Jump to content

మల్లారి జమ్మ

వికీపీడియా నుండి
జమ్మ మల్లారి కురుమ
Mallari Jamma
జననం
Mallari

80 Years
జాతీయతభారతీయురాలు
వృత్తిఒగ్గుకథ కళాకారిణి
తల్లిదండ్రులుచెన్నమ్మ, గుండాలు
బంధువులుజమ్మ ఐలేష్ ,గుండాలు,శ్రీశైలం,మల్లేష్ ,మహేందర్ ,(మేనల్లుడ్లు) "ముఖ్య బందువులు MlC యోగ్గే మల్లేశం,క్యామ మల్లేష్ గార్లు
వెబ్‌సైటుhttps://www.facebook.com/JammaMallariKuruma/ https://youtube.com/channel/UCXOJ8XW1DQdUf16uL9VaKew

మల్లారి జమ్మ తెలంగాణ రాష్ట్రంకు చెందిన ఒగ్గుకథ కళాకారిణి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

జీవిత విషయాలు

[మార్చు]

ఈమె చెన్నమ్మ, గుండాలు దంపతులకు రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మేడిపల్లి గ్రామంలో జన్మించింది.[2] జమ్మకు ఆరుగురు అక్కచెల్లెల్లు, ముగ్గురు అన్నదమ్ములు.

Special Story About Storyteller Jamma Mallari

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణం ఈనెల ఎనిమిదవ తేదీన కొత్త కళను సంతరించుకుంది. ఆ తెలుగు వెలుగుల కళాప్రాంగణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు వేదికైంది. రాష్ట్రంలోని ఆడబిడ్డల గౌరవార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలవి. ‘ఉమెన్‌ అచీవర్‌ అవార్డు –2020’ పురస్కారాల ప్రదానం జరుగుతోంది. వేదిక మీద నుంచి అచీవర్‌ అవార్డు విజేతలైన మహిళలకు ఆహ్వానం పలుకుతున్నారు. తెల్లటి ధోవతి కట్టుకుని, కాషాయం రంగు చొక్కా ధరించి, తలకు ఎర్రటి తలపాగా చుట్టుకున్న ఓ డెబ్బై ఐదేళ్ల వ్యక్తి వేదిక మీదకు వెళ్లడం కనిపించింది. ఇది మహిళలకు జరుగుతున్న పురస్కారం, వేదిక మీదకు వెళ్తున్నదెవరు? అందరిలో సందేహం. వేదికపైకి రమ్మని పిలుపు వచ్చిన పేరు స్త్రీదా పురుషుడిదా? ఆ సందేహానికి తగిన కారణమే ఉంది. అవార్డు అందుకోవడం కోసం వేదికపైకి వెళుతున్న ఆ వ్యక్తి పురుషుడి వస్త్రధారణలో ఉన్న మహిళ. తొలి ఒగ్గు కథా కళాకారిణి.. జమ్మ మల్లారి.

రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, నక్కర్త మేడిపల్లి.. జమ్మ మల్లారి స్వగ్రామం. తెలుగు రాష్ట్రాల్లో ఒగ్గు కథ చెప్పిన తొలి మహిళ ఆమె. అప్పటి వరకు మగవాళ్లే కథకులు. లయబద్ధంగా పాడుతూ, ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉరకలెత్తేటట్లు మధ్య మధ్య హూంకరిస్తూ ఒగ్గు కథ చెప్పడం మగవాళ్లకే పరిమితమైన రోజులవి. ఆ ఒగ్గు కథను చూడడానికి కూడా ఇంటి గడపదాటి రావడానికి ఆడవాళ్లకు అనుమతి లేని రోజుల్లో ఒక మహిళ ఏకంగా కథ చెప్పడానికి వేదిక మీదకు రావడమే ఓ సాహసం. అంతటి సాహసానికి నాంది వేసింది తన తండ్రి అని చెప్పారు మల్లారి.

నాయన వెంట వెళ్లేదాన్ని

‘‘మా నాయన గుండాలు, అమ్మ చెన్నమ్మ. ఆరుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు మొత్తం తొమ్మిది మంది సంతానం. మా నాయనకు వారసత్వంగా వచ్చిన కళకు నన్ను కూడా వారసురాలిని చేశారాయన. నాయన కథ చెప్తుంటే ఇష్టంగా ఆయన వెంట వెళ్లేదాన్ని. మా అమ్మ కోప్పడేది. మగపిల్లల్లెక్క చొక్కా, ధోవతి కట్టుకునేదాన్ని. మా అమ్మ చీర కట్టినా సరే దాన్ని ధోవతి లెక్క గోచి పెట్టుకుని బర్రెలు తోలుకుని పొలం పోయేదాన్ని. మా నాయన నా ఇష్టాన్ని గమనించి మా అన్నదమ్ములతోపాటు నాకు కూడా తాళం వేయడం, డోలు వాయించడం, కథ చెప్పడం నేర్పించారు. పదహారేళ్ల వయసులో సొంతంగా ఎవరి సహాయమూ లేకుండా కథ చెప్పాను. బీరప్ప, మల్లన్న, ఎల్లమ్మ కథలను చెప్పేదాన్ని. ఒక్కో కథను కొన్ని వందలసార్లు చెప్పి ఉంటాను.

