Jump to content

మానికొండ సుబ్బారావు

వికీపీడియా నుండి

మానికొండ సుబ్బారావు కమ్యూనిస్టు నాయకుడు. 1964 నుంచి ఆయన జిల్లా కార్యదర్శిగానూ, రాష్ట్ర కమిటీ సభ్యులుగానూ, 1968 నుంచి 1975లో ఆయన చనిపోయే వరకూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగానూ పనిచేశాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1918 లో కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా నందమూరులో జన్మించాడు.[1] బాల్యంలోనే తండ్రి మరణించాడు. తల్లి పేరు బుల్లెమ్మ. ఆయన బందరు పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసాడు. బందరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్‌ లో ఉత్తీర్ణుడయ్యాక బివిఎస్‌సి కోర్సులో ప్రవేశించాడు. రెండేళ్లు చదివి అక్కడ జరిగే అన్యాయాలకూ, అక్రమాలకూ వ్యతిరేకం గా చదువుకు స్వస్తి చెప్పి స్వగ్రామం చేరాడు. ఆయన తన 19వ యేటనే కట్నకానుకలు లేకుండా సూర్యావతిని వివాహమాడాడు. ఆయన 1938-39 లలో అన్నా ప్రగడ కామేశ్వరరావు గుంటూరు జిల్లా మంతెనవారిపాలెంలో ప్రారంభించిన 'విద్యా వనం' అనే ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసాడు. పిల్లల్లో సత్ప్రవర్తన, అభ్యుదయ భావాలు కలిగించడానికి ప్రత్యేక తరగతులు నడిపేవాడు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న రోజుల్లోనే కమ్యూనిస్టు సాహిత్యం అధ్యయనం చేస్తుండే వాడు. స్థానిక కమ్యూనిస్టు కార్యకర్తలతో సంబంధాలు పెట్టుకున్నాడు.[1]

నందమూరులో ఆయన ఇల్లు పార్టీ కార్యకర్తల రహస్య సమావేశాలకు స్థావరంగానూ, రక్షణ దుర్గంగానూ తయారయింది. కృష్ణా జిల్లా కమ్యూనిస్టు కమిటీ ఆ రహస్య కాలంలో జయ ప్రదంగా నడవడానికి మానికొండ ప్రధాన పాత్ర వహించాడు. ఒక ఏడాదిపాటు మానికొండ విప్లవ కార్యాచరణను ప్రత్యక్షంగా చూసిన జిల్లా, రాష్ట్ర నాయకత్వం, 1941వ సంవత్సరంలో ఆయనను పార్టీ గన్నవరం తాలూకా ఆర్గనైజర్‌ గా నియమించింది. ఆయన బలమైన కమ్యూనిస్టు పార్టీని గన్నవరం తాలూకాలో నిర్మించాడు. కార్మికుల నుంచి మేధావుల వరకూ అందరితోనూ ఆయన సామరస్యంగా వ్యవహరించేవాడు. ముఖ్యంగా కార్యకర్తలను రాజ కీయంగా చైతన్యవంతులను చేయడం లోనూ, వాళ్లు తమ కాళ్లమీద తాము నిలబడ గలిగేపాటి దక్షత సమకూర్చడంలోనూ పార్టీ ఆర్గనైజర్‌గా ఆయన ప్రతిభ వెల్లడయింది. రెండేళ్లలో పార్టీ నిర్మాణానికీ ప్రజా ఉద్యమానికీ ఆయన చేసిన కృషికి గుర్తింపుగా పార్టీ ఆయనను కృష్ణాజిల్లా నాయకత్వానికి ప్రమోట్‌ చేసింది. పార్టీ కృష్ణాజిల్లా నాయకత్వం స్వీకరిం చిన తరువాత అనేక వ్యతిరేక శక్తులను ఎదుర్కొంటూ పార్టీ విధానాలను ప్రజలకు ఓపికతోనూ, సమర్థతతోనూ వివరిస్తూ ప్రజల నిత్య జీవిత సమస్యలపైన నిర్మాణాత్మకంగా పనిచేశాడు.[1]

కమ్యూనిస్టు కుటుంబం

[మార్చు]

