పేరిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆపిల్ తో ప్రిన్స్ పారిస్

పేరిస్ - గ్రీసు దేశపు పురాణ గాథలు

[మార్చు]

గ్రీసు దేశపు పురాణ గాధలలో ఒక కథ ఇది. ప్రస్తుతం టర్కీ దేశం ఆక్రమించిన ప్రాంతాన్ని పూర్వం ఏసియా మైనర్ అనేవారు. ఈ ప్రాంతపు ఈశాన్య మూలకి ట్రోయ్ అనే నగరం ఉండేది. గర్భవతిగా ఉన్న ఈ నగరపు రాణి హెకూబా ఒక రాత్రి ఒక వింతైన జ్వాలని ప్రసవించినట్లు కలని కన్నది. రాజు ఆస్థాన జ్యోతిష్కుడిని పిలిపించి కలకి అర్థం చెప్పమని అడిగేరు.

“రాజా! రాణి వారు ప్రసవించబోయే బాలుడు ట్రోయ్ నగరపు వినాశనానికి కారకుడు అవుతాడు! ఈ రాజ్యాన్ని, ప్రజలని రక్షించుకోవాలంటే ఈ బాలుడిని హతమార్చవలసిందే” అని జోశ్యంతో పాటు సలహా కూడా చెప్పేడు.

భూపతనమైన వెంటనే బాలుడిని హతమార్చమని భటుడికి ఆదేశం ఇచ్చేడు రాజు. ముక్కుపచ్చలారని పసికందు ప్రాణాలు తియ్యలేక భటుడు ఆ పసికూనని ఇడా పర్వతం మీద ఒక చెట్టు కింద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పసి కందుని ఒక ఎలుగుబంటి చూసింది. పాపని చూసి, జాలిపడిందో ఏమో రాత్రల్లా కాపలా కాసింది. మరునాడు బాలుడు ఏమయ్యాడో చూద్దామని భటుడు తిరిగి వచ్చేడు. ఆ బాలుడు ప్రాణాలతో కనిపించేసరికి “ఈ బాలుడు భవిష్యత్తులో ఏదో సాధించవలసి ఉంది. అందుకనే ప్రాణాలతో బయట పడ్డాడు” అనుకుంటూ ఆ పసివాడిని రహస్యంగా తన ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నాడు. శుక్లపక్ష చంద్రుడిలా పెరిగిన పేరిస్ (Paris) స్ఫురద్రూపి, సత్యసంధుడు, శీలవంతుడుగా ముల్లోకాలలోను పేరు తెచ్చుకున్నాడు.

పందేలలో పోటీకని పేరిస్ కోడె దూడలని పెంచేవాడు. పందెంలో తన గిత్తని ఎవ్వరి గిత్త ఓడగొడితే వారికి బంగారు కిరీటం బహుమానంగా ఇస్తానని పేరిస్ ఒక సారి సవాలు విసిరేడు. స్వర్గలోకంలో ఉన్న ఆరిస్ (Ares) ఈ సవాలు విన్నాడు. తానే స్వయంగా ఒక గిత్త రూపం దాల్చి పోటీలోకి దిగేడు. యుద్ధాలకి అధినేత అయిన ఆరిస్ ఈ పోటీని అనాయాసంగా గెలిచేడు. పేరిస్ పెద్దమనిషి తరహాలో ఓటమిని అంగీకరించి ఆరిస్ కి బంగారు కిరీటాన్ని బహూకరించేడు. ఈ సంఘటనతో “సత్యసంధుడు, మాట తప్పని పెద్దమనిషి” అని పేరిస్ భూమి మీద, స్వర్గంలోనూ పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నాడు. ఇలాంటి పేరు రావడంతో ఒక అనూహ్యమైన పందేనికి పేరిస్ ఎలా న్యాయనిర్ణేత అయేడో చూద్దాం.