ఆలకించారు.. ఆదరించారు

మా చిన్నప్పుడు ‘మగవాడు ఇంటిపట్టున ఉంటే పనికి రాని వాడైపోతాడు. ఆడవాళ్లు గడప దాటితే గౌరవాన్ని కోల్పోతారు’ అనే ఒక నానుడి ఉండేది. ఆడవాళ్ల మీద అన్నేసి ఆంక్షలున్న అలాటి రోజుల్లో కూడా... అంటే అరవై ఏళ్ల కిందట నేను ఒగ్గు కథ చెబుతుంటే ఎవరూ అడ్డుకోలేదు. కథ చెప్పడంలో నేను ఎంత సంతోషాన్ని పొందేదాన్నో.. నా కథను వినడానికి జనం కూడా అంతే ఇష్టపడేవాళ్లు. నన్ను చూసి చాలా మంది ఒగ్గు కథ చెప్పడం నేర్చుకున్నారు. కానీ వాళ్ల ఇళ్లలో సరైన సహకారం లేకపోవడం వల్ల ఇందులో కొనసాగలేకపోయారు. ఆంక్షల వల్ల కళ ఉండి కూడా ఎంతోమంది ఆడవాళ్లు ఆ కళను ప్రదర్శించలేక, సాధన కొనసాగించలేక పోయారు. ఇప్పటి అమ్మాయిలకు ఒకటే చెబుతున్నాను. ఇది గొప్ప కళ. అంతరించిపోవడానికి దగ్గరగా ఉంది. మగవాళ్లు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా... ఆడపిల్లలు మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి. ఆడపిల్లలు నేర్చుకుంటే ఆ కళను తమ పిల్లలకు కూడా నేర్పిస్తారు. దాంతో ఈ కళ అందరి నాలుకల మీద నాట్యమాడుతుంది. తరతరాలు బతికి ఉంటుంది’’ అని చెప్పారు మల్లారి.

జమ్మ మల్లారి ఒగ్గు కథ కోసం రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్‌ జిల్లాలతోపాటు హైదరాబాద్‌ నుంచి కూడా మేడిపల్లికి వస్తారు. ప్రస్తుతం వార్ధక్యం కారణంగా నడవలేకపోతున్న మల్లారిని కారులో సగౌరవంగా వాళ్ల ఊరికి తీసుకెళ్లి వాళ్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత అంతే మర్యాదలతో ఇంట్లో దిగబెడతారు.  

– వాకా మంజులారెడ్డి ఫొటోలు: తాండ్ర శ్రీశైలం, సాక్షి, యాచారం

నేను చిన్నప్పుడు పాలు తాగకుంటే మా నాయన ‘ఈ బిడ్డను బతికించు సామీ! నీకే అంకితం చేస్తాం’ అని మల్లన్న (మల్లికార్జునస్వామి)కు మొక్కినాడంట. ఆ మొక్కు కోసం నన్ను పదకొండేళ్లకే మల్లన్నకిచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుంచి ప్రతి ఆదివారం మల్లన్న పూజ చేసుకోవడం అలవాటైంది. కథలు చెప్పడంలో మునిగిపోవడంతో నాకు ప్రత్యేకంగా మరో జీవితం కావాలని కూడా అనిపించలేదు. మా అన్నదమ్ములు సేద్యం చేసుకుంటూ ఒగ్గు కథ చెప్పేవాళ్లు. నేను మల్లన్న సేవలో ఒగ్గుకథ చెప్పుకుంటూ జీవితాన్ని సంతోషంగా వెళ్లదీశాను. మా గొల్ల కురుమలు ఇప్పటికీ ఇళ్లలో ఏ వేడుకైనా నన్ను తీసుకెళ్లి పూజలు, పిల్లల పెళ్లిళ్లు చేయించుకుంటారు. పానం ఉన్నంత కాలం కథ చెబుతా. అప్పట్లో చిందేసి చెప్పిన దాన్ని. ఇప్పుడు ఓపిక తగ్గింది. కథ మొత్తం నిలబడి చెప్పలేక, కూర్చుని చెబుతున్నాను.  

– జమ్మ మల్లారి, ఒగ్గు కథాకళాకారిణి

కళారంగం

[మార్చు]

తండ్రి సహకారంతో చిన్నప్పటినుండే దేవుని పట్నాల దగ్గరికి వెళ్ళేది. తన పదహారవ ఏట సొంతంగా తొలి పట్నంవేసి, ఒగ్గుకళా ప్రదర్శన ఇచ్చిన తొలిమహిళగా గుర్తింపు పొందింది. జమ్మ అలంకరణంతా పురుషుడిలాగే ఉంటుంది. బీరప్ప ఒగ్గుకథలో కాలికి గజ్జెకట్టి కామరాతి వేషం వేసేది. వేలకొద్దీ బీరప్ప కళ్యాణాలు చేసి తలువాలు పోసిన మల్లారికి, ఒగ్గకథల ‘సూపర్‌స్టార్‌' అనే బిరుదు ఇచ్చారు. తన 18వ ఏట మల్లికార్జునస్వామిని భర్తగా స్వీకరించి ఆ స్వామి సేవలో పట్నాలు వేస్తూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒగ్గుకథలు చెప్పింది.[3]

పురస్కారాలు

[మార్చు]
  1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.
  2. [4] హైదరాబాద్ లో రవీంద్రభారతిలో Women Achiever Award ౼
  3. అందుకుంది

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 9 March 2020.
  2. ఆంధ్రభూమి, రంగారెడ్డి (9 March 2020). "జమ్మ మల్లారికి అరుదైన గౌరవం". Archived from the original on 9 మార్చి 2020. Retrieved 9 March 2020.
  3. నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 9 March 2020.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 మార్చి 2020. Retrieved 9 March 2020.