బొమ్మ హేమాదేవి
బొమ్మ హేమాదేవి | |
---|---|
స్థానిక పేరు | రుక్మిణి |
జననం | యమున 1931 సెప్టెంబరు 14 నిజామాబాద్, తెలంగాణ |
మరణం | 1996 నవంబరు 26 హైదరాబాద్ | (వయసు 65)
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
మతం | హిందూ |
భార్య / భర్త | బొమ్మ నారాయణగౌడ్ |
పిల్లలు | శోభారాణి, అలకనంద, అర్చన, ఆరాధన, అనిల్‌చంద్ర, అశోక్‌చక్రవర్తి |
తండ్రి | రామాగౌడ్ |
తల్లి | గంగాదేవి |
బొమ్మ హేమాదేవి తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముఖ నవలా రచయిత్రి[1] .
విశేషాలు
[మార్చు]బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఈమె నిజామాబాదులో1931, సెప్టెంబర్ 14వ తేదీన రామాగౌడ్, గంగాదేవి దంపతులకు జన్మించింది. ఈమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు యమున. అపర దానకర్ణుడు రాజా నర్సాగౌడ్ పెద్ద మనుమరాలు ఈమె[2]. ఈమెను, ఈమె చెల్లెలు రంజనను అప్పట్లో నిజాం రాష్ట్రంలో ఒకే ఒక తెలుగు మీడియం పాఠశాల హైదరాబాదు నారాయణగూడ లోని "ఆంధ్ర గర్ల్స్ హైస్కూలు" (తరువాతి కాలంలో మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హైస్కూలు అని పిలువడింది)లో చదివించారు.
వివాహం, కుటుంబ జీవితం
[మార్చు]ఈమెకు 16వ యేట కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన బొమ్మ నారాయణగౌడ్‌తో వివాహం జరిగింది. వివాహం తరువాత ఈమె పేరు రుక్మిణిగా మారింది. నారాయణగౌడ్ ఈమె తాత రాజానర్సాగౌడ్ ఆర్థిక సహాయంతో ఇంటర్, ఇంజనీరింగ్ చదివాడు. అతడు నీటిపారుదల, రోడ్లు, భవనాల ఇంజనీరుగా పనిచేశాడు. వీరి కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. ఈ దంపతులకు శోభారాణి, అలకనంద, అర్చన, ఆరాధన అనే నలుగురు కుమార్తెలు, అనిల్‌చంద్ర, అశోక్‌చక్రవర్తి అనే ఇద్దరు కుమారులు కలిగారు.
రచనావ్యాసంగం
[మార్చు]ఈమె దేవిరమ, యమున అనే కలం పేర్లతో 1960ల నుంచి 40కి పైగా నవలలు, కథలు, విస్తృతంగా వ్రాసింది. ఈమె మొదటి నవల 1960లో వెలువడిన భావన భార్గవి. 1973 లో తన కోడలి పేరు హేమాదేవి పేరుతో వ్రాసిన “కుంకుమ పూలు" అనే కథకు మొదటి బహుమతి లభించింది. అప్పటి నుండి ఆమె బొమ్మ హేమాదేవి అనే పేరుతో రచనలు చేసింది. ఈమె రచనలు జయశ్రీ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ప్రజాతంత్ర, తరుణ, కళాసాగర్, అనామిక, సామ్య, ప్రభవ మొదలైన పత్రికలలో ప్రచురితమయ్యాయి. వనజ - అడవి పుత్రిక నవలను 1995వ సంవత్సరంలో వ్రాసింది. ఇది విప్లవోద్యమంలో, దళాలలో పనిచేసిన ఒక మహిళ ఆత్మకథ. వనజ (పద్మక్క) ఉద్యమ జీవితాన్ని ఈ నవలలో చక్కని శైలితో చిత్రించింది. ఈమె దాదాపు వంద కథలు వ్రాసింది. తెలుగులో తొలి బిసి స్త్రీ వాద రచయిత్రి[2]. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2017, డిసెంబరు 14వ తేదీన హైదరాబాద్ లో సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో "బొమ్మ హేమాదేవి కథలు" పుస్తకం వెలువడింది[3].
రచనలు
[మార్చు]ఈమె రచనల పాక్షిక జాబితా:
నవలలు
[మార్చు]- భావన భార్గవి
- నవధాన్యాలు
- నవరసాలు
- దీప
- తార
- లవ్‌స్టోరీ
- తపస్విని
- కుంకుమ పూలు
- నవభారతి
- వనజ - అడవి పుత్రిక
- ప్రేమే నేరమౌనా?
కథలు
[మార్చు]- అన్నపూర్ణ
- అభయ
- ఆలింగనము
- ఇజా జత్ హై
- ఏక్ స్కూటర్ కీ వాపసీ
- కమ్ లీ
- కుంకుమపూలు
- కుంజ్ కిషోర్
- చిరుదీపం
- ఛోటీ ఛోటీ బాతేఁ
- నవతరం
- ఫాల్స్ ప్రైడ్
- బాంచెన్ దొరసానీ!
- బాంధవి
- మానవులు
- మిస్టర్ అనంత్
- మేఘన
- రామాయణంలోని...
- శాంతినిలయం
రేడియోనాటికలు
[మార్చు]- పొగమంచు
మరణం
[మార్చు]ఈమె తన 65వ యేట 1996, నవంబరు 26వ తేదీన మరణించింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ సయ్యద్, అఫ్రీన్ బేగం (12 September 2016). "తెలంగాణాలో 'నవలా'మణులు". నమస్తే తెలంగాణ. Retrieved 7 January 2018.
- ↑ 2.0 2.1 జ్వలిత (11 July 2016). "స్వంత సామాజికస్పృహ లేని బిసి రచయిత్రులు". మన తెలంగాణ. Retrieved 7 January 2018.[permanent dead link]
- ↑ "ఐ ప్యాడ్‌లో తెలుగును పొందుపరచాలి : ఎంపీ కవిత". Archived from the original on 2017-12-17. Retrieved 2018-01-07.
- ↑ బొమ్మ, హేమాదేవి (1 December 2017). సంగిశెట్టి శ్రీనివాస్ (ed.). బొమ్మ హేమాదేవి కథలు (1 ed.). హైదరాబాద్: తెలంగాణా పబ్లిషర్స్. pp. 11–13.