మా భూమి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా భూమి
(1979 తెలుగు సినిమా)
Maabhoomi.jpg
దర్శకత్వం గౌతమ్ ఘోష్
నిర్మాణం జి. రవీంద్రనాధ్,
బి. నర్సింగరావు
కథ కిషన్ చందర్ (మూల కథ)
చిత్రానువాదం గౌతమ్ ఘోష్,
పార్ధ బెనర్జీ
తారాగణం సాయిచంద్,
కాకరాల,
బి.ఎన్.రావు,
రామిరెడ్డి,
భూపాలరెడ్డి,
యాదగిరి,
హంస,
పోకల,
రాజేశ్వరి,
ప్రసాదరావు,
ప్రదీప్ కుమార్,
లక్ష్మణరావు
సంగీతం బి. నర్సింగరావు,
నాగభూషణం,
వింజమూరి సీత
సంభాషణలు పార్ధో బెనర్జీ,
బి. నర్సింగరావు
ఛాయాగ్రహణం కమల్ నాయక్
నిర్మాణ సంస్థ చైతన్య చిత్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మా భూమి, 1980లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది. ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా ఇది. కిషన్ చందర్ రచించిన హిందీ (ఉర్దూ) నవల "జబ్ ఖేత్ జాగే" ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. ఈ సినిమా మొదటిసారి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-1980లో మొదటిసారిగా ప్రదర్శితమైంది[1]. జూలై 1980లో నిర్వహించిన కార్వే వారీ చలనచిత్రోత్సవంలో[2], కైరో మరియు సిడ్నీ చలనచిత్రోత్సవాల్లో భారతదేశపు అధికారిక ఎంట్రీ.[3][4] సిఎన్ఎన్-ఐబీఎన్ వారి వంద గొప్ప భారతీయ చలనచిత్రాల జాబితాలో ఈ సినిమా చోటుచేసుకుంది.[5]

కథాంశం అభివృద్ధి[మార్చు]

అభ్యుదయ రచయిత కిషన్ చందర్ వ్రాసిన జబ్ ఖేత్ జాగే(అర్థం: పొలాలు మేల్కొన్నప్పుడు) అన్న ఉర్దూ నవలికను ఆధారం చేసుకుని ఈ కథాంశాన్ని తయారుచేసుకున్నారు. గౌతమ్ ఘోష్‌కి నిర్మాతలు బి.నరసింగరావు, జి.రవీంద్రనాథ్‌లు సినిమా తీసేందుకు జబ్ ఖేత్ జాగే నవలికను సూచించారు. బి. నరసింగరావు, రచయిత ప్రాణ్‌రావు, పార్థూ బెనర్జీల సహకారంతో ఆ నవలికలోని మూలకథకి, తెలంగాణా సాయుధపోరాటం నేపథ్యంలోని మరికొన్ని వాస్తవాలు, సంఘటనలను జోడించి ఈ సినిమా స్క్రిప్టును అభివృద్ధి చేశారు.[6] చిత్రానికి దర్శకత్వం వహించమని నిర్మాతలు గౌతమ్ ఘోష్‌ని కోరినప్పుడు ఆయన అంగీకరించి నవల చదివి దాని ఆధారంగా ఓ ట్రీట్ మెంట్ వ్రాసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. కానీ అది నిర్మాతలకు నచ్చలేదు. ఈ క్రమంలో సినిమాకు అవసరమైన పరిస్థితులను, తెలంగాణా గ్రామీణ ప్రాంత స్థితిగతులను అర్థంచేసుకునేందుకు దర్శకుడు, రచనా బృందం నల్గొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో తిరిగారు. కడవెండి, బాలముల, సూర్యాపేట్, వరంగల్ వంటి ప్రాంతాలను సందర్శించి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారితో ఇంటర్వ్యూలు, ఫొటోలు, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, సుందరయ్య, బసవ పున్నయ్య, రాసుకున్నవి-ఇతర 20, 30 పుస్తకాలు, క్రానికల్, గోలకొండ, మీజాన్ ప్రెస్ రిపోర్టులు అట్లా అదో పెద్ద రీసెర్చ్ వర్క్ చేశారు. దర్శకుడు తెలంగాణా గ్రామాల జనజీవనాన్ని అర్థంచేసుకునేందుకు పల్లెటూర్లలోని ఇళ్ళు, వాకిళ్ళ ముందు పొద్దున్నే వేచిచూసి, జనం మాటతీరు, కట్టుబొట్టూ, వ్యవహారం తెలుసుకుకున్నారు. వీటన్నిటి ఫలితంగా ప్రస్తుతం సినిమాకున్న స్క్రిప్ట్ రూపుదిద్దుకుంది.[7]

కథ[మార్చు]

