Jump to content

మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి

వికీపీడియా నుండి

మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి కవి-పండితుడు-రచయిత.

జీవిత విశేషాలు

[మార్చు]

మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి గారు 1895 సం.లో గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు గ్రామమున జన్మించారు.ఈయన తండ్రి శాంకరయ్యగారు పరమ పౌరాణికోత్తములు. తిరుపతి వేంకట కవులు అవధానంలు చేస్తూ ఆంధరదేశమంతటా సరస్వతీచిద్విలాసాన్ని ప్రదర్సిస్తూ సంచారం చేస్తున్నప్పుడు అనేకయువహృదయాల్ని ఆకర్షించారు. అలాంటి యువహృదయాల్లో మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి కవి ఒకరు. పద్యాలు చెప్పుతూ ఆధోరణే జీవితానికి వేలిబాటగా తీర్చుకోచూచిన మాధవపెద్ది కవి తిరుపతివేంకటేశ్వరశిష్యపరమాణువై నారు. వెంకటశాస్త్రిగారు ఈశిష్యుని గూర్చి సం. 1937 లో ఈవిధంగా చెప్పినారు:

ఇతడు సుమారు ఇరువదియేడ్లకు పూర్వము నాయొద్ద కొన్నాళ్ళు మాఘ కావ్యమును, కౌముది యు చదువుకొనుటకు వచ్చాడు.మాదంపతులయందు కేవలము కన్నతల్లిదండ్రులకన్నను అధికభక్తిగా నుండి చదువుకున్నాడు.కాని అతనికి దోచినట్టు చదువుటయే కాని నాయేర్పాటునుబట్టి చదువువాదు కాడు. ఇతనికప్పటికే తెలుగులో మంచి కవితాధార యుండెడిది. ఎట్లో కొంత కౌముదియు, మాఘకావ్యములో కొంతవరకును నేర్చాడు. ఇతని చదువు గానముతో మిళితముగా యుండెనుగాని నాకు రేగుప్తి (సంగీతవిశేషము) వలనే ఇతనికి నాదనామక్రియ మనెడి రాగము మీద అభిమానమెక్కువ. ఆకారణము వలన నాకు శిష్యుడై కూడా నాచదువుధోరణి ఇతరశిష్యులతో పాటుగా ఈతదు అనుకరించువాడు కాడు.

కనుక చళ్ళపిళ్ళవారి శిష్యత్వము ఈతనికి దోహదమిచ్చింది. మాధవపెద్ది కవి కవితా వినోదంతో కాలక్షేపం చేస్తూ, కావ్యానందం ద్వారా బ్రహ్మానందాన్ని సాధించిన ధన్యజీవి అని అంటారు.

మాధవపెద్ది కవి ఉన్నచోట పళ్ళగంపకు ఎగబడినట్టుగా చుట్టు నోరు తెరుచుకొని ఆయన మాటల్నీ, పద్యాల్నీ వింటూ అనేకులు అట్టే నిలుచికొనిపోయేవారట. ఈయనది హాస్య ప్రకృతి. లోకాన్నంతా ఆదృష్టితో తేలికగా చూడడము ఈతను అలవరచుకున్న వైశిష్ట్యం ఈలోకము శాశ్వతము కాదనే ధ్రువనిశ్చయంతో కాలక్షేపం చేస్తూఉండేవాడు. ఇలా ఆషామాషీగా ఉండే ఈతనికి జీవితంలో పెద్ద దెబ్బ తగిలింది. అది కామేశ్వరీ (భార్య) వియోగం. దీనికి ఈతని కవిహృదయం యెంతగానో బాధనొంది సతీస్మృతి అనే ఖండ కావ్యమును రచించాడు. ఆపుడు కవిజీవితాన్ని గురుంచి, లోక నైజాన్ని గురుంచి ఆలోచించడం ప్రారంభించాడు.

ననువంచిచెనిగాని పాడునరజ
 న్మంబిచి దైవంబు, మిం
టను బారంగలయెట్టి పిట్టనయి యు
 న్నన్ నాబహిఃప్రాణముం
డిన లోకంబున కట్టె నే నెగిరి పో
 నేయెన్నడో! ఇంక బా
రిన ఈవ్యర్ధపుజీవనం బను నెడా
 రిన్ యాత్ర సాగింతునే.

