మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనేది తెలుగులో ప్రాచుర్యం కలిగిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే రాష్ట్ర గీతంగా అధికారికంగా స్వీకరించబడిన ఒక గేయం. ఈ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి. ఈ గేయంలో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించాడు. సుందరాచారి 'మా తెలుగు తల్లికి' గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించాడు.[1] కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడాలన్న కోరికకు ఈ పాట సరిపోలేదు కాబట్టి ఆ సినిమాలో చేర్చలేదు.[2] టంగుటూరి సూర్యకుమారి ఆభేరి రాగంలో మధురంగా పాడిన ఈ పాటను, తను ప్రైవేటుగా గ్రామఫోన్ రికార్డులో హెచ్.యం.వి. సంస్థ ద్వారా విడుదల చేసిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది. ఈ పాటపై హక్కులను సూర్యకుమారి సుందరాచారికి 116 రూపాయలిచ్చి కొనుక్కున్నది.[3] ఆ తరువాతి కాలంలో సుప్రసిద్ధదర్శకుడు బాపు, బుల్లెట్ చిత్రం కోసం ఈ పాటను బాలసుబ్రమణ్యంతో పాడించారు. లీడర్ సినిమాలో టంగుటూరి సూర్యకుమారి గారి పాటను కొత్త పాటతో కలిపి కథానాయకుడిపై చిత్రీకరణ చేశారు
గేయం[మార్చు]
![]() |
|
ఈ శ్రావ్యకాన్ని వినే ప్రయత్నంలో మీకు ఇబ్బంది ఎదురైందా? మీడియా సహాయాన్ని చూడండి. |
మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ ॥మా తెలుగు॥
కడుపులో బంగారు కను చూపులో కరుణా
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి ॥మా తెలుగు॥
గల గలా గోదారి కదలి పోతుంటేను ॥గల గలా॥
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి ॥మా తెలుగు॥
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ పాటలే పాడుతాం
నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!!
అమరావతి గుహల - అమరావతి నగర[మార్చు]
పురాణాలలో అమరావతిని ఇంద్రనగరంగా, సర్వసుఖ, సర్వభోగ, సర్వాంగ సుందర నగరంగా తెగ వర్ణిస్తూ ఉంటా రు. కాళిదాసు మేఘసందేశం లో అలకాపురిని వర్ణించి వర్ణిం చి మనసులని ఊరించాడు. మనకి గొప్ప చరిత్ర ఉన్న ముఖ్యపట్టణం అమరావతి. ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అన్నారు మా తెలుగుతల్లి కవి. తరువాత అక్కడ గుహలు లేవని, ‘అమరావతి నగర’ అని సవరించి పాడడం మొదలు పెట్టారు.[4]
బుల్లెట్ సినిమాలో కూడా ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటలో ‘అమరావతినగర అపురూప శిల్పాలు’ అని ఉంది. అయితే టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులో ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అనే ఉంది.[5]
మూలాలు[మార్చు]
- ↑ "State anthem composed in Chittoor". The Hindu. 2011-03-24. Retrieved 2014-02-02.
- ↑ కె, లక్ష్మీరాజ్యం (2012-10-21). "పాటకు పట్టాభిషేకం". సూర్య. Retrieved 2014-02-02.[dead link]
- ↑ ఎం, భాను గోపాల్‌రాజు (2012-12-29). "కష్టాలనెదిరించి మల్లె పూదండ కూర్చిన శంకరంబాడి". సూర్య. Retrieved 2014-02-05.[dead link]
- ↑ "అరచేతిలో అమరావతి". Sakshi. 2015-04-03. Retrieved 2018-01-25.
- ↑ "...ఏ నిర్వచనానికి లొంగని వారు -". www.andhrajyothy.com. Retrieved 2018-01-25.
బయటి లింకులు[మార్చు]
- టంగుటూరి సూర్యకుమారి పాడిన మాతెలుగు తల్లికి పాట వీడియో (యూట్యూబ్) రంగరాయ మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ ఆసోషియేషన్ పునర్మిలనం బిర్మింగహామ్, 1985 కార్యక్రమంలో, అప్లోడ్ చేసినవారు అప్పారావు నాగభైరు, 2008