అపస్వరం అనే ఏపిల్ పండు కథ

[మార్చు]

స్వర్గానికి అధినేత జూస్ భార్యలలో ఒకరైన థేమిస్ (Themis) జూస్ కొడుకులలో ఒకడు జూస్ ని పదవీభ్రష్టుడిని చేస్తాడని జోశ్యం చెప్పింది. ఈ జోశ్యం ఇలా ఉండగా జూస్ ఒక రోజు సముద్రపుటొడ్డుకి విహారానికని వెళ్లి, అక్కడ తేటిస్ (Thetis) అనే జలకన్య (nymph)ని చూసి, మనసు పడి, గాంధర్వ విధిని పెళ్లి చేసుకుంటానంటాడు. అప్పుడు తేటిస్ కి పుట్టబోయే కొడుకు తండ్రిని మించిన వాడు అవుతాడు అని మరొకరు (ఒక కథనం ప్రకారం Prometheus) జోశ్యం చెప్పేరు. జూస్ రెండు రెండు కలిపితే నాలుగు అని లెక్క వేసుకుని, పెద్ద ఎత్తున కంగారు పడి, తేటిస్ ని పీలియస్ (Peleus) అనే ముసలి మానవుడికి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి తాంబూలాలు ఇప్పించేసేడు.(ఈ పీలియస్ కొడుకే అక్ఖిల్లిస్ అనే యోధుడు!) విందుకి జూస్ అందరినీ ఆహ్వానించేడు - కలహభోజని అని పేరు తెచ్చుకున్న ఒక్క ఏరీస్ (Eris) ని తప్ప!

తనకి ఈ విధంగా జరిగిన అవమానానికి ఏరీస్ కోపోద్రేకురాలు అయింది. అసహనంతో రగులుతున్న ఏరీస్ అతిధులు బారులు తీర్చి భోజనాలు చేస్తున్న మందిరానికి గాలివానలా దూసుకు వచ్చింది. ఆమె లోపలికి రాకుండా హెర్మీస్ (Hermes) అడ్డగించి అగ్గి మీద గుగ్గిలం జల్లేడు. ఏరీస్ బయట నుండే “ఇదే నా పెండ్లి కానుక” అంటూ ఒక బంగారు ఏపిల్ పండుని అతిథుల మధ్యకి విసిరింది. ఆ బంగారు ఏపిల్ పండు మీద “ఇది ముల్లోకాలలోను అందమైన ఆడదానికి మాత్రమే” అని రాసి ఉంది. ఇంకేముంది. “ఆ పండు నాదే!” అంటూ అక్కడ ఉన్న దేవతలంతా ఎగబడ్డారు. ఆ దొమ్మీలో హేరా, ఎతీనా, ఏఫ్రొడైటి అనే ముగ్గురు దేవతలు ఆ పండుని స్వాధీన పరచుకుందుకి పోటీ పడ్డారు. హేరా సాక్షాత్తు జూస్ భార్య. పైపెచ్చు పట్టమహిషి. ఈమె స్త్రీలకి, వివాహ జీవితాలకి అధినేత్రి. ఎతీనా విద్యలకి అధినేత్రి. ఏఫ్రొడైటి అందాలకి దేవత.

ఈ ముగ్గురిలోను పండు ఎవ్వరికి చెందాలి? ముగ్గురూ దేవతలకి రాజైన జూస్ ని తీర్పు చెప్పమన్నారు! జూస్ కి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది. ఎవరి పక్షాన్న తీర్పు చెబితే ఎవ్వరికి కోపం వస్తుందో! వారిలో ఒకామె తన భార్య కూడా!

“ఈ సమస్యని న్యాయబద్ధంగా పరిష్కరించగలిగే స్థోమత భూలోకంలో ఉన్న ఒక్క పేరిస్ కి తప్ప మరెవ్వరికీలేదు” అంటూ తన కొడుకు హెర్మీస్ ని తోడు ఇచ్చి అందరిని భూలోకంలో ఇడా (Ida) పర్వతం మీద ఉన్న పేరిస్ దగ్గరకి పంపి ఇబ్బంది నుండి తప్పుకున్నాడు జూస్!

