Jump to content

ప్రాథమిక విద్య - సమస్యలు - పరిష్కారాలు

వికీపీడియా నుండి
                                                                                  మనదేశంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. తల్లిదండ్రులందరూ పిల్లలను తమ స్థాయికి తగ్గ పాఠశాలలో చేర్పిస్తున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య అనేక హంగులతో హంగామా చేస్తోంటే... సర్కారు బడుల్లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతోంది. అటు పాలక ప్రభుత్వాలు మాత్రం ప్రాథమిక విద్యకు పెద్దపీట వేస్తున్నామంటూ పలు పథకాల పేరిట కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నా పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి. కారణం లోపభూయిష్ట విధానాలు, ఆచరణలో ఎడతెగని నిర్లక్ష్యమే. దీన్ని అధిగమించాలంటే సమర్థనీయ సంస్కరణలే శరణ్యమని తెలిపే వ్యాసం ఈ వారం ప్రత్యేకం.

పాఠశాల విద్య- అక్షరాస్యత:

ఇటీవల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు విద్యా ప్రమాణాల అందుబాటుకు సంబంధించి ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. పనిచేసే జనాభా మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (25 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న జనాభా ఎన్నేళ్లు విద్యను పూర్తి చేశారో వాటి సగటునే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటారు) 2000 సంవత్సరంలో 4.19 సంవత్సరాలు. అదే 2010 సంవత్సరంలో 5.12 సంవత్సరాలకు పెరిగింది. ప్రాథమిక విద్యలో విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) నిష్పత్తిలోనూ గణనీయమైన పెరుగుదల కనిపించింది. సెకండరీ విద్యలో విద్యార్థుల నమోదు వృద్ధి 1990వ దశకంలో సగటు 4.3 శాతం కాగా 2009-10 నాటికి 6.27 శాతానికి పెరిగింది. యువకులలో అక్షరాస్యత 1983లో 60 శాతం ఉంటే 2009-10లో 91 శాతానికి పెరిగింది. వయోజనుల విషయానికొస్తే 2001లో 64.8 శాతం ఉన్న అక్షరాస్యత 2011 నాటికి 74 శాతానికి పెరిగింది.

ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నా: జాతీయాభివృద్ధిలో విద్యారంగ ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం 12వ పంచవర్ష ప్రణాళిక (2012-2017)లో విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాల పెంపు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ఈ రంగంలో సమాన అవకాశాల కల్పనకు ప్రాధాన్యమిచ్చింది. ఈ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయాన్ని 11వ పంచవర్ష ప్రణాళికలో రూ.12,44,797 కోట్లుగా అంచనా వేశారు. ఈ మొత్తంలో 35 శాతం ప్రణాళికా వ్యయం కాగా మిగిలిన 65 శాతం ప్రణాళికేతర వ్యయం. విద్యకు సంబంధించి మొత్తం ప్రభుత్వ వ్యయంలో 43 శాతం ప్రాథమిక విద్యపై 25 శాతం సెకండరీ విద్యపై, మిగతా 32 శాతం ఉన్నతవిద్యపై వెచ్చించారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగం పై చేసిన ఖర్చులో ప్రాథమిక విద్యపై 39 శాతం, సెకండరీ విద్యపై 12శాతం, ఉన్నత విద్యపై 50శాతం కేటాయించా యి. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే.. పాఠశాల విద్య 75శాతం వాటా కలిగి ఉంది. ఇందులో ప్రాథమిక విద్య వాటా 44 శాతం కాగా, సెకండరీ విద్య వాటా 30 శాతం.

పాథమిక విద్యారంగం-సమస్యలు, అనుభవాలు:

  11వ పంచవర్ష ప్రణాళికలో అనేక రంగాలలో ఆశించిన మేర విజయాలు సాధించిన భారత ఆర్థిక వ్యవస్థ విద్యారంగంలో మాత్రం పలు సవాళ్లను ఎదుర్కొంది. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలతో పోల్చినపుడు భారత్‌లో మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (ఎం.వై.ఎస్.) తక్కువ స్థాయిలో ఉంది. పొరుగు దేశమైన చైనా మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్‌లో మన కంటే ఎంతో ముందంజలో ఉంది. ఆ దేశంలో 8.17 సంవత్సరాలు కాగా, బ్రెజిల్‌లో 7.54 సంవత్సరాలు. ఇక మన దేశం విషయానికి వస్తే 5.12 సంవత్సరాలు గానే నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు కన్నా (7.09 సంవత్సరాలు) భారత్‌లో మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ తక్కువే అని చెప్పవచ్చు. ప్రాథమిక విద్య తర్వాత విద్యార్థులలో డ్రాపౌట్ (మధ్యలో చదువును ఆపినవారు) రేటును భారత్‌లో ఎక్కువ గమనించవచ్చు. ప్రాథమిక విద్య, హయ్యర్ సెకండరీ విద్య మధ్య నమోదు నిష్పత్తిలో అంతరం మనదేశంలో చాలా తక్కువ. జాతీయ సగటు కన్నా ఎస్సీలు, ఎస్టీ తెగల విద్యార్థులలో డ్రాపౌట్ రేటు ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు.
     ప్రాథమిక విద్యలో బడిలో నమోదైన పిల్లల నిష్పత్తిలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ,విద్యార్థుల హాజరుకు సం బంధించి వివిధ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు పెరిగాయి. విద్యాపరంగా వెనుకబడిన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లలో విద్యార్థుల హాజరురేటు 60 శాతం కన్నా తక్కువగా నమోదవుతున్నది.
  ప్రాథమిక విద్యలో గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయ లభ్యతలో పురోగతి కనిపిస్తోంది. సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపుల కారణంగా జాతీయస్థాయిలో విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి 27ః1 కు చేరుకుంది. మరోవైపు విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో వివిధ రాష్ట్రాలలో వ్యత్యాసాలు పెరిగాయి. సరైన శిక్షణలేని ఉపాధ్యాయుల సంఖ్య బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో 8.1 లక్షలుగా ఉన్నారని అంచనా.
  ప్రాథమిక విద్యలో విద్యార్థుల అభ్యసన స్థాయి తక్కువగా ఉండటం ప్రస్తుతం ఒక సవాల్‌గా మారింది. అదే తరగతి స్థాయికి సంబంధించి ఇతర దేశాల విద్యార్థుల అభ్యసన స్థాయి కన్నా భారత విద్యార్థుల అభ్యసన స్థాయి తక్కువగా ఉంది. విద్యారంగ పరంగా అన్ని స్థాయిలలో నమోదులో పెరుగుదల, భౌతిక అవస్థాపనా సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ, బలహీనమైన సాంప్రదాయ విద్య ద్వారా ఆశించిన ప్రయోజనాలు సమకూరడం లేదు.
  11వ పంచవర్ష ప్రణాళికలో ప్రాథమిక విద్యలో డ్రాపౌట్ రేటును 50 నుంచి 20 శాతానికి తగ్గించాలని లక్ష్యం. ఈ విషయంలో కొంతమేర పురోగతి సాధించినప్పటికీ జాతీయ సగటు డ్రాపౌట్ రేటు 42.39 శాతంగా నిలవడం ఆందోళన కలిగించే పరిణామం. ఎస్సీ, ఎస్టీయేతర విద్యార్థులలో డ్రాపౌట్ రేటు 37.22 శాతం కాగా ఎస్సీ విద్యార్థులలో 51.25 శాతం, ఎస్టీ విద్యార్థులలో 57.58 శాతంగా నమోదు కావడాన్ని బట్టి వివిధ సామాజిక వర్గాల విద్యార్థులలో డ్రాపౌట్ రేటు వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.
  పదకొండో పంచవర్ష ప్రణాళికలో ప్రాథమిక విద్యా వ్యాప్తికి సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం అమలుతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలైన మధ్యాహ్న భోజన పథకం, ఉపాధ్యాయ విద్యా పథకం (టీచర్ ఎడ్యుకేషన్ స్కీమ్), మహిళా సమాఖ్య, మైనారిటీ విద్యాసంస్థలలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి, మదర్సాలలో నాణ్యత గల విద్య అందించడం లాంటి పథకాలను అమలుచేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రాథమిక స్థాయిలో పిల్లల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) జరగటం లేదు, విద్యా నాణ్యతలో రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య, వివిధ సామాజిక వర్గాల మధ్య అంతరాలు పెరిగాయి.

ప్రాథమిక విద్య - ఆంధ్రప్రదేశ్:

                            భారత్‌లోని ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు అక్షరాస్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సంతృప్తికరంగా లేదనే చెప్పాలి. గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు, స్త్రీ-పురుష అసమానతలు ఇప్పటికీ ఉన్నాయి. తల్లిదండ్రులలో తక్కువ అక్షరాస్యతా స్థాయి, పేదరికం, అందుబాటు లో లేని పాఠశాలలు, మృగ్యమైన మౌలిక సౌకర్యాల కల్పన పర్యవసానం అక్షరాస్యత విషయంలో ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుకు కారణం. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు కేటాయింపు తక్కువగా ఉంది. 1995 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యలో ఏ విధమైన మార్పునూ పాలక ప్రభుత్వాలు తీసుకురాలేదు. 1996లో ప్రాథమిక విద్యను ఒక కార్యక్రమంగా డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (డిపెప్) ప్రవేశపెట్టడం ద్వారా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. 1996లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేశారు. పాఠశాల వ్యవస్థలో సామాజిక యాజమాన్య ప్రక్రియ ద్వారా ప్రాథమిక విద్యను సార్వత్రికం చేసే క్రతువులో భాగం గా సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేశారు. బాలికలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల్లో విద్యావ్యాప్తికి ఈ పథకం చేయూతనిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మొదటగా  ఉభయ గోదావరిజిల్లాలలో ప్రవేశపెట్టి 2002-03 నాటికి ఇతర జిల్లాలకు విస్తరించారు. ప్రాథమిక విద్యా వ్యాప్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ (ఓబీబీ), చదువుల పండగ,మళ్లీ బడికి, మధ్యాహ్న భోజన పథ కం లాంటి కార్యక్రమాలను అమలు పరిచింది. 2005లో వి ద్యార్థుల్లో భాషాభివృద్ధి కార్యక్రమం(ఛైల్డ్ లాంగ్వేజ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్-క్లిప్),2009లో ఎల్‌ఈపీ కార్యక్రమాన్ని ప్రాథమిక విద్యా బోధనలో భాగంగా ప్రవేశపెట్టారు.

