పెరుమాళ్ మురుగన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెరుమాళ్ మురుగన్
పెరుమాళ్ మురుగన్
పుట్టిన తేదీ, స్థలం1966[1]
వృత్తిరచయిత
జాతీయతభారతీయుడు
గుర్తింపునిచ్చిన రచనలు‘మధోరుభగన్’ (నవల)

పెరుమాళ్ మురుగన్ తమిళ కవి,నవలా రచయిత. తమిళ సాహిత్య చరిత్ర కారుడు.

జీవిత విశేషాలు[మార్చు]

తమిళనాడులోని కోయంబత్తూరు,ఈరోడ్‌,తిరువూర్‌,సేలం,కరూర్‌ ప్రాంతాన్ని 'కొంగునాడు' అంటారు. ఈ ప్రాంతంలోని నమక్కల్‌ జిల్లాలో గల తిరుచెంగోడు పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో తమిళ భాషా ఆచార్యునిగా గత 8 ఏళ్ళ నుంచి పెరుమాళ్‌ మురుగన్‌ పనిచేస్తున్నాడు. ఆయన ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగాడు. ఇతను ఆరు నవలలు, నాలుగు కథా సంపుటాలు, నాలుగు శతకాలు రచించాడు. ఇతను రచించిన సీజన్స్ ఆఫ్ ది పామ్‌ , మధోరుభగన్ అను రెండు నవలలు ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి. సీజన్స్ ఆఫ్ ది పామ్‌ నవల 2005లో ప్రతిష్టాత్మకమైన కిరియామా అవార్డుకు ఎంపికయ్యింది. తాను రచించిన కథలకు తమిళనాడు ప్రభుత్వం నుండి కూడా అవార్డులు అందుకున్నాడు.[2]

పెరుమాళ్ మురుగన్ తన తమిళ నవల మధోరుభగన్ తో ఇటీవల(జనవరి, 2015) దేశవ్యాప్తంగా సంచలనమయ్యాడు. నిజానికి ఈ నవల 2010లో ముద్రించబడింది. అయితే 2013లో 'One Part Woman'పేరుతో అనిరుథ్ వాసుదేవన్ ఆంగ్లం లోకి అనువదించాడు. ప్రముఖ ప్రచురణల సంస్థ పెంగ్విన్ దాని ఆంగ్లానువాదాన్ని వెలువరించింది. నూటపాతికేళ్ల నాడు తిరుచెంగోడు ప్రాంతంలో నెలకొన్న ఒక ఆచారం నేపథ్యంగా ఆయన ఈ నవల రచించాడు. సంతానం లేని మహిళలు ఒక తిరునాళ్ల సందర్భంగా ఆలయంలో అపరిచితులతో శారీరకంగా కలవడం ఈ నవల యొక్క ప్రధానాంశం. ఈ నవలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. తిరుచెంగోడులోని ఆరెస్సెస్ శాఖ, హిందూ మున్నాని, కొన్ని కులసంఘాలు గత నెలలో దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. బంద్‌లు, హర్తాళ్లు నిర్వహించాయి. దానితో నవలలో దానిని వ్యతిరేకించే వారికి అభ్యంతర కరమైనవిగా తోచిన భాగాలను తరువాతి ముద్రణ లో తొలగిస్తానని, వారితో చర్చకు తాను సిద్ధమేనని పెరుమాళ్ మురుగన్ ప్రతిపాదించినా ఖాతరు చేయకుండా దాడి చేశారు. ఈ సంఘటనతో మనస్తాపం చెందిన మురుగన్ "రచయితగా పెరుమాళ్ మురుగన్ మరణించాడు. అతడేమీ దేవుడు కాదు. కావున అతని పునరు త్థానం ఏమీ ఉండదు. ఇక నుంచి పెరుమాళ్ మురుగన్ ఒక ఉపాధ్యాయుడుగా మాత్రమే బతికి ఉంటాడు"అని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రకటించాడు.[3] తరువాత రెవెన్యూ అధికారుల చొరవతో మత సంస్థలు, కుల సంఘాలతో సమావేశం జరిగింది. ఇందులో మురుగన్ కూడా పాల్గొన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పడానికి, నవల ఉపసంహరణకు ఆయన హామీ ఇచ్చాడు. ఆయనపై దాఖలుచేసిన కేసుల ఉపసంహరణకు హిందుత్వ సంస్థలు కూడా అంగీకరించాయి.

