మానం ఆంజనేయులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానం ఆంజనేయులు
[[Image:
మానం ఆంజనేయులు
|225x250px|మానం ఆంజనేయులు]]


మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 1999
నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1939
చెన్న కొత్తపల్లి, గుంటూరు జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సిపిఐ

మానం ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిపిఐ నాయకుడు, పాత్రికేయుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు, జర్నలిస్టు మరియు పెందుర్తి శాసనసభ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (విసిబిఎల్) కు 1983 నుండి మూడు దశాబ్దాల పాటు చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

జననం

మానం ఆంజనేయులు గుంటూరు జిల్లాలోని చెన్నకొత్తపల్లి గ్రామంలో 1939లో జన్మించారు. తల్లితండ్రులు అంజనమ్మ, వెంకటసుబ్బయ్య. అన్నయ్య వెంకటనారాయణ.

రాజకీయ నేపధ్యం

ఊహ తెలిసేటప్పటికి మానం ఆంజనేయులు తండ్రి వెంకటసుబ్బయ్య కనుమూసారు. చిన్నాన్న ఉమాకాంతం గ్రామానికి పెద్ద దిక్కు. కమ్యూనిస్టు వ్యతిరేకి. తల్లికి రాజకీయాలు తెలియవు. చిన్నమ్మ బసవ పున్నమ్మ కమ్యూనిస్టు ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చారు. చదువుకోసం అమ్మ, అన్నయ్యతో కలసి పెదనందిపాడు వలస వచ్చారు. ఆ ప్రాంతం చుట్టు పక్కలున్న పాలపర్రు, నర్సాయపాలెం కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రాలు. బడికి వచ్చే పిల్లలు తమ గ్రామాలపై పోలీసుల చేస్తున్న దాడుల గురించి కథలుగా చెప్పేవారు. ఈ క్రమంలో అన్నయ్య కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రభావితం అయ్యారు. కమ్యూనిస్టు శ్రేణులకు కొరియర్, భోజనాలు అందించేవారు. ఇది గమనించిన చిన్నాన్న పిల్లలను అద్దంకికి మార్చారు. అక్కడ వారు ఉండే ఇంటి యజమాని కాకాని బుచ్చయ్య కమ్యూనిస్టు. ఆయన ఇచ్చే పుస్తకాలు, కరపత్రాలు చదవడం; చిన్నమ్మ, అన్నయ్యల ప్రభావంతో పోర్త్ ఫారం చదువుతున్న ఆంజనేయులు కమ్యూనిస్టు ప్రభావానికి లోనయ్యారు.

ఇంటర్ నుంచే క్రియాశీల రాజకీయాల్లో..

1953లో ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. క్రమంగా ఏఐఎస్ఎఫ్ ఉద్యమ కార్యకర్త అయ్యారు. అనంతరం ఇంటర్ కోసం నర్సారావుపేట వచ్చారు. ఆంజనేయులు డాక్టర్, వారి అన్నయ్య ఇంజనీర్ అవ్వాలన్నది కుటుంబం కోరిక. విద్యార్థి ఉద్యమంలో కీలకంగా ఉంటూ 1955 నాటి ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసారు. 1956లో పట్టణ కార్యదర్శి కొండ్రుగట్టు వెంకటేశ్వర్లు పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఇంటర్ తప్పడంతో సొంతూరు చేరి పార్టీ పని మొదలు పెట్టారు. గ్రామంలో హరిజనుల దేవాలయ ప్రవేశ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. చిన్నాన్న కోపానికి అవధులు లేవు. జరిమాన విధించారు. అనంతరం డిగ్రీ కోసం గుంటూరు ఏసీ కాలేజీలో చేరారు. ఉద్యమం కారణంగా డిస్మిస్ చేశారు. హిందూ కాలేజీలోనూ అదేపరిస్థితి. కనపర్తి నాగయ్య, మల్లయ్య లింగం తదితరులు ప్రభావం ఆంజనేయులుపై అధికంగా వుండేది. సిపిఐ పార్టీ ఆదేశాల మేరకు విశాలాంధ్ర పత్రికలో సబ్ ఎడిటర్ గా పని చేయడానికి విజయవాడ వచ్చి కొద్ది రోజులు పనిచేశారు. విద్యార్ధి ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన నేపథ్యం కారణంగా పార్టీ నిర్మాణానికి ఉపయోగపడాలని విశాలాంధ్ర తరపున విలేకరిగా, ఏజెంటుగా ఆంజనేయులును పార్టీ సీనియర్ నేతలు నీలం, దాసరి విశాఖపట్నం పంపించారు.

