జ్యోతిర్మఠం
జ్యోతిర్మఠము అని పిలిచే బదరీనాధ్ ఆశ్రమం ఆది శంకరులు స్థాపించిన నాలుగు మఠాలలో ఒకటి. దీనిని ఉత్తరామ్నాయ మనీ, బదరికాశ్రమం అని కూడా అంటారు. దీన్ని జోషిమఠ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో జోషిమఠ్ పట్టణంలో ఉంది. సముద్రమట్టం నుండి 1875 మీ. ఎత్తులో ఉన్న ఈ పట్టణం అనేక హిమాలయ పర్వత శిఖరారోహణ యాత్రలు, ట్రెక్కింగు యాత్రలకు, బద్రీనాథ్ యాత్రకూ ప్రవేశ ద్వారం.
మఠ విశేషాలు
[మార్చు]జ్యోతిర్మఠం ఉత్తరామ్నాయ మఠం. ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు ప్రధానమైన పీఠాల్లో ఇదొకటి. మిగతా మూడూ శృంగేరి, పూరి, ద్వారకల్లో ఉన్నాయి. ఈ మఠాల ఆచార్యులను " శంకరాచార్య " అని అంటారు. ఆది శంకర ప్రారంభించిన సంప్రదాయం ప్రకారం ఈ మఠం అధర్వవేదానికి నేతృత్వం వహిస్తుంది. జ్యోతిర్మఠ బదరీనాథ్ పట్టణం దగ్గర ఉంది. ఈ ప్రదేశం గురు గోవింద్ ఘాట్ లేదా వాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కుకు వెళ్ళే ప్రయాణికులకు స్థావరం. ఇక్కడి నరసింహ ఆలయం లోని ప్రధాన దేవత నరసింహ స్వామి. దీన్ని ఆది శంకరులు స్థాపించాడని నమ్ముతారు. ఇది 108 " వైష్ణవ దివ్య దేశాలలో " ఒకటి.[1]
- ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం.
- పీఠ దేవత నారాయణుడు
- పీఠ శక్తి పూర్ణగిరి.
- పీఠ తీర్థం అలకనంద (గంగానది).
వీరిది నందవాళ సాంప్రదాయం. ఈ మఠ సన్యాసులు "గిరి", "పర్వత", "సాగర" యోగపట్టములను ధరిస్తారు. ఇక్కడ అథర్వణ వేదము ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. అయమాత్మా బ్రహ్మ అనేది ఈ మఠపు మహావాక్యము. ఈ మఠానికి తోటకాచార్యుడు మొదటి అధిపతి. భారతదేశపు ఉత్తర భాగం ఈ మఠం పరిధిలోకి వస్తుంది.
స్థల చరిత్ర
[మార్చు]సా.శ. 7, 11 వ శతాబ్దాల మధ్య, కట్యూరి రాజులు తమ రాజధాని కుమావున్ లోని "కట్యూర్" నుండి (ఆధునిక బైజ్నాథ్ ) లోయలోని వివిధ ప్రాంతాలను పరిపాలించారు. కత్యూరి రాజవంశాన్ని వాసుదేవ్ కత్యూరి స్థాపించాడు. జోషిమఠ్ వద్ద ఉన్న పురాతన బాస్‌దేవ్ ఆలయం వాసుదేవ్ కు ఆపాదించబడింది. వాసుదేవ్ బౌద్ధ మూలానికి చెందినవాడు, కాని తరువాత బ్రాహ్మణ పద్ధతులను అనుసరించాడు. సాధారణంగా కట్యూరి రాజులు అనుసరించిన బ్రాహ్మణ పద్ధతులకు కారణం ఆది శంకరు (సా.శ. 788-820) చేసిన తీవ్రమైన ప్రచారం కారణమని చెప్పవచ్చు.[2]
11 వ శతాబ్దంలో కట్యూరి రాజులను ఓడించి చాంద్ రాజులు అధికారానికొచ్చారు.