కాసుల ప్రతాపరెడ్డి
కాసుల ప్రతాపరెడ్డి | |
|---|---|
| జననం | కాసుల ప్రతాపరెడ్డి 1962 జులై 10 |
| పేరుపడ్డది | రచయిత, పాత్రికేయుడు |
జీవిత విశేషాలు
[మార్చు]రాంరెడ్డి, సత్తెమ్మ దంపతులకు 1962, జులై 10 వ తేదీన యాదాద్రి - భువనగిరి జిల్లా, రాజాపేట మండలం, బొందుగుల గ్రామంలో జన్మించాడు.[1] ఇతని ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య స్వగ్రామంలోనే నడిచింది. ఇంటర్‌మీడియట్ హైదరాబాదు లోని ఆలియా కాలేజిలో చదివాడు. తరువాత సికందరాబాదు లోని సర్దార్ పటేల్ కాలేజిలో బి.ఎస్.సి. చదివాడు. అక్కడ తిరుమల శ్రీనివాసాచార్య ఇతని గురువు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ తెలుగు సాహిత్యంలో చేరాడు. సి.నారాయణరెడ్డి, నాయని కృష్ణకుమారి, ఎస్వీ రామారావు, ఎల్లూరి శివారెడ్డి, సుమతీ నరేంద్ర ఎం.ఎ.లో ఇతని గురువులు. ఎం.ఎ. తరువాత "తెలుగు నవల- వ్యాపారధోరణి" అనే అంశంపై పరిశోధించి ఎంఫిల్ పట్టా సంపాదించాడు. ఆ తర్వాత ఉదయం దినపత్రికలో రిపోర్టర్ గా ఉద్యోగం ప్రారంభించాడు. వన్ ఇండియా డాట్ కామ్‌లో తెలుగు విభాగానికి సంపాదకుడిగా ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ప్రస్తుతం ఏషియానెట్ న్యూస్ తెలుగు వెబ్ సైట్ సంపాదకుడిగా పనిచేశారు. 2023 నవంబర్ లో పదవీ విరమణ చేశారు.

కాసుల ప్రతాపరెడ్డి సుప్రభాతం అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్న కాలంతో పలువురు కొత్త రచయితలను ఆయన వెలుగులోకి తెచ్చారు. ఆయన రాసిన వెంటాడిన అవమానం కథ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లోనూ కాకతీయ విశ్వవిద్యాలయం లోనూ ఎం.ఎ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. ఆయన సాహిత్యంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో కాసుల ప్రతాపరెడ్డి సాహిత్యం: సమగ్ర విశ్లేషణ పేరుతో మద్దిరాల సత్యనారాయణ రెడ్డి పరిశోధన చేసి పిహెచ్ డి పట్టా పొందారు. 2013లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారి అబ్బూరి రామక్రిష్ణారావు, అబ్బూరి వరద రాజేశ్వరరావు కీర్తి పురస్కారం అందుకున్నారు. ఆచార్య సుమతీ నరేంద్ర తన అమ్మమ్మ పేర నెలకొల్పిన ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ అవార్డును ఆయన తెలంగాణ సారస్వత పరిషత్ నుంచి అందుకున్నారు.
2023వ సంవత్సరానికి గాను పత్రికా రంగంలో చేసిన విశేష కృషికి గాను సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ నుంచి పత్రికా రంగంలో చేసిన విశేేష కృషికి గాను సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్య సేవకు గాను 2025లో సినారె సాహిత్య పురస్కారంతో సినారె సాహిత్య కళా పీఠం ఆయనను సత్కరించింది. హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయంలో దక్షిణ భారతదేశ సాహిత్య విమర్శల సదస్సులో 2025 ఆగస్టు 5వ తేదీన తెలుగు సాహిత్య విమర్శపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. [2]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈ వేదిక తరఫున ఆయన సంపాదకత్వంలో ’తెలంగాణ తోవలు‘ అనే పుస్తకం వెలువడింది. సాహిత్యంతో పాటు వివిధ అంశాలపై తెలంగాణకు సంబంధించిన విషయాలను ఎలా అర్థం చేసుకోవాలో వివరించే 18 మంది రచయితల వ్యాసాలు ఉన్నాయి. ’వాళ్లూ - మనమూ‘ అనే వ్యాసంలో కాసుల ప్రతాపరెడ్డి కోస్తాంధ్ర, తెలంగాణ సాహిత్యంలోని వివిధ ధోరణులను తులనాత్మకంగా విశ్లేషించారు. తెలంగాణ సాహిత్యాన్ని విశ్లేషించడానికి కోస్తాంధ్ర విమర్శనా కొలమానాలు సరిపోవని గుర్తించిన మొదటి రచయిత కాసుల ప్రతాపరెడ్డి. మలి దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన పుస్తకం ’తెలంగాణ తోవలు’. తెలంగాణ నవలపై సమగ్రమైన విశ్లేషణ చేసిన రచయిత కూడా ఆయనే.[3]
రచనలు
[మార్చు]- తెలుగు నవల- వ్యాపారధోరణి
- ఎల్లమ్మ ఇతర కథలు
- గుక్క దీర్ఘకవిత, ఇతర కవితలు
- తెలంగాణ తోవలు (సంపాదకత్వం)
- తెలంగాణ కథ -దేవులాట (సంపాదకత్వం)
- మే 31 (సంపాదకత్వం)
- ఇరుసు (వ్యాసాలు)
- భౌగోళిక సందర్భం (వ్యాసాలు)
- తెలంగాణ సందర్భాలు (వ్యాసాలు)
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు- రాజకీయ, సాంస్కృతికోద్యమాలు (వ్యాసాల సంకలనం)
- తెలంగాణ సాహిత్యోద్యమాలు (వ్యాసాల సంకలనం) [4][2]
- కొమురం భీమ్ (మోనోగ్రాఫ్)
- జీవితమే ఉద్యమమై.. (శంకర్ గుహ నియోగి జీవితంపై అనువాదం)
- పడి లేచిన తెలంగాణ (అనువాదం)
- బోజ జంగయ్య (మోనో గ్రాఫ్)
- కొలుపు (సాహిత్య వ్యాసాలు)
- శిలువకు తొడిగిన మొగ్గ (కథల సంపుటి)
- తెలంగాణ నవలా వికాసం (తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ)
- ముదిగంటి గోపాల్ రెడ్డి (మోనోగ్రాఫ్)
పురస్కారాలు
[మార్చు]- ఎల్లమ్మ ఇతర కథలు పుస్తకానికి సురమౌళి అవార్డు
- 2013లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి అబ్బూరి రామకృష్ణారావు – అబ్బూరి వరదరాజేశ్వరరావు కీర్తి పురస్కారం.
ఇతర లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెంపులేని దేవులాటే నా సాహిత్య విమర్శ: కాసుల ప్రతాపరెడ్డి
- ↑ 2.0 2.1 ఆంధ్రజ్యోతి, సాహిత్యం. "తెలంగాణ సాహిత్య చరిత్ర దిశగా..." Retrieved 27 July 2016.[permanent dead link]
- ↑ తెలంగాణ తోవలు.
- ↑ నిజామాబాద్ న్యూస్ (November 24, 2015). "సాహితీ సర్జన్ ప్రతాపరెడ్డి". సంగిశెట్టి శ్రీనివాస్. Archived from the original on 22 ఏప్రిల్ 2016. Retrieved 27 July 2016.