భార్యా వియోగం అనంతరము ఆర్థిక దురవస్థ, అంతర్వేదన, ఆరోగ్యం చెడి ఉబ్బసానికి గురై ఎంతగానో బాధనొందినాడు. హెచ్చినకొద్దీ ఈయన అంతర్ముఖుడై కాజొచ్చాడు. కవితా ప్రసంగాలలో లీనమైపోయినాడు. నూజవీడు జమీందారు గారైన అప్పరాడ్విభునికి మాధవపెద్దికవి తన గోడు విన్నవించుకున్న సందర్భాన్ని బృందావనం లో చదివితే ఎంతటి దారిద్ర్యాన్ని అనుభవించినాడో తెలుసుకో గల్గుతాం.

మడులు మాన్యములెల్ల మున్నె తెగన
 మ్మంబడ్డ వేవేవొ యొ
త్తిడు లాయప్పులనా రొనర్పగ దదా
 దిన్ దారకం బౌచు నుం
డెడి యుద్యోగము గూడ నూడె గడు వ్యా
 ధిగ్రస్తమైపోయె నా
యొడ లీనాటికి, జీవయాత్ర ఇక నె
 ట్లో వేంకటాద్రి ప్రభూ!

ఈయన శరీరానికి బాధ కల్గినప్పుడల్లా కవిత్వానికి అలంకారం చేకూరింది; ఆత్మకు వికాశం కల్గింది.

తెనాలిలో డాక్టరు గోవిందరాజుల వెంకటసుబారావు గారి అండ లభించిన తరువాత ఆరోగ్యం కుదుటబడిందీయనకు. డాక్టరుగారితో స్నేహము, వేదాంతం లక్ష్మీనారాయణ గారు ఆదరణ లభించడంతో మాధవపెద్దికవి తెనాలివాసి అయిపోయినాడు. ఈమహనీయులిద్దరు ఈకవికి పెట్టని కోటలై ప్రాణాన్నదాతలై పరోక్షముగా ఆంధ్రసాహిత్యసరస్వతీ వికాసానికి తోడ్పడినారు.

అనేక సభల్లో గరవం పొందిన కవి బుచ్చయ్యగారు; కఠమెత్తి పద్యాల్ని చదువుతు ఉంటే ఎంత పెద్ద సభ అయినా సద్దుమణిగి అదుపులోనికి వచ్చేది. శ్రావ్యంగా నాథనామక్రియ రాగంలో ముక్కుతో పద్యాలు చదువుతూ ఉంటే ప్రజలు ముగ్ధులయ్యేవారు.

మాధవపెద్ది కవి నలుగురిలో చదువుతూ ఉండడమే కాని రచ్చకు వచ్చింది కాటూరి వేంకటేశ్వరరావు గారి మైత్రి హెచ్చినప్పటినుంచే ననవలె. కాటూరివారి కోమలహృదయంలో మాధవపెద్దికి ఉత్తమ స్థానం లభించడం విశేషం. ఆ అమృతముహూర్తమునుంచి మాధపెద్దికాటూర్లు జంటబాయలేదు. కాటూరివారన్నారంటె మాధవపెద్ది ప్రక్కన ఉన్నమటే. అంతగా వారిరివురు జీవికాజీవలైనారు.

జాతీయోద్యమాన్ని నవ్యాంధ్రకవులుకూడా యధాశక్తిగా నడిపించినవారే. మాధవపెద్దికవి హరిజనోద్ధరణంనిమిత్తం హెచ్చుగా పాటుపడిన కవి.

ప్రణయలీల అనే ఖండ కావ్యాన్ని వ్రాసి ఉమరుఖయ్యాం రుబాయితీ ల ప్రభావాన్ని చూపించాడు. ఉమర్ ఖయ్యా మనే ప్రత్యేక కావ్యాన్నే ప్రచురించి ఆభావాన్ని స్థిరపరచాడు.


మెడ పైకెత్తి యొకానొకప్పుడు శర
 న్మేఘంబులం గాంచి నీ
పొడ నేమే నెరిగించునేమొ యని నే
 బుద్ధీంద్రియక్షోభతో
నడుగం జూచెద నెన్నొ చుక్కల ననం
 తాకాశమం దైన నె
క్కడ నీచక్కని గానమును సం
జ్ఞన్ దెల్లవోవున్ సఖీ.

