ఫ్రీ హిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫ్రీ హిట్ అనేది క్రికెట్‌లో బౌలరు వేసే ఒక డెలివరీ. ఇది, బౌలరు వేసిన ఒక చెల్లని బంతికి గాను వేసే జరిమానా బంతి. దీనిలో నో-బాల్‌కు వర్తించే పద్ధతుల ద్వారా తప్ప ఇతర పద్ధతుల ద్వారా బ్యాటర్‌ని అవుట్ చేయలేరు. రనౌట్, బంతిని రెండుసార్లు కొట్టడం ఫీల్డ్‌ను అడ్డుకోవడం అనేవి ఆ మూడు ఔటయ్యే పద్ధతులు. [1]

వన్డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 మ్యాచ్‌లలో ఫ్రీ హిట్ ఉంటుంది. ఒక బౌలర్ నో-బాల్ వేసిన వెంటనే వేసే బంతి ఫ్రీ హిట్ అవుతుంది. బంతిని నడుము కంటే ఎత్తున ఫుల్ టాస్ వేస్తే, బ్యాటరుకు ఫ్రీ హిట్‌ లభిస్తుంది.

చరిత్ర[మార్చు]

ఇది 2007 అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చింది. మొదట్లో ఫుట్ ఫాల్ట్ వలన ఇచ్చే నో బాల్‌లను మాత్రమే ఫ్రీ హిట్‌కి పరిగణించేవారు.[2]

2015 నుండి, అన్ని రకాల నో బాల్‌లకూ ఫ్రీ హిట్లు ఇచ్చేలా నిబంధనలు మార్చారు. [3]

పొందే ప్రయోజనం[మార్చు]

ఫ్రీ హిట్ బాల్ ద్వారా, బ్యాటరు మామూలుగా ఔటయ్యే పద్ధతుల్లో (క్యాచ్ లేదా లెగ్ బిఫోర్ వికెట్ ) ఔటవడు కాబట్టి, భయపడకుండా మరింత శక్తివంతమైన షాట్ ఆడే వీలుంటుంది. లోపం ఫీల్డింగ్ వైపు ఉంది కాబట్టి, ప్రయోజనం బ్యాటింగ్ వైపు ఉంటుంది. నో-బాల్ వేసినపుడు ఔట్ చేయడానికి ఏయే పద్ధతులు ఉంటాయో - అనగా.. రనౌట్, ఫీల్డ్‌ను అడ్డుకోవడం, బంతిని రెండుసార్లు కొట్టడం - అవే పద్ధతులు ఫ్రీ హిట్ డెలివరీలో కూడా ఉంటాయి.[4]

ఫ్రీ హిట్ డెలివరీలో బ్యాటర్ క్యాచ్ లేదా బౌల్డ్ అయినట్లయితే, బంతి ఆటలోనే ఉంటుంది, బ్యాటర్ పరుగులు చేయగలడు. బౌల్డ్ అయిన సందర్భంలో, స్టంప్‌లను తాకడానికి ముందు బ్యాట్ బంతిని తాకినట్లయితే బ్యాట్స్‌మన్‌కు పరుగులు వస్తాయి; ఒకవేళ క్లీన్ బౌల్డ్ అయినట్లయితే అప్పుడూ వచ్చే పరుగులు బై ల కింద లెక్కిస్తారు.[5] [6] [7] 2017 జనవరిలో భారత ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన వన్‌డేలో లియామ్ ప్లంకెట్ ఒక ఫ్రీ హిట్ డెలివరీలో MS ధోనిని క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు బంతి బౌండరీకి వెళ్లడంతో భారత్‌కు నాలుగు బైలు ఇవ్వడం దీనికి ఒక ఉదాహరణ. [8]

ఫీల్డింగ్ పరిమితులు[మార్చు]

నో-బాల్ అందుకున్న బ్యాటరే ఫ్రీ హిట్ బంతి కోసం స్ట్రైక్‌లో ఉంటే, ఫ్రీ హిట్ బాల్ సమయంలో ఫీల్డింగ్ జట్టు ఫీల్డింగ్ మార్చడానికి అనుమతించబడదు. అయితే, వికెట్ కీపర్ స్టంప్‌ల వద్ద లేచి నిలబడి ఉంటే, భద్రతా కారణాల దృష్ట్యా,వారు వెనక్కి, మరింత సాంప్రదాయిక స్థానానికి వెళ్లేందుకు అనుమతిస్తారు.

నో-బాల్‌పై బ్యాటర్లు బేసి సంఖ్యలో పరుగులు చేసినట్లయితే, అవతలి బ్యాటర్ ఇప్పుడు స్ట్రైకర్‌గా ఉంటాడు. ఇప్పుడు ఫ్రీ హిట్ కోసం ఫీల్డింగు జట్టు ఫీల్డును మార్చుకోవచ్చు. వాస్తవానికి స్ట్రైకర్ ఏ కారణం చేత మారినా, ఈ మార్పును అనుమతిస్తారు. ఉదాహరణకు, నో-బాల్‌లో రనౌట్ అయిన స్ట్రైకరు స్థానంలో కొత్త బ్యాటర్ వచ్చినపుడు ఇలా జరుగుతుంది. చట్టవిరుద్ధమైన ఫీల్డ్ ప్లేస్‌మెంట్ కారణంగా నో-బాల్ కాల్ చేస్తే ఫీల్డింగును సరిచెయ్యాలి.

సిగ్నల్[మార్చు]

బౌలర్ ఎండ్ వద్ద ఉన్న అంపైర్ ఒక చేతిని గాలిలో పైకి లేపి వృత్తాకార కదలికలు చేయడం ద్వారా తదుపరి బంతి ఫ్రీ హిట్ అని సూచిస్తాడు. ఫ్రీ హిట్ బంతిని వైడ్ గానీ, నో-బాల్ గానీ చేస్తే మరో ఫ్రీ హిట్ వస్తుంది. ఈ సందర్భంలో అంపైర్ మళ్లీ ఫ్రీ హిట్‌ను సూచించాల్సి ఉంటుంది.

మూలాలు[మార్చు]

  1. "ICC Men's One Day International Playing Conditions Effective 30 September 2018". ICC. p. 4.44, section 21.19. Retrieved 31 July 2019.
  2. "Clarification to free-hit regulation in ODIs". ESPNcricinfo. 2 October 2007. Retrieved 31 July 2019.
  3. "All no balls concede free hit in ICC ODI & Twenty20 rule changes". BBC. 26 June 2015. Retrieved 31 July 2019.
  4. "No ball, free hit explained: The rules that sealed Indian victory". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 25 October 2022.
  5. "Brains and brawns: Walking through the soul-stirring final over in India's win over Pakistan". T20 World Cup (in ఇంగ్లీష్). Retrieved 23 October 2022.
  6. "Dead ball Law | MCC".
  7. "India vs Pakistan: Free hit byes proof of Virat Kohli's exceptional match awareness". Moneycontrol (in ఇంగ్లీష్). Retrieved 25 October 2022.
  8. Anand, Nikhil (20 January 2017). "Watch: India gets four runs on the ball MS Dhoni was bowled". CricTracker (in ఇంగ్లీష్). Retrieved 23 October 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫ్రీ_హిట్&oldid=3952358" నుండి వెలికితీశారు