సాక్షాత్తు స్వర్గలోకానికి అధిపతి అయిన జూస్ తనయుడు హెర్మీస్ స్వయంగా వచ్చి అడుగుతూ ఉంటే పశువులని కాసుకుంటూన్న పేరిస్ కాదనలేకపోయేడు.

దేవతల ముందు నిలబడి ముగ్గురిని పరకాయించి చూస్తున్నాడు.

దేవతలు ముగ్గురూ ఎలాగో ఒకలాగ పేరిస్ ని మభ్యపెట్టి తీర్పు తమవైపు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.

“నన్ను ఎంపిక చేస్తే నిన్ను ఐరోపాకీ, ఆసియా మైనరుకి చక్రవర్తిని చేస్తాను,” అని ఆశ పెట్టింది హేరా.

ఎతీనా ముందుకి వచ్చి, “నీకు విద్యాబుద్ధులు ప్రసాదిస్తాను. యుద్ధరంగంలో తిరుగులేని అస్త్రాలు ఇస్తాను,” అని ఎర చూపించింది.

చిట్టచివరికి తన కురులని సుగంధం వెదజల్లే పువ్వులతో అలంకరించుకున్న ఏఫ్రోడైటి ముందుకి వచ్చి, “పేరిస్ ! నువ్వు నన్ను ఎన్నుకున్నావంటే నీకు మరపురాని అనుభవాన్ని ప్రసాదిస్తాను. స్త్రీ యొక్క ప్రేమ ఎలా ఉంటుందో చవి చూపిస్తాను. స్పార్టా రాణి హెలెన్ (Helen)ని మించిన అందగత్తె ఈ భూలోకంలో లేదు. ఆమె పొందు నీకు దక్కేలా వరం ఇస్తాను. ఆమె నీ సందిట బందీ అయేలా చేస్తాను. ఏమంటావు?”

హెలెన్ అసాధారణమైన అందగత్తె. ఆమె చేతి కోసం ఎందరో యువకులు ఉవ్విళ్ళూరేవారు. శూరులు, వీరులు, మేథావులు, ఒకరేమిటి? ఎవరిని ఎన్నుకుంటే ఎవరికీ కోపం వస్తుందో? హెలెన్ ని వరించడానికి వచ్చిన యువరాజులందరి దగ్గర మెనలావూస్ (Menelaus) ఒక హామీ తీసుకున్నాడు. భవిష్యత్తులో ఈ కొత్త దంపతులకి ఏ ఆపద వచ్చినా అందరూ సైన్యసమేతంగా వచ్చి హెలెన్ ని రక్షించాలి. అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు హెలెన్ తండ్రి తిందారియస్ స్పార్టా రాజైన మెనలావూస్ ని హెలెన్ భర్తగా ఎంపిక చేసేడు.

ఇలా పెళ్ళి అయిపోయి, కాపురం చేస్తున్న హెలెన్ పేరిస్ ని ప్రేమించేలా చేస్తుంది ఏఫ్రోడైటి. ఈ సంఘటన మహాభారత యుద్ధాన్ని పోలిన మహాసంగ్రామానికి దారి తీసింది. గ్రీకులకి, ట్రాయ్ నగరానికి మధ్య జరిగిన ఈ భీకర పోరాటాన్ని హోమర్ అనే రచయిత తన ఇలియాడ్, ఆడెస్సీ అనే ఉద్గ్రంథాలలో పొందుపరచేడు. ఈ కథలో కొన్ని పాత్రలు భువి నుండి దివికి, దివి నుండి భువికి సునాయాసంగా తిరుగుతూ ఉంటారు. దేవతలు పోటీ పడి, పందెం కట్టి, దాని పర్యవసానంగా భూమి మీద లక్షలాది ప్రజలు నాశనం అవడానికి కారణభూతులు అవుతారు.

మూలాలు

[మార్చు]

వేమూరి వేంకటేశ్వరరావు, "అపస్వరం అనే ఏపిల్ పండు కథ," ఈమాట జాల పత్రిక, మే 2020, https://web.archive.org/web/20200510215803/https://eemaata.com/

"https://te.wikipedia.org/w/index.php?title=పేరిస్&oldid=3271100" నుండి వెలికితీశారు