ప్రాచీన తెలుగు కవుల కవితా తత్త్వము
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ప్రాచీన తెలుగు కవులు-కవిత్వ తత్వము
తెలుగు సాహిత్యానుశీలనకు విమర్శ సిద్ధాంతాలుగా ఇంతవరకు సంస్కృతాలంకారికుల సిద్ధాంతాలే ఆధారమయ్యాయి. కావ్యాన్ని, కవిత్వ తత్వాన్ని, కావ్య హేతువులను, కావ్య ప్రయోజనాలను సంస్కృతాలంకారికుల దృష్టితోనే పరిశిలించే దశ ఇప్పుడు కూడా ఉంది. దీనికి కారణం తెలుగులో సమగ్రమైన కావ్య తత్వ శాస్త్రాలు లేకపోవడమే. ప్రసిద్దులైన తెలుగు సాహిత్య విమర్శకులు కూడా సంస్కృత లక్షణ గ్రంథాలమీదే ఆధారపడి విమర్శ సిద్దాంతాలను వెలయించారు. దీనికి కారణం దాదాపుగా ఆధునిక యుగం వచ్చే వరకు తెలుగు సాహిత్యం సంస్కృత సాహిత్యం మీదనే ఆధారపడి ఉండడమే. ప్రతి కావ్యము మార్గ రీతిలో రచింపబడడమే. సంస్కృత భాషా సాహిత్యాలు తెలుగు భాషా సాహిత్యాలపైన గాఢమైన ప్రభావాన్ని చూపడమే.
తెలుగు కవులు తమ కావ్య అవతారికలలో తమ కవిత్వాన్ని గురించి వివరించే దశలో కొన్ని సిద్ధాంతాలను చేశారు. వీటిని సమగ్రంగా పరిశిలించి తెలుగు కవుల కవిత్వ తత్వాన్ని గురించిన సిద్ధాంతాలను వివరించడమే ఈ వ్యాస ఉద్దేశం.
నన్నయ
[మార్చు]ప్రాచీన కవులలో ఆదికవి నన్నయ తన కవిత్వ తత్వాన్ని వివరిస్తూ
సారమతిన్ గవీంద్రులు ప్రసన్న కథా కలితర్థ యుక్తి లో
నారసి మేలునానితరులక్షర రమ్యత నాదరింప నా
నారుచిరార్థ సూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారత సం హితా రచన భందురుడయ్యె జగద్దితంబుగన్
అని అవతారికలో పేర్కొన్నాడు. ఈ పద్యం నన్నయ కవిత్వ తత్వాన్ని తెలుపుతుంది.
నన్నయ దృష్టిలో రెండు వర్గాలవారున్నారు. ఒకటి పండిత వర్గం. వీరిని నన్నయ కవీంద్రులు అన్నాడు. తెలుగులో నన్నయ ఆదికవి అయినప్పుడు ఈ కవీంద్రులు సంస్కృత కవులు. అందువల్లనే పండిత వర్గం. వీరు దేశ భాషలో రచింపబడిన తెలుగు భారతాన్ని అంగీకరించే స్థితిలో లేరు. దైవ భాషలో రచింపబడిన భారతానువాదం చేయడమే దుస్సాహసం. ఈ సాహసాన్ని ప్రదర్శించే నేపథ్యంలో ముందుగా సంస్కృత కవులను ఆకర్షించడమే నన్నయ ముందున్న లక్ష్యం. వీరు కవిత్వాన్ని లోనారసి పరిశీలిస్తారు. కథా గమనం, కథా గమనంలోని అర్థ యుక్తి వీరికి అవసరం. అందువల్లనే వీరి కోసం ప్రసన్న కథా కలితార్థ యుక్తితో రచించాడు.
రెండవ వర్గం ఇతరులు. నన్నయ దృష్టిలో ఇతరులంటే ఎవరు? ఇప్పటి దాకా పామరులు అనుకుంటున్నాము. కానీ నన్నయ దృష్టిలో పామరులు కాదు. సంస్కృత కవేతరులు. అంటే తెలుగు వారు. సంస్కృత కవీంద్రులు కథకలితార్థ యుక్తితో లోనారసి మేలు అంటే, తెలుగు పాఠకులు తెలుగు భారతంలోని అక్షర రమ్యతను ఆదరిస్తారు.
