ముక్కామల నాగభూషణం
ముక్కామల నాగభూషణం పండితుడు, రాజకీయవేత్త. శాస్త్రీయ దృష్టితో సాహిత్య పరిశీలన చేయగల దిట్ట. 'రామాయణం', ‘మహాభారతం' ఈ రెండు కావ్యాలను పరిశీలించి, కొన్ని అంశాలను విజ్ఞుల ముందుంచాడు. 1987లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి స్వాతంత్ర్య సమరంపై కొన్ని ప్రసంగాలు చేసాడు. 1988లో సంగీత రూపకాన్ని రచించాడు. అది కూడా విజయవాడ కేంద్ర నుంచి ప్రసారమయింది.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ముక్కామల నాగభూషణం 1910 ఫిబ్రవరి 4న కృష్ణా జిల్లా బుద్ధవరం గ్రామంలో జన్మించాడు. 1921లో బెజవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఒక వాలంటీరుగా పాల్గొన్నాడు. తరువాత స్వాతంత్ర్యసమరంలోనూ, జమీందారీ వ్యతిరేక పోరాటంలోనూ పాల్గొన్నాడు. జైళ్లకు వెళ్ళాడు. రాజమండ్రి జైలు నుండి తప్పించుకు పోయాడు. సంవత్సరాల తరబడి అజ్ఞాతవాసంలో ఉండి పోరాడాడు. బాల్యం నుండి సంఘ సంస్కరణోద్యమంలోనూ, రైతు ఉద్యమంలోనూ, జాతీయ ఉద్యమంలోనూ సన్నిహిత సంబంధాలుండేవి. అనేక సంస్కరణ వివాహాలు చేయించాడు.
వివిధ ఉద్యమాలకు సంబంధించి అనేక వ్యాసాలు, పాటలు, పుస్తకాలు రాసాడు. వీరు రాసిన, ఆకాశవాణి విజయవాడ కేంద్రంవారు ప్రసారం చేసిన సంగీత రూపకాలలో కొన్నింటిని జాతీయ, అంతర్జాతీయ ప్రశంసా పత్రాలు లభించాయి. దశాబ్ద కాలంపాటు వీరు ప్రగతి, ఆంధ్రవాణి వారపత్రికలకు సంపాదకులుగా ఉన్నాడు.
1943 లో ప్రజానాట్యమండలి స్థాపనకు దోహదం చేసి, 1948లో అది ప్రభుత్వ నిషేధానికి గురయ్యేటంతవరకూ ఆర్గనైజరుగా ఉంటూ దాని అభివృద్ధికి కృషి చేసాడు. ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షునిగా జమీందారీ విధానం రద్దు కొరకు అనేక పోరాటాలు నిర్వహించాడు. తత్ఫలితంగా 1948లో జమీందారీ విధానం రద్దయింది.
ప్రభుత్వ సహాయంతో నిమిత్తం లేకుండా హరిజనులకు కాలనీలు నిర్మించాడు. మంచినీటి బావులు తవ్వించాడు. విజయవాడలోని గాంధీ పరతంపై గల నిర్మాణాలన్నీ ఇతని కృషి ఫలితంగా రూపొందినవే. విజయవాడ చుట్టు ప్రక్కల గల విద్యాలయాల నిర్మాణంలో అతని పాత్ర ఉంది. కోటీ యాభై లక్షల వ్యయంతో ఎదురుమొండి, ఈల చెట్ల దిబ్బ దీవులకు సాగునీటి సౌకర్యం కల్పించాడు.
ప్రాంతీయ అభివృద్ధి సంఘానికి కృష్ణా జిల్లా రచయితల సంఘానికి, దీనజన సంక్షేమ సమితికి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషనుకు అధ్యక్షునిగా ఉండి ఆయా రంగాలలో ఎన్నదగిన కృషి చేసాడు[1].
అతను 1992 జూలై 25న దివంగతులైనాడు[1].
రచనలు
[మార్చు]- శతావతారాలు 1978 : భారతగాథ, రామాయణ గాథకు భిన్నమైనదనీ, రామాయణ గాథకు మూలం త్యాగం కాగా, భారత గాథకు మూలం రాజ్యకాంక్ష అయినందున ఈ రెండు దృక్పథాలు, ప్రయోజనాలు వేరుగా వున్నాయని ఈ రచయిత తేల్చాడు. ఈ రెండు కావ్యాలను గురించీ ఇంకా వివరంగా పరిశీలించి “రామాయణ భారత గాథలు రెండూ శతావతారాలు ఎత్తినప్పటికీ, వాటిని చారిత్రక దృష్టితో పరిశీలించాలి” అని, ప్రజల మనస్సులపై మత్తుమందు చల్లి, మూఢనమ్మకాలను పెంచే గ్రంథాలనీ వాటిని త్రోసి పుచ్చకూడదు అన్నాడు. నేటి యువతరం చదివి, ఆలోచించి, నిగ్గు తేల్చవలసిన అంశాలనేకానేకం ఈ పుస్తకంలో ఉన్నాయి.[2]
- ప్రాచీన భారతదేశంలో వైజ్ఞానిక ప్రగతి 1987[3]
- భారత స్వాతంత్ర్య సమర చరిత్ర[4]
- అసుర నాగరికత, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రచురణ, తొలి ముద్రణ: మార్చి, 1992, శ్రీ అరుణోదయ ప్రింటింగ్ ప్రెస్, సీతారాంపురం, విజయవాడ, 2.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 ముక్కామల నాగభూషణం (2003-08-01). భారత స్వాతంత్ర సమర చరిత్ర.
- ↑ శతావతారాలు(Satavataralu) By Mukkamala Nagabhushanam - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2019-11-29. Retrieved 2020-04-13.
- ↑ "image1.jdomni.in/product/18122019/5E/9D/EE/ADE6F9FCDF311CAD41EFA31C7F_1576655845711_450X450.jpeg కోసం Google చిత్ర ఫలితం". www.google.co.in. Retrieved 2020-04-13.[permanent dead link]
- ↑ "jsnbooks.com/uploads/2019/Bharata-Swatantrya-Samara-Charitra-Telugu-Book-By-Mukkamala-Nagabhushanam.jpg కోసం Google చిత్ర ఫలితం". www.google.co.in. Retrieved 2020-04-13.[permanent dead link]