మంగిపూడి పురుషోత్తమశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగిపూడి పురుషోత్తమశర్మ

మంగిపూడి పురుషోత్తమ శర్మ (1892-1946) జాతీయోద్యమ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. అతను జాతీయ కవి వెంకటశర్మ తమ్ముడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను పశ్చిమ గోదావరి జిల్లా, పిప్పర గ్రామంలో సీతమ్మ, విశ్వపతి శాస్త్రి దంపతులకు 1892లో జన్మించాడు. బందరు జాతీయ కళాశాలలో మెట్రిక్యులేషన్ చదివాడు. సహాయనిరాకరణ ఉద్యమతీర్మానం లోని విద్యాలయాలను బహిష్కరించవలెను అనే కార్యక్రమం ప్రకారం చంద్రుపట్ల బాపిరాజు, వడ్లపట్ల గంగరాజు, కలగర కృష్ణారావు, బద్దిరాజు నాగభూషణం, దాట్ల సీతారామరాజు, నిడమర్తి వెంకట ఉమామహేశ్వరరావు మొదలగు విద్యార్థులతో పాటు చదువులకు స్వస్తి చెప్పాడు.[1][2]

అతను సంస్కృతాంధ్ర భాషలలో ప్రావీణ్యుడు. అతను తన 17వ యేటనే భీష్ముని చరిత్రను వచన కావ్యంగా వ్రాశాడు. ఇది ఆనాటి స్కూలు ఫైనల్ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఉంది. గాంధీజీ అనుచరునిగా అతని బోధనలకు ప్రభావితుడై సత్యాగ్రహోద్యమంలో పనిచేసి, కారాగార శిక్షను అనుభవించాడు. "స్వేచ్ఛాగానం" అనే ఖండకావ్యాన్ని రచించాడు. అతని రచనలు ఎన్నో పత్రికలలో ప్రచురించబడేవి. 1928 లో మాగంటి అన్నపూర్ణాదేవి పై వ్యాసం వెలువరించాడు. భీష్ముని చరిత్ర,[3] కోయిలపాట, స్వామి దయానంద సరస్వతి జీవితము, గోదావరిలు అతని రచనలు. స్వాతంత్ర్యోద్యమంలోనే కాకుండా, జాతీయావాదిగానూ అతని పాత్ర అనన్యసామాన్యం. అతను కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా ప్రజలలో దేశభక్తిని ప్రబోధించాడు. 1920లో శర్మ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని తన ప్రసంగాలతో ఉర్రూతలూగించాడు. గాంధీజీ 1929 ఏప్రిల్ 23–28 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించినప్పడు శర్మ అతనితో ఉండి, మహాత్ముడి ఉపన్యాసాలను అనువదించాడు. గాంధీజీ ఆదేశానుసారం 1920లో కొవ్వలి గోపాలరావు లాంటి మరెందరో మిత్రులప్రోత్సాహంతో తణుకులో 5 ఎకరాల తోటలో 60 వేలు ఖరీదు చేసే భవనంలో జాతీయ పాఠశాల ప్రారంభించాడు. దీనిని ఆశ్రమంగా మార్చాలని శర్మగారు ప్రయత్నించాడు. అయితే దీనిని ఆశ్రమంగా మార్చడానికి కొవ్వలి గోపాలరావు వ్యతిరేకించాడు. అయితే 1924 నుంచి ఈ జాతీయ పాఠశాలలో 3 సంవత్సరాలు క్రియాత్మకంగా పనిచేయడమే అతని జాతీయోద్యమ జీవితంలో ప్రధాన ఘట్టం. అతను 1946 జనవరి 16న మరణించాడు.[4][5]

రచనలు[మార్చు]

  1. భీష్ముని చరిత్ర[6]
  2. కోయిల పాటలు[7]
  3. కర్మయోగము[8] (అనువాదము మూలం: స్వామి వివేకానంద)

మూలాలు[మార్చు]

  1. "పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/28 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-06-17.
  2. "పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము/ప్రథమ సందర్శన 1921 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-06-17.
  3. మంగిపూడి పురుషోత్తమశర్మ (1939). భీష్ముని చరిత్ర.
  4. "పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/56 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-06-17.
  5. తణుకు తళుకులు పుస్తకం, రచయిత: కానూరి భద్రీనాథ్. పుట:56
  6. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో భీష్ముని చరిత్ర పుస్తకప్రతి
  7. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కోయిలపాటలు పుస్తకప్రతి
  8. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కర్మయోగము పుస్తకప్రతి