రుచిరార్థ సూక్తి నిధి నన్నయ. అంటే కవి అనేకమైన అర్థ వంతమైన లోక రీతులను, నీతులను వివరించాల్సి ఉంటుంది. ఇది నన్నయ దృష్టిలో కవికి ఉండాల్సిన లక్షణం.
కవిత్వ ప్రయోజనం జగద్ధితము. సంస్కృతాలంకారికులు చెప్పిన "విశ్వశ్రేయ కావ్యం" అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నన్నయ మహాభారతాన్ని జగద్ధితం కోసం వ్రాస్తున్నానన్నాడు. కావ్యానికి ప్రయోజనం నన్నయ దృష్టిలో ఉపదేశమే. మహాభారత రచన ఉదేశం కూడా వైదిక మతోద్దరణమే. ఇదే ఆకాలమునాటికి అవసరమైంది కూడా. అందువల్లనే వైదిక మతోద్దరణ పరమ ప్రయోజనంగా నన్నయ భారతాన్ని అనువదించాడు.
నన్నయ సంస్కృతాలంకారికులు చెప్పిన " ఇతివృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితం" అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కథ గమనానికే ప్రాధాన్యత నిచ్చాడు. అందువల్లనే నన్నయది కథా కథన శైలి. ఇతి వృత్తనిర్మాణము వైపే నన్నయ దృష్టి. ప్రాచీనాలంకారికులు చెప్పిన " శబ్ధార్థౌ సహితౌ కావ్యం" అన్న విషయాన్ని కూడా నన్నయ అంగీకరించి నట్టు కనిపిస్తుంది.
- ప్రసన్న కథా కలితార్థ యుక్తి - అర్థానికి సంబంధించిన లక్షణం.
- అక్షర రమ్యత - శబ్ధానికి సంబంధించిన లక్షణం.
తిక్కన
[మార్చు]తిక్కన రసవాది. "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న సిద్ధాంతాన్ని తిక్కన అంగీకరించినట్లు కనిపిస్తుంది. అందువల్లనే "నానా రసాభ్యుదయోల్లాసి" అన్నాడు. ఈ రసాభ్యుదయోల్లాసము సంస్కృత కవులకు. మరి తెలుగు జనానికి ఆనదం కలిగించే అలతి అలతి పదముల అనల్పార్థ రచన. అందువల్లనే తాను "ఉభయ కవిమిత్రుడు" అనిపించుకున్నాడు. ఇక్కడ ఉభయ కవులు అంటే మార్గ, దేశి కవులు అని అర్థం. తిక్కన రస వాది కబట్టే కథా కథనానికి కాకుండా సంభాషణాత్మకతకు ప్రాధాన్యమిచ్చాడు. నాటకీయ శైలిని పాటించాడు. తిక్కన దృష్టిలో కావ్యానికి పరమప్రయోజనం " ఆనందమే". అందువల్లనే " అంధ్రావళి మోదమున్ బొరయునట్లుగా" అన్నాడు. రసం ఆనంద కారకం. రసవాది కావున కావ్యం ఆనందాన్ని కలిగించాలన్నది తిక్కన మతం. ఇతనిని కవిబ్రహ్మ అని కూడా అంటారు. బ్రహ్మ అంటే సృష్టి కర్త అని అర్దం అయితే ఇతని కంటే ముందే తెలుగు కవులు ఉన్నప్పటికి తెలుగుకు ఒక రూపము ఇచ్చిన వాడు తిక్కన.
పోతన
[మార్చు]పోతన తెలుగులో భాగవత రచన తన పూర్వజన్మ సుకృతమని, దీనిని తెలుగు జేసి జన్మ రాహిత్యాన్ని పొందుతానన్నాడు. ప్రాచీన సంస్కృతాలంకారికులు చెప్పిన " చతుర్వర్గ ప్రాప్తి", "సద్య పరనిర్వృత్తి" పోతన కావ్యానికి ఉండాల్సిన పరమ ప్రయోజనాలుగా చాటి చెప్పాడు. అందువల్లనే అపారమైన భక్తి ఆవేశంలో ఎడతెరపిలేకుండా భగవన్నామ స్మరణ చేశాడు. మందార మకరందాలను తెలుగు వారికి అందించాడు. తాను ధన్యుడు కావడమే కాకుండా తెలుగు సమాజాన్ని భక్తి సముద్రంలో ఓలలాడించి పునీతులను చేశాడు.