సిరిపురం నల్లగొండ జిల్లాలోని గ్రామం. అక్కడ నివసిస్తున్న బీద రైతుకూలీలలో వీరయ్య కొడుకు రామయ్య ఒకడు. పదవ యేటనే భూస్వామి వద్ద పశువులు మేపడానికి కుదురుతాడు రామయ్య. జగన్నాథరెడ్డి భూస్వామి. అతని కొడుకు ప్రతాపరెడ్డి. వీరికి 50 వేల ఎకరాలకు పైగా భూమి వుంది. అన్నిరకాల దౌష్ట్యం, దౌర్జన్యాలకు వీరు పెట్టింది పేరు. వీరి అత్యాచారాలను ఎదుర్కోవడానికి "సంఘం" మద్దతు కోరాలని నాగయ్య అనే పశువుల కాపరి సూచిస్తాడు. రామయ్య చంద్రి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే చంద్రిని దివాణంలో పని చేయడానికి పిలిపిస్తారు. దీనితో వ్యధాపూరితుడైన రామయ్య వూరు విడిచి వెళ్లిపోతాడు. సూర్యాపేటలో గురవయ్య అనే వర్తకుని వద్ద పనికి కుదురుతాడు. ఈ పని సరిపడక హైదరాబాదుకు వెడతాడు రామయ్య. అక్కడ రిక్షా లాగడం ప్రారంభిస్తాడు. అది మానేసి ఒక ఫ్యాక్టరీలో పనికి చేరతాడు. మక్బుల్ అనే కార్మిక నాయకునితో పరిచయం ఏర్పడుతుంది. చదవడం, వ్రాయడం నేర్చుకుంటాడు. ఫ్యాక్టరీలో సమ్మె జరిగి రామయ్య అరెస్టయి జైలుకు పంపబడతాడు. అక్కడ తన గ్రామస్థుడు నాగయ్య కనిపించి గ్రామ పరిస్థితులు వివరిస్తాడు. జైలు నుంచి విడుదలై రామయ్య సిరిపురం వచ్చి "సంఘం" కార్యకలాపాలలో పాల్గొంటాడు. గ్రామ దళం భూస్వామి కోటపై దాడికి పూనుకుంటుంది. జమీందారు ప్రతాపరెడ్డి తన అనుచరులతో కలిసి కారులో పారిపోతాడు. 1948, సెప్టెంబరు 13న భారతప్రభుత్వం నిజాం రాష్ట్రంపై పోలీసు చర్యను ప్రారంభిస్తుంది. నైజాము లొంగిపోతాడు. హైదరాబాద్ భారత్‌లో అంతర్భాగమౌతుంది. సిరిపురం గ్రామస్థులు జమీందారులకు వ్యతిరేకంగా పోరాడడానికి పూనుకుంటారు. గ్రామ పొలిమేరల్లో సైనికులకు, గెరిల్లాలకు యుద్ధం కొనసాగుతుంది. రామయ్య, మరికొందరు మరణిస్తారు. మిగిలిన గెరిల్లాలు అడవులలోకి తప్పించుకుని పారిపోయి పోరాటాన్ని కొనసాగించడానికి నిర్ణయిస్తారు[8].

నిర్మాణం[మార్చు]

తారాగణం ఎంపిక[మార్చు]

సినిమాలో తారాగణం కోసం వెండితెరకు కొత్తవారైన రంగస్థల నటులను, మొత్తంగా నటనకే కొత్తవారైన ఔత్సాహికులను తీసుకున్నారు. పోరాటాలు, గుంపు వంటివి చిత్రీకరించేప్పుడు పెద్దసంఖ్యలో జనం అవసరమైతే సినిమా చిత్రీకరించిన మంగళ్‌పర్తి గ్రామస్తులను నటింపజేశారు.[6] సినిమాలో కథానాయకుడు రామయ్య పాత్రలో త్రిపురనేని సాయిచంద్ నటించారు. ప్రముఖ కథకుడు, నవలాకారుడు త్రిపురనేని గోపీచంద్ కుమారుడు ఆయన. సాయిచంద్ ముందు సినిమాలో నటించగలనా అని భయపడినా దర్శక నిర్మాతల చొరవ వల్ల సినిమాలో పాలుపంచుకుని చక్కని నటన కనబరిచారు. సినిమాలో కథానాయకుడు రామయ్యపాత్రకు తండ్రి వీరయ్యగా కాకరాల నటించారు. జమీందార్‌గా ఎంబీవీ ప్రసాదరావు, పట్వారీగా లక్ష్మణ్‌రావు, లంబాడి చంద్రిగా హంస, ఇతర ముఖ్యపాత్రల్లో నరసింగరావు, గద్దర్, భూపాల్‌రెడ్డి, రామిరెడ్డి, విజయప్రకాశ్, మాస్టర్ సురేశ్, యాదగిరి, రాజగోపాల్, రాజేశ్వరి, శకుంతల, పోచమ్మ తదితరులు నటించారు.[7] ఈ చిత్రం ద్వారా కథానాయకుడు సాయిచంద్ మాత్రమే కాక తెలంగాణ శకుంతల, కొమరం భీం సినిమాలో హీరోగా నటించిన భూపాల్ రెడ్డి వంటివారు ఈ చిత్రంతోనే పరిచయమయ్యారు.[6]

చిత్రీకరణ[మార్చు]

