బండి గోపాలరెడ్డి

వికీపీడియా నుండి
(బంగోరె నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బండి గోపాలరెడ్డి
జననం(1938-10-12)1938 అక్టోబరు 12
నెల్లూరు జిల్లా
మరణం1982 అక్టోబరు 31(1982-10-31) (వయసు 44)
విద్యఎం. కాం ఆనర్స్
విద్యాసంస్థఆంధ్ర విశ్వవిద్యాలయం
వృత్తిపాత్రికేయుడు, రచయిత, విమర్శకుడు

పుస్తకప్రేమికుడు, జర్నలిస్ట్, చరిత్రకారుడు, వేమన, బ్రౌన్, గురజాడ, సి.ఆర్.రెడ్డి, "తవ్వకప్పనిమంతుడు", 'రీసెర్చ్ గెరిల్లా', బంగోరె అనే పేరుతో ప్రసిద్ధుడైన బండి గోపాలరెడ్డి (1938-1982) పత్రికా రచయిత, గొప్ప సాహిత్య పరిశోధకుడు, విమర్శకుడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించిన బంగోరె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం.కాం ఆనర్స్ వరకూ చదువుకున్నా ఆసక్తి, కృషి మాత్రం సాహిత్యం, పరిశోధన రంగాల్లోనే సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో కొద్దికాలం స్రవంతి పేరుతోనో, మరో పేరుతోనో ఒక పత్రిక నిర్వహించాడు. కొద్దీ కాలం కడపజిల్లా సహకార బ్యాంకులో పనిచేసినా ప్రధానంగా పాత్రికేయునిగా, పరిశోధకునిగా జీవించాడు. బంగోరె శ్రీమతి సుమిత్ర నెల్లూరు ప్రభుత్వ మహిళా కళాశాల, దొడ్ల కౌసల్యమ్మ కళాశాలలో అధ్యాపకురులుగా పనిచేసి 2001లో కాబోలు పదవివిరమన చేసి 2002 ప్రాంతంలో చనిపోయింది. ఈ దంపతుల కుమారులిద్దరు అమెరికాలో స్థిరపడ్డారు.

నెల్లూరు స్థానిక చరిత్రతో ప్రారంభమైన కృషి విస్తరిస్తూ వేమన, సి.పి.బ్రౌన్‌, గురజాడ వంటి పలువురి సాహిత్యం, జీవితాలపై లోతైన పరిశోధనలతో తెలుగు సాహిత్య పరిశోధన రంగంలో సంచలనం సృష్టించాడు. ఆ క్రమంలో బ్రౌన్ సాహిత్య కృషిపైన, వేమనపై, వేమన గురించి 20వ శతాబ్ది తొలినాళ్ళలో సాహిత్య కృషికి ప్రోత్సహించిన సి.ఆర్.రెడ్డి, సాగించిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వంటివారి గురించి, గురజాడ జీవితం, సాహిత్యాల గురించి, వీరేశలింగం గురించి, అజ్ఞాత చరిత్రకారులు, జర్నలిస్టుల గురించి - ఇలా ఎన్నెన్నో అంశాల గురించి పరిశోధనలు, ప్రచురణలు చేశాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కం మొదటి కూర్పు, బ్రౌన్ ప్రచురించిన తాతాచార్ల కథలు, సి.ఆర్.రెడ్డి ప్రసంగాలు, వ్యాసాలు, డాక్టర్ జె.మంగమ్మ బుక్ ప్రింటింగ్ ఇన్ ఇండియా వంటివెన్నో వెలికితీసి, పరిష్కరించి, నోట్స్ రాసి పలు హోదాల్లో ప్రచురించాడు. స్వయంగా సి.పి.బ్రౌన్ జర్నలిజం చరిత్ర, సి.పి.బ్రౌన్ సాహిత్య స్వీయచరిత్ర, బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు, ఉన్నవ మాలపల్లి నవలపై ప్రభుత్వ నిషేధాలు వంటి పలు అంశాలపై గ్రంథాలు రాశారు. బంగోరె పరిశోధనల్లో వెలికివచ్చిన అంశాల్లో గురజాడ అప్పారావు జన్మదినం, బ్రిటీష్ ప్రభుత్వంపై తిరగబడ్డ నెల్లూరు అజ్ఞాత స్వాతంత్య్ర యోధుడు వంటివి ఉన్నాయి. బంగోరెకు ఎంతో ప్రియమయిన విషయం పుస్తకాల సేకరణ, పుస్తకపఠనం. మేధావులతో, రచయితలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం అతని హాబీలు. నెల్లూరు జమీన్ రరయితులో పనిచేస్తున్న కాలంలోనే నెల్లూరు వర్ధమాన సమాజం గ్రంథాలయానికి కార్యదర్శి అయి 1971 వరకు పనిచేసాడు. ఆ క్రమంలోనే తనకు గొప్ప గొప్ప కవిపండితులతో సాన్నిహిత్యం కలిగింది. కావాలి జవహర్ భారతి కాలేజి రాజకీయ శాఖ హెడ్ కెవిఆర్ తో పరిచయం, స్నేహం బంగోరె సాహిత్య దృక్పథంలోనూ, పరిశోధనలలోను మార్పులు తెచ్చాయి.

