ప్రోటిస్టా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రోటిస్టా
కాల విస్తరణ: Neoproterozoic - Recent
శాస్త్రీయ వర్గీకరణ
Domain:
Kingdom:
ప్రొటిస్టా*

Typical phyla

ప్రోటిస్టా (లాటిన్ Protista) జీవుల రాజ్యంలో ఏకకణ నిజకేంద్రక జీవులు ఉన్నాయి. వీనిలో కశాభయుత జీవులు, డయాటమ్ లు, డైనోఫ్లాజెల్లేట్ లు, జిగురు బూజులు, జుఫ్లాజెల్లేట్ లు, సార్కోడైన్ లు, సీలియేట్ లు, స్పోరోజోవన్ లు, ప్రోటోజోవన్ లు, ప్రాథమిక వృక్షాలు, ప్రాథమిక శిలీంద్రాలు చేరి ఉన్నాయి.

జీవావరణ వ్యవస్థలో జలచరాలుగా నివసించే ఈ జీవులు వృక్ష ప్లవకాలుగా (ఉత్పత్తిదారులు), జంతు ప్లవకాలుగా (ప్రాథమిక వినియోగదారులు) ఉంటాయి. జిగురు బూజులు కణకుడ్య రహిత, కణకుడ్య సహిత జీవులకు మధ్యస్థంగా ఉంటాయి. శాఖీయ దశ కుడ్యరహితంగాను, ప్రత్యుత్పత్తి దశలు కుడ్యసహితంగాను ఉంటాయి. పోషణ పూతికాహార భక్షణ, జాంతవ భక్షణ పద్ధతులలో జరుగుతుంది. కాంతి లభించే సమయంలో పాదపీయ భక్షణ, కాంతి లేనప్పుడు పూతికాహార భక్షణ జరుపుకొనే యూగ్లీనా వంటి జీవులను మిశ్రమ పోషకాలు అంటారు. సహజీవనం గడిపే ప్రోటిస్ట్ లు చెదపురుగుల వంటి కీటకాల ఆంత్రనాళంలో ఉంటాయి.

కణనిర్మాణ రీత్యా ప్రోటిస్ట్ లు జీవద్రవ్యాన్ని లోపలి కొన్ని కణాంగాలను ప్రమాణ త్వచ నిర్మాణం గల ప్లాస్మా పొర ఆవరించి ఉంటుంది. కేంద్రక త్వచం స్పష్టంగా ఉంటుంది. హిస్టోన్ లతో కూడిన డి.ఎన్.ఏ. జన్యు పదార్ధంగా ఉంటుంది. కొన్ని కణాంగాలు వుంటాయి. అలైంగికంగాను, లైంగికంగాను ప్రత్యుత్పత్తి జరుపుకోగలవు. అభివృద్ధిలో పిండం ఏర్పడదు.

వర్గీకరణ[మార్చు]

జీవావరణ శాస్త్రరీత్యా ప్రోటిస్టాలను మూడు సమూహాలుగా విభజించారు:

 • స్వయంపోషక ప్రోటిస్ట్ లు: ఇవి మొక్కల వంటి జీవులు.
  • డైనో ఫ్లాజెల్లేట్లు: ఇవి అధికంగా సముద్రజలాల్లో నివసిస్తూ ఉండే ఏకకణ శైవలాలు. ఉదా: నాక్టిల్యుకా, సిరేషియం, గోన్యాలాక్స్
  • డయాటమ్ లు: ఇవి మంచి నీటిలోను, సముద్రపు నీటిలోను, తేమ నేలల్లోను ప్లవక జీవనం గడిపే ఉత్పత్తిదారులు. ఉదా: ట్రెసిరేషియం, కాసినోడిస్కస్, స్టెఫానోడిస్కస్.
  • యూగ్లీనాయిడ్లు : వీటికి కణకుడ్యం ఉండదు. ఉదా: యూగ్లీనా, ఫాకస్, కోప్రోమోనాస్.
 • విచ్ఛేదకారక ప్రోటిస్ట్ లు: ఇవి శిలీంద్రక ప్రోటిస్ట్ లు, జిగురు బూజులు
  • అకణ జిగురు బూజులు: ఇవి నిజమైన జిగురు బూజులు. అభివృద్ధిలో ద్వయస్థితిలో ఉండే ప్లాస్మోడియమ్ దశను ఏర్పరుస్తాయి. ఉదా: ఫైజేరమ్, లైసియా, స్టెమోనిటిస్
  • సకణ జిగురు బూజులు: ఇవి గుంపుగా చేరి జీవపదార్ధపు రాశిగా ఏర్పడతాయి. ఉదా: డిక్టియా స్టీలియమ్
  • జాలక జుగురు బూజులు: ఇవి ముఖ్యంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. జిగురు తంతువులు వల వంటి జీవపదార్ధపు రాశిగా ఏర్పడతాయి. ఉదా: లాబిరింతులా
 • వినియోగదారులైన ప్రోటోజోవన్ ప్రోటిస్ట్ లు: వీటిని ప్రోటోజోవన్ ప్రోటిస్టులనీ, జంతు ప్రోటిస్టులనీ పేర్కొంటారు. ఉదా: ప్రోటోజోవా, జూమాస్టిగోఫోర్ లు, సార్కోపైన్ లు, స్పోరోజోవన్లు, సీలియోఫోర్ లు