1945-46 నాటికే మానికొండ కుటుంబం ఆదర్శ విప్లవ కుటుంబం అనే ఖ్యాతి గాంచింది. మానికొండ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేయడంతోనే ఆగిపోకుండా, తన తల్లి బుల్లెమ్మ గారిని విప్లవమాతగా తీర్చిదిద్దారు. భార్య సూర్యావతి నీ విప్లవ నారిగా తయారు చేశారు. పార్టీ రహస్య జీవితంలో మానికొండ ఇంటికెందరెందరో వచ్చి పోతుండేవారు. బుల్లెమ్మగారు వారినందరినీ తన బిడ్డల్లాగా ఆదరించింది. తరువాత 1945 నుంచి ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీ, ప్రజాశక్తి కార్యాలయాల్లో ఆమె 'కమ్యూన్‌' నిర్వహించారు. పార్టీ సభ్యులూ, కార్యకర్తలూ తమ ఆస్తిపాస్తులను సమర్పించాలని పిలుపు ఇచ్చినప్పుడు మానికొండ దంపతులు తమ యావదాస్తినీ పార్టీకి సమర్పించారు. 1948లో ఆంధ్రరాష్ట్ర మహిళా మహాసభ జరుపుకోవడాన్ని ప్రభుత్వం నిషేధించిన సందర్భంగా విజయవాడ లో జరిగిన నిరసన ప్రదర్శనలో బుల్లెమ్మ గారు జెండా పుచ్చుకొని అగ్రభాగాన నడిచారు. ఊరేగింపును చెదరగొట్టడానికి పోలీసులు ప్రయోగించిన బాష్పవాయువుకు శరీరం కాలి ఆమె స్పృహ తప్పి పడిపోయింది.

మానికొండ సాధారణ స్థానాల్లో ఉంటూ కూడా తన భార్య సూర్యావతి పైస్థానాలకు వెళ్లడానికి తగిన ప్రోత్సాహాన్నిచ్చారు. ప్రాథమిక పాఠశాల చదువుకే పరిమితమైన ఆమెను ఆయన తన కృషి ద్వారా విద్యా విజ్ఞానమూ, చైతన్య వికాసమూ కల్పించి ఆమె ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఉద్యమానికే నాయకత్వం వహించే స్థాయికి తీసుకురాగలిగారు. ఎంతో ఆదర్శమైన కమ్యూనిస్టు మహిళగా ఆమెను తీర్చిదిద్దారు. అలా ఆమె సర్పంచ్‌గానూ, ఎంపిపిగానూ, శాసన మండలి సభ్యురాలుగానూ పనిచేశారు. ఉద్యమపథంలో సూర్యావతిని రాయవెల్లూరు జైలులో ఏడాదిపాటు నిర్బంధించారు. ఇంచు మించు అదే సమయంలో మానికొండను కూడా అరెస్టు చేసి జైలులో పెట్టారు. జైలులో ఉన్న రెండున్నరేళ్లు ఆయన ఆదర్శనీయమైన జీవితం గడిపారు. అక్కడ అధ్యయనమూ, అధ్యాపనమూ నిర్వహించారు. జైల్లో ఉన్న సాధారణ కార్యకర్తలకు రాజకీయ తరగతులు నిర్వహించారు. ఆరు నెలలు తరువాత ఆయన ను జామీనుపై విడుదల చేయగా, పార్టీ కార్య క్రమాలు కొనసాగించడానికి రహస్య జీవితం గడిపారు. 1955లో పార్టీ ఆర్థిక సంక్షోభంలో పడినప్పుడు బుల్లెమ్మగారు మానికొండ దంపతులను ఆదుకొని తన దగ్గర మిగిలి ఉన్న కొద్దిపాటి డబ్బుతో సంసారాన్ని నడుపు కొచ్చింది.

పార్టీలో చీలిక

[మార్చు]

1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక అని వార్యమైంది. దీనికి ముందు జరిగిన రాజకీయ సిద్ధాంత నిర్మాణ పోరాటంలో మార్క్సిస్టులుగా మానికొండ దంపతులు రివిజనిజాన్ని ప్రతిఘటించి నిలిచారు. కృష్ణాజిల్లా కమిటీ కార్యదర్శిగా మానికొండ పార్టీ పునర్మిర్మాణ బాధ్యతలను చేపట్టారు. 1964 డిసెంబర్‌ 29 రాత్రి అనేకమంది నాయకులతోపాటు మానికొండ దంపతులను అరెస్టుచేసి ప్రభుత్వం హైదరాబాద్‌ సెంట్రల్‌ జైలులో డిటెన్యూలుగా ఉంచింది. జైల్లో మాని కొండ ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర రాశాడు.

అస్తమయం

[మార్చు]

1975 జనవరి 28వ తేదీన ఆయన గుండెపోటుతో మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "ఆదర్శ కమ్యూనిస్టు మానికొండ సుబ్బారావు | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2020-05-28.[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]