2010లో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు స్నేహబాల కార్డులను ప్రవేశపెట్టారు. ఈ కార్డులను ఉపయోగిస్తూ ఉపాధ్యాయులు ఆయా తరగతుల విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించుకోవడం ద్వారా ప్రాథమిక విద్యలో సంతృప్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 2011లో ఒకటో తరగతి విద్యార్థులకు ద్వితీయ భాషగా ఆంగ్లంను ప్రవేశపెట్టారు. ఇలా అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రాథమిక విద్యాభివృద్ధికి సర్కారు సకల చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు నిష్పత్తి తక్కువ గానే ఉంది. మూల్యాంకనా ప్రమాణాలు సక్రమంగా లేకపోవడం, పాఠశాలలోని పిల్లలకు భద్రతా సౌకర్యాల కొరత, ప్రైవేటు విద్యాసంస్థలలో అధిక ఫీజుల వసూలు, పరీక్షా విధానంలో లోపాలు, లింగ వివక్ష, బాలికల విద్య పట్ల అశ్రద్ధ, విద్యారంగంపై ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉండటం, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి సరిగా లేకపోవడం, ఇప్పటికీ వీడని డ్రాపౌట్ రేటు.... ఇలా మన రాష్ట్రంలోని ప్రాథమిక విద్యను పలు సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఇదే తరుణంలో ప్రైవేటు పాఠశాలలు అధికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో విస్తరిస్తున్నాయి.

పాథమిక విద్య పరిఢవిల్లాలంటే:

  ప్రాథమిక విద్యావ్యవస్థ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. అవి
      రెండు, మూడో తరగతి పూర్తయ్యేలోపు పాఠశాలలో చేరిన విద్యార్థికి ప్రాథమిక అంశాల పట్ల అవగాహన పెంపొందించాలి.
      మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులలో హయ్యర్ గ్రేడ్ సాధించలేని వారిని గుర్తించి అవసరమైన సామర్థ్యాలను పెంపొందించాలి.
  ధనిక, పేద వర్గాలు అనే తేడాలేకుండా అందరు చిన్నారులూ ప్రాథమికవిద్యను సర్కారు బడుల్లోనే విధిగా పూర్తి చేయాలి. ఇందుకు గాను 1 నుంచి 7వ తరగతి వరకు ప్రైవేటు విద్యాసంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే నిర్వహించేలా బాధ్యత తీసుకోవాలి. దీన్ని కచ్చితంగా అమలు చేస్తే మన ప్రాథమిక విద్య ప్రపంచానికే ఆదర్శవంతమవుతుంది.
  విద్యా నాణ్యత పెంపొందించే విషయంలో కింది అంశాలపై దృష్టి సారించాలి.
      పాఠ్య ప్రణాళిక, అభ్యసన లక్ష్యాలు (కరిక్యులమ్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్)
      బోధనాభ్యసన పరికరాలు (లెర్నింగ్ మెటీరియల్స్)
      తరగతి గదులలో ఉపాధ్యాయుని మద్దతు
      పాఠశాల నాయకత్వం, నిర్వహణ అభివృద్ధి (స్కూల్ లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్)
  ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటు చేసే విషయంలో సామాజిక, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం.
  మహిళా ఉపాధ్యాయులను అధికంగా నియమించడం, పాఠశాలలో విద్యార్థినుల నమోదు నిష్పత్తిని పెంచడం
  ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే పటిష్టమైన వ్యవస్థాగత ఏర్పాటు అవసరం.

ఇ వ్యాసం డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్ గారి చేత వ్రాయబడింది

[1]


మూలాలు

[మార్చు]
  1. http://www.sakshieducation.com/CA/GTStory.aspx?nid=69742&cid=1&sid=180&chid=653&tid=0[permanent dead link]