విశాఖకు విలేకరిగా వచ్చి..

మానం ఆంజనేయులు 1968లో కుటుంబంతో సహా విశాఖ చేరి విశాలాంధ్రలో పని చేస్తూనే పార్టీలో కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. పార్టీ నిర్మాణం పట్ల చొరవతో విశాఖ తాలూకా సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు . సీనియర్లతో మమేకమవుతూ పార్టీ నిర్మాణమే పనిగా పెట్టుకున్నారు.

ట్రేడ్ యూనియన్ నేతగా ..

ప్రముఖ కార్మిక నాయకుడు ఎం.వి.ఎన్. కపర్థి సలహాతో విశాఖ ట్రేడ్ యూనియన్ బాధ్యతల్లోకి వచ్చారు మానం ఆంజనేయులు. ఆయన సారధ్యంలో ట్రేడ్ యూనియన్ల బలం పెరిగింది. ఉద్యమాల తీవ్రత, పార్టీ పలుకుబడి కూడా పెరిగింది. ట్రేడ్ యూనియన్ సమస్యలపై ఎక్కడ కేసు నమోదైనా మానం ఆంజనేయులు పేరు ఉండేది. విశాఖలో తొలిసారి కాంట్రాక్టు లేబర్ యూనియన్ను ఏర్పాటు చేశారు. వరుసగా అన్ని కంపెనీల్లో యూనిట్లు ఏర్పాటయ్యాయి. 1974లో సీపీఐ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేశారు.

పెందుర్తి ఎమ్మెల్యేగా..

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లా పెందుర్తి నుంచి మానం ఆంజనేయులు సిపిఐ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సీనియర్ కాంగ్రెస్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్ధి ద్రోణంరాజు శ్రీనివాస్ పై సుమారు 30 వేల ఓట్లతో ఆంజనేయులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994-99 మధ్య కాలంలో పెందుర్తి నియోజకవర్గం, విశాఖ జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి మంచి గుర్తింపు పొందారు. అనంతర కాలంలో సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఒక పర్యాయం పని చేశాను. నిత్యం క్యాడర్ అభివృద్ధిపై దృషి సారించి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేవారు. ప్రస్తుతం రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, ప్రస్తుత ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (విసిబిఎల్) చైర్మెన్ చలసాని రాఘవేంద్ర రావు వంటి యువకులను ప్రోత్సహించారు.

మూడు దశాబ్దాల పాటు విసిబిఎల్ చైర్మెన్ గా..

జూన్ 29, 1983న ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (విసిబిఎల్) చైర్మెన్ గా మానం ఆంజనేయులు బాధ్యతలు చేపట్టారు. ఆయన దూరదృష్టి,కృషి, మార్గదర్శకత్వంలో విసిబిఎల్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ బ్యాంకింగ్ రంగంలో ప్రధాన సంస్థగా అభివృద్ధి చెందింది. ఛైర్మన్‌గా 30 సంవత్సరాల ఆయన పదవీకాలంలో ఒక బ్యాంకు శాఖ నుండి 35 శాఖలకు విస్తరించింది. ఆంజనేయులు కృషి విశాఖపట్నం సహకార బ్యాంకును మించి విస్తరించాయి.

జాతీయ సహకార పట్టణ బ్యాంకింగ్ రంగంలో..

జాతీయ సహకార పట్టణ బ్యాంకింగ్ ఉద్యమంలో మానం ఆంజనేయులు కీలక పాత్ర పోషించారు. 1986లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ లిమిటెడ్ (NAFCUB)కి అనుబంధంగా ఆంధ్ర ప్రదేశ్ అర్బన్ & టౌన్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని బ్యాంక్ మేనేజ్‌మెంట్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ఈ అసోసియేషన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ప్రస్తుతం A.P కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడుగా వున్నారు. ఆంజనేయులు జాతీయ స్థాయిలో, సహకార బ్యాంకులకు ప్రాతినిధ్యం వహిస్తూ NAFCUBకి డైరెక్టర్ మరియు ఉపాధ్యక్షుడుగా పనిచేసారు.


== మూలాలు ==