జమీన్ రైతు పత్రిక సహాయ సంపాదకునిగా 1964 నుంచి 1971 వరకు, ఆపైన ఏడాది పాటు మద్రాసు (నేటి చెన్నై)లో అమెరికన్ రిపోర్టరులో పాత్రికేయునిగా చేసి, అమెరికన్ రిపోర్టోర్ మూత పడడంతో అక్కడ ఉద్యోగం మూడునాళ్ళ ముచ్చట అయింది. నెల్లూరు వచ్చి యూత్ కాంగ్రెస్ వారపత్రికలో కొన్ని నెలలు సంపాదక బాధ్యత నిర్వహించి, 1975 నుంచి 1979 వరకూ తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టు రీసెర్చి అధికారిగా, 1980 నుంచి ఏడాది పాటు ప్రభుత్వం వేమనపై ఏర్పరిచన పరిశోధన ప్రాజెక్టులో, ఆపైన 1982 వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కట్టమంచి రామలింగారెడ్డి గురించి ఏర్పరిచిన ప్రాజెక్టులో పనిచేశాడు. 1975 - 1982 మధ్యకాలంలో పలు అకడమిక్ రీసెర్చి ప్రాజెక్టుల్లో పనిచేస్తూ, తన పరిశోధన సంతృప్తికరంగా ముగియకుండానే వాటి కాలం చెల్లిపోతూ, అస్థిరమైన పరిస్థితుల్లో జీవించడం, పరిశోధన ప్రాజెక్టుల్లో పరిస్థితులు వంటికారణాలతో జీవితేచ్ఛ కోల్పోయాడు. ఎవరికీ చెప్పకుండా నెల్లూరు విడిచిపెట్టి ఢిల్లీ, హరిద్వార్, హృషీకేశ్ వంటి ప్రాంతాలు తిరిగి, అశాంతితో 1982 అక్టోబర్ 31న 44 సంవత్సరాల ప్రాయంలో భాక్రానంగల్ ప్రాజెక్టుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బంగోరె చేసిన పరిశోధన, కృషి ఎంతో ఉన్నా రాసుకున్న నోట్సులోంచి విస్తరించి చేయాల్సిన పరిశోధనలు, పరిష్కరించి చేయాల్సిన ప్రచురణలు మరణానంతరం మిగిలిపోయే ఉన్నాయి.

జీవితం

[మార్చు]

విద్యాభ్యాసం, తొలినాళ్ళు (1938-1964)

[మార్చు]

బంగోరె జననం 1938 అక్టోబర్ 12. మరణం 1982 అక్టోబర్ 31. నెల్లూరు వి. ఆర్. కళాశాలలో ఇంటర్మీడియట్, అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.కాం ఆ నర్స్ చదివాడు. 1960లో కొద్దికాలం స్రవంతి పత్రిక నిర్వహణ, తర్వాత మరి కొన్ని నెలలు ఆంధ్రజ్యోతి దినపత్రిక, విజయవాడలో ఉద్యోగం చేసి, కడప కో ఆపరేటివ్ బ్యాక్ లో సెక్రటరీగా పని చేసాడు.

జమీన్ రైతు ఉద్యోగం, పరిశోధనలు (1964-1971)

[మార్చు]

1964లో నెల్లూరు జమీన్ రైతు వార పత్రికలో సహాయ సంపాదకుడుగా పనిచేసాడు. జమీన్ రైతు పత్రికలో వారం వారం "కూనిరాగాలు" శీర్హిక నిర్వహించి నెల్లూరు జిల్లా ప్రజాబాహుళ్యంలో విశేషమైన కీర్తి పొందాడు. ఈ శీర్షికను "లోకలిస్ట్ " కలంపేరుతో నిర్వహించాడు. ఈ పత్రికలో బంగోరె, బండి గోపాలరెడ్డి పేర్లతో కూడా వ్యాసాలు రాసేవాడు. స్థానిక చరిత్ర పైన పరిశోధించి వందల వ్యాసాలు రాసాడు. నెల్లూరు వీధుల చరిత్ర, పాతకాలం సత్రాలు, పాఠశాలలు, మిషనరీ సంస్థల చరిత్ర ఇట్లా అనేక విషయాలమీద రాసాడు. పుస్తకాలమీద, సినిమాల మీద, నెల్లూరు గోప్పవారిమీద రాసాడు. నేలనూతల శ్రీకృష్ణమూర్తి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం కూడా ఇతని రచనా వ్యాసంగానికి ప్రోత్శాహం కలిగించింది. స్థానిక చరిత్ర రచనకు ఒంగోలు వెంకటరంగయ్య గారి "కొందరు నెల్లూరు గొప్పవారు" వ్యాసాలు దారి చూపాయి.

1967 ప్రాంతంలో నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయానికి కార్యదర్శి అయ్యాడు. ఈ సమాజం ప్రతి సంవత్సరం కవిపండితుల జయంతులు జరుపుతుంది. ఆవిధంగా ఎందరో ప్రసిద్ధవ్యక్తుల పరిచయం, స్నేహం లభించింది. కావలి కళాశాల అద్యాపకులు కే.వి. ఆర్ స్నేహం తనపయి గొప్ప ప్రభావం కలిగించింది. 1969 మార్చి నెలలో గురజాడ అప్పారావు గారి మొదటి కన్యాశుల్కం ప్రతి సంపాదించి, దానికి నోట్సు రాసి, ఆరుద్ర ఉపోద్ఘాతంతో ప్రచురించాడు. ఈ పుస్తకం పరిశోధకుడుగా ఆయనకు అజరామరమయిన కీర్తి తెచ్చిపెట్టింది.ఇందులో గురజాడవారి జన్మదినాన్ని నిర్దుష్టంగా నిరూపించాడు.

బంగోరె విద్యార్థి దశలోనే బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది (నవల) చదివి ఆ ప్రభావంలో బుచ్చిబాబుతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. అంతకు ముందు ఆచంట జానకిరాం అభిమానిగా ఉన్నాడు. 1967 ప్రాంతాలలో ఖలీల్ జిబ్రాన్ కవిత్వం మీద మిత్రులతో చర్చలు జరుపుతుండేవాడు. ఇల్లూరులో మరుపూరు కోదండరామారెడ్డి నడిపిన మందాకిని వారిపాట్రియాకులో తాజ్మహల్ అనేకవితా, కొన్ని కథానికలు ప్రచురించాడు.

నేలనూతల శ్రీకృష్ణమూర్తి 1962-64 కాలంలో విక్రమ సింహపురి మండల సర్వస్వం గ్రంథాన్ని సంపాదకులుగా వెలువరించడానికి కృషిచేస్తున్నాడు. ఇందులో బంగోరె స్థానిక చరిత్ర మీద అనేక వ్యాసాలు రాయడమే కాక, ఈ గ్రంథ సహాయ సంపాదకుడుగా పనిచేసాడు. "Speeches and essays of C.R. Reddy" చిన్న పుస్తకాన్ని తయారుచేసాడు, నెల్లూరు వర్ధమాన సమాజం దీన్నీ ప్రచురించింది.1970)

అమెరికన్ రిపోర్టరులో ఉద్యోగం, నెల్లూరు తిరిగిరాక (1971-1973)

[మార్చు]

1971చివర వరకు జమీన్ రైతులో పనిచేసి, మద్రాసులో USISలో బి.యస్.ఆర్. కృష్ణ సంపాదకత్వంలో వెలువడుతున్న American Reporter పత్రిక లో పనిచేశాడు. ఆ ఉద్యోగం ఒక ఏడాది మించి సాగలేదు.ఈ సమయంలోనే మద్రాసు GOMLలో పరిశోధించి "సి.పి. బ్రౌన్ జర్నలిజం చరిత్ర 1831-1857" పుస్తకాన్ని రాసి Nellore Historical Society పక్షాన అచ్చువేశాడు.1973చివరలో మద్రాసు నుంచి వెనక్కి వచ్చి, నెల్లూరు వారపత్రిక యూత్ కాంగ్రెస్ లో సంపాదకుడుగా చేరి(నవంబర్ 73కల్లా యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు) ఒక యాడాది పని చేసాడు. ఈ సమయంలోనే డాక్టర్ జే.మంగమ్మ పుస్తకం " బుక్ ప్రింటింగ్ ఇన్ ఇండియా" ను ప్రచురించాడు.

సి.పి.బ్రౌన్ ప్రాజెక్టు అధికారిగా (1975-1979)

[మార్చు]

బండి గోపాలరెడ్డి 1975 లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో తెలుగుశాఖలో C.P.Brown Project లో రీసెర్చ్ ఆఫీసర్ గా నియమించబడ్డాడు.

ఈ కృషిలో భాగంగానే "బ్రౌన్ జాబులు, ఆధునికాంధ్ర సాహిత్య శకలాలు " పుస్తకం వెలుగు చూచింది(1977 ఫిబ్రవరి). దీనికి ప్రొఫెసర్ జి.యన్. రెడ్డి ప్రధాన సంపాదకుడుగా, బంగోరె సంపాదకుడుగా వ్యవహరించారు వీరిద్దరు కలిసి " Literary auto biography of C.P.Brown" ను యస్.వి. విశ్వవిద్యాలయం పక్షాన 1978లో తెచ్చారు. 1977లో ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే 'ఆంద్ర గీర్వాణ ఛందము"ను వెలువరించాడు.ఈ పరిశోధన లోంచే "బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు: కడప జాబుల సంకలనం" కూడా తయారుచేసి, అచ్చువేసాడు. ఈ ప్రాజెక్ట్ కాల పరిమితి ముగియడంతో నెల్లూరు వచ్చేసాడు. మద్రాసు ఆర్కైవ్స్ లో పరిశోధించి, "మాలపల్లి నవలఫై ప్రభుత్వనిషేధాలు"పుస్తకం తెచ్చాడు(1979). ఇది తన సొంత ప్రచురణ.

వేమన, సి.ఆర్.రెడ్డి పరిశోధన ప్రాజెక్టులు (1980-1982)

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తనకోసం వేమన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి, హైదరాబాద్ పిలిపించింది. 24-April 1980 లో ఈ కొత్త ఉద్యోగంలో చేరాడు. అప్పటికే బంగోరెలో చాలా అసంతృప్తి, తలపెట్టిన పరిశోధనలు అర్థాంతరంగా ముగిసిపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, కుటుంబానికి దూరంగా ఉండడం వంటి అనేక అంశాలు అతనిమీద ప్రభావం చూపి ఉండవచ్చు. ప్రభుత్వశాఖల్లో ఉండే పరాధీనత, బాసిజం ఏవీ అతని ప్రవృత్తికి సరిపడేవి కావు. ఏమయినా తనకున్న పరిమిత అవకాశాల్లో వేమన గురించిన సమస్త విషయాలను సేకరించి ఒక సమగ్ర భాండాగారాన్ని భవిష్యత్ పరిశోధకులకోసం ఎర్పాటు చెయ్యాలని పూనుకొన్నాడు. సుడిగాలి పర్యటనలు చేసి బోలెడంత భోగట్టా రాశి పోసాడు. కోర్ట్ స్టేలతో 1981లో ఆ పదవిలో కొన్నాళ్ళు సాగినా , ప్రాజెక్ట్ ముగిసిపోయింది. ఈ నిస్సహాయ పరిస్తితుల్లో ఆంధ్ర విశ్వ విద్యాలయంలో కట్టమంచి రామలింగారెడ్డి మీద పరిశోధనకు బంగోరె నియమించబడ్డాడు. 1982 అక్టోబర్ లో ఆ ఉద్యోగము ముగిసింది.

