పొత్తూరి విజయలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొత్తూరి విజయలక్ష్మి
జననం (1953-07-18) 1953 జూలై 18 (వయసు 70)
వృత్తిరచయిత్రి
జీవిత భాగస్వామిపీ.వీ. శివరావు
పిల్లలు
  • శిరీష
  • ప్రవీణ్ కుమార్
తల్లిదండ్రులు
  • వల్లూరి వెంకటకృష్ణమూర్తి (తండ్రి)
  • వల్లూరి సత్యవాణి (తల్లి)

పొత్తూరి విజయలక్ష్మి ప్రముఖ కథా రచయిత్రి. ఈవిడ హాస్య కథలకు, నవలలకూ ప్రసిద్ధురాలు.

బాల్యం

[మార్చు]

ఈమె జూలై 18, 1953న గుంటూరు జిల్లా యాజలి గ్రామంలో జన్మించారు. వల్లూరి సత్యవాణి, వల్లూరి వెంకటకృష్ణమూర్తి ఈమె తల్లిదండ్రులు.

కుటుంబం

[మార్చు]

పీ.వీ. శివరావు తో ఈమె వివాహం 1970లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు శిరీష, ప్రవీణ్ కుమార్.

ఈమె 1982లో రాయటం మొదలు పెట్టారు. మొదటి నవల ప్రేమలేఖ. ఇది శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాగా తీయబడింది. ఈమె మొత్తం మీద 200 కథలు, 14 నవలలు, 3 సినిమాలు, 2 టీవీ సీరియల్స్ రూపొందించారు. ఈమె రచనలు రేడియోలో నాటికలుగా ప్రసారమయ్యాయి. ఈమె రాసిన హాస్య కథలు "పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు, మా ఇంటి రామాయణం, చంద్ర హారం, అందమె ఆనందం" అనే హాస్యకథా సంపుటాలుగా వెలువడ్డాయి.


నవలతో పాఠక లోకానికి పరిచయమైన విజయలక్ష్మి తన కథలతో పాఠకులకు చేరువై, మన్నన పొందారు. చక్కని కథా వస్తువు, సునిశిత హాస్యం, కొంత వ్యంగ్యం, మోతాదు మించని రచనా శైలి పాఠకులను ఏకబిగిన కథలను చదివిస్తాయి. ఎప్పటికప్పుడు సమాజములోను, ప్రజల జీవితాలలోను చోటు చేసుకునే మార్పులు, వాటి వల్ల కలిగే ఇబ్బందులు, వచ్చి పడే సమస్యలు, తెచ్చి పెట్టుకునే తంటాలు, పరిష్కారాలు తెలియక, తెలిసినా అమలు చేత కాక పడే తిప్పలను హాస్యం, వ్యంగాలను మేళవించి ప్రస్తావిస్తారు. మనుషుల ఆలోచనలు, అలవాట్లలోని లోపాలను ఎత్తిచూపుతూ కొన్ని పరిష్కారాలను కూడా చూపెడతారు. శ్రీమతి విజయలక్ష్మి కథలు అన్నీ దాదాపు కుటుంబం, కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతుంటాయి. తరాల అంతరం, మనస్తత్వాలు, వాటి వల్ల ఏర్పడే సంఘర్షణ వంటి వాటిని మోతాదు మించకుండా చిత్రించడం వల్లనే శ్రీమతి విజయలక్ష్మి కథలు రక్తి కడతాయి. ఈమె కథలలో అశ్లీలం, అసభ్యత మచ్చుకకు కనిపించక పోగా, చాల మటుకు పాత్రలు సంస్కారవంతగా ఉండి, ఆశావహ దృక్పథంతో నడుచుకుంటాయి.

రచనలు


'సన్మానం' ఆనే కథలో సన్మానం చేస్తామంటే నమ్మి నగరానికి వచ్చిన ఒక కవి అవస్థలు పడుతుంటే సమయస్పూర్తి కనబరచి గౌరవంగా ఇంటికి పంపే సూర్యం పాత్ర అందుకు చక్కని ఉదాహరణ. డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతోంది, డబ్బే లోకం అని అందరూ బాధపడిపోతుంటే, డబ్బాశ లేకుండా మంచితనంతో బ్రతికే వారు, ఇతరుల సుఖం కోరే వారు ప్రపంచంలో ఉన్నారని మనకు చూపెడతారు 'పూర్వి' కథలో. ఈ హాస్య రచయిత్రి వ్రాసిన పూర్వి కథ చదవడం ముగిసే సరికి కళ్ళు చెమరుస్తాయి. ఎక్కడ చూసినా స్వార్ధం రాజ్యమేలుతోందని, మనలను ఇబ్బంది పెట్టేవారే అందరూ అనుకోవటం పొరపాటని, మహాత్ములు కాకున్నా మనచుట్టూ కూడా మంచివాళ్ళు ఉంటారని 'ఒక ప్రయాణం' కథలో చెబుతారు. పరోపకారానికి అస్తులుండనవసరం లేదని మంచి మనసు ఉంటేచాలని 'పుణ్యాత్మురాలు'ని చూపెడతారు ఒక కథలో. అర్థం చేసుకునే తోడు ఉంటె జీవిత ప్రయాణం ఆనందంగా సాగుతుందని 'చల్లని దీవెన ' కథ ద్వారా బోధ పరుస్తారు. కాలంతో పాటు కుటుంబ జీవితంలో మారే పరిస్థితులను, వాటి వల్ల అనుభవంలోకి వచ్చే మంచి చెడ్డలను పాఠకుల ముందు ఉంచుతారు విజయలక్ష్మి. ఇలాంటి కథలే 'అడ్డం తిరిగిన కథ', 'బ్లాగుతో కథ సుఖాంతం'.

