పొట్లూరి వీరరాఘవయ్య చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పొట్లూరి వీరరాఘవయ్య చౌదరి (1892 - 1942) మృదంగ విద్వాంసుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర గల, పెదపారుపూడి మండలంలోని జమిదింటకుర్రు గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుండి గ్రామ దేవాలయం నందు జరుగు భజన గానములకు వెళ్ళుచుండేవాడు. ఆ సమయం నందు అతనికి మృదంగ వాద్యమునందు అభిరుచి కలిగి ఎలాగైనా నేర్చుకోవాలని ధృఢ నిశ్చయం చేసుకొనెను. కొంతవరకు ఆ గ్రామమునందే ఒక మార్దంగికుని వద్ద నేర్చుకొన్నాడు. తరువాత ఆ కాలంలో పేరొందిన మార్దాంగికాచార్యుడు బందరు నివాసి అయిన "మార్దంగి కాచార్య" అశ్వధాటి రామమూర్తి గారిని ఆశ్రయించి గురుభక్తితో గురువుకు శుశ్రూష చేసి మృదంగ వాద్యమునందు నైపుణ్యమును సంపాదించాడు. తనకు 25 సంవత్సరములు వయస్సు వచ్చేసరికే వారు పేరొందిన గాయకులకు ప్రక్క వాద్యకారునిగా మృదంగం వాయించినాడు. ఇంకనూ నేర్చుకొనదలచి రామమూర్తి గారి వద్ద అనుమతి పొంది దక్షిణ దేశానికి తరలి పోయాడు. పుదుక్కోట పట్టణంలో సంగీత విద్వాంసులచే నందీశ్వర అవతారముగా పరిగణింపబడుతున్న పుదుక్కోట దక్షిణామూర్తి పిళ్ళై ను ఆశ్రయించాడు. సుమారు నాలుగు సంవత్సరాలు అతని వద్ద శిక్షణ పొంది పరిపూర్ణ పాండిత్యమును గడించెను. తరువాత స్వంత ప్రాంతానికి వచ్చి ప్రప్రథమముగా కాకినాడలో కళా పోషకులు "దివాన్ బహద్దూర్" కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తినాయుడుచే నిర్వహించబడుతున్న శ్రీ సరస్వతి గానసభ యందు మహా విద్వాంసులైన నైనా పిళ్లై కచేరీకి గోవిందస్వామి పిళ్లై ఫిడేలు, సుందరం అయ్యరు ఘటం, సీతారామయ్య మోర్సింగు, పుదుక్కోట దక్షిణామూర్తి పిళ్లై కంజీరా వాద్యములతో పాటు వీరరాఘవయ్య చౌదరి మృదంగం అత్యంత నైపుణ్యముతో వాయించి ప్రజల, విద్వాంసుల మన్ననలను పొందాడు.

అతను జీవించి ఉన్నంత వరకు శ్రీ సరస్వతీ గానసభ యందు ప్రతి సంవత్సరము కచేరీలకు మృదంగము, కంజిరా వాయించేవాడు. చౌదరి దేశం నలుమూలల అనేక గానసభలలో గాయకులకు ప్రక్క వాయిద్యము వాయించాడు. కొన్ని సమయాలలో ఒక కచేరీలో చౌదరి కంజిరా, వారి ప్రథమ గురువులైన అశ్వధాటి రామమూర్తి మృదంగం వాయించుట కూడా జరుగు చుండెడిది.

ప్రత్యేకత

[మార్చు]

కచేరీలందు గాయకునితో మృదంగముపై ననుసరించుటలో అతనికతనే సాటి. పాటను పోషించుటలో నాదానుభవం, గంభీరత్వము, సున్నితము అక్కడి కక్కడె ముక్తాయి పంపకము చాలా వివరణగా ఉండేవి.పల్లవికి వాయించుటలో వారు సిద్ధహస్తులు. ఎంత క్లిష్టమైన పల్లవినైనా అతను సునాయాసంగా వాయించేవాడు. అతను కచేరీలలో వాయించుట మొదలు పెట్టినప్పటి నుండి ప్రతీ కచేరీలో మార్దంగికునికి కూడా తన వాద్యమునకు అవకాశమిచ్చి గౌరవించుట మొదలైనది. అతను అనేక సువర్ణ పతకాలను మార్దంగికాగ్రేసర గౌరవం పొందాడు. వీరి శిష్యులలో మహదేవు రాధాకృష్ణరాజు, నర్రా గోపాలకృష్ణయ్య మొదలైన వారున్నారు.

అతను 1942 నవంబరు 10వ తేదీన విజయవాడ పట్టణమందు తన స్వగృహంలో మరణించెను. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1]

మూలాలు

[మార్చు]
  1. మృదంగ బోధిని, మహాదేవు రాధాకృష్ణరాజు, ప్రభుత్వ సంగీత కళాశాల, విజయవాడ, 1976 త్రివేణీ ప్రెస్, మచిలీపట్నం