంది మరి. సముద్రంలో ఉప్పుటేరు కలిసే చోట, ఉప్పుటేరులో కొల్లేరు సరస్సు కలిసేచోట లభించే చేపలకూ ఎంత ప్రత్యేకత ఉందో అంత గిరాకీ ఉంటుంది.

పులస రుచి

[మార్చు]

సముద్రంలో ఉన్నపుడు విలసగా ఉండే ఈ చేపలు గోదావరిలోకి వలస వచ్చి పులసలుగా మారతాయి. సముద్రపు ఉప్పునీటిలో ఉన్నంతకాలం ఇవి విలసలుగా ఉండి సాధారణరుచి కలిగి ఉంటాయి. సముద్రంనుండి గోదావరి వరదనీటిలోకి ఎదురీదడంవల్ల ఈ చేపలకు అమోఘమైన రుచివస్తుంది. ఈ పులసచేపల్లో ఆడ (శన), మగ (గొడ్డు) అని రెండురకాలుంటాయి. ఇందులో ఆడచేప రుచి ఎక్కువగా ఉండడంవల్ల ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఈ చేపకు ముళ్ళు చాలా ఎక్కువగా వుంటాయి. చేపకు రుచి తెప్పించేది ప్రధానంగా వండే విధానమే. కట్టెల పొయ్యిమీద కుండతో వండితే మంచి రుచి వస్తుందని చెపుతారు. ఈ చేపను పులుసుగా మాత్రమే వండుతారు. ఇందులో కొందరు వంకాయ, బెండకాయలు కూడా వేసి వండుతారు. పొద్దుట వండిన కూర సాయంత్రానికి మరింత రుచినిస్తుంది.లేదా రాత్రి పూట వండిన పులస పులుసును తెల్లారి ఉదయం తింటే చాలా రుచికరంగా వుంటుంది

పులస ధర

[మార్చు]

సముద్రానికి దగ్గరగా ఉండే యానాం, కోటిపల్లి ప్రాంతాల్లో దొరికే పులసలకు తక్కువధర ఉంటుంది. ఎందుకంటే అవి అప్పుడే గోదావరి నీటిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి వాటికి అంతధర ఉండదు. అలాగే కపిలేశ్వరపురం, ఆలమూరు ప్రాంతాల్లో దొరికే చేపలకు ధర కొంచెంఎక్కువగా ఉంటుంది. కానీ పొట్టిలంక, ధవళేశ్వరం సమీపంలో దొరికే చేప ధరలకు అంతూపొంతూ ఉండదు. వీటి రుచి అధికంగా ఉండడంవల్ల ఈ చేపలకు డిమాండ్‌ పెరిగి సమయాన్ని బట్టి ధరలు పలుకుతుంటాయి. పిల్ల చేపల నుంచి పెద్ద చేపల వరకూ ఇవి వేరు వేరు సైజుల్లో దొరుకుతాయి ఆయా సైజులను బట్టి రూ.2000 నుంచి రూ.5 వేల వరకూ ధర పలుకుతాయి. వండిన చేపల పులుసుని కూడా నగరాల్లో అమ్ముతున్నారు. అది డిమాండును బట్టి మూడు వేల నుంచి 5 వేల వరకూ ధర ఫలుకుతోంది.

పులస విశేషాలు

[మార్చు]

