మిడతల హంపయ్య
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
హంపయ్య అనంతపురం జిల్లా వ్యాపారస్థులలో అతిరథుడు. ఇంట కూర్చుండియే ప్రత్తి వ్యాపారమున లక్షలు గడించెను. ఎప్పుడేది కొనవలెనో, ఏ సమయమున దానిని విక్రయము చేయవలెనో భవిష్యత్తును చదివి చేసినట్లు ఆయన వ్యవహరించెడివాడు. మంచి యోధ. ఉండునో ఊడునో అని మీనమేషములు లెక్కించుచు అవకాశమును జారవిడుచువాడు కాడు. దూరాలోచన ఆయన విజయమునకు ఇంకొక కారణము. గుంతకల్లు జంక్షన్ పరిసరములలో ఎంతయో భూమిని ముందే కొని ఉంచుకున్నాడు. అనేక సంవత్సరములు గడచిన వెనుక ఆ భూమి విలువ నూరంతలు పెరిగి అతనికి గొప్ప లాభము చేకూర్చింది.
అందరు వర్తకుల వలె హంపయ్య ధన పిశాచికాడు. ధనలోభము ఆయన ఎఱుగని గుణము. కాని భోగలాలసుడును కాడు. స్వంత సౌఖ్యమునకై ఆయన ధనమును వ్యయము చేయలేదు. సంపాదించు వరకే తన ధనము, సంపాదించిన వెనుక అది తనది కాదు అను భావము అతడికి ఉంది. కావున ఏ విషయాసక్తుడు కాక, గర్వపడక, అహంభావమునకు చోటీక, విఱ్ఱవీగక, పరమవేదాంతి వలె జీవితమును గడిపాడు. అవకాశమున్నప్పుడు భారతమో, భాగవతమో చదివించుకుని ఆనందించెడివాడు.
ఇతనికి వితరణగుణము స్వాభావికముగా అలవడింది. ఈయన అనంతపురం జిల్లాలో దానకర్ణుడని చెప్పవచ్చు. అడిగిన వారికి లేదనకుండా సహాయము చేసెను. కాని వ్యక్తుల కంటే సంస్థలకే ఎక్కువ దానము చేసెను. గుంతకల్లు ఆసుపత్రికి 10,000 రూపాయలు, దత్తమండలకళాశాలకు బీదవిద్యార్థుల వేతన నిమిత్తము 10,000 రూపాయలు, ఆ కళాశాల సారస్వత సంఘమునకు 1000 రూపాయలు, ఉరవకొండ హైస్కూలు విద్యార్థుల వేతనములకు 5000 రూపాయలు, ఆ ఊరిలోని బాలికా పాఠశాలకు 7500 రూపాయలు, బెంగళూరు దేవాంగకుల విద్యార్థుల నిమిత్తము 10,000 రూపాయలు ఈ విధంగా అతడెన్నో సంస్థలకు మహోపకారము చేసెను.
ఇతడు తాలూకా బోర్డు, జిల్లా బోర్డు సభ్యుడిగాను, మద్రాసు శాసనసభ సభ్యుడిగాను పనిచేశాడు. ఇతడికి ప్రభుత్వము రావుసాహేబ్ బిరుదును ప్రదానం చేసింది. ఇతడు పార్శ్వవాయువుతో సుమారు 6 నెలలు బాధపడి బెంగుళూరు మొదలైన చోట్ల వ్యాధి నివారణకై వైద్యమును పొంది జాడ్యము వాసి కానందువలన ఉరవకొండలోని తన ఇంటివద్దనే ఉండి 1931, జూన్ 10, బుధవారమునాడు మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ పప్పూరు రామాచార్యులు (1931-06-13). "కీ.శే.రాయిసాహేబ్ యం.హంపయ్యగారు". శ్రీసాధనపత్రిక. 5 (39): 5. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 28 December 2015.
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు from అక్టోబరు 2016
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు
- Articles covered by WikiProject Wikify from అక్టోబరు 2016
- All articles covered by WikiProject Wikify
- 1931 మరణాలు
- అనంతపురం జిల్లా వ్యాపారవేత్తలు
- అనంతపురం జిల్లా విద్యాదాతలు
- మద్రాసు ప్రెసిడెన్సీలో శాసన సభ్యులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు