బేతాళ పంచవింశతిక
బేతాళ పంచవింశతిక అనేది వేదం వెంకటరాయశాస్త్రి సులభ గ్రాంధిక శైలిలో అనువదించారు. 1910 ప్రాంతంలో ప్రెస్ పెట్టిన తరవాత దానికి పని కల్పించడానికి ఈ అనువాదం చేసి అచ్చువేసి ఉంటారు. తొలి ఆరుపేజీలు లేవు, ముద్రణ కాలం తెలియదు. సంస్కృతంలోనో, ప్రాకృతంలోనో మొదట ఇది మౌఖిక సాహిత్యంగా ప్రచారంలో ఉండి, తర్వాత గ్రంధస్థం చేయబడి ఉండవచ్చు. ఈ పుస్తకాలు ఆరోజుల్లో కేవలం చదువుకొన్న వారిని దృష్టిలో ఉంచుకొని గ్రంథస్తం చేసినవి. వినోదంకోసం, కాలక్షేపంకోసం కూర్చిన కథలే అయినా ఆనాటి సమాజాన్ని గురించి అక్కడక్కడా కొన్ని విషయాలు తెలుస్తాయి.
కథా వస్తువు
[మార్చు]కథల్లో దాదాపు కథానాయకులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. ఒక్క కథలో మాత్రం రజకులే పాత్రలు. మరొక కథలో సాలె అమ్మాయి నాయిక. దుష్ట బ్రాహ్మణులు, హంతకులు, కటికవాళ్లు, వైద్యులు, మోసగాళ్ళయిన పైకులాలవాళ్ళు, మోసగత్తెలు, భర్తను వంచించి, పరపురుషులతో సంబంధాలు కొనసాగించే గ్రంథసాంగురాలు, ఇంకా కొన్ని పురుషుల కథలు ఇందులో ఉన్నాయి. ప్రతికథ చివర బేతాళుడు కథలోని ధర్మసందేహాన్ని వివరించమని అడగడం, విక్రమార్కుడు ఆనాటి విశ్వాసాలు, నైతికత ప్రకారం తీర్పు చెప్పడం ఉంటుంది.
మంచి మహిళలు, దుష్టస్త్రీలు, దుష్టపురుషులు, మాంత్రికులు, మహర్షులు, పరకాయ ప్రవేశాలు, పునర్జన్మలు, ధనాశతో హత్యలు, నేరాలు, కొందరు ఉన్నతమయిన నడవడిక గలిగిన వ్యక్తులు, నీతిమంతులయిన దొంగలు పాత్రలు. ఏమైనా స్త్రీ పాపం చేస్తుందని, స్త్రీని నమ్మరాదని ఈ కథల్లో అంతర్లీనంగా సందేశం ఉంటుంది.
కొన్ని కథల్లో వైశ్యులను పిసనారులుగా, హాస్యానికి వాడుకోడం వుంది. ఇందుులో వైశ్యుులు వణిక్కులు, ఓడవ్యాపారులు, అపర కుబేరులు, దేశమేలే రాజుతో వియ్యమందతగిన యోగ్యతకల పాత్రలుగా చిత్రించబడ్డారు.
ఇతర వివరాలు
[మార్చు]వెంకటరాయశాస్త్రి బేతాళ పంచవింశతికను అనువదించి నూరేళ్లవుతున్నా, తెలుగుభాషలో ప్రవేశం ఉన్న ఎవరైనా చదివి ఆనందించగలరు. అనువాదంలో ఆయన వాడిన కొన్ని పదాలు, పదబంధాలు ఇప్పటి పాఠకులకు పరిచయంలేకపోవచ్చు. ఇల్లడకన్య అంటే పెంచుకున్న కన్య. ఓడప్రయాణాన్ని సబురు అంటారు. సఫర్ తెలుగులో సబురు అయివుంటుంది. అచ్చికలుమచ్చికలు అంటే సరస సల్లాపాలు. జీబు అంటే పొద, అరణ్యంలో చెట్లు దట్టంగా పెరిగిన చోటు. ఒక కథలో బోధిసత్వుడి ప్రస్తావన వస్తుంది. మరొక కథలో ధాన్యం దంచుతున్న శబ్దం వినగానే రాజకుమార్తె చేతులు కందిపోయినట్లు వర్ణన. హడావిడి అనే అర్థంలో హావడి అని వాడబడింది. భాష, చరిత్ర, సమాజం వంటి విషయాలమీద ఆసక్తి కలిగించే పుస్తకం. బేతాళ పంచవింశతికి తెలుగు, ఇంగ్లీషు, ఇతర భాషల్లో అనుకరులు అనువాదాలు లభిస్తున్నాయి.