గోదావరి పరిసరాల్లో చేపల మార్కెట్లకు పులసలు కొత్త కళను తీసుకొచ్చాయి. ఎక్కువ డిమాండ్‌ ఉన్న చేపను ఎంతరేటయినా పెట్టి కొనడానికి వెనకాడటం లేదు ఈ ప్రాంతవాసులు. ఈ చేపల రుచి చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి సైతం భోజన ప్రియులు తరలివస్తున్నారు. దీంతో చేపలమార్కెట్లు కిటకిటలాడుతన్నాయి. పులస... ఈ పేరు చెప్పగానే గోదావరి జిల్లాల్లో నోరూరని వారుండరంటే ఆశ్చర్యమే. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ చేపకు తూర్పు గోదావరి జిల్లా ఎంతో ఫేమస్‌. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరిలో ఎర్రనీరు ఉన్నప్పుడే ఈ పులసలు ఎక్కువగా దొరుకుతాయి. అయితే వీటి ధర మాత్రం కాస్త ఎక్కువే. చిన్న సైజు చేప కొనాలంటే సుమారు నాలుగొందల నుంచి ఐదొందల వరకు ఉంటుంది. ఇక పెద్దసైజు చేప కొనాలంటే పదిహేనొందలు పెట్టాల్సిందే. దీనికి ఉన్న డిమాండ్‌ అలాంటింది. పుస్తెలమ్మయినా సరే పులస రుచి చూడాలనేది ఇక్కడ ఎక్కువగా వినిపించే నానుడి. ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో ఉన్న గోదావరిలో ఈ చేపలు ఎక్కువగా దొరుకుతాయి. అంతర్వేది సముద్రం నుంచి ఇలసలు గోదావరిలోకి ఎదురీది పులసలుగా మారుతాయి. దీంతో ధవళేశ్వరం పరిసర ప్రాంతాల్లో పడే పులసలకు గిరాకీ ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులకు పంట పడుతోంది. వలలో ఒక్క చేప పడిందంటే సుమారు 500 జేబులో పడ్డట్టే. ఇక్కడ మార్కెట్లో పులసలు కొనుగోలు చేసి అక్కడే వండించుకొని మరీ దూర ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. సంక్రాంతి సీజన్‌లో బంధువులు వచ్చినట్లు పులసల టైంలోనూ వస్తారు. ఒకటి రెండు రోజులు ఉండి మరీ ఈ చేప రుచిచూసి వెళ్తుంటారు. దీంతో ఈ సీజన్‌ను అంతా పులసల ఫుడ్ ఫెస్టివల్‌గా పిలుస్తుంటారు. ఇదిలా ఉంటే ఈ చేపల వండటంలో కొంత నేర్పు అవసరం. అలవాటుపడిన వారు తప్ప ఇతరులు దీనిని వండలేరంటే ఆశ్చర్యం లేదు. సాధారణంగా వండే వంటకాలకంటే దీనిని ప్రత్యేకంగా వండుతారు. పులస పులుసు చూశాక మీకు నోరూరుతోందా. అయితే దాన్ని రుచి చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే. (జులై 29, 2009, బుధవారం టివి 5 లో వచ్చిన వార్త)

పులసల వేట

[మార్చు]

పులసను వేటాడడం ఆషామాషీకాదు. గేలం వేస్తేనో, వల విసిరితేనో ఇవి దొరికేయవు. ఏటిమధ్యకు వెళ్ళి వలలను మత్య్సకారులు ఏర్పాటు చేసుకుంటారు. తెల్లవారుజామున వేటకు వెళితే సాయంత్రానికి ఒకటిరెండు దొరికితే గొప్పే. కొన్ని సందర్భాల్లో అసలు దొరకనే దొరకవు. దొరికితే వారి పంట పండినట్లే. వలలో పడిన వెంటనే ఈ చేపలు మరణిస్తాయి. అందుకే ఇవి బతికుండగా జాలర్లు కూడా చూసిన దాఖలాలు ఉండవు.ధవళేశ్వరం బ్యారేజికి దిగువన సఖినేటిపల్లి, పి.గన్నవరం, రాజోలు, అయోధ్యలంక, పెదమల్లంక, బోడసకుర్రు, కరవాక, గోగన్నమఠం, గంటి, నారాయణలంక, కేదార్లంక, వానపల్లి, వాడపాలెం, అద్దంకివారిలంక, కోటిపల్లి, యానాం, గోడితిప్ప, ఓడలరేవు, జొన్నల్లంక, లంకలగన్నవరం, కె.ఏనుగుపల్లి, మానేపల్లి, నాగుల్లంక తదితర  ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ఆయా గోదావరి నదీపాయల్లో పులసల వేట సాగిస్తారు. సుమారు మూడు నెలలపాటు ధవళేశ్వరం బ్యారేజికి దిగువ మొదలుకొని కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 200 బోట్లలో సుమారు 600 మంది మత్స్యకారులు పులసల వేటలో నిమగ్నమవుతారు.