1940-50ల నాటి నిజాం పాలన కాలపు స్థితిగతులు ప్రతిఫలించాలన్న ఉద్దేశంతో మెదక్ జిల్లాకు చెందిన మంగళ్‌పర్తి గ్రామాన్ని చిత్రీకరణకు ఎంచుకున్నారు. చిత్రీకరణ దొంతి, దౌల్తాబాద్‌లలో కూడా సాగింది. 50 రోజుల పాటుగా చిత్రీకరణ జరిగిన ఈ సినిమాను 5.5లక్షల బడ్జెట్‌లో నిర్మించారు.[7] స్క్రిప్ట్ అవసరాలకు తగ్గట్టు అప్పటికి మంగళ్ పర్తికి కరెంటుకూడా లేదు(ఉండివుంటే కరెంటు వైర్లు చలనచిత్రంలో కనిపించి చారిత్రిక స్థితిగతులను చెడగొట్టేవి). సినిమా నాణ్యతపరంగా మంగళ్ పర్తి ఎంతగానో ఉపయోగపడినా యూనిట్ సౌకర్యాల విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సివచ్చింది. యూనిట్ మొత్తం ఒక బడిలో బసచేసి మగవారంతా బావి వద్ద స్నానాలు చేసి, రాత్రిళ్ళు దోమలతో ఇబ్బందులు పడి సినిమా చిత్రీకరణ చేసుకున్నారు. స్త్రీలకు మాత్రం గ్రామంలో సంపన్న కుటుంబీకుల ఇళ్ళలో స్నానాదికాల సౌకర్యాలు వినియోగించుకున్నారు. సినిమా చిత్రీకరణలో కూడా చాలా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మంగళ్ పర్తి బి.నరసింగరావు అత్తవారి ఊరు కావడంతో కొంత ఉపకరించింది.
సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు దొంతి గ్రామంలో గడీని ప్రజలు ముట్టడించే సన్నివేశాన్ని తీయడానికి మాత్రం చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. సమయానికి హఠాత్తుగా గడీ ముట్టడి సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు నిరాకరించారు. ఐతే షూటింగ్ యూనిట్ ముందుగా ఏర్పాటుచేసుకున్న తలుపులు ప్రజలు ఆగ్రహంతో వచ్చి బద్దలుకొట్టే షాట్ అనుమతి లేకుండానే చిత్రీకరించేశారు.[7]
సినిమాకు గౌతమ్ ఘోష్ భార్య నిలాంజనా ఘోష్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా వ్యవహరించారు. ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం కళాదర్శకునిగా పనిచేశారు. చిత్రకారుడిగా సుప్రసిద్ధుడైన తోట వైకుంఠం సినిమాకు పనిచేయడం అదే మొదలు.

నిర్మాణానంతర పనులు[మార్చు]

నిర్మాణానంతరం సినిమాకు మరింత చారిత్రిక కోణాన్ని అందించేందుకు హైదరాబాద్ రాష్ట్రంపై 1948లో భారతప్రభుత్వం చేసిన సైనిక చర్యకు సంబంధించిన పత్రికల లైబ్రరీ షాట్స్(చారిత్రిక విషయాల పాత వీడియోలు) సినిమాలో వినియోగించుకున్నారు. సినిమాకు ఎడిటింగ్ టి.రాజగోపాల్ చేశారు. హైదరాబాదులో సారధి స్టూడియో దొరకకపోవడంతో సినిమా పాటలను మాక్స్ ముల్లర్ భవన్ లో ఒక్కరోజులో చేశారు. సినిమాలోని పాటలకు సంగీత దర్శకత్వం వింజమూరి సీత వహించగా ఆర్కెస్ట్రా సంగీత దర్శకుడు బి.గోపాలం నిర్వహించారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దర్శకుడు గౌతం ఘోష్ తానే స్వయంగా చేసుకున్నారు.


మూలాలు[మార్చు]

  1. http://dff.nic.in/2011/indian_cinema_1980.pdf
  2. http://dff.nic.in/2011/IP1981.pdf
  3. Awards
  4. Telugu Cinema Nostalgia - Maa Bhoomi - Narsing Rao - Gautam Ghose
  5. 100 Years of Indian Cinema: The 100 land mark Indian films of all time|Movies News Photos-IBNLive
  6. 6.0 6.1 6.2 రెంటాల, జయదేవ (21 మార్చి 2015). "మన భూమి... జన సినిమా..." జగతి పబ్లికేషన్స్. సాక్షి. Retrieved 23 March 2015. Cite news requires |newspaper= (help)
  7. 7.0 7.1 7.2 7.3 "మాభూమి:వెండితెరపై మహత్తర తెలంగాణ". నమస్తే తెలంగాణ. 22 మార్చి 2015. Retrieved 23 March 2015. Cite news requires |newspaper= (help)
  8. ఆంధ్రపత్రిక ప్రత్యేక ప్రతినిధి (15 January 1980). "తెలంగాణా పోరాటం ఆధారంగా తీసిన సినిమా మా భూమి". ఆంధ్రపత్రిక దినపత్రిక (సంపుటి 66, సంచిక 270). Retrieved 17 January 2018.

బయటి లింకులు[మార్చు]