సంగిశెట్టి శ్రీనివాస్
సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీ కారుడు. తెలంగాణ సాహిత్య, చరిత్ర పరిశోధనతో ఆయన పేరు మమేకమైంది. పరిశోధనే ప్రధాన ధ్యేయంగా ఆయన అమూల్యమైన సాహిత్య, చారిత్రక సంపదను వెలికి తీసి తెలుగు సమాజానికి చేర్పును అందిస్తున్నారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు పరిశోధన లో కీర్తి పురస్కారాన్ని ప్రకటించారు.[1] 2016లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[2]
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన యాదాద్రి-భువనగిరి జిల్లాలోని రఘునాథపురంలో జన్మించారు. వారిది సామాన్య కుటుంబం. వారి తండ్రి సదువుకోకపోయినా ఇప్పటి ఏ ఫ్యాషన్ డిజైనర్‌కు తీసిపోని విధంగా బట్టలను డిజైన్ చేసేవారు. తల్లి చేనేత పనులైన ఆసు పోయుట, కండెలు చుట్టుడు, వంటి పనులన్నీ చేసేది. ఇంటి పని, శాల పనే గాకుండా ఇంట్లో మగ్గాలు నేసే నేతగాళ్ల పెండ్లిళ్లు చేయించేది కూడా. తన బంగారు కడెం అమ్మి కూడా వాండ్ల పెండ్లిళ్లు చేసిందంటే ఆమె గుణం అర్థం చేసుకోవచ్చు. అన్నీ తానే అయి చూసుకున్న వారి అమ్మ వజ్రమ్మ మూలంగానే ఆయనతో పాటు వారి అయిదుగురు అన్నదమ్ములు ఎవ్వరి కాళ్ల మీద వాళ్లు నిలబడేవిధంగా ఎదిగినారు.[3]
ఉస్మానియాలో మొదట జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చేసారు. అది ప్రవృత్తికి తోడ్పడింది. లైబ్రరీసైన్స్‌లో చేసిన మాస్టర్స్ డిగ్రీ ఉద్యోగానికి ఉపయోగ పడింది. అంతకు ముందు అఫ్జల్ గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో రోజూ రాత్రి పన్నెండు గంటలవరకు చదువుకోవడం కూడా ఆయన అధ్యయనానికి మెరుగులు దిద్దింది.
ఆంధ్రప్రాంతానికి, ఆంధ్రప్రాంత పత్రికలకు సంబంధించినవి కావడంతో మరి తెలంగాణ ప్రాంతంలో పత్రికలు లేవా? అని వేసుకున్న ప్రశ్నకు జవాబుగా వచ్చిన ఆయన పరిశోధనే ‘షబ్నవీస్ తెలంగాణ పత్రికా రంగ చరిత్ర'. ఆ తర్వాత దస్త్రమ్ పేరిట విస్మరణకు గురయిన తొలినాటి వెయ్యి కథల్ని లెక్కగట్టి చెప్పడం జరిగింది. ఇది పరిశోధకుడిగా ఆయన తొలి ప్రస్థానం. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధిస్తూ సాహిత్యం అంతగా రాలేదు అని తెలంగాణ, తెలంగాణేతర విమర్శకులు లోతుల్లోకి పోకుండా వ్యాఖ్యానాలు చేయడంతో ఆయన మిత్రుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి రెండేండ్లు శ్రమపడి 1969 తెలంగాణ ఉద్యమ కవిత్వాన్ని వెలువరించారు.
తెలంగాణ హిస్టరీ సొసైటీ ప్రారంభం నుంచి దాంట్లో భాగస్వామియై ఆ సంస్థ తరపున అచ్చేసిన అన్ని పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు. ఈ సొసైటీ ద్వారా 1948 భిన్న దృక్కోణాలూ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విద్రోహ చరిత్ర, 1969 ఉద్యమ చారిత్రక పత్రాలు వెలువరించారు. ఈపుస్తకాలు తెలంగాణలో ఉద్యమ వ్యాప్తికి, ఇంటలెక్చువల్స్‌కు వివిధ విషయాలపై అవగాహన కలిగేందుకు తోడ్పడ్డాయి.