మద్రాసు హైకోర్టు తీర్పు[మార్చు]

2016 జూలై నెల 5 వ తేదీన ఈ కేసును కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ పుష్పా సత్యనారాయణలతో కూడిన ధర్మాసనం 160 పేజీల వివరణాత్మక తీర్పును ఇచ్చింది.

మధోరు భగన్ నవలా నేపథ్యం[మార్చు]

ఈ నవల తిరుచెంగోడు ప్రాంతం లో గౌండర్ కులానికి చెందిన వ్యవసా య కుటుంబంలోని కాళి, అతని భార్య పొన్నల కథ. పెళ్లయి పన్నెండేళ్లయినా సంతానం కలగలేదు. దీని వల్ల సమాజం వాళ్లను కించపరుస్తూ ఉంటుంది. పెళ్లయినా సంతానం కలగకపోవడంతో అవహేళనకు గురయ్యే పరిస్థితి మన సమాజంలో నేటికీ ఉంది. ఈ నవల కథా సందర్భం వందేళ్ల నాటిది అని గుర్తుంచుకుంటే దాని తీవ్రత అర్థమవుతుంది. కాళి, పొన్నల సంతానలేమికి కారణం వంశాగల్ శాపమనీ, తిరుచెంగోడు కొండల మీద వెలసిన పవల్ అనే దుష్టదేవత విగ్రహం కూడా ఒక కారణమనీ వారి ఇరువురి తల్లులూ భావిస్తుంటారు. శాంతిపూజ చేయిస్తారు. వంశాకురం లేకపోవడం తీవ్ర అవమానంగా భావి స్తారు.

చివరకు ఆ ప్రాంతంలో వాడుకలో ఉన్న ఒక సంప్రదాయంలో పరిష్కా రం వెతుకుతారు. ఆ ప్రాంతంలో ఉన్న అర్ధనారీశ్వర దేవాలయం వద్ద జరిగే రథోత్సవాలలో పదునాల్గవ రోజు సంతానంలేని వివాహిత స్త్రీలు (దైవరూప) పరపురుషునితో సంగమించే ఆచారం వందేళ్ల క్రితం ఉండేది. తద్వారా సంతానం కలిగితే ఆ సంతానానికి సామి పిళ్లై (దేవుని బిడ్డ) అని నామకరణం చేస్తారు. ఆ ఆచారాన్ని అనుసరించాలా వద్దా అన్న మీమాంస కాళి, పొన్నల మధ్య, ఆ ఇద్దరి కుటుంబాల నడుమా, వారి లోలోపల తీవ్ర మానసిక సంఘర్షణ రేపుతుంది. సంతాన లేమికి కారణం కాళిలో ఉందని భావిస్తారు. దానికి రుజువులేమీ లేవు. ఆ సంఘర్షణను అత్యంత సున్ని తంగా చిత్రించాడు రచయిత.

భూస్వామ్య సమాజ భావజాల సంక్లిష్టతలను వాటికి వాస్తవికతను, పాటించి, కళాత్మ కతను జోడించి అద్భుతంగా చిత్రించాడు. సమాజం లోని భావజాల వత్తిళ్లు, వ్యక్తుల్ని కుటుంబాలను ఎలా పీడిస్తాయో మనకర్థ మవుతాయి. పొన్న అత్త, కాళి తల్లి తండ్రి, పొన్న సోదరుడు ఆ పద్నాల్గవ రోజు ఉత్సవానికి పొన్నను పంపుతారు. పొన్న సోదరుడు కాళిని ఒక కొబ్బరి తోటకు తీసుకుపోయి తాగించి మైకంలో ఉంచుతా డు. రథోత్సవంలో పొన్న సంగమంలో పాల్గొందా లేదా అన్నదాన్ని రచయిత చిత్రించలేదు. కాళీ మైకం నుండి బయటపడిన తర్వాత భార్య పొన్న తనను మోసం చేసిందని కుప్పకూలుతాడు. దీనితో నవల ముగుస్తుంది.[4]

మూలాలు[మార్చు]

  1. [1] caravanmagazine.in›1 December 2013
  2. [2] peoplesdemocracy.in/.../tamilnadu-writers-condemn-burning-tamil-novel...Jan 4, 2015
  3. http://www.thehindu.com/news/cities/chennai/perumal-murugan-quits-writing/article6786990.ece
  4. http://www.sakshi.com/news/opinion/well-the-death-of-the-author-and-character-208929 డా.బి.సూర్య సాగర్(జనసాహితీ) సాక్షిలో

ఇతర లింకులు[మార్చు]