Jump to content

పేట శ్రీనివాసులు రెడ్డి (పేటశ్రీ)

వికీపీడియా నుండి

పేట శ్రీనివాసులు రెడ్డి (పేటశ్రీ) కథకుడు, జానపద పరిశోధకుడు, విమర్శకుడు, ప్రొఫెసర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమికి తొలి డైరెక్టర్‌గా నియమితులయ్యారు.[1]

బాల్యం-విద్యాభ్యాసం

[మార్చు]

ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించారు. తల్లిదండ్రులు చెంగమ్మ, నారాయణరెడ్డి. తిరుపతి పెద్దకాపువీధి మున్సిపల్ ప్రాథమికోన్నత స్కూల్, టి.పి.యం హైస్కూల్, శ్రీవేంకటేశ్వర జూనియర్ కాలేజ్, శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా 'జానపద శృంగార గేయాల' మీద పరిశోధన చేసి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి. పట్టాను అందుకున్నారు. అంతేకాకుండా పి.జి.డిప్లొమో ఇన్ ఫోటోగ్రఫీ, పి.జి.డిప్లొమో ఇన్ ఎపిగ్రఫీ కోర్సులు చేశారు.

ఉద్యోగ జీవితం

[మార్చు]

1992లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయనశాఖలో సహాయాచార్యులుగా చేరి, 2001-2007లలో సహాచార్యులుగా, 2007 నుండి ఆచార్యులుగా సేవలందించారు. మీడియా డీన్ గా, ఓరియంటల్ లెర్నింగ్ డీన్ గా ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ వ్యవస్థాపక  డైరెక్టర్ గా, ఎస్వీయూ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా, వార్డెన్ గా, వివిధ విశ్వవిద్యాలయాలకు పాఠ్యప్రణాళికా సంఘ అధ్యక్షునిగా, సభ్యులుగా పనిచేశారు. 1986-1992 మధ్య ఆరేళ్ళపాటు ఆంత్రోపాలజీ శాఖలో ఫోటో గ్రాఫర్ కం ఆర్టిస్ట్ గా పనిచేయడం విశేషం.

ఇప్పటి వరకూ 112 జాతీయ, 17 అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పత్రసమర్పణ చేశారు. అనేక కార్యశాలల్లో పాల్గొన్నారు. ఎన్నో సదస్సులకు ఉపన్యాసకుడిగా హాజరై ప్రత్యేకాంశాలపై ప్రసంగించారు. స్వయంగా 12 జాతీయ, అంతర్జాతీయ సదస్సులను నిర్వహించారు. ఈయన పర్యవేక్షణలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ నుండి ఇప్పటికి వివిధ అంశాల్లో పరిశోధనలకుగానూ 30 పిహెచ్.డి., 15 ఎం.ఫిల్. డిగ్రీలను పరిశోధకులు పొందారు.

కుటుంబ జీవితం

[మార్చు]

1994 లో శైలజను వివాహం చేసుకున్నారు. వీరికి సిద్దార్థ్ రెడ్డి, సాకేత్ రెడ్డిలు సంతానం.

రచనలు

[మార్చు]

1. జానపద శృంగార గేయాలు (1989)

2. జానపద గేయాల్లో శ్రీవేంకటేశ్వరుడు (1991)

3. చిత్తూరు జిల్లా పల్లె పదాలు (1991)

4. చిత్తూరు జిల్లా కోలాటం పాటలు (1992)

5.   తిరుపతి గంగ జాతర (1995) [1]

6. తిరుమల తిరుపతి గ్రామదేవతలు (2000)

7.   బూతు ఆచారాలు (2000)

8.   కొండ కతలు (2003)

9.   రాయలసీమ జానపద కళలు (2003)

10. వ్యాసతోరణం (2004)

11. GANGAMMA JATARA (English-2003)

12. తిరువీధులు (2009)

13. అంతా జానపదం (2012)

14. చిత్తూరు జిల్లా జానపద విజ్ఞానం (2012)

15. తిరుపతి పెద్దాయన ఎం. బలరామరెడ్డి (2015)

16. తెలుగు ఐతిహ్యాలు (2015)

17. జానపద గేయాల్లో శ్రీకృష్ణుడు (2019)

18. గొబ్బి పాటలు (2019)

19. తిరుపతి కథలు (2019)

20. తిరుమల కథలు (2019)

21. తిరుమల-తిరుపతి కథలు (2019)

22. కథలు https://kathanilayam.com/writer/11036

ఈయన రాసిన 230 వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయ్. కథకుడిగా పేటశ్రీ 150 కథలు ప్రచురించారు. వీటిలో 108 కథలు తిరుపతి కథలు పేరిట నవ్య, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సాక్షి ఆదివారం ఆనుబంధాలలో ప్రచురింపబడ్డాయి. ఈ 108 తిరుపతి కథలను ఎమెస్కో ప్రచురణ సంస్థ పెద్ద ఉద్గ్రంథంగా ప్రచురించింది. ఇవే కాకుండా వివిధ సామాజికాంశాల మీద అనేక కథలు రాశారు. వీటి మీద వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.

అవార్డులు

[మార్చు]

పేటశ్రీ రచనలకు, సాహిత్య కృషికిగానూ అనేక పురస్కారాలు వరించాయి.

  1. ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్తు వారి 'రామరాజు జానపద విజ్ఞాన పురస్కారం' (1995)
  2. సుభద్రా కుమారి చౌహాన్ సెంటినరీ అవార్డు (2004)
  3. బి.ఎన్.శాస్త్రి ఆత్మీయ పురస్కారం (2004)
  4. భరత ముని కళారత్న అవార్డు (2012)
  5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ 'ఉత్తమ అధ్యాపక అవార్డు' (2013)
  6. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అవార్డు (2014)
  7. జానపద కళాపీఠం అవార్డు (2014)
  8. కోటపాటి మురహరిరావు సాహితీ పురస్కారం (2014)
  9. తెలుగు విశ్వవిద్యాలయం 2016 కీర్తి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం, "ఆధ్యాత్మిక సాహిత్యం" విభాగం, 2016 మే 12.[2][3]
  10. జానపద సాహితీరత్న (2018)
  11. ఉగాది పురస్కారం 2021

విదేశాల సందర్శన

[మార్చు]

జానపద విజ్ఞానాంశాల మీద థాయ్ లాండ్, చైనా, ఆస్ట్రేలియా, భూటాన్, శ్రీలంక, ఇండోనేషియా వంటి అనేక దేశాలలో జరిగిన అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని పరిశోధన పత్రాలను సమర్పించారు. పేటశ్రీ పేరిట అనేక పత్రికల్లో కార్టూన్లు, ఛాయా చిత్రాలు ప్రచురించారు. 200లకు పైగా పుస్తకాలకు ముఖచిత్రాల్ని అందించారు.

మూలాలు

[మార్చు]
  1. "తెలుగు భాషకు వన్నె తెస్తా". Sakshi. 2019-12-14. Archived from the original on 2022-11-23. Retrieved 2022-11-23.
  2. ఆంధ్రజ్యోతి (30 April 2016). "కీర్తి పురస్కారాలను ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Archived from the original on 23 July 2018. Retrieved 2022-11-23.
  3. నమస్తే తెలంగాణ (13 May 2016). "ప్రతిభామూర్తులకు కీర్తి పురస్కారాలు". Archived from the original on 23 July 2018. Retrieved 2022-11-23.