పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి (నవంబరు 5, 1877 - జనవరి 7, 1950 ) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు.

జీవిత సంగ్రహం[మార్చు]

వీరు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలోని చోడవరం గ్రామంలో నవంబరు 5, 1877 (బహుధాన్య కార్తీక బహుళ షష్ఠి) తేదీన జన్మించారు.

తండ్రి వద్ద ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం. శొంఠి భద్రాద్రి రామశాస్త్రి వద్ద కావ్య నాటకాలంకారాలను చదివి సంస్కృతంలో పాండిత్యాన్ని సంపాదించారు. పిదప ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి, తర్వాత కాకినాడలోని పిఠాపురం మహారాజావారి కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా నియమితులయ్యారు. పిఠాపురం మహారాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిని ప్రాచీనాంధ్ర గ్రంథ సంపాదనకై నియమించారు. ఆ పనిమీద మైసూరు, మద్రాసు, తంజావూరు వంటి ప్రాంతాలతో పాటుగా పలు తెలుగు ప్రాంతాల్లో తిరిగి విలువైన గ్రంథాలనెన్నిటినో సంపాదించారు. ఆ తర్వాత బందరు నేషనల్ కళాశాలలోను, రాజోలు బోర్డు హైస్కూలులోను కూడా ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. [1]

వీరు ప్రాచీన సంస్కృత వాజ్మయాన్ని ఒక నూతనరీతిలో పరిశోధన చేసి మంచి విమర్శకులుగా పేరుపొందారు. వీరి కృషి ఫలితంగా మహాభారత చరిత్ర (1923) అనే విమర్శన గ్రంథం వెలువడింది. ఆ గ్రంథాన్ని సమర్ధిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ కొందరు వాదప్రతివాదాలకు దిగారు. చివరకు కేసు కోర్టులకు ఎక్కింది.

మరణం[మార్చు]

వీరు జనవరి 7 1950 తేదీన పిఠాపురంలో పరమపదించారు.

రచనలు[మార్చు]

 • వేదకాలపు వ్యవసాయ చరిత్ర
 • పరీక్షిత్తు[2] (1932) మహాభారతంలో పాండవుల వారసుడైన పరీక్షిత్తు జీవితం గురించి ఈ కథలో అధ్యాయాలుగా వివరించారు. పరీక్షిత్తు జననానికి పూర్వరంగం, పరీక్షిత్తు జననం, ధర్మరాజు అశ్వమేధ యాగం, ఆపైన సంఘటనలు, పరీక్షిత్తు బాల్యం, మహాభారత యుద్ధం, పాండవుల పాలన, వారి మహాప్రస్థానం, పరీక్షిత్తు పాలన మొదలైన విషయాలు అధ్యాయాలుగా ఉన్నాయి. మహాభారతంలో పాండవుల వారసునిగా, భాగవతంలో భాగవత శ్రోతగా పరీక్షిత్తు ప్రవర్తిల్లుతాడు. ఇలాంటి పాత్ర జీవితక్రమాన్ని ఈ పుస్తకంలో వ్రాయడం విశేషం.
 • మాంసభుక్తి
 • రామోపాఖ్యానము-తద్విమర్శనము[3] (1938) ఎర్రాప్రగడ రచించిన రామాయణం రామోపాఖ్యానం. ఆయన రాసిన తొలినాళ్ళ కావ్యంగా దానికి పండితోలోకంలో ప్రత్యేకాసక్తి కలిగివుంది. ఆ కావ్యాన్నీ దానిపై తాను రచించిన విమర్శనూ ప్రచురించారు పెండ్యాల వారు.
 • నవకథా మంజరి (1942)[4] ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలోని కొన్ని ఆసక్తికరమైన, విచిత్రమైన ఘట్టాలను స్వీకరించి కథలుగా మలిచారు రచయిత. పెండ్యాల వారు పురాణాలను, ఇతిహాసాలను చరిత్రతో ముడివేసి తార్కికంగా చర్చించడంలో దిట్ట. ఆంధ్రూలలో స్వాభిమానం పెరిగేందుకు ఈ గ్రంథం రచించినట్టు ముందుమాటలో చెప్పుకున్నారు. ఇందులో ఆంధ్రుల దాయాదుడు, త్రిలింగదేశపు మహారాణి, ఆంధ్రపిత, వరరుచి, కుమారిల భట్టాచార్యుడు, తెలుగునాటి తురుష్కయోగి, ఆంధ్రగాయకుడు, ప్రాచీనాంధ్ర వర్తకుడు, శ్రీశైల మల్లికార్జునుడు కథలున్నాయి.
 • ఉత్తర భారతము
 • చిత్రరత్న పేటి
 • సూక్తి సుధాలహరి[5] (1941) బ్రిటీష్ విద్యావిధానం భారతదేశంలో ప్రవేశించిన కొద్దీ తెలుగు విద్యాబోధనలో ఎన్నో మార్పులు వచ్చాయి. అటువంటి వాటిలో సూక్తుల బోధన ఒకటీ. అనేకమైన సాహిత్య గ్రంథాలు, నీతికథల నుంచి మంచి మాటలు సేకరించి ప్రచురించి వాటిని బాలురచే చదివించడం మొదలైన కొద్దీ అటువంటి ఎన్నో గ్రంథాలు ప్రచురితమయ్యాయి.

మూలాలు[మార్చు]

 1. పెండ్యాల, వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి (1928). పరమయోగి విలాసము గ్రంథ పీఠిక (1 ed.). పిఠాపురం: రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు. p. i. Retrieved 22 March 2015.
 2. భారత డిజిటల్ లైబ్రరీలో పరీక్షిత్తు పుస్తకం.
 3. భారత డిజిటల్ లైబ్రరీలో రామోపాఖ్యానము-తద్విమత్శనము పుస్తకం.
 4. భారత డిజిటల్ లైబ్రరీలో నవకథామంజరి పుస్తకం.
 5. భారత డిజిటల్ లైబ్రరీలో సూక్తిసుధాలహరి, రెండవ భాగము పుస్తకం.
 • వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, పెండ్యాల, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీలు: 774-5.