Jump to content

మణిప్రవాళము

వికీపీడియా నుండి
మణి ప్రవాళము

దక్షిణదేశ భాషలలో మలయాళ భాష యందు మణిప్రవాళ భాష ఒక కావ్యశైలి. ఇందు అనేక ఉద్గ్రంధములు రచించబడినవి.మలయాళ సాహిత్య చరిత్రమునందు మణిప్రవాళయుగము ఒక స్వర్ణయుగముగా భావించబడుచున్నది. మణిప్రవాళము మలయాళమునకు విలక్షణమైన ఒక కావ్యభాషాభేదము.ఇది నిలువ ద్రొక్కుకొనుటకు కొన్ని చారిత్రక సాంఘిక పరిస్థితులు కారణములుగా పేర్కొనబడుచున్నవి. ఇది సంస్కృతము, మలయాళముల మిశ్రభాష.

చారిత్రిక పరిస్థితులు

[మార్చు]

కేరళ దేశమున ప్రాచీనకాలమునందు చేరరాజులు శెన్ దమిళ్ అనబడు అచ్చమయిన తమిళమును ప్రోత్సహించు చుండిరి. ఉత్తరహిందూదేశమునుండి కేరళకు వలసవచ్చిన నంబూద్రి బ్రాహ్మణులు సంస్కృతమును అభిమానించిరి.తత్ఫలితముగా అందలి సామరజనులయొక్కయు, సామాన్యప్రజానీకము యొక్కయు వ్యవహారములో నుండిన మలయాళమునకు చాలకాలము ఆదర ప్రోత్సాహములు లేకపోయెను.దానికి నాటి సంఘము నందలి ఉన్నతవర్గముల వారి చిన్నచూపే కారణము.నంబూద్రి బ్రాహ్మణులుది ఆర్యజాతికి చెందినివారు.స్థానికులయిన మలయాళీలకు నంబూద్రి బ్రాహ్మణులతో వివాహముల మూలమున సంబంధ భాందవ్యములేర్పడినప్పుడు ఉభయులకును వ్యవహార భాష అయిన మలయాళము క్రమముగా కొన్ని మార్పులకు లోనగుట తప్పనిసరి అయినది.దైనందిక జీవితమునకు సంబందిచిన వ్యవహారాదులలో సహజముగా ఏర్పడు ఆదాన ప్రదానాదులు మూలమున ఉభయ భాషల పదజాలమును సమ్మేళనము పొంది తత్ఫలితముగా కొన్ని మార్పులు ఆయా భాషలలో ఏర్పడుటకు ప్రారంభమయ్యెను.ఇట్టి వ్యవహారమువలన మిశ్రభాష యొకటి ఒక క్రమపద్దతిలో వికాసము పొంది, అది మత విషయకములయిన, వైదిక కర్మ కలాపములకు సంబందించిన శాస్త్ర సంబంధములయిన విషయములను వివరించుటకు ఉపయోగించిరి.క్రమముకా అది విద్యావంతుల వ్య్వహార భాషగాకూడా పరిణామము పొందెను.

పెరుమాళ్ వంశీయులయిన రాజుల అనంతరము కేరళమున తమిళముయొక్క ప్రాభవము నశింప ఆరంభమాయెను. కూత్తు, కూడియాట్టం అను నాటక కళాభేదములు కేరళలోని అన్ని తరగతులవారికిని ప్రీతి పాత్రములయిన వినోద సాధనములుగా వ్యాప్తి లోనికి వచ్చినప్పుడు అందు ఉపయోగింప బడుచుండిన ఈమిశ్రభాష జనాదర పాత్రముకాదొడెగెను. పురాణ ప్రవచనములయందు, వేదాంత ప్రసంగములయందు, వ్యాఖ్యానములయందు విశేషముగా ఉపయోగించుచుండిన ఈమిశ్రభాష సహజముగానే కవిత్వమునకు ఉపయుక్తము అయినది.

ఈనూతన భాష తొలుత సంస్కృత గ్రంధముల వ్యాఖ్యానములందు ప్రయోగ దశలోనుండి తరువాతి కాలమున క్రమముగా మౌలికములయిన కావ్యాదుల రచనమునకు ఉపయోగించబడెను.ఈఘట్టమే మలయాళమున మణిప్రవాళ యుగమునకు ప్రారంభకాలము ఉభయభాషలయందును నిష్ణాతులయిన విద్వాంసులు సంస్కృత మలయాళములు రెంటినుండియు యధేచ్చముగా పదజాలమును స్వీకరించి వాని మధుర సమ్మేళనముతో తమ కావ్యాదులలో నూతనముగా నిబంధించిన ఈభాషా రూపమునకు వారే మణిప్రవాళము అని దాని స్వభావమునకు సూచక నామముగావించిరి.

మణిప్రవాళ సారస్వతశాఖలో విశేషకృషి చేసినవారు శ్రీ పి.శంకరన్ నంబియార్ అను విద్వాంసులు.ఇది 9వ శతాబ్దమున వర్ధిల్లినది.

మణిప్రవాళమున రచితములయిన కావ్యములన్నియు సంస్కృత వృత్తములందే వ్రాయబడెను.వానియందు రసము, అలంకారము, రచనా విధానము పరిశీలించినచో సంస్కృత ప్రభావము చాలా ఎక్కువ.

మణిప్రవాళ రచనావిధానము ఒక్క మలయాళమునందు మాత్రమే కాక తమిళము, కన్నడము, తెలుగు భాషలయందుకూడా ప్రవర్తిల్లినది.తమిళనమునందు జైనులును, వైష్ణవులును రచించిన వ్యాఖ్యానములలో మణిప్రవాళభాష విస్తారముగా ఉపయోగించబడినది. ఉత్తర సంగయుగమునందు జైనులు రచించిన వచన కావ్యములందు కూడా ఇట్టిభాష కానవచ్చును.


మూలములు

[మార్చు]