తెలుగు విశ్వవిద్యాలయం కోసం సుజాతా రెడ్డితో కలిసి దాదాపు 1150 పేజీల్లో 110 యేండ్ల తెలుగు కథా సాహిత్యంలోని మెరుగైన ఆణిముత్యాల్లాంటి కథలను 120 సేకరించి సంకలనం చేయడం జరిగింది. ఇందులో మొత్తం తెలుగు సాహిత్యంలో తెలంగాణ కథకులకు సాధికారికమైన వాటా దక్కిన గ్రంథమిది.
రచనలు[మార్చు]
- తొలి తెలుగు కథకురాలుభండారు అచ్చమాంబ
- 1969 తెలంగాణ ఉద్యమ కవిత్వం
- కమ్యునిజమా? కోస్తావాదమా?
- ఛీ! కృష్ణ కమిటి
- వట్టికోట ఆళ్వారుస్వామి చరిత్ర (ఎన్.వేణుగోపాల్‌తో కలిసి)
- హైదరాబాద్ సిర్ఫ్ హమారా!
- షబ్నవీస్
- దస్త్రమ్
- ఆవుల పిచ్చయ్య కథలు : ఆవుల పిచ్చయ్య రాసిన కథల సంపుటి
- గాయపడ్డ తెలంగాణ
- ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దళిత పెయింటర్, తెలంగాణ బిడ్డ కుమారిల స్వామి
- కొండా లక్ష్మణ్ బాపూజీ (మోనోగ్రాఫ్)
- వట్టికోట ఆళ్వారుస్వామి (మోనోగ్రాఫ్)
- మాదిరెడ్డి సులోచన కథలు (సంపాదకత్వం కె.విద్యావతితో కలిసి)
- బొమ్మ హేమాదేవి కథలు (సంపాదకత్వం)
- సుషుప్తి (మాదిరెడ్డి సులోచన నవల - సంపాదకత్వం)
- శ్రీవాసుదేవరావు కథలు (సంపాదకత్వం)
- తెలంగాణ నవలా చరిత్ర
- ఇందుమతి కవిత్వం (సంపాదకత్వం)
- అలుగు (సంపాదకత్వం వెల్దండ శ్రీధర్‌తో కలిసి)
- కూరాడు (సంపాదకత్వం వెల్దండ శ్రీధర్‌తో కలిసి)
- తొలి తెలుగు దళిత కథా రచయిత్రి తాడి నాగమ్మ కథలు, రచనలు (సంపాదకత్వం వెల్దండ శ్రీధర్‌తో కలిసి)
- బహుళ (తెలంగాణ ప్రత్యేక సాహిత్య సంచిక, సంపాదకత్వం సుంకిరెడ్డి నారాయణరెడ్డి, స్కైబాబాలతో కలిసి)
- పడుగుపేకలు (చేనేత కథలు సంపాదకత్వం)
జర్నలిస్టుగా[మార్చు]
జర్నలిస్టుగా ఆయన ప్రస్థానం 1991లో ఉదయం దినపత్రికలో కె.రామచంద్రమూర్తి శిక్షణలో జర్నలిస్టుగా చేరడంతో ఆరంభమయింది. ఆనాడే పాశం యాదగిరి, కె.శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి, అమరుడైన జర్నలిస్టు గులాం రసూల్‌తో కలిసి పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఎన్నో విషయాల్ని, ఎందరో వైతాళికుల్ని వివిధ పత్రికల ద్వారా వెలుగులోకి తీసుకురావడమైంది. సోయి సాహిత్య పత్రికతో పాటు, వివిధ దినపత్రికల్లో వ్యాసాలు అనేకం రాయడమైంది. అలాగే గతంలో తెలంగాణ టైమ్స్, చర్చ పత్రికలో రెగ్యులర్ కాలమ్ నిర్వహించి తెలంగాణ వెలుగుల్ని, సామాజిక/రాజకీయ అంశాల్ని వరుసగా ఆ రెండు పత్రికల్లో వెలువరించారు.[4]
సంపాదకుడిగా[మార్చు]
తెలంగాణ కథా సిరీస్
పురస్కారాలు[మార్చు]
- పరిశోధన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2013)[5]
చిత్రావళి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
- ↑ Mee Kosam, Telangana (31 May 2016). "Telangana State Level Awards List 2016". www.meekosam.co.in. Archived from the original on 8 ఆగస్టు 2016. Retrieved 1 October 2021.
- ↑ మా అమ్మ రెక్కల కష్టమే పార్ట్ 2...
- ↑ మా అమ్మ రెక్కల కష్టమే పార్ట్ 3...
- ↑ "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.