నవవిధ భక్తి మార్గాలను ప్రబోధించి పురుషార్థ సాధనే కావ్య రచన, పఠన ప్రయోజనమని చాటి చెప్పాడు. "నే పలికిన భవ హరమగునట" అనడంలో ఇదే ఉద్దేశము.
పలికెడిది భాగవతమట
పలికెంచెడువాడు రామ భద్రుండట, నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాధ పలుకగనేలా
- అని మోక్ష సాధనే కవిత్వ పరమప్రయోజనమని చాటి చెప్పాడు.
శ్రీనాధుడు
[మార్చు]శ్రీనాధుడు తెలుగు కవిత్వానికి ఒక విశిష్టతను ఆపాదించినవాడు. కవిత్వమంటే ఎట్లా వుండాలో చెప్పినవాడు. ప్రాచీన అలంకారికులు చెప్పిన వక్రతకు శ్రీనాధుడు ప్రాధాన్యమిచ్చాడు.
హరచూడా హరిణాంక వక్రతయు కాలాంతస్ఫురచ్చండికా
పరుషోద్గాఢ పయోధర స్ఫుట తటీ పర్యంత కాఠిన్యమున్
సరసత్వంబును సంభవించెననగా సత్కావ్యముల్ దిక్కులన్
చిరకాలంబు నటించుచుండు కవిరాజీగేహ రంగంబులన్
- సత్కావ్యములు ఉండాలని శ్రీనాధుడి అభిప్రాయము. కుంతకుని వక్రోక్తి శ్రీనాధుడు గ్రహించాడు. కావ్యానికి ప్రధానమైనది వక్రతయే. తరువాతది కాఠిన్యము. ఇది భాషా సంభంధమైనది. వక్రత భావ సంభంధమైనది. సరసత్వము రస సంబంధి. శబ్ధ, భావ, రసాత్మకతలు మూడింటికి శ్రీనాధుడు ప్రాధాన్యమిచ్చాడు. ప్రళయకాలమునందు కాళికా దేవి యొక్క పరుషమైన గాఢమైన స్తనములపై స్ఫుటమైన మొనల వంటి కాఠిన్యముండాలని శ్రీనాధుని అభిప్రాయము. శ్రీనాధుని దృష్టిలో వక్రత కావ్యానికి ప్రాణము. రసము తదనుయాయి.
ప్రబంధ కవులు
[మార్చు]ప్రభంధ కవులు లోకోత్తరమైన వర్ణణా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇది ప్రతిభకు సంబంధించింది. శ్రీనాధుని కాఠిన్యాన్ని పుణికి పుచ్చుకుని శృంగార భూయిష్ఠమైన రచనలు చేశారు. అల్లిక జిగిబిగితో, ముద్దుముద్దు పలుకులతో, పదగుంఫనాలతో, అనన్య కల్పనా చాతుర్యముతో, మధుర భక్తి ఆవేశముతో ప్రభంధాలను రచించారు. వీరి దృష్టిలో కావ్యము అంటే వర్ణనలే. కథా ప్రాధాన్యత తక్కువ. కొందరు ఇతివృత్తంలో ప్రఖ్యాతమైన వానిని గ్రహించగా పింగళి సూరన వంటివారు కల్పనకు ప్రాధాన్యత నిచ్చారు. స్థూలంగా ప్రసిద్ధ ప్రాచీనకవులు తమ తమ కావ్యావతారికలలో తమ కవిత తత్వాన్ని గురించి వివరిస్తూనే కావ్య గత అంశాల గురించి చర్చించారు. కొందరు ఇతివృత్తానికి ప్రాధాన్యతనిస్తే, మరికొందరు రసవాదాన్ని సమర్థించారు. కొందరు వక్రోక్తి కావ్యాత్మ అని భావిస్తే మరికొందరు రసము కావ్యాత్మగ నిర్ణయించారు. సమగ్రమైన పరిశోధన చేసి తెలుగు సాహిత్యానికి సంబంధించిన అలంకార శాస్త్రాన్ని వెలయించాల్సిన బాధ్యత విమర్శకుల మీద ఉంది.