ప్రేమలేఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీవారికి ప్రేమలేఖ

ప్రేమలేఖ పొత్తూరి విజయలక్ష్మి రచించిన నవల. దీని ఆధారంగా 1984లో ఉషాకిరణ్ మూవీస్ వారి తొలి సినిమా 'శ్రీవారికి ప్రేమలేఖ' నిర్మించబడింది.

సంక్షిప్త కథ[మార్చు]

స్వర్ణలత అనే ఓ అమ్మాయి మనసు పెట్టి ఓ ప్రేమలేఖ రాసి, సోనీ అని సంతకం చేసి, కొంచం ఆకతాయి తనంగా దానిని చేతికొచ్చిన అడ్రస్ రాసి పోస్టు చేసేస్తుంది. ఆ ఉత్తరం చేతులు మారి మారి ఆనందరావు అనే మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారి చేతిలో పడడమూ, ఉత్తరం చదివి అతగాడు సోనీతో పీకల్లోతు ప్రేమలో పడిపోవడమూ మిగిలిన కథ.

ప్రధాన పాత్రలవే కాదు, మిగిలిన ఏ ఒక్క పాత్రకీ కూడా పేరునీ, మేనరిజాన్నీ మార్చలేదు జంధ్యాల. ఆనందరావు తండ్రి పరంధామయ్య ముక్కోపి. తల్లి మాణిక్యాంబ పరమ సాత్వికురాలు. అన్నగారు బాబీగా పిలవబడే భాస్కర రావుకి పేకాట పిచ్చి. అతని భార్య అన్నపూర్ణకి సినిమాలు చూడడం ఎంత ఇష్టమో, వాటిని శ్రీకారం నుంచి శుభం కార్డువరకూ భర్తకి వర్ణించి వర్ణించి చెప్పడం అంతకన్నా ఇష్టం. ఆనందరావు అక్క కామేశ్వరి, మేనమామ సూర్యంగా పిలవబడే సూర్య నారాయణ మూర్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. పుట్టింటి వాళ్ళు తన భర్తకి అల్లుడి మర్యాదలు సరిగ్గా చేయడం లేదన్నది ఆవిడ ఫిర్యాదు.

ఇక, కథానాయిక స్వర్ణలతని వాళ్ళ నాన్నగారు బాగా చదువు చెప్పించి ఇందిరాగాంధీ అంతటి దాన్ని చేద్దాం అనుకుంటారు. కూతుర్ని కనీసం జిల్లా కలక్టర్ గా అయినా చూడాలి అన్నది ఆయన కోరిక. చదువుకోడం అన్నది స్వర్ణకి బొత్తిగా సరిపడని వ్యవహారం. సినిమాలన్నా, నవలలన్నా ప్రాణం. కాబోయే వాడికోసం కలలు కంటూ ఉంటుంది. "నాన్నారూ, మీరింక సంబంధాలు చూడ్డం మొదలు పెట్టచ్చండీ! నాకు చదువు మీద ఇంట్రస్టు తగ్గిపోయింది" అని చెబుదాం అనుకుంటుంది కానీ, సిగ్గు మొహమాటం అడ్డొస్తాయి. "అసలు దానికి చదువు మీద దృష్టి లేదు. ఎంతసేపూ నవలలు చదవడం, సినిమాలు చూడ్డం, మంచం మీద బోర్లా పడుకుని గాడిదలాగా కబుర్లు చెప్పడం. ఏమన్నా అంటే నోరు పెట్టుకు పడిపోతుంది. వినయం విధేయత బొత్తిగా లేవు," ఇది వాళ్ళమ్మ గారి గోడు.

సోనీ ప్రేమలో మునిగితేలుతున్న ఆనందరావు పెళ్ళిచూపులకి వెళ్ళడానికి ఇష్ట పడక పోవడంతో, సూర్యం, కామేశ్వరి, బాబీ, అన్నపూర్ణ కలిసి బయలుదేరతారు, స్వర్ణని చూసి రాడానికి. బాబీని చూసిన స్వర్ణకి 'అగ్ని పరీక్ష' నవలలో విష్ణు వర్ధన్ గుర్తొస్తాడు. సూర్యాన్ని చూసి 'అపస్వరం' నవలలో శ్యామూ లాగా ఉన్నాడని అనుకుంటుంది. ఇక అన్నపూర్ణకైతే, స్వర్ణ 'శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్' లో జయప్రద లాగా కనిపిస్తుంది. తిరుగు ప్రయాణంలో బాబీకి ఆ సినిమా కథ మొత్తం చెప్పేస్తుంది కూడా. బాబీ స్నేహితులు 'మార్గదర్శి', 'హార్మనీ పెట్టె', 'కళ్ళజోడు' ల పేకాట ప్రహసనం సరేసరి.

మూలాలు[మార్చు]

  • శ్రీ రిషిక పబ్లికేషన్స్ ప్రచురణ. పేజీలు 142, వెల రూ.80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రేమలేఖ&oldid=3296923" నుండి వెలికితీశారు