Jump to content

భగవద్గీత-క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

వికీపీడియా నుండి
భగవద్గీత
యోగములు
1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస
గీతా మహాత్యము
గీత సంస్కృత పాఠము
గీత తెలుగు అనువాదము
హిందూధర్మశాస్త్రాలు

గమనిక


క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము, భగవద్గీతలో పదమూడవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అర్జునుడు:

ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము అనగా ఏమిటి?

కృష్ణుడు:

దేహాన్ని క్షేత్రమని, దీనిని తెలుసుకొన్నవాన్ని క్షేత్రజ్ఞుడని అంటారు. నేనే క్షేత్రజ్ఞున్ని. క్షేత్రక్షేత్రజ్ఞులను గుర్తించడమే నిజమైన మతం. వీటి గురించి క్లుప్తంగా చెప్తాను విను. ఋషులు అనేకరకాలుగా వీటిగురించి చెప్పారు. బ్రహ్మసూత్రాలు వివరంగా చెప్పాయి. పంచభూతాలు, అహంకారం, బుద్ధి, ప్రకృతి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, ఇంద్రియ విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రుచి, వాసనలు, ఇష్టద్వేషాలు, తెలివి, ధైర్యం ఇవన్నీ కలిసి క్షేత్రమని క్లుప్తంగా చెప్పారు.

అభిమానము, డంబము లేకపోవడం, అహింస, ఓర్పు, కపటం లేకపోవడం, గురుసేవ, శుచిత్వం, నిశ్చలత, ఆత్మనిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం, నిరహంకారం, ఈ సంసార సుఖదుఃఖాలను నిమిత్తమాతృడిగా గుర్తించడం, భార్యాబిడ్డలందు, ఇళ్ళుల యందు మమకారం లేకపోవడం, శుభాశుభాల యందు సమత్వం, అనన్య భక్తి నాయందు కల్గిఉండడం, ఏకాంత వాసం, నిరంతర తత్వ విచారణ వీటన్నిటిని కలిపి జ్ఞానం అని చెప్పబడతోంది. దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానం.

సత్తు లేక అసత్తు అని చెప్పలేని సనాతన పరబ్రహ్మాన్ని తెలుసుకొంటే మోక్షం వస్తుంది. ఈ విశ్వమంతా అదే వ్యాపించి ఉంది. ఈ పరబ్రహ్మతత్వం అన్నిటియందు కలిసిఉన్నట్లు కనిపించినా దేనితోనూ కలవదు. కాని అన్నిటినీ భరిస్తూ పోషిస్తోంది. నిర్గుణమై ఉండీ గుణాలను అనుభవించేదీనని తెలుసుకో.

అది సర్వభూతాలకూ లోపలా, బయట కూడా ఉంది. అది సూక్షం. తెలుసుకోవడం అసాధ్యం. గుర్తించిన వారికి సమీపంలోనూ, మిగతావారికి దూరంలో ఉంటుంది. ఆ పరమాత్మ అఖండమై ఉన్నప్పటికీ అన్ని జీవులలోనూ విభజింపబడి ఉన్నట్లు కనపడుతుంది. సృష్టిస్థితిలయ కారకం అదే. అది సూర్యుడు, అగ్నులకు తేజస్సును ఇస్తుంది. చీకటికి దూరంగా ఉంటుంది. అదే జ్ఞానం, జ్ఞేయం, సర్వుల హృదయాలలో ఉండేది. జ్ఞానం, జ్ఞేయం, క్షేత్రం ఈ మూడూ తెలుసుకొన్న వాడు భక్తుడై మోక్షం పొందగలడు. ప్రకృతి పురుషులు తెలియబడని మొదలు గలవి. దేహేంద్రియ వికారాలు, త్రిగుణాలు, సుఖదుఃఖాలు ప్రకృతి వలనే పుడుతున్నాయి. దేహ, ఇంద్రియాల పనికి ప్రకృతి-సుఖదుఃఖాల అనుభవానికి పురుషుడు మూలం. జీవుడు త్రిగుణాల వలన సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు. వివిధ జన్మలకు గుణాల కలయికే కారణం. తాను ఈ శరీరమందే ఉన్నప్పటికీ దీనికి అతీతుడు, స్వతంత్రుడు, అనుకూలుడు, సాక్షి, పోషకుడు, భోగి ఐన పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఈ విషయాల గురించి బాగా తెలుసుకొన్నవాడు ఏ కర్మలు చేసినా తిరిగి జన్మించడు. కొందరు ఆ పరమాత్మను పరిశుద్ధ సూక్ష్మబుద్ధితో హృదయంలోనూ, మరికొందరు యోగధ్యానం వలనా, జ్ఞానయోగం వలనా, కొందరు నిష్కామయోగం ద్వారా దర్శిస్తున్నారు. ఈ ఆత్మజ్ఞానం తెలియనివారు తత్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు. వీరు కూడా సంసారాన్ని తరిస్తారు. ఈ ప్రాణులంతా క్షేత్రక్షేత్రజ్ఞుల కలయిక కారణం. అన్నీ నశించినా తాను నాశనం కానట్టి ఆ పరమాత్మను చూడగలిగినవాడు మాత్రమే నిజంగా చూసినవాడు. ఆ దైవాన్ని అంతటా సమంగా చూసేవాడు తనను తాను పాడుచేసుకోడు. పరమగతిని పొందుతాడు. ఆత్మ ఏ కర్మా చేయదనీ, ప్రకృతే చేస్తుందని తెలుసుకొన్నవాడే జ్ఞాని. అన్ని జీవులనూ ఆత్మగా చూస్తూ ఆనీ ఆత్మ అని గ్రహించిన మనిషే బ్రహ్మత్వం పొందుతాడు. పుట్టుక, గుణం, వికారం లేనిది కావడం చే శరీరమందున్నా కర్తృత్వం కానీ, కర్మఫల సంబంధం గాని తనకు ఉండవు. శరీరగుణాలు ఆత్మకు అంటవు. ఒక్క సూరుయ్డే జగత్తును ప్రకాశింప చేస్తున్నట్టు క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రాలైన అన్ని దేహాలనూ ప్రకాశింప చేస్తున్నాడు. క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని, మాయాబంధాన్ని దాటే ఉపాయాన్ని తన జ్ఞాననేత్రం వలన తెలుసుకొన్నవాడే పరమగతినీ పొందుతాడు.