నగరాలకు తరలించే సంస్కృతి

[మార్చు]

గోదావరినదిలో లభించే పులసను ఐస్‌లో ఉంచరు. ఎందుకంటే అది దొరికితే వెంటనే అమ్ముడైపోతుంది. పైపెచ్చు ఐస్‌లో పెడితే చప్పబడిపోతుంది .భీమవరం పరిసరాల నుంచి ఈ దేశవాళి చేపల కూరలు ప్రతిరోజూ హాట్ క్యారేజీల్లో ప్యాక్ చేసి రాజధానికి పంపిస్తుంటారు. వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు, ఉద్యోగుల కోసం వారి బంధువులు, మిత్రులు పంపిస్తారు. ఇందులో పండుగొప్ప, బొమ్మిడాయి, కొర్రమీను, రామలుతోపాటు ఇతర చేపల రకాలు ఉంటాయి. భీమవరం నుంచి హైదరాబాద్‌కు 30కి పైగా బస్సులు వెళతాయి. మూడు రైళ్లు ఉన్నాయి. ప్రతి రోజూ పార్శిళ్లు రాత్రి 7,8 గంటల మధ్య బస్సులకు అందజేస్తారు. తెల్లవారి ఆరు గంటలకల్లా హైదరాబాద్‌లో కూర టేబుల్‌పై రెడీగా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాజకీయ ప్రముఖులకు, తెలంగాణ మిత్రులకే కాకుండా సెక్రటేరియట్‌లో ఐఏఎస్‌లకు సైతం వండిన చేప కూరలు పంపించడం అలవాటైపోయింది.

మరీ డిమాండ్ పెంచకండి

[మార్చు]

పులస లాంటి అరుదైన జాతులపై విపరీతమైన డిమాండ్ పెంచడంతో, వాటిని అధికంగా వేటాడేస్తున్నారు. ఖండాంతర ప్రయాణం చేసి వాటి సంతానొత్పత్తికోసం గోదావరి ప్రాంతానికి చేరుకునే పులసలను రుచిపేరుతోనూ, విపరీతమైన డిమాండ్ వల్ల పూర్తిగా నిర్మూలింపజేస్తున్నారు. శనపులస అంటే గుడ్లతో వున్న పులస అని అర్ధం దానికి మరింత డిమాండ్ అంటూ గర్భవతి ఐన పులసను చంపుతున్నట్లు లెక్క. ఇంతాచేస్తే పులసలను కృత్రిమంగా సాగుచేయలేము. అందుకే వీటిని తినే విషయంలో సంయమనం తప్పని సరిగా అవసరం. నిజానికి మరింత రుచికరంగా వుండే అనేక రకాల చేపలు కూడా అందుబాటులోవున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి సూచిస్తున్న చేపలుగా సాల్మన్, సారిడాన్ వంటివి కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అందుకే వీటి ప్రచారం విషయంలో సంయమనం పాటిస్తేనే పులస జాతులు పూర్తిగా నీర్మూలనకు గురికాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం.

నకిలీ పులస

[మార్చు]

పులసకున్న డిమాండ్ వల్ల. సముద్రంలోని ఇల్సాలను తీసుకొచ్చి పులసగా అమ్మేస్తుంటారు. ఇల్సా నలుపు, ఎరుపు రంగు షేడ్స్‌తో ఉంటే... పులస మాత్రం వెండి (సిల్వర్) రంగులో మెరుస్తుంటుంది. పులసను కొనేప్పుడు ఈ తేడాలను గమనించాలి

ఆహారంగా పనికొచ్చే మరికొన్ని చేపల రకాలు

[మార్చు]

కట్టి పరిగెలు (పిత్త పరిగెలు), కొయ్యంగలు, తుళ్ళు, మట్టగిడసలు, గొరకలు, జలుగులు, కర్నింగాయలు, అరటి చేపలు, శాక రొయ్యలు, బుంగ రొయ్యలు, గాజు రొయ్యలు, గొల్లిగాయలు, జల్లలు, రామలు, ఆకు పరిగెలు, సీసం రొయ్యలు, బెత్తెలు, ఇసుక దొందులు, ఇంగిలాయలు, మార్పులు...ఇలాంటివి సముద్ర ప్రాంతాలో ఎక్కువగా దొరుకుతాయి. చెరువుల్లో ఎక్కువగా దొరికే చేపలు బొచ్చె, పండుగొప్ప, శీలవతి, జడ్డువా, బంగారుతీగ, గడ్డి చేప, నల్లగండు మేను, తెల్లగండు మేను, కట్ల, ఇల్లంబ్రాయిలు లాంటి రకాలు లభిస్తాయి

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పులస_చేప&oldid=4282109" నుండి వెలికితీశారు