నెల్లూరు విడిచి వెళ్ళడం, మరణం (1982)

[మార్చు]

అలసిపోయి, నిరాశతో నెల్లూరు చేరాడు.అతనిలో ఘనీభవించిన అసంతృప్తి, జీవితేఛ్ఛ కోల్పోవడం వంటి వైక్లబ్యాలను సన్నిహిత మిత్రులు కూడా గమనించలేదు. ఎవ్వరికీ చెప్పకుండా నెల్లూరు విడిచి, ఢిల్లీ, హరిద్వార్, హృషికేశ్ తదితర ప్రదేశాలు ఒక గమ్యంలేకుండా తిరిగి, చివరకు, భాక్రానంగల్ డాం మీదినుంచి దూకి ప్రాణాలు విడిచిపెట్టాడు. అతని జీవితంలోను, మరణంలోను అన్ని విషాద విస్మయాలే. బంగోరె మరణించిన కొన్ని నెలలలోపు నెల్లూరు యువకులు H.S.K రంగారావు మిత్రబృందం కూనిరాగాలు పేరుతొ బంగోరె జమీన్ రాయిటులో రాసిన కొన్ని వ్యాసాలను చిన్న పుస్తకంగా ప్రచురించారు. కె.వి.ఆర్. దీనికి పరిచయం రాశాడు.

రచనలు

[మార్చు]
  1. తాతాచారి కథలు - నాల్గవ ముద్రణ యంయస్ కో ప్రచురణ(సంపాదకత్వం)[1]
  2. మాలపల్లి నవలపై ప్రభుత్వ నిషేధాలు సొంత ప్రచురణ, 1978-79.
  3. వేమన-సి.ఆర్.రెడ్డి : 1928లో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారితో అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున చేసిన 'వేమన ఉపన్యాసాల' ఏర్పాటు వెనుక గల నేపథ్యాన్ని వివరిస్తున్నదీ గ్రంథం. వేమనకు సంబంధించి సి.ఆర్.రెడ్డి, రాళ్ళపల్లికి రాసిన విలువైన జాబులు ఈ సంకలనంలో ఉన్నాయి. వేమనను విశ్వవిద్యాలయాల్లోకి పిలిచి, పీటవేసి పెద్దరికం యిచ్చినది కట్టమంచి వారయితే, మహాకవిగా మర్యాద చేసినది రాళ్ళపల్లివారు. బంగోరె, విశ్వవిద్యాలయ శకలాలలోంచి ఏర్చికూర్చిన అనేక చారిత్రక విలువైన పత్రాల సంకలనం ఈ గ్రంథం.[2]
  4. బ్రౌన్ జాబులు తెలుగు జర్నలిజం చరిత్ర
  5. చంద్రిక కథ (తమిళం నుంచి అనువాదం, ఎన్.ఎస్.కృష్ణమూర్తి, వి.యన్. రాఘవన్ గార్లతో కలిసి.)1969లో జమీన్ రైతులో ధారావాహికగా ప్రచురించి, 1971లో పుస్తకంగా తెచ్చాడు. ఇటీవల వ్యాపార ప్రచురణ సంస్థల వాళ్ళు దీనికి పునర్ ముద్రణలు తెచ్చారు.
  6. విక్రమసింహపురి మండల సర్వస్వం, సహాయ సంపాదకుడుగా 1964. నెల్లూరు జిల్లా పరిషత్ ప్రచురణ.
  7. కన్యాశుల్కం తోలిముద్రణ(1969 Scholars edition) కు విశేషమైన పరిశోధన చేసి నోట్స్ తో ప్రచురించాడు(1969)
  8. పెన్న ముచ్చట్లు వ్యాససంకలనం: రచయిత డాక్టర్ కాళిదాసు పురుషోత్తం. ఇందులో నా మిత్రుడు బంగోరె వ్యాసం.
  9. బంగోరె జాబులు-సంపాదకులు:డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్,సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ ప్రచురణ, నెల్లూరు, .2019.ఈ పుస్తకంలో బంగోరె మిత్రులకు, రచయితలకు రాసిన జాబులు తన పరిశోధన, ఆంతరంగిక జీవితం, సంఘర్షణను స్పష్టం చేస్తాయి.

మూలాలు

[మార్చు]
  1. "మొట్టమొదటి తెలుగు కథ నెల్లూరియునిదే". Archived from the original on 2016-03-23. Retrieved 2015-10-27.
  2. "కినిగె లో పుస్తక వివరాలు". Archived from the original on 2015-12-31. Retrieved 2015-10-27.

ఇతర లింకులు

[మార్చు]