Jump to content

బందా పరదేశి

వికీపీడియా నుండి

నిరతాన్నదాత మహా భక్త శిఖామణి-బందా పరదేశి. 17వ శతాబ్దంలో నియోగి కుటుంబంలో పూర్వపు గుంటూరు జిల్లా, ప్రస్తుత ప్రకాశం జిల్లా వేటపాలెంలో పుట్టిన బందా పరదేశి కరణీకం చేసేవాడు. ఎవ్వరినీ చెయ్యి చాచిన వాడు కాదు. భార్య కమలాంబ వివాహం తో జరిగింది. భార్య కమలాంబ  కూడా చక్కగా సహకరించేది. నిత్య అన్నదానంతో దంపతులు తరించేవారు. ఈ వంశం వారు ఇప్పటికీ చీరాల, వేటపాలెంలో ఉన్నారు. వీరిలో బందా వెంకట నరసయ్య ఒకరు.బందా దంపతులు ఒక్క రోజు కూడా అన్నదానం చేయని రోజు లేదు. ఏకాదశి వ్రతం తప్పని సరి. ద్వాదశినాడు 12 మందికి తక్కువకాకుండా, 108 కి మించకుండా అన్న సంతర్పణ చేసేవారు. వ్రతం రోజు జాగరణం చేసేవారు. భోజనం చేసి వెళ్ళే వారిని పంపలేక పంపలేక పంపించే వారు. ఇలా నిత్యఖర్చుతో ఉన్న ఆస్తి అంతా హారతి కర్పూరమై హరించి చివరికి భార్య మెడలో మంగళ సూత్రం కూడా అమ్మే పరిస్థితి కలిగింది.

అన్నదాత  కధ

[మార్చు]

చేతిలో చిల్లి గవ్వ లేని నిర్భాగ్యం బందా దంపతులను ఆవహించింది. భార్యను వెంటపెట్టుకొని అర్ధరాత్రి ఇల్లు వదిలి బాపట్ల తూర్పు సత్రం చేరి జరగవలసిన దాన్ని గురించి భార్యా భర్తలు ఆలోచిస్తున్నారు. ఆ రోజు ఉదయమే ఆ సత్రంలో దిగిన  నిరుపేద స్త్రీ ఆకలితో అలమటిస్తున్న తన పిల్లలకు ‘’ఇదుగో సెనగపప్పు మాత్రమే ఉన్నాయి, తిని నీళ్ళు తాగి పడుకోండి. రేపు పొద్దున్న పదింటికి  వేటపాలెం లో  బందా పరదేశి గారింటికి వెడితే అమృతాన్నం పెడతారు, ఆ మహాదాతలైన దంపతులు ‘’ అని ఊరడిస్తుండట౦ బందా చెవిన పడింది. వెంటనే భార్యకు చెప్పితమింట్లో ఒక కుందీ, రోలు ఉన్నాయి, కనుక వాటిని అమ్మేసి ఆ పేద స్త్రీకి, పిల్లలకు భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పి, వారు వచ్చే లోపే తాము ఇంటికి చేరాలని తొందరబెట్టి అప్పటికప్పుడు ఇద్దరు నడిచి వేటపాలెం చేరారు. బొమ్మిశెట్టి సుందర రాజం అనే వైశ్యునికి , రోలు రెండు రూపాయలకు అమ్మేసి, బియ్యం పప్పుఉప్పూ కూరలు తెచ్చి వంట చేసి సిద్ధంగా ఉండగా,  అతిధులు రాగా వారికి ఆప్యాయంగా వడ్డించి తినిపించి సాగనంపి, తమ బీద స్థితి తెలియజేసి, సంతృప్తి చెందారు బందా దంపతులు . రోలును తీసుకోనిపోమ్మని వైశ్యునికి కబురు పంపారు .అతడు వచ్చి ఆ రోలు తీసే ప్రయత్నంలో ఉండగా దానికింద మొహరీల బిందె కనిపించింది.

వైశ్యుడు ఆబిందేను చూసి దాన్ని పరదేశికి ఇవ్వబోగా, అతను  తన ఇంట్లో అలాంటి బిందేకాని మొహరీలు కానీ ఎప్పుడూ లేవు అని నిజం చెప్పి,  రోలుతో సహా ఆ మోహరీ బిందె కూడా వైశ్యుడిదే అని నిష్కర్షగా చెప్పాడు. ధర్మాత్ముడైన వైశ్యుడు రోలుమాత్రమే తనది బిందె తనదికాదని చెప్పి రోలు తీసుకు వెళ్ళాడు. శ్రీ రామచంద్ర ప్రభువే తమ నిరతాన్న దానానికి ఇలా మొహరీల బిందె ఏర్పాటు చేశాడని, ఆ దేవదేవుని వేనోళ్ళ స్తుతించి మళ్ళీ సంతృప్తిగా నిరతాన్న దానం చేయటం మొదలు పెట్టారు . బందా పరదేశి దంపతుల పేరు దేశం లో  గ్రామగ్రామాన మారు మోగింది . ఇది విన్న కొందరు అసూయా పరులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నిరతాన్న ప్రదాత కనుక ఈ ఫిర్యాదును లెక్క చేయలేదు . దీనితో బందా దంపతుల కీర్తి ఆసేతు హిమాచలపర్యంతం వ్యాపించింది.[1]

నిరతాన్నదానం

[మార్చు]

 సా.శ. 1670 లో వచ్చిన గంగానది పుష్కర స్నానానికి వాసి రెడ్డి ప్రభువు గురువుగారితో కలిసి కాశీ వెళ్ళారు . పుష్కర స్నానం చేస్తూ ప్రభువు  బ్రాహ్మణులకు విపరీతంగా దాన ధర్మాలు చేసి అందరి ప్రశంసలు పొందాడు. అక్కడి వారు  ‘’ నిరతాన్నదాత బందా పరదేశి ఉండే ఆంద్రదేశపు ప్రభువు వెంకటాద్రి నాయుడు ‘’ అని చెప్పుకోవటం రాజుగారు విని, మహా సంతోషించి , అతనికి తన రాజధానిలో ఘన సత్కారం చేయాలని అనుకున్నాడు. యాత్ర ముగించి రాజధాని అమరావతి  చేరి బందా వారిని నోటీసు ఇచ్చి పిలిపించి , ’’ నాకు  తెలియకుండా వేట పాలెం విడిచి  వెళ్ళ వద్దు’’ అని ఆంక్ష విధించాడు. రాజాజ్ఞ కనుక ఒక ఏడాది అమరావతిలోనే ఉండిపోయాడు .

ఒక ద్వాదశి నాడు ఉదయం కాలినడకలో వెడుతుంటే ఒక  ఇంటిముందు వందలకొద్దీ బ్రాహ్మణులూ చేతులు కడుక్కోవటం చూశాడు. ఏమిటి విశేషం అని వారిని అడుగగా పరదేశి ద్వాదశి పారాయణ భోజనం ఆహ్వానానికి వచ్చినట్లు చెప్పారు . పరమ సంతోషం వెలిబుచ్చి వేటపాలెం వెళ్ళగా పరదేశి భార్య కమలాంబ చేసే అన్నదానం కనులారా చూసి, ఆ అమ్మ భిక్ష  తాను  కూడా చేయదలచినట్లు కబురుపంపి, సపరి వారంగా వెళ్లి సంతోషంగా భోజనం చేసి, సత్కారం పొందాడు. ఆమెకు సంతోషంగా కృతజ్ఞతలు చెప్పగా ఆమె ‘’ అన్నగారూ! తోబుట్టువును మరవకండి ‘’ అని చెప్పింది. ఉబ్బి తబ్బిబ్బై ప్రభువు అమరావతి చేరాడు. పరదేశితో ‘’ మిమ్మల్నిఅనవసరంగా కష్టపెట్టాను. క్షమించండి ‘’ అని విన్నపాలు చెప్పి, అర్ధ సింహాసం మీద తనప్రక్కన కూర్చో బెట్టి విలువైన బహుమతులతో సత్కరించాడు. ఇంతగా అన్నదానం చేయటానికి ద్రవ్యదాత ఎవరని ప్రశ్నిస్తే అద్దేపల్లి సుబ్బయ్య శ్రేష్టి అని చెప్పగా , అతన్ని పిలిపించి ‘’పరదేశిగారి అన్న సంతర్పణకు మీరు ఇచ్చిన డబ్బు ఎంత?’’ అని అడుగగా ‘’ప్రభూ పరదేశికి తిరిగి తీసుకొనే ఉద్దేశ్యంతో నేను డబ్బు ఇవ్వలేదు . కనుక పద్దు రాయలేదు . కాబట్టి  ఎంత ఇచ్చానో చేప్పలేను ‘’ అన్నాడు . దిమ్మతిరిగి బొమ్మ కనిపించి వెంకటాద్రి నాయుడు ‘’ ఔదార్యం అంటే ఇలా ఉండాలి ‘’అనుకోని ‘’ నాకు తెలీకుండా అతనికి డబ్బు ఇచ్చే అధికారం నీకు ఎక్కడిది? అనుమతి లేకుండా చేశావు .అయినా క్షమిస్తున్నా. అతనికిచ్చిన డబ్బు అంతా నేను నీకు ఇచ్చేస్తా తీసుకో’’ అన్నాడు . శ్రేష్టి ‘’ మీరిచ్చే శిక్షకంటే , భగవంతుడు ఇచ్చే శిక్ష పెద్దది . సత్సంకల్పానికి పాపకూపంలో పడి పోతానేమో నని భయంగా ఉంది. మన్నించండి ‘’ అన్నాడు వినయంగా .’’ సరే నువ్వు చెప్పింది కూడా బాగుంది . నేను పరదేశిక నువ్వు ఇచ్చిన డబ్బు అంతా తిరిగి నీకు ఇచ్చేస్తా తీసుకో . అతనికి ఘన సన్మానం చేస్తాను. నువ్వుకూడా పాల్గొని ఆ డబ్బు అతని సన్మానానికి ఖర్చు చెయ్యి . ఇద్దరం ధన్యులమవుతాం ‘’ అన్నాడు సెట్టి సమ్మతించాడు .

అన్నప్రకారమే వెంకటాద్రి నాయుడు బందా పరదేశికి ఘన సన్మానం చేసి, భార్య కమలా౦బను పిలిపించి కాశీలో ఆంధ్రప్రభుత్వం నిర్వహించే అన్నదాన సత్రానికి పరదేశి అధికారిగా చేయటానికి ఆమెను ఒప్పింఛి, వేటపాలెం సత్రానికి కమలాంబను అధికారిని చేశాడు. వారణాశిలో తన బాధ్యతలు అత్యంత సమర్ధంగా సంతృప్తిగా నిర్వహించాడు.[1]

మరణం

[మార్చు]

పరదేశిగారు వేటపాలెం, సా.శ. 1785లో ఆ విశ్వేశ్వరునిలో ఐక్యమయ్యారు. రెండేళ్ళ తరువాత భార్య కమలాంబ కూడా కైవల్యం చెందింది. బందా పరదేశి గురించి నిరతాన్నదాత అపర అన్నపూర్ణాదేవి డొక్కాసీతమ్మలాగా ఆంధ్ర దేశంలో పెద్దగా ఎవరికీ తెలియదు . సత్రం సంఘటన ఇద్దరి జీవితాలలో చోటు చేసుకోవటం తమాషాగా ఉంది. అమరావతి ప్రభువు ఇతనిని ఆదరిస్తే, పిఠాపురం రాజా ఆమెను గుర్తించారు . ఇద్దరూ కారణ జన్ములు. ఆంధ్రులకు ప్రాతస్మరణీయులు .

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 పంగులూరి, వీరరాఘవయ్య (1957). మహాభక్త ఆంధ్ర విజయం (PDF). గుంటూరు: శాంతి ప్రెస్, గుంటూరు. pp. 38–45.

వెలుపలి లంకెలు

[మార్చు]