Jump to content

బతుకమ్మ చీరలు

వికీపీడియా నుండి
బతుకమ్మ చీరలు
2021లో పంపిణీ చేసిన బతుకమ్మ చీరల మోడల్స్
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ఆడబిడ్డలు
స్థాపన2017
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం

బతుకమ్మ చీరలు, బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ తెలంగాణ ప్రభుత్వం కానుకగా అందిస్తున్న చీరలు.[1] మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించటంతోపాటు అడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక అందించే ఉద్దేశ్యంతో 2017లో బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది.

ప్రారంభం

[మార్చు]

బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకునే సంప్రదాయం తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతూవస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ప్రతిఏటా ప్రభుత్వం తరపున బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలందరికీ బతుకమ్మ కానుకను అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అలోచనలోంచి ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది.[2]

మొదట్లో 30 డిజైన్ల చీరలతో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ 225 డిజైన్లకు చేరుకుంది. బతుకమ్మ చీరల ఆర్డర్‌తో ఒక్కో చేనేత కార్మికుడికి సగటున రూ.20 వేలు సంపాదన సమకూరుతోంది.

పంపిణీ వివరాలు

[మార్చు]

ప్రతిఏటా నవరాత్రుల సందర్భంగా ప్రజాప్రతినిధులు వారివారి ప్రాంతాలలో అర్హులైనవారికి చీరల పంపిణీని ప్రారంభిస్తారు. చీరల పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పోరేషన్ డివిజన్ల వారీగా రేషన్‌ షాపులకు సమీపంలో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో రేషన్‌ డీలర్‌, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీ.. పట్టణాలు, నగరాల్లో రేషన్‌ డీలర్‌, మున్సిపల్ బిల్‌ కలెక్టర్‌, మహిళా సంఘం ప్రతినిధుల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది. ఆహార భద్రత కార్డులతో వచ్చి మహిళలు చీరలు తీసుకునే అవకాశం ఉంటుంది.

  1. 2017: 2017 సంవత్సరంలో 225 కోట్ల రూపాయలు వెచ్చించి 94 లక్షల బతుకమ్మ చీరలు తయారు చేయించారు. 1,04,57,610 మందికి రేషన్ షాపుల ద్వారా సెప్టెంబరు 18, 19, 20 తేదీలలో ఈ చీరలు పంపిణీ చేశారు.
  2. 2018: 2018 సంవత్సరంలో రూ.280 కోట్ల వ్యయంతో 80 రంగుల్లో 95లక్షల జరీ అంచు పాలిస్టర్‌ చీరలను మరమగ్గాలపై తయారుచేయించారు. అక్టోబరు 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం జరగాల్సివుండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున చీరల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తరువాత డిసెంబరు 19న చీరల పంపిణి ప్రారంభమయింది.
  3. 2019: 2019 సంవత్సరంలో కోటి బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం 313 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, 16 వేలమంది నేత కార్మికులలో, 26 వేలమగ్గాలపై ఈ చీరలను తయారుచేయించింది. 10 రకాల డిజైన్స్‌తో, 10 రకాల రంగులతో... 10 లక్షల చీరలను 9 మీటర్ల పొడవు, మిగతా 90 లక్షల చీరలు 6 మీటర్ల పొడుగుతో తయారుచేయబడ్డాయి. సెప్టెంబరు 23 నుంచి చీరల పంపిణీ జరిగింది.[3]
  4. 2020: 2020లో 287 డిజైన్లలో చీరల తయారీకి రూ.317 కోట్లు ఖర్చు చేయబడింది. సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ లోని మరమగ్గాలపై ఈ చీరలు తయారయ్యాయి. కరోనా నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్ళి చీరలను అందజేశారు. అప్పుడు తీసుకోలేని వారికి 2020 అక్టోబరు 12 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల ద్వారా చీరలు పంపిణీ చేశారు.[4]
  5. 2021: 2021 సంవత్సరంలో కోటి బతుకమ్మ చీరల తయారీకి 318 కోట్ల రూపాయలను ఖర్చుచేశారు. దాదాపు 16 వేల మగ్గాలపై పదివేల నేత కుటుంబాలు ఆరునెలలపాటు శ్రమించి చీరలను తయారు చేశాయి. గతంలో మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించి, ఈసారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 రంగులతో, డాబీ అంచుతో సరికొత్తగా రూపొందించారు. వృద్ధులకు 6.3 మీటర్లు, ఇతరులకు 5.5 మీటర్ల చీరలను తయారు చేశారు. సిరిసిల్లలో 75 లక్షలు, వరంగల్లులో 13 లక్షలు, కరీంనగర్ లో 12 లక్షల చీరలు తయారుచేయబడ్డాయి.[5]
  6. 2022: 2022 సంవత్సరంలో 1.10 కోట్ల చీరల తయారీకి 333 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలతో చీరెలను రూపొందించడంతోపాటు ప్రత్యేకంగా చీరల డాబీ అంచుతో 100% పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలు తయారుచేయబడ్డాయి. 6 మీట్లర్ల (5.50 + 1.00) మీటర్ల పొడవుగల 92.00 లక్షల సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారుచేయించారు. ఈ చీరెల తయారీకి సిరిసిల్లలోని 16 వేలమంది నేత కార్మికులకు పనులను అప్పగించింది. ఆగస్టు 22వ తేది నుండి నుంచి జిల్లాలకు చేరవేసి, సెప్టెంబరు 22వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో, వార్డుల్లో లబ్ధిదారులకు అందజేశారు.[6]
  7. 2023: 2023 సంవత్సరానికి బతుకమ్మ చీరల పంపిణీకోసం ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌లో 400 కోట్ల రూపాయలను ప్రతిపాదించి 2023 జూన్ 30న 351.52 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[7] 2022 వరకు రాష్ట్ర చేనేత సహకార సంస్థ నుంచి అందించిన బతుకమ్మ చీరల ఆర్డర్లు, ఈ సంవత్సరం తెలంగాణ పవర్ లూం టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి అందించారు. 21 రంగులు, 25 డిజైన్లతో దాదాపు 500 వెరైటీల్లో 5 కోట్ల 54 లక్షల 78 వేల 550 మీటర్ల బట్ట ఉత్పత్తిలో 95 లక్షల 90 వేల 700 బతుకమ్మ చీరల ఉత్పత్తి జరుగగా సిరిసిల్లలోని 139 మ్యాక్స్ సొసైటీలకు 3,70,37,000 మీటర్లు, 64,03,600 చీరలు, 126 ఎస్ఎస్ఐ యూనిట్లకు 1,84,41,850 మీటర్లు, 31,87,100 చీరల ఉత్పత్తి ఆర్డర్లను ఇచ్చారు.[8] 2023 అక్టోబరు 4వ తేదీనుండి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు.[9]

మూలాలు

[మార్చు]
  1. "225 రకాలతో 90 లక్షల బతుకమ్మ చీరలు ఆర్డర్". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-30. Archived from the original on 2021-12-01. Retrieved 2022-01-20.
  2. "Telangana State Portal బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసే కార్యక్రమంపై సీఎం సమీక్ష". www.telangana.gov.in. 2017-08-26. Archived from the original on 2018-01-11. Retrieved 2022-01-20.
  3. "కోటి బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం". Zee News Telugu. 2019-09-19. Archived from the original on 2022-01-20. Retrieved 2022-01-20.
  4. "Bathukamma Sarees: రేపట్నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ… - Telugudunia". www.telugudunia.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-08. Archived from the original on 2022-01-20. Retrieved 2022-01-20.
  5. "చ‌క‌చ‌కా బ‌తుక‌మ్మ చీర‌ల ప్యాకింగ్‌!". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-28. Archived from the original on 2022-01-20. Retrieved 2022-01-20.
  6. telugu, NT News (2022-09-21). "రేపటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ : కేటీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-09-21. Retrieved 2022-09-21.
  7. "బతుకమ్మ చీరల కోసం నిధులు విడుదల". www.suryaa.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-06. Retrieved 2023-07-06.
  8. "Rajanna Siricilla: 21 రంగులు, 25 డిజైన్లు, దాదాపు 500 వెరైటీల్లో బతుకమ్మ చీరల ఉత్పత్తి..!". News18 Telugu. 2023-03-07. Archived from the original on 2023-03-08. Retrieved 2023-07-06.
  9. Chary, Maheshwaram Mahendra (2023-10-04). "Bathukamma Sarees : 250 డిజైన్లలో బతుకమ్మ చీరలు… పంపిణీ ప్రారంభం". Hindustantimes Telugu. Archived from the original on 2023-10-05. Retrieved 2023-10-05.