సుమారు యాభై ఏండ్ల క్రితపు కుటుంబాలు, చుట్టరికాలు, ఆప్యాయతలు, గౌరవ మర్యాదలు, అమాయకత్వాలకు హాస్య కథల రూపమిచ్చి తరువాతి తరాల ముందుంచారు రచయిత్రి. ఈనాడు ఆదివారం అనుబంధములో వారం వారం వచ్చిన ఈ కథలు బహుళ జనాదరణను పొందాయి. ఏ కథలోనైనా నిరాశ, నిస్పృహ మచ్చుకకైనా ఉండకుండా కథలు వ్రాయగల రచనా నైపుణ్యము ఆమె సొంతమని శ్రీమతి విజయలక్షి పేరు పొందారు. మంచి చెడులు అన్నిచోట్లా ఉంటాయని తన కథల ద్వారా పాఠకులకు తెలియచెప్పారు రచయిత్రి. 'ఏలిన వారి దివ్య సముఖమునకు' కథ ఒక్కటి చాలు ఆమె రచనా నైపుణ్యం చాటడానికి. తాగి తాగి చనిపోయిన వాని భార్య రత్తాలు ప్రభుత్వానికి వ్రాసే లేఖ ఈ కథ. బడుగు జీవితాలను, మద్యం వాళ్ళ జీవితాలను ఎంత నాశనం చేస్తోందో చెపుతూ మొగుళ్ళు చనిపోయాకనే కడుపుకింత తింటున్నామనే రత్తాలు గోడును ఈ కథ చెపుతుంది. సన్మానాలు చేసి శాలువాలు కప్పటం కాకుండా ఏదైనా పనికొచ్చే వస్తువు ఇవ్వాలని సూచించారు 'ఎవరో ఒకరు ఎపుడో అపుడు' కథలో. పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని, వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే తోడు కోసమే కదాని అరవై ఏళ్ల వయస్సు దాటి జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు ముందుచూపు లేకుండా తొందరపడి పెళ్లి చేసుకుంటే పడే ఇబ్బందులకు 'అడ్డం తిరిగిన కథ' అడ్డం పడుతుంది. ఒక రకంగా కొందరికిది మేలుకొలుపు. పెద్దగా కల్పనల జోలికి వెళ్ళకుండా, ఏ భావం పాఠకులకు స్ఫురించాలో అదే భావాన్ని చిన్న చిన్న మాటల్లో చెప్పేస్తారు. 'కారులో షికారు కథలో' అలా కారు కింద పడుకుని రిపేరు చేసుకుంటూ అంచెలంచెలుగా గమ్యానికి చేరుకున్నారని చెప్పారు. కథా గమనములో వేగము, సంభాషణలలో పదును కథలకు వన్నె తెస్తాయి.

తెలుగు నుడికారము

[మార్చు]

ఈమె కథలలో అచ్చ తెలుగు నుడికారము కనపడుతుంది. అక్కుళ్ళు బక్కుళ్ళుగా, నీటిలో నిలబడి మొసలితో వైరం తెచ్చుకున్న చందం, గుప్పెడు ఒడ్లు మొహాన చల్లితే బుట్టెడు పేలాలు పూచినట్టు వంటివి అనేకం పాఠకులను మురిపిస్తాయి. కథలోకి సూటిగా వెళ్ళడం, సంభాషణలలో క్లుప్తత, అనవసరంగా ఒక్క మాటా రాయకపోవటం, అభ్యంతరకర పదజాలం అసలు లేకపోవటం శ్రీమతి విజయలక్ష్మి రచనా ప్రతిభకు నిదర్శనమని విమర్శకులంటారు.

ఇలా రెండువందలకు పైచిలుకు కథలు వ్రాశారు విజయలక్ష్మి. మధ్య తరగతి కుటుంబ జీవితాలను పరిశీలించి, పరిశోధించి జనరంజకంగా అక్షరబద్ధం చేసే శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి కలం తెలుగు వారికొక వరం.

గుర్తింపు

[మార్చు]

ఈమె ఈ కింది పురస్కారాలుఅందుకున్నారు :

బయటి లంకెలు

[మార్చు]