శుర్పణఖనాసికాఖండనము-పంచవటి అన్న ఖండకావ్యము రచించాడు. ఇది కళాశాల విద్యార్థులకు పాఠ్యగ్రంధమై మరింత ప్రాచుర్యాన్ని పొందింది. పాత్రల్ని ప్రవేశ పెట్టడంలో, సంభాషణా శైలిలో, పద్యల్ని నడిపించడములో, జాతీయాల్ని ప్రయోగించడములో పంచవటి ప్రశంసనీయమైన ఖండకావ్యము.

ఇంకను ఈయన చాటుధారాచక్రవర్తి అన్నట్లు వ్రాసినట్లు చాటువులు ప్రముఖుల ప్రశంసలు పొందినవి. అన్నింటి కన్నా మాధవపెద్ది కీర్తిని చిరస్థాయిగా నిలువరిచిన రచన మృత్యుంజయస్తనం అను శతక కావ్యము. శతకాలన్నీ భక్తిభావ ప్రకాశితాలైనా, మృత్యుంజయ శతకము మాత్రం హాస్యాన్ని మేళవించి పార్ధక్యాన్ని పొందుతున్నది.

ఒకతే చాలుగదయ్య యేలుకొన, నీ
 హోదా కటయ్యా యొక
ర్తుక నొంటన్ మరియొక్క తెన్ శిరసునం
 దున్ గట్టుకున్నావు యే
లకొ, పైగా మెడనిండ బాము లొడలె
 లన్ బూదియంగూడ నీ
మొకమున్ మామొక మేమిరూపమిది! శం
 భూ ప్రేతభూతప్రభూ!

శ్రీకైలాసనగాధివాస! కరుణా
 సింధూ! జగత్ప్రాణబం
ధూ! కల్యాణగుణావహా! సకలదు
 ర్దోషాపహా! దేవతా
నీకాభ్యర్చితపాదపంకజ! భవా
 నీనాధ! గంగాసనా
ధా! కైవల్యమయా! చర్నిగమగే
 యా! తండ్రి మృత్యుంజయా!
 

ఒక లంబోదరుడైన పుత్రకుడు ము
 న్నున్నట్టిదే నీకు జా
లక కాబోలును సృష్టిచేసితివి యీ
 లంబోదరుంగూడ దీ
గకు గాయల్ బరువౌనకాని, కుడుముల్
 గల్పించి యెవ్వాని కే
లకొ యివానికి నొక్కమైని యిడుముల్
 మొల్పింతు మృత్యుంజయా!

నిజంగా మాధవపెద్ది మధురభారతియే. హాస్యం అణువణువునా అగుపిస్తుండే ఈయనపలుకులు పలుకులవెలదికి మందస్మితం కలుగజేస్తాయి. ఆంగ్లపదాల్నీ, హిందుస్థానీపదాల్నీ బహుళంగా తన కవిత్వంలో వాడి ఆవిధమైన ధోరణికి మార్గదర్సి అయినాడు. పోచాయింపులు- గాడిద తన్నులు- బండారం బైటపడడం- సవాలక్షా లావాదీవీలు - సున్నకు సున్న, హళ్ళికి హళ్ళి - లెక్కకా జమక - బిస్మిల్లా- టికానాలేదు - కనాకష్టము- చలోభాయిగాడు - హత్తెరీ- ఫక్తు - కామూషు- డికాక్షన్- గంపశ్రాద్ధపు తలకట్టువాడు- ఇలా జాతీయాలు - మామూలు పలికబళ్ళు - స్వేచ్ఛగా ఇతని కవితలో వాడినట్లు గుర్తిస్తాము. నవ్యాంధ్రలో మాధవపెద్దికవికి ఉన్నస్థానం అనితరసాధ్యమైనది.

ఆవామనమూర్తి- చేతులో పొడుంకాయ- చంకలో ఉత్తరీయపు చుట్టా- పొడుంచారలతోటి ముక్కు- నిరంతరకవితా ప్రసక్తీ- ఆహాస్య ప్రకృతీ- ఆదరంతో కవిమిత్రుల్నీ బంధువుల్నీ సంభావించడమూ- చేస్తూ సం. 1950 ఫిబ్రవరి 6 న మరణించారు.

మూలాలు

[మార్చు]

1950 భారతి తెలుగు మాస పత్రిక- వ్యాసకర్త శ్రీ పిల్